[అనూరాధ బండి గారు రచించిన ‘చలి కథలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
1.
కరిమబ్బుల నవ్వు మెరుపులా గుచ్చుకుంటే
అందం తెలిసిపోతుంది, నవ్వులా.
సౌందర్యం చిరునామాకై వెతుకువాడొకడు
నిగూఢార్థాన్ని లిఖిస్తున్నాడు బొగ్గు కుంపట్లో.
2.
ప్రశ్నలు వచ్చి పిట్టని నిమురుతాయి,
రెక్కల రహస్యమేమిటని.
చలిమంటల్లో సమాధానాలు,
గూడుని వెదకుతాయి.
3.
ముదుసలి వాకిటిని అర్థిస్తుంది..
చలిని వడుకుతున్న రాతిరినిటు తేకని.
గుడ్లురిమినా సరే ఆకాశం తన ఉరుములాపదు.
ఎంత వేడుకున్నా ఆగని వర్షంలా, చలి మాత్రం
నిశ్శబ్దంగా మంచుని కురిపిస్తూనే వుంటుంది.
4.
పిల్లల చలిమంటల్లో ఉదయం తెలుస్తుంది.
వీధుల సవ్వడికి, వీధి దీపాలు
నవ్వుతూ వెళ్ళిపోతాయి.
5.
కొన్ని మగ్గిన పళ్ళు రాలతాయి.
నడిబజారుల్లో దైన్యం మాత్రం
నాట్యం ఆపదు.
6.
అందరూ ఇటు రండి.
మీ మీ ముఖాలను అద్దంలో
చూసుకువెళుదురు.