[dropcap]చ[/dropcap]లం ఆత్మకథ రాసుకుని/రాయించుకుని ఇప్పటికి దాదాపు 50 ఏళ్ళు! ముందు మాటలో ఆయనే అన్నారు “నా చెయ్యే నా మెదడు” అని.
అవును నిజమే. కళ్ళు సరిగా కనిపించనప్పుడు, చేతులు కలాన్ని గట్టిగా పట్టుకోలేనప్పుడు … లోపలి ఆలోచనలన్నీ ఆ చేతి వేళ్ళ నుంచే బయటపడ్డాయి.
అదిగో – విలువైన, అమూల్యమైన ఆ పుస్తకాన్నే ఈమధ్య (జూన్ రెండోవారం) చదివాను. చదువుతున్నంతసేపూ ఒకప్పుడు కొడవటిగంటి కుటుంబరావు అన్నమాటలే గుర్తుకొచ్చాయి. సంచలనాల చలం ఎంత ఒంటరివారో ఆయన ఆలోచనలు అంత జంటగా జనం దరిచేరాయి మరి.
అప్పట్లోనే “నాకు ఎవరు తోడు” అనుకున్నారు ఆత్మకథా రచయిత. “అసలు నేను రాయకపోతేనేం” అని కూడా మథనపడ్డారు. అయినా తన కథావాహినిలో లోలోపలి వ్యధలూ అంతర్మథనాలూ పేజీలనిండా పరచుకున్నాయి. వీటిలో చలం మది నిండా ఆనందం నింపినవీ, సాటివారి హృదయాల్లోకి చొరబడి అటూ ఇటూ కదిపి కుదిపినవీ-రెండూ ఉన్నాయి.
ఏ మనిషిలోనైనా ఏముంటాయి?సంతోష సంతాపాలు. ప్రతివారి జీవితంలోనూ అనుభావానికి వచ్చే భావాలేమిటి? సుఖదుఖాలు. వీటిని పలవరించిన జ్ఞాపకాలే చదువరి ఎదలో తిష్ఠవేసి తీరతాయంటే మీరు నమ్మాలి.
ఎందుకంటారా …
*చిన్నప్పుడు చలం జేబులో కడిగిన ఏ ఆవకాయ ముక్కయినా ఉంటే చాలు. అసలీ లోకంతోనే పని లేదన్నట్లు ఉండేవారు. అంతేనా-ఠంచనుగా పరీక్షలప్పుడే ఏ జ్వరమో వచ్చి తప్పి కూర్చుని టీచర్లందరినీ నివ్వెరపరచేవారు.
*సోదరి పెళ్ళి వేళ “ఎంతమంది ఆడపిల్లలు ఇట్లా నానా బాధలూ పడుతున్నారో” అని తల్లడిల్లిపోయారు. భార్యను స్వప్నచారిణిగా భావించారు.
* ఆ తర్వాత కాలక్రమంలో- కొంతమందితో కలిసి ఒకే ఇంట ఉండేవారు. ఆ రోజుల్లోనే దేవులపల్లి కృష్ణశాస్త్రితో సావాసం. నాటకాలతో సహా ఏది రాయాలన్నా అదొక పిచ్చి. ఒకసారి *చిత్రాంగి*ని పట్టుపట్టి మరీ పూర్తి చేసింది చాలక , అప్పుడే ఆ రాత్రే ఎవరికైనా సరే చదివి వినిపించా లనుకున్నారు. ఇంటి నుంచి ఆ చిమ్మచీకట్లో ఈదురుగాలిలోనే బయలుదేరి రెండు మైళ్ళు నడిచి వెళ్ళారు. నేరుగా చింతా దీక్షితుల్ని గది తలుపులు తట్టి లేపి, తాను రాసిందంతా చదివి వినిపించాకే తిరుగుముఖం పట్టారు చలం.
*అందం, ఆకర్షణ… ఇటువంటివన్నీ అబద్ధాలేనా- అంటూ ఎప్పుడూ తర్కించే వారాయన. తాను జీవితమంతా ఆశించింది, అన్వేషించిందీ శాంతినే. మరో వైపు… అశాంతినిచ్చేది తన జీవితంలోకి రాకపోతే ఉత్త మొద్దులా ఉండేవాడిననీ చెబుతుండేవారు. తన జీవితం నిండా యుద్ధమే ఉందన్నారు. తనలోని బాధతోనే కాదు-ఇతరత్రా అంధకారంతోనూ నిరంతరం పోరాడానన్నారు. ఎప్పుడూ అంచుల్లోనే ఆయన నడక సాగింది.
ఇంకా-
1936 నుంచి తన లోపలి సంతో షమంతా పూర్తిగా మాయమైంది. “ఈ ప్రపంచం నాకే కాదు, లోకంలోని గొప్ప మేధావంతులకూ అర్థం కాదు”అనడంలో నిర్వేదముంది. మనిషి మనసే అంత; అనంతమైన ఈ కాలాన్ని తెలుసుకునే శక్తి దానికి లేదనడంలో వేదాంతమే ధ్వనిస్తుంది.
తనకేమైనా కాంతి రానీ, రాకపోనీ- ఈశ్వరుడే సత్యం అని చివరికి తేల్చి చెప్పడంలో, అన్నీ తనకూ కొంతవరకు తెలుసుననడంలోనూ సంచలనాల చలం అచలంగా కనిపిస్తారు.
రాతకు సంబంధించి ఆయనదో విభిన్న అనుభవం. మనసును వికసింపచేసేదే గొప్ప సాహిత్యమంటారు ఇదే “చరిత్ర”లో మరో చోట. పూర్తిగా నిజమేనని ఈ పుస్తకం చదివాక నాకూ అనిపించింది.
***
పేజీలు: 224
వెల: రూ. 60
ప్రచురణ: అరుణా పబ్లిషింగ్ హౌస్
ఏలూరు రోడ్డు, విజయవాడ -2