[dropcap]తె[/dropcap]లుగు పదాలకు వ్యతిరేక పదాలను పుస్తక రూపంలో అందిస్తున్నారు చక్కా చెన్నకేశవరావు.
***
“తేనెలొలుకు మన తెలుగు భాష పట్ల అనేక కారణముల మూలముగా అవగాహన, అభిలాష నానాటికీ తగ్గుతున్నవి. అయిననూ మన మాతృభాషను మరువకూడదు, మఱుగున పడనీయరాదు. అందువలన ప్రతి రచయిత(త్రి), కవి, గ్రంథకర్త తెలుగు భాషా కీర్తి ఆచంద్రతారార్కముగ నిలుచుటకునూ, జగజ్జేగీయమానముగా శోభింపంజేయుటకునూ తన వంతుగా వివిధ ప్రక్రియలలో మన తెలుగు భాషను పాఠకులకు విరివిగా అందజేయుట ఆవశ్యకము.
స్థూలముగ వ్యతిరేకార్థక పదములను ఈ విధముగ వర్గీకరించితిని. 1) భావభేదము; 2) క్రియాభేదము; 3) లింగభేదము, 4) దశ, దిశా భేదము; 5) గుణభేదము; 6) కాలభేదము; 7) ఇతర భేదములు.
పైన ఉదహరించిన వర్గీకరణల విధముగా వ్రాయ తొలుదొలుత సంకల్పించితిని. కానీ, జిజ్ఞాసువు తనకు కావలసిన పదము కొఱకై పుస్తకమంతయు వెదకుకొనకుండ, తన ఉద్దిష్ట పదమును త్వరితముగ గ్రహించగలందుకులగాను, శబ్దాన్వేషణ సులభము, సుగమము చేయు నిమిత్తం అకారాది క్రమములోనే పొందుపరిచితిని.
వివిధ విజ్ఞాన శాస్త్రములకు సంబంధించిన పదములు అక్కడక్కడ ఈయఁబడినవి. అలాంటి సందర్భములలోను, మరికొన్ని పదముల అర్థము, భావము పాఠకులకు సవివరముగ తెలియగలందులకు సరిపడు ఆంగ్లపదములు ఇవ్వడమైనది.
ఈ పుస్తకములోని పదములు అధికశాతము వ్యావహారిక పదములే. వానికి అదనముగ ఎన్నో క్రొత్త పదములను ఏర్చి, కూర్చి వ్రాయడమైనది. అందువలన వాడుకలోగల శబ్దోచ్చారణకు, అసలు ఉచ్చారణకు గల సూక్ష్మభేదములు గ్రహించుటకును, ఇతర అర్థములు తెలిసికొనుటకును అవకాశము కలుగును.
ఈ పుస్తకమునందు కేవలము వ్యతిరేకార్థక పొందుపఱచడమేఁ గాక పెక్కు సందర్భములలో అర్థములను ఇచ్చుట జరిగినది. అట్లొనర్చుట వలన పాఠకులు తమ పదసంపత్తిని వృద్దిపఱచుకొన వీలగును” అన్నారు సంకలన కర్త చక్కా చెన్నకేశవరావు తమ ముందుమాట “మీతో మనసు విప్పి…”లో.
***
‘చక్కా’ వారి వ్యతిరేకార్థక పదకోశము
సంకలనకర్త: చక్కా చెన్నకేశవరావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్, 28-22-20, రహిమాన్ వీధి, అరండల్ పేట, విజయవాడ – 520002.
పుటలు: 248
వెల: ₹150
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు, ప్రచురణకర్త