Site icon Sanchika

చలం లేఖలు

[ప్రఖ్యాత రచయిత శ్రీ గుడిపాటి వేంకటాచలం తనకు వ్రాసిన లేఖలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య. ఈ లేఖలలో చలం గారు తమ ఆధ్యాత్మిక అనుభవాలను వెల్లడించారు.]

1.(18-7-1957)

సుప్రసన్న గారికి,

మీ ఉత్తరం అందినది. శ్రీ శ్రీ ద్వారా మీకు చలం పరిచయమైంది. అదొక విశేషమే కావొచ్చు. కాని చలం ద్వారా మీకు అరుణాచలం దర్శనమైతే మీరన్నట్టు తప్పకుండా జీవితాన్నే క్రొత్తగా ముంచివైచే ఒకానొక నవోత్తేజం పొందుతారు.

నాకో కొత్త మిత్రుణ్ణిచ్చాయి నా పుస్తకాలు.

ఈశ్వరాశీర్వాదాలతో

చలం.

2.(3-8-1957)

సుప్రసన్న గారికి,

మీ ఉత్తరం,

విషయాలకు ప్రశ్నలకూ జవాబులకూ సంబంధం ఉంటుంది. కాని మన మనుకునే సంబంధం కాకపోవొచ్చు. ఏమైనా ఉత్తరంలో మీరు వేసుకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మీ ఉత్తరంలోనే ఉన్నాయి. కావల్సిందల్లా అవి సరైన సమాధానాలని విశ్వాసం కుదరడమే. మనసు స్వభావమే ప్రశ్న. మనసుకి తెలివి హెచ్చిన కొద్దీ సందేహాలు ఎక్కువొతాయి. సమాధానాల పైన ఇంకా ప్రశ్నలు రేగుతాయి. ఆ గుణం విజ్ఞానాభివృద్ధికి చాలా అవసరం ఈ Sciences అన్నీ పాతవీ కొత్తవీ కూడా. ఆ unsatisfied curiosity వల్లనే పుట్టి పెరిగాయి. ఆ మనోగుణమే మానవుణ్ణి దూరం చేస్తోంది. వెతికి వెతికి కానక తిరిగి ఈశ్వరుణ్ణి చేరుకునేటట్టు చేస్తోంది. మనసు అనేది ఉన్నన్నాళ్ళు ప్రశ్నలూ తెగవు. ఔను మనసు ఆగితే ఆలోచనా ఆగుతుంది. దాంట్లోనే గాని ప్రశ్నలు ఆగవు.

ఆలోచనా పథమే నశించిన్నాడు ఆది మానపుణ్ణి జంతు స్థితి తీసుకుపోదు (జంతువుకీ ఆలోచన వుంది). దేవతాస్థితికి తీసుకుపోతుంది. ఆధ్యాత్మిక సాధన అంతా మనసుని ఆపడానికే, అంటే ఆలోచనలేని స్థితిని పొందడానికే, అది అమృతస్థితి. Academy ల సంగతి నాకు తెలీదు. అఖ్ఖర్లేదు. వాళ్ళ నన్ను పిలవరు. నేను పోను. ఔను ధ్యానం వల్ల శాంతీ, ఉత్తేజమూ లభించే మాటా చాలా నిజం. ఆధ్యాత్మిక శాంతి మీరు చెప్పే రకము శాంతులన్నిటికీ మించినది. ఆవి అసలు శాంతికి దూరపు జ్ఞాతులు. ధ్యానమంటే ఒక దాని పైనే మనసు నిలి ఉండే స్థితి ఏదైనా సరే కాని ఆ విషయానికి మీ మనసుని కట్టేసే శక్తి ఉండాలి. ఉహ లేకుండా ఉండిపోవడం ధ్యానానికి ఆశయం. ఔను మాట్లాడుకుంటే కొంత సులభంగా సంగతులు అర్థమౌతాయి. కాని ఇక్కడి వాతావరణం ఇంకా సులభంగా అర్థమయ్యేట్టు చేస్తుంది. మాట్లాడుకుంటే understanding, ఈ వాతావరణం, అది experience, భగవాన్ ప్రభావం.

ఈశ్వరాశీర్వాదాలతో

చలం

3.(14-8-1957)

సుప్రసన్న గారికి,

మీకు భగవాన్ పాదాల ముందు అంత బాగా నచ్చినందుకు సంతోషంగా వుంది. రసదృష్టితో అర్థం చేసుకున్న సంగతి స్పష్టం. ‘శివానంద లహరి’ ‘సౌందర్య లహరి’ పేర్లు విన్నాను. కాని వాటిని చదవలేదు. సంస్కృతం రానిది వాటి ప్రశస్తి ఎట్లా గ్రహించగలను? ఎవరన్నా నాకు వినిపించి explain చేయగలవారు లభించినపుడు నాకా అదృష్టం, మనసు కట్టాలంటే గురువు అనుగ్రహం లేనిది దుస్సాధ్యం నాయని సుబ్బారావుగారు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారు కద.

ఈశ్వరాశీర్వాదాలతో

చలం.

4.(28-8-1957)

సుప్రసన్న గారికి,

మీ ఉత్తరం, గురువు అవసరమనేది అనుభవం వల్ల రాశారు చాలా మంది సాధకులు అనాదిగా. అంతే నాకు తెలుసు. గురువు అంటే ఈశ్వరుడే రూపంలో మనకి కన్పించడమన్న మాట. Sincere గా సాధన చేసే వారికి అవసరమైన సమయం వచ్చేటప్పటికి గురువు దర్శనమౌతుంది. అప్పుడు వైష్ణవుల వలెనే సమస్తమూ గురువుకి అర్పించుకుంటాడు సాధకుడు. సూనృతంగా సాధనలో ప్రవేశించడమూ ఈశ్వరుని ప్రార్థించడమే మన కర్తవ్యము, తక్కింది ఈశ్వరుడే చూసుకుంటాడు. రస దృష్టిలో అంటే నేనేమీ ప్రత్యేకమైన అర్థంలో వ్రాయలేదు. దాంట్లో రసాన్నీ అంతరార్థాన్నీ (allegory) గ్రహించారని వ్రాశాను. సౌందర్య లహరి సంగతి రుక్మిణినాథ శాస్త్రిగారు వారు వెళ్ళిపోయినారు. ఉన్నా ఎవరూ నాకు వాటి అర్థం సరిగా కూచోని చెప్పేవారు లేరు. ఉత్సవం బాగా జరిగింది. మన ప్రయత్నమే కావలిసింది. ఈనాడు సాధించలేకపోయింది రేపు సాధించగలుగుతాము.

ఈశ్వరాశీర్వాదాలతో

చలం.

5. (7-9-1957)

సుప్రసన్న గారికి,

మీ ఉత్తరం, మీరు పంపిన గీతాలు, మీరు పంపిన పుస్తకం, పుస్తకం మెల్లిగా చదువుతున్నాను, బావుంది.. నిజమైన సత్తా ఉన్న artist ని ఎవరూ ఏదీ ఆపలేదు. Silence చేయలేదు. artist లోపలి బలహీనతే, ధనకీర్తులపైన ఆశలే అతన్ని చీల్చేస్తాయి. కొంత రాస్తాడు. ప్రచురణ కాలేదనో, ప్రచురణ వెంటనే సద్యోకీర్తి లభించలేదనో ఆగిపోతాడు. ఎవరి Outlook ని ఎవరు చంపగలరు? తనకి తానేగాక, రచన కోసమే చేసుకోవాలి. Publish కావడం, అది ఒక side issue గా ఉండాలి. ప్రభుత్వం patrons కావడంతో రచన, కవిత్వం, Paying Concerns అయినాయి. రేడియో సినీమాల సహాయంతో, కనక రచయిత సులభంగా నశిస్తున్నాడు. సారస్వత విషయాలకన్న అతి ముఖ్యమైన పనిలో సాధనలో ఉన్నాను నేను. కనక ఆ పనికి అవసరమున్న రోజున అవసరమైపవాడు రానే ఒస్తాడు. ఏ ఉత్తరతోగాని ఏ మనిషి వల్ల గాని భగ్నమయ్యే శాంతి ఒక శాంతి కాదు. అయినా మీ ఉత్తరంలో ఏముందని నా శాంతి చెడగొడుతుంది? నాకు కనబడేదల్లా నా పైన అభిమానమూ, ప్రేమే..

ఈశ్వరాశీర్వాదాలతో

చలం.

6.(21-9-1957)

సుప్రసన్న గారికి,

మీ ఉత్తరం, అవును, మనం ఆత్మలో ఎదిగిన కొద్దీ మహాత్ముల పుస్తకాలు బాగా అర్థమౌతాయి. ఇదివరకు కన్న లోతైన అర్థాలు కనబడతాయి. శంకరుడు, అరవింద, రమణ, మొదలైనవారు మన జ్ఞాన భక్తి etc. విభజనలకందరు; మన మనసుకి వారిని ఓ Catalogues కింద తీసుక రాగల శక్తి లేదు కనక మనం ఏమన్నా వారిని అది సత్యంలో భాగమే అవుతుంది. పూర్తి సత్యం కాదు. ఉత్తరాలు రాయాలనీ, ఎక్కువ మాట్లాడలనీ, బుద్ధిలేకపోవడం ఆత్మాభివృద్ధికి చిహ్నాలు. సాధన సాగుతోందన్న మాటా. ఎవరు ఏ అంతస్థులో ఉంటేనేం, ఉన్నది ఒకటే సత్యం, దాన్ని పొందాలంటే యోచనల్ని (భగవాన్ విషయమైనా సరే చివరికి) తగ్గించుకోవాలి..

ఈశ్వరాశీర్వాదాలతో

చలం.

Exit mobile version