Site icon Sanchika

చక్రభ్రమణం

[dropcap]ఉ[/dropcap]దయం ఆఫీసులో ఉండగా 11 గంటలకు అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కొంచెం కంగారుగానే ఎత్తాను, “మీ నాన్న నిన్ను ఈ శని, ఆదివారాల్లో ఓసారి రాగలవా అని అడిగి వీలుంటే రమ్మన్నానని చెప్పమన్నారు రా!” అమ్మ కంఠం ఎప్పటిలా స్పష్టంగా ఉంది.

“అలాగేనమ్మా !వస్తాను. ఇంతకీ, చెప్పొద్దన్నది కూడా చెప్పు.” నేను అనునయంగా అడిగాను.

“ఏరా చెప్పద్దు అన్నది ఎలా చెప్తాను?” అమ్మ ప్రశ్న.

“అవునమ్మా నువ్వు మాట మీరవు. అబద్దం చెప్పవు. కానీ నిజాన్ని దాచనూ లేవు. కాస్త సూచనగా ఏమైనా చెప్తావేమో అని అడిగాను.” నింపాదిగా అన్నాను.

“మరే! కాస్త ఒంట్లో నలతగా ఉంది. ముందు నీకు చెప్పాలనుకున్నా, మనసు మార్చుకుని నీతో మాట్లాడే పని ఉందని మాత్రమే చెప్పమన్నారు” అమ్మ వివరణ ఇచ్చింది.

“సరేనమ్మా, వస్తాను” అని ఫోన్ పక్కన పెట్టి, వెంటనే రైలు టికెట్ బుక్ చేసుకున్నాను.

నాన్న, అమ్మ అమలాపురంలో ఉంటారు. నేను, శ్రీమతి హైదరాబాదులో. గత 30 సంవత్సరాలుగా అక్కడే. నా కూతురు రమ్య బెంగళూరులోనూ, కొడుకు రాజీవ్ షికాగోలోనూ ఉంటారు.ఇంకా పెళ్లిళ్లు చేయలేదు, ఇద్దరి వల్ల ఏ బెడద లేదనే చెప్పాలి. చదువులు ఉద్యోగాలు అన్ని చాలా మామూలుగా ఏ హడావిడి లేకుండా జరిగాయి. “కాస్త టైం ఇవ్వండి నాన్నా!” అన్నారని ఇద్దర్నీ వివాహ చర్చల్లోకి లాగలేదు నా భార్య లలిత. గత పదేళ్లుగా దేశంలో వచ్చిన అన్ని మంచి మార్పులకి, చక్కటి లబ్ధిదారు. తక్కువలో పిల్లల చదువులు అయిపోయాయి. వాళ్లు ఉద్యోగస్తులు అయ్యారు. అమ్మను జాగ్రత్తగా చూసుకుంటారు. ఈమధ్య 3 నెలలకోసారి నా భార్యామణి కూతురు దగ్గరికి బెంగళూరు వెళ్లి వస్తోంది కూడా. మా ఇల్లు మల్కాజిగిరిలో. మేమిద్దరం మధ్యతరగతి మనస్తత్వాలకు మరీ దూరంగా పోకుండా కాలక్షేపం చేసేస్తున్నాం.

లలితకు రాత్రి భోజన సమయంలో, అమ్మ ఫోన్ గురించి చెప్పాను.

“మొన్నేగా పండగలకు వెళ్లొచ్చాం? ఇంతలో మామయ్య గారికి ఏమై ఉంటుందబ్బా!” సందేహం వెలిబుచ్చింది. “మీ రమణ గారికి ఒకసారి ఫోన్ చేయొచ్చుగా? ఆయనకు తెలియని ఆరోగ్య సమస్యలు ఉంటాయా!” అని ఓ సలహా కూడా ఇచ్చింది.

నేను మాట్లాడకుండా టీవీలో న్యూస్ చూస్తున్నాను.

నా కేసి సాలోచనగా చూసి, “పెద్ద వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అదేదో వెళ్లాక తెలుస్తుంది” అంది. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాను. లలితకు నా ముఖ కవళికలను బట్టి మనసు అర్థం చేసుకోవడం బాగా తెలుసు.

సాయంత్రం పని అయిపోయాక గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేసాను. కూర్చునే సమయానికి వచ్చింది ‘హైమ’! వెంటనే గుర్తు పట్టాను. తన నిలువు బొట్టు, పెద్ద కళ్ళు, సొట్ట బుగ్గ ఏం మారలేదు! అదేంటి, మరి? తల నెరవలేదు. చూసి కూడా పలకరించడం లేదు. చిత్రం! అనుకుంటూ, ఉండగానే “అంకుల్! ఆ కింద ఖాళీయేనా? నా సూట్ కేసు పెడతాను” అన్నదా అమ్మాయి.

అప్పటికి అర్థమైంది! హైమ కాదు, బంధువు ఏమో! మేనత్త కూతురా? స్వంత కూతురా? క్షణాల్లో పాతికేళ్ల వెనక్కి వెళ్లి, మళ్లీ మామూలుగా అయిపోయాను.

“ఖాళీయేనమ్మా!” అని కింద పెట్టడానికి సహాయం చేశాను.

కూర్చున్నాక, ఫోన్ చేసుకుంది, “తాతయ్య! బండి ఎక్కేసాను. పార్సిల్ తెచ్చుకున్నాను.తినేసి పొద్దుటికంతా వచ్చేస్తాను.”

కొద్దిగా మాట్లాడి, తెచ్చిన పాక్ విప్పుకొని,ఇడ్లీ తింది. మంచినీళ్ళ బాటిల్ కోసం అనుకుంటా, వచ్చే పోయే హాకర్లను గమనిస్తోంది. మజ్జిగ ,లస్సీ, పెరుగన్నం పులిహోర -ఇలా ఏవేవో వస్తున్నాయ్.

నేను కిందకి వెళ్లి, ప్లాట్ఫాంపై ఒక మంచి నీళ్ళ బాటిల్ కొని తెచ్చి, అమ్మాయికి అందించాను. “ఇరవై రూపాయలు” అన్నాను. ఫక్కున నవ్వింది. “సరే అంకుల్! ఐనా థాంక్యూ!”- అంటూ. నేను కూడా కలిసి నవ్వాను.

“ఈమధ్య రైళ్లల్లో, విమానాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదట. మా అమ్మాయి బోలెడు జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది” అన్నాను.

“ఔనండీ! ఇప్పుడు అదే నడుస్తోంది. చిన్న ప్రయాణంలో అంత అవసరమా?”

ఇలా, ఆ అమ్మాయి మాటలు వింటూనే, డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకున్నాను. త్వరగానే పడుకున్నాం. ***

నేనెప్పుడూ రాజమండ్రిలో రైలు దిగి అమలాపురం వెళ్ళిపోతాను. హైమ గురించి ఏం అడగాలన్నా,ఇలా కుదరదని ఈసారికి ఈ అమ్మాయికి జూనియర్ హైమా అని పేరు పెట్టుకున్నాను. పాత జ్ఞాపకాలు తిరగతోడు కొన్నాను.

హైమ చాలా చురుకు. తను గర్ల్స్ స్కూల్. నేను మున్సిపల్ స్కూలు. అందరం పక్కపక్కనే ఉండే వాళ్ళం. ఆరు నుంచి పదో తరగతి దాకా కలిసి ఆడుకునే వాళ్ళం. తర్వాత మేము పలకరింపులతో పేపర్లలో రిజల్ట్స్ చూసుకోవడంతో గడిచింది. తను కాకినాడలో డాక్టర్ కోర్స్‌కి వెళ్ళిపోయింది. జీవితం గురించి ఆలోచించుకుంటూ ఇంటికి చేరాను. ఇంట్లో నాన్న లేరు. “కాస్త టిఫిన్ చెయ్” అంటూ రెండు దోసలు, అల్లం పచ్చడి పెట్టింది అమ్మ.

రమ్యకి, లలితకు అప్డేట్స్ ఇచ్చాను.

కాసేపట్లో నాన్న వచ్చారు.

కుశలప్రశ్నలు అయ్యాక కుర్చీలో కూర్చుని, “బాబు! నాకు, కాశీ, ప్రయాగ, రుషీకేశ్, ఆ గంగ చూడాలని ఉందిరా!”తీరికగా ప్రకటించారు నాన్న.

“ఇప్పుడా? నాన్నా”అన్నాను.

“అవున్రా! చాలా ఏళ్ళ కిందట చూశాను. నాకు ఒకసారి ఆ గంగమ్మనీ, దేవుళ్లను చూసేసి రావాలని ఉంది” 70లలో ఉన్నా, నాన్న ఇంత సెంటిమెంటల్‌గా ఎప్పుడూ మాట్లాడలేదు. అమ్మ కూడా వచ్చి కూర్చుంది.

“అది సరే! అదేనా ఇంకా ఏమైనా చెప్తారా?” అంది.

నాన్న నవ్వారు.”సరే! నీ మాట నేను కాదంటానా! కాదనగలనా?.. ఏమీ లేదు లేరా! మొన్న చుట్టం చూపుగా మన రమణ వచ్చాడు. ఇదిగో ఈ మెడమీద కాయ ఏదో ఉంది చూడండి అంది – మీ అమ్మ. వాడు చూసి తప్పదంటూ పరీక్షలు చేయించాడు. ఆపరేషన్ చేయాలి థైరాయిడ్ పెరిగింది అన్నాడు. అదేదో అయ్యేలోపు ఈ యాత్ర పెట్టుకోవాలి అనిపించింది. ఏం పర్వాలేదు అన్నాడనుకో!”

“అవునా! నాన్నా. నేను రమణను కలుసుకుని వస్తాను. విషయాలు మాట్లాడుకుందాం.”

నాన్న మెడికల్ ఫైల్ పట్టుకుని బయలుదేరాను. రమణ చాలా పలుకుబడి ఉన్న డాక్టరు. సర్జన్. చిన్నప్పటి నుంచి మేము స్నేహితులం. లోపలికి వెళ్లగానే పేషెంట్లను ఆపేశాడు. “రారా!” అంటూ ఇంట్లోకి దారితీసాడు. “అయ్యో! వాళ్లందర్నీ, అలా?” అన్నాను నేను. “ఎంతసేపో కాదు లేరా! కాఫీ తాగి వచ్చేద్దాం.” అంటూ లోపలికి తీసుకువెళ్లాడు.

“నాన్నకి” అని నసిగాను.

“పర్లేదులే! థైరాయిడ్లో చిన్న కణితి.”

“చెయ్యాలి అంటావా? తట్టుకోగలడా?” అన్నాను.

“అవును. ఏం అవ్వదు లేరా! ఆ రకం వాటికి ప్రాణాపాయం ఉండదు. కానీ ఆపరేషన్ చేయించాలి”

 నేను తేలిక పడ్డాను.”మరి ఆయన ఏమిట్రా? ఏదో కాశీయాత్ర అన్నారు?” అని అడిగాను.

రమణ నవ్వాడు,”ఒరేయ్ గడిచిపోతూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.ఏదైనా అనారోగ్యం వచ్చేసరికి రకరకాల ఆలోచనలు వస్తాయి. తన ఒంటి మీద కత్తి పడే లోపు కాశీకి వెళ్లి రావాలన్నారు.పంపించూ” అన్నాడు.

“మరి ఈ లోపు ఆపరేషన్ చేయకపోతే లేట్ అవ్వదా?”అని అడిగాను.

“పర్వాలేదు. మరో నెలలో చేసినా, ఇప్పుడు చేసినా ఒకటే. కానీ చెయ్యాలి మరి. తప్పదు.”

 కాసేపు కబుర్లు వేసుకున్నాం. “మన స్కూలు బ్యాచ్ మేట్స్ గెట్ టుగెదర్ పెడుతున్నాం. వచ్చేనెల 20వ తారీకు. ఆ పాటికి నాన్నగారి ఆపరేషన్ పెడదాం. ఓ వారం నువ్వు సెలవు పెట్టుకుంటే, అన్ని పనులు సరిపోతాయి” హుకుం జారీ చేశాడు.

ఇంటికి వచ్చేసాను. అమ్మ నన్ను చూడగానే లేచింది, “నీతో భోజనం చేస్తాను అన్నారు నాన్న. రమణ కలిసాడా?” అని, లోపలికి వెళ్ళింది.

నాన్న నా కేసి చూశారు, “ఏరా దేవుడికి 40 ఏళ్లుగా దీపం, దండం పెడుతున్నాను. ఆ పొగకు కూడా క్యాన్సర్ వచ్చింది అంటాడా మీ రమణ?” తెచ్చిపెట్టుకున్న నవ్వుతో . నాన్న పక్కన కూర్చుని ఆయన చేయి నా చేతి లోకి తీసుకున్నాను.

“లేదు నాన్నా. అంతటి ప్రమాదాలు ఏం లేవు. ఆపరేషన్ చేయాలట,ఆ తర్వాత మిగిలిన విషయాలు చెప్తాను, అన్నాడు” అన్నాను.

“అదేంట్రా అన్ని పరీక్షలు అయిపోయాయి అన్నాడు?”

 “కొన్ని పరీక్షలు మటుకు, ఆపరేషన్ తరువాత ఆ కణితిని టెస్ట్ చేశాక తెలుస్తాయి. వంట ఎంత బాగా చేసేమన్నా, తిన్నాకేగా రుచి తెలిసేది?” అన్నాను లోపలికి దారి తీస్తూ.

అమ్మ కూడా నవ్వుతూ తల తిప్పి చూసింది. భోజనాలు అయ్యాక నాన్న అమ్మా యాత్రల ప్లాన్ వేశాను. మంచి రోజు కూడా వెతికాం నేను, లలిత ఫోన్ లోనే. అమ్మ నాన్న ఎదురుగా అన్నీ మాట్లాడుకున్నాం.

మాటల మధ్య లలిత,రాజీవ్ వస్తున్నాడని కబురు చెప్పింది. నాలుగు వారాల తరవాత టికెట్టు తీసుకుంటున్నాడట. ఇప్పుడేం సెలవలు లేవే! అయినా పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో, వాళ్ల ప్లాన్స్ వాళ్లవి. మనం గౌరవించక తప్పదు అనుకున్నాను.

***

యాత్ర ముగించుకొని అమ్మ-నాన్న వచ్చారు.

ఆపరేషన్ సమయానికి నేను,లలితా వెళ్ళాం. బాగా జరిగింది.

నాన్నను ఇంటికి తీసుకు వచ్చాక మూడో రోజుకి మా చిన్ననాటి స్నేహితుల పునః సమ్మేళనం భారీ ఎత్తున జరిగింది. అలనాటి టీచర్లు, మాస్టార్లు, మా స్నేహితులు చాలామంది వచ్చారు.

నిదానంగా, భోజనాల తర్వాత వచ్చిన వాళ్లలో మా హైమా, నా జూనియర్ హైమ కనిపించారు. అమ్మాయే నన్ను, “హలో అంకుల్! నా పేరు శృతి” అంటూ పలకరించింది. నేను తడబడుతూనే, “ఆ వేళే అనుకున్నాను సుమా! నువ్వు మా హైమ కూ..కూతురివా?!. ఇంతకు హైమా ఏంటిలా చిక్కి పోయావు? ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు?” అంటూ ఆప్యాయంగా పలకరించాను.

“ప్రాక్టీసా? ప్రాక్టీసు… లేదుగా..! నువ్వు బావున్నావా? నాన్న అమ్మ ఎలా ఉన్నారు?” అంది.

హైమ మాటలో చిన్న తొందరపాటు, కంగారు.

సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాం.

మర్నాడు రమణా నేను కూర్చున్నాం.వాడు చెప్పుకొచ్చాడు.

 హైమ డాక్టర్ కోర్స్ అవుతుండగానే ఆమెకు మేనమామ కొడుకుని ఇచ్చి పెళ్లి చేశారు. అతడు ఏదో బ్యాంకులో పని చేస్తాడు. హైమ ఉద్యోగం రీత్యా పి.హెచ్.సి.లో పని చేసింది. అతడు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళాడు. అక్కడెవరో సహోద్యోగితో సంబంధం పెట్టుకోవడం జరిగింది. మూడేళ్లు బాగానే జరిగింది, అటు-ఇటు చక్కగా జీవితం సాగిస్తూ గడిపేసాడు హైమా వాళ్ళయన. ఆ తర్వాతే ఆ వూరి డాక్టరు, హైమా కలుసుకోవడం తటస్థించింది. మాటల మధ్య హైమ భర్త సంబంధం గురించి బయట పడింది.

పిల్లకు ఇంకా రెండు ఏళ్ళు వయసు ఉండగా ఈ విషయం తెలిసిన హైమ మనసు బాగా దెబ్బతింది. అప్పుడే మతిస్థిమితం తప్పింది. పెద్దలు కలుగ చేసుకున్నప్పటికీ, ఆమె మనసు చాలా తీవ్రంగా బాధపడి, హైమ కోలుకోలేదు. చాలా రోజులు వైద్యం జరిగింది. హైమ భర్త దూరంగా వెళ్ళిపోయి వదిలేసాడు. ఇక వాళ్ళ నాన్నగారు హైమను, బిడ్డను తన ఇంటికి తెచ్చుకున్నారు. సుమారు రెండు సంవత్సరాలు హిస్టీరియాతో ఒకే గదిలో గడిపింది హైమ. కూతురుకు పదేళ్ల వయసు వచ్చేసరికి ఉదృతం తగ్గింది. మనుషులలో పడింది. ఉద్యోగం పోయింది. హైమ కూతురే శృతి. ఎందుకో ఆ తరువాత కూడా హైమ భర్త కలిసి రాలేదు. ఇక వీళ్ళు వదిలేసారు. శృతి అమలాపురం బి.వి.సి.కాలేజిలో ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరం. సంగీతం నేర్చుకుంటోంది. తల్లిని చూసుకుంటూ అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంటున్నారు.”

కాసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం.

“కానీ! ఒక డాక్టర్‌గా హైమ చదువు, ప్రతిభా అన్ని నేలపాలయ్యాయిరా. ఎంత బాగా చదివేదని! అబ్బాయిలతో పోటాపోటీగా. తను పి.జి. చేసేటప్పుడు వాళ్ల సీనియర్లు చెప్పేవారు… అందరికన్నా ఎన్నో రెట్లు గొప్పగా పని చేసేదట. అప్పట్లో తన ఒక సెన్సేషన్. సర్వీస్‌లో అయితే ఒక్క చేత్తో సునాయాసంగా ఆపరేషన్లు, డెలివరీలు చేసేది. అసలు హైమ చెయ్యి పడితే చాలు అని మా కాలేజీలో, తర్వాత కూడా మంచి పేరు తెచ్చుకుంది. నా మటుకు నాకు హైమ ఒకే జన్మలో రెండు జన్మలు చూస్తోందనిపిస్తుంది.

అద్భుతమైన ప్రతిభ, చదువు… హఠాత్తుగా వచ్చిన మార్పు… మతి భ్రమణం… ఇప్పుడు బాగానే ఉందనుకో…. ఏంటో! కొన్ని జీవితాలు అంతే! ఎలా ప్రయాణిస్తాయో తెలీదు.” అన్నాడు రమణ.

చాలాసేపటి దాకా విన్నది జీర్ణించుకోవడానికి సరిపోయింది నాకు. తనకు జరిగిన మోసానికి బాధ, బతికే ఉందిలే అనే ఆనందం, కూతురు భరోసాగా ఉన్నందుకు సంతోషం…. ఇలా ఎన్నో భావాలు కలబోసిన మనసుతో ఇల్లు చేరాను.

తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. నాన్నగారి రిపోర్టులు వచ్చాయి. భయపడే అవసరం లేదని రమణ చెప్పాడు. మనసుకు ఊరటగా ఉంది. మరో నెలలో రాజీవ్ వస్తాడు

ఇంతే కదా! బాధ ఒక రోజే ఉంటుంది. నెమ్మదిగా రొటీన్‌లో పడిపోతాం.

***

రాజీవ్ వచ్చి రెండు రోజులయింది. సెలవు పెట్టుకుని రమ్య బెంగుళూరు నుండి వచ్చింది. రాత్రి భోజనాలయ్యాక మా ‘సర్వసభ్య సమావేశం’ మొదలయింది. తీరుబాటుగా పెద్ద విషయాలను చర్చించడం అన్నమాట. ఆసక్తిగా వినడానికి కూర్చున్నాం.

రాజీవ్ జేబులోంచి ఒక ఫోటో బయట పెట్టాడు. ఎవర్నో ప్రేమించాడు కాబోలు అనుకున్నాను. నేను లలిత ముందస్తుగానే దీనికి సిద్ధపడ్డాం…

ఫోటో శృతిది. చూడగానే గతుక్కు మంది నా మనసు.

 “ఈ అమ్మాయి…” అని అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. “ఏం మీకు ముందే తెలుసా?” అన్నాడు పిల్లాడు. “తెలుసు అంటే… కొంచెం తెలుసు. వాళ్లది అమలాపురం. వాళ్ల అమ్మకు అంతగా మతిస్థిమితం లేదు. నాకు కుటుంబం అంతా తెలుసు, కానీ…. ” నేను సందేహాస్పదంగా చెప్పాను.

‘నాన్నా!” అని రాజీవ్ ఏదో చెప్పబోయే లోపు, రమ్య చెయ్యి పైకెత్తి, “అన్నయ్య చెప్పేదంతా విన్నాక అప్పుడు మాట్లాడదాం” అని తీర్పు చెప్పింది.

లలిత, నేను మొహాలు చూసుకున్నాము.

రాజీవ్ నిదానంగా మొదలుపెట్టాడు. “అమ్మా-నాన్నా, చెల్లాయ్! ముందుగా నేను మీకు నా గత రెండేళ్ల జీవితం గురించి చెప్పాలి. ఉద్యోగం బాగానే సాగింది. కంపెనీలో సరైన వాళ్లు కలిసి సరదాగా గడిచింది. బాగానే వెనకేసుకున్నాను. ఇంజనీరింగ్‌లో నా జిగ్రీ దోస్త్ ఒకడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. వాడు వచ్చాక నేను వాడు కలిసి ఇల్లు తీసుకున్నాం.

ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారు అన్నట్టు, వాడి ‘స్పీడు’ నాకు అబ్బింది. వాడి ప్రభావంతో కొన్ని వ్యాపారాల్లో మదుపు పెట్టాను. ఒకానొక విషయంలో వాడి బదులు, నేను సేవింగ్స్ అన్నీ ఇన్వెస్ట్ చేసేశాను.

 పూర్తిగా నమ్మడం నా తప్పనుకోండి. ఏదేమైనా ఇది జరిగిన మూడు వారాల తర్వాత వాడు మాయమైపోయాడు. నా బుర్ర బద్దలై పోయింది. చేతిలో ఆ నెల జీతం తప్ప ఏం లేదు. ఎవరితో చెప్పాలన్నా, నా అనుభవలేమి- నా పొరపాటే తప్ప ఇంకేం కనబడలేదు. చాలా డిప్రెస్ అయ్యాను. ఓ రోజు శనివారం కూర్చుని ఉన్నాను. జస్ట్ నా పక్కన ఉన్న ఒక భారతీయుడి మీద కాల్పులు జరిగాయి. హోటల్లోకి కుటుంబంతో సరదాగా వచ్చినవాడు అక్కడికక్కడే కుప్పకూలి చచ్చిపోయాడు.

నా చెవుల్లో ఆ హాహాకారాలు ఇంకా స్పష్టంగా వినబడుతూనే వున్నాయి. ఒక వారం పాటు పిచ్చిపట్టిన వాడిలా అయిపోయాను.

నా కొలీగ్స్ నన్ను ఆదుకున్నారు. డబ్బు కన్నా ప్రాణం విలువైనది. పరిస్థితులు చక్కబడే వరకు వాళ్ల సహకారం రోజూ ఉండేది. మూడు నెలలపాటు నా కొలీగ్ సుందర్ నా దగ్గర ఉండి నన్ను కోలుకునేలా చేశాడు. ఖాళీగా ఉన్న నా మెదడు మనసు కుదుట పరిచాడు. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న వాడితో ఉండడానికి మూడు నెలల కోసం అమెరికా వచ్చారు. వాళ్ల ఫాదర్…. ఆయన నన్ను ప్రత్యేకంగా పట్టించుకున్నారు. ఎప్పుడూ సరదాగా గడిపేవారు ఆయన వల్లే నాకు బాలమురళీకృష్ణ గారి తత్వాలు, కీర్తనలు వినడం వచ్చింది. అప్పుడే, ఒకసారి ఈ శృతి పాడిన పాటని వినిపించారు. నాకు చాలా నచ్చింది. నెమ్మదిగా ఆమె పాటలు అన్నీ వింటూ ఉండేవాడిని. అంకుల్ శృతి గురించి అంతా చెప్పారు. వాళ్లకు బంధువులవుతారట.”

 “సరే రా, అన్నయ్యా… ఇంతకు శృతిని పెళ్లి చేసుకుందామనేనా నిర్ణయం?” అంది నవ్వుతూ రమ్య.

 “అదేమిట్రా! అంత బాధ పడితే, ఒక్క మాట అయినా చెప్పావు కావు. ఎలాగో ఒకలా నేను వచ్చి నిన్ను చూసుకుందును కదా! అస్సలు తెలియ చెప్పకుండా అలా దాచుకోవడం ఏమిటిరా? అన్ని కష్టాల్లోకి డబ్బు కష్టమే అతి సులువైనది. నష్టం లేదు. పోయిన డబ్బు మనది కాదు, అనుకోవాలి. నీ గురించి తల్లడిల్లి పోయే వాళ్ళం ఇంతమంది ఉండగా…” లలిత నిష్ఠూరంగా అంది.

“ఇంకిప్పుడు పాతవి తవ్వకమ్మా!” రమ్య సర్దబోయింది.

 రాజీవ్ మటుకు, ” కాదు లేవే! నాదే తప్పు. అమ్మ కైనా చెప్పాలిగా! అమ్మా! ప్లీజ్! ఏమీ అనుకోకు. అప్పుడు నా బుర్ర ఖాళీ అయిపోయింది. చూస్తూ ఉండగా రెండు వారాలు గడిచిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకున్నాను. మీకు చెప్పకూడదని కాదు కానీ,…” అన్నాడు.

 నేను, ” నీకు అంతా తెలుసా?” అన్నాను.

“ఆ! తెలుసు, నాన్నా. శృతితో నేను మాట్లాడాను స్కైప్‌లో..

తండ్రి లేకపోయినా, ఒకపక్క తనను తాను మలచుకుంటూ, మరో పక్క వాళ్ళ అమ్మను జాగ్రత్తగా చూసుకుంది శృతి. అంతా బాగా జరిగినప్పుడు కాదు, అవాంతరాలు వచ్చినప్పుడు దాటుకుని వెళ్ళగలగాలి. ఇది నేను నేర్చుకున్నాను. కానీ శృతి అమలు చేసేసింది. నాకు అదే నచ్చింది.

శృతి వాళ్ళ అమ్మ మీకు తెలుసు. ఆవిడకి జరిగిన అన్యాయం గురించి కూడా మీకు తెలుసు కదా ఇంకెందుకు?”.

లలిత, “ఆ విషయం చెప్పారు లేరా నాన్నా! సరే నీ ఇష్టం” అంటూ లేచింది. “కంగ్రాట్స్ రా అన్నయ్యా! మా అన్నయ్య ఎలాగైనా స్పెషల్” అంటూ మెచ్చుకుంది రమ్య.

“స్వీట్ తినాలి ఇప్పుడు” అంటూ లలిత లోపలికి వెళ్లి తను చేసిన కొబ్బరి ఉండలు పట్టుకుని వచ్చింది.

నేను, ముందు గదిలోకి వెళ్లాను. జీవన రథం వెళ్లే దారులు ఒక్కోసారి పక్కావి.ఒక్కోసారి కచ్చావి.

పూలబాట మీద వెళ్తే పూలు తొక్కేసాం అనుకోవాలా? ముళ్ల బాట ఎదురైతే ప్రయాణం ఆపేస్తామా? నడక ముఖ్యం.

ఇంతలో రాజీవ్ నా దగ్గరికి వచ్చాడు.

“ఇంతకీ పెళ్లయ్యాక ఏం చేస్తావ్?” కళ్ళలో కళ్ళు పెట్టి నిశితంగా చూసాను.

“శృతి, నేనూ ఆ ఊళ్ళోనే జాబ్ చూసుకుంటాం. కుదరకపోతే వాళ్ళ కాలేజ్‌లో ఫాకల్టీగా ట్రై చేద్దామని నాన్నా”.

వెనకనుంచి లలిత, ‘ పోనీలెండి మళ్లీ మీ వంశవృక్షం అదే గడ్డమీద కొత్త చిగురు తొడుగుతోంది. నాకు ఓకే రా! దేశంలో నువ్వుంటానంటే అంతకన్నా మాకు బలం ఏముంది?” అంది.

ఈ కొత్త పాయింట్‌కి నేను నవ్వుకున్నాను తృప్తిగా.

***

 “అంటీ అంటక.. ఇంటి మోహమూ విడవలెనూ…….

 నిజము కాదని మది నిలచుండవలెనూ…”

బాల మురళి కృష్ణ గారి తత్వం.

శృతి చక్కగా ఆలపిస్తోంది.

చిరునవ్వుతో… ఆ అమ్మాయికి ఈ ప్రయాణపు సత్యం ఏదో తెలుసునన్నట్టు, అప్పుడప్పుడు కళ్ళు మూసి… తెరుస్తోంది.

నేను వింటున్నాను…..

Exit mobile version