[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ గారి ‘చంపకాలోచనమ్’ పుస్తకానికి శ్రీ సాంప్రతి నాగేంద్రనాథ్ గారు వ్రాసిన ముందుమాట. [/box]
[dropcap]శ్రీ[/dropcap] పాణ్యం దత్తశర్మగారి ఖండ కావ్యం వారి అఖండ కావ్యరచనా పటిమను ప్రస్ఫుటం చేస్తూన్నది. ఇందులోని ఖండికలన్నీ రసమయగుళికలే. సంస్కృతాంధ్ర భాషలలోనే గాక ఆంగ్ల భాషలో గూడ మంచి పట్టు గలిగిన వీరి పదవిన్యాసము కదను తొక్కిన విధానము నెంత పొగిడినా తక్కువే. పదముల తీరు, తెన్నులను తెలిసి ప్రయోగించుటలో మంచి ప్రజ్ఞాశాలి, సత్కవి శ్రీ దత్తశర్మ, ఔచిత్య నిర్వహణలోని మెళకువల నెరిగినవాడు. ఆ కావ్య రచనా సంప్రదాయాల మీద, ఆధునిక కావ్య కల్పనా విధానాల మీద కూడ సమానమైన గౌరవం కలిగిన వీరి రచనాశైలి అనన్య సామాన్యమైనది.
ఈ కావ్యంలోని ఖండికలను చదువుతూంటే చదువుతున్నట్లుండదు. కవితో కలిసి ఆలోచిస్తున్నట్లో, ఆ పద్యాలతో కలిసి నడుస్తున్నట్లే అనిపిస్తుంది. దానికి నాకు తోచిన కారణం, నిరాడంబరమైన, నిర్దుష్టమైన శైలి. ఎచ్చులకు పోని భావనా బలం. అవసరానికి తగినంతవరకే కావ్యశిల్పాన్ని చెక్కగల నేర్పరితనం. అద్యతన కాలంలో ఎక్కువగా వాడుకలో లేని విశేషవృత్తములు తరళము పద్మనాభము, భుజంగ ప్రయాతము, వసంత తిలకము వంటివి మృదుపద బంధాలతో, హాయిగా సాగిపోతాయి. ఎక్కడా ధార కుంటుపడలేదు. ఛందస్సు ఏదైనా, సమాన స్థాయిలో, పద్యాల మధ్య వెలితి లేకుండా ఈ ఖండకావ్యాన్ని నడిపించారు.
దేవతాస్తుతిలో, సామాన్య మానవుల కొరకు వారికి అర్థమయ్యేలా సగుణ బ్రహ్మ రూపాన్ని ఆవిష్కరింపజేశారు. తెలుగువారింటి పెళ్ళిలో జరుగు వివిధ విశేషాలతో ‘నరసింహుని పెండ్లి’ని వర్ణిస్తూ, విశేష ఛందోవృత్తాలను ప్రయోగించడం శర్మగారి కవితా స్ఫూర్తికి తార్కాణము. ఈ ఖండికలో నరసింహస్వామి వివాహాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రాంతీయ పండుగల విశిష్టతను విశదీకరించే విధంగా బోనాల పండుగను వర్ణిస్తూ సింహవాహినికి సమర్పించిన కవితా నీరాజనం ప్రశంసనీయము.
“మట్టి కుండగ నున్నంత మనును ధరను
వ్రక్కలైనంతనే దాని రాత మారు
మన్నుయాత్మయౌ, దనువేమొ మట్టి కుండ
ఆత్మవెలుగును నిరతంబు ఆరుతనువు.”
అని అత్యంత సులభంగా అర్థమయ్యే రీతిలో జీవితపరమార్గాన్ని బోధించారు ‘మోక్షాకాంక్ష’ అన్న ఖండికలో. జీవితాన్ని కాచి వడబోసిన వారికి తప్ప, ఇతరులకు ఈ విధంగా చెప్పడం సాధ్యం కాదు. అనడం అతిశయోక్తి కాదు. ఈ ఖండిక భోగిని కూడ యోగిగా మార్చగలదని నా విశ్వాసము.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పరమభక్తులు శ్రీ శర్మగారు. జగద్గురువులు ఆది శంకరాచార్యులవారి కరావలంబస్తోత్రమునకు వీరి తెనుగుసేత భక్తిప్రపూరితముగా సాగింది. “ఓయి నరసింహా! నాకు చేయూత నీవే” అనే మకుటంతో పద్య రచన చేశారు. నరసింహస్వామిని “ఓయి” అని సంబోధించడం ద్వారా స్వామికి అత్యంత ఆప్తునిగా తన సాధికారతను చాటుకున్నారు.
అవధాన దిగ్గజం పౌరాణికరత్నం బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రిగారి వైదుష్యవిశేషాలను తమ వ్యాసము ద్వారా తెలియజేసి, తన తండ్రి యెడలగల భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పుత్రులుగా ధన్యులయ్యారు. సహజంగానే వీరు స్త్రీ పక్షపాతి. పైగా విశేషమైన ప్రాపంచిక జ్ఞానం గలవారు. పరిస్థితులను ఆలోచనా ధోరణులను ఇట్టే పసిగట్టగల దిట్ట. అందుకే ‘చంపకాలోచనము’ అనే ఖండికలో సగటు గృహిణి దైనందిన జీవితంలో పొందిన అనుభవాలను, వారి మనోభావాలను, సహజమైన రీతిలో మనోహరంగా వర్ణించారు. అంతే కాదు, పురుషాధిక్యత చూపే వారికి సూటిగా తగిన చురకలంటించారు, శలవు దినములనేవి లేకుండా ప్రతినిత్యము గృహిణి చేసే పనులు అందరికి తెలిసినవే అయినా, ఎవరూ గుర్తించరు. శర్మగారిలా అంటారు “భయమును ప్రేమయన్ భ్రమను బాయుడు ధూర్తపు భర్త లెల్లరున్” అని ఘాటుగా స్పందించారు. అక్కడితో ఆగక “సవరణ చేసుకొండు పురుషాధిక నీచనికృష్ణవర్తనల్” అని హెచ్చరించారు. స్త్రీ వాదులు వీరికి బ్రహ్మరథం పడితే ఆశ్చర్యపడనక్కరలేదు. వీరి కందాల అందాలు మధుర నిష్యందాలు! వీరి సామాజిక స్పృహకు పర్యావరణ రక్షణకై వీరికున్న తపనకు తార్కాణము “తరువే బతుకు తెరువు”.
“తరుహీనం బైనప్పుడు
సురలోకంబైన నిత్యశోభల బాయున్”
అని, పర్యావరణ రక్షణ జరుగకపోతే వచ్చే ప్రమాదాన్ని సూటిగా హెచ్చరించారు.
తెలుగు భాషపై గల మమకారాన్ని తెలుగు విశిష్టతను ‘జాను తెనుగు గెలువ జాలు భువిని’ అని ఖండికలో విశదీకరించారు. విచక్షణారహితంగా ఆండ్రాయడ్ ఫోన్లు వాడటం వలన కలుగుతున్న అనర్థాలను వాట్సప్, ఫేస్‌బుక్ మాధ్యమాల మాయలో పడిపోవటం వలన జరుగుతున్న కష్ట నష్టాలను ఎటువంటి మొగమాటం లేకుండా తెలియజేశారు దత్తశర్మ. ప్రమాదపు బారిన పడకుండా తగిన హెచ్చరికలు కూడ చేశారు. కత్తిని కూరలు తరగడానికి కుత్తుకలు కోసుకోడానికి కూడ వాడవచ్చును అని చెబుతూ సాంకేతిక విజ్ఞానాన్ని సక్రమమైన పద్దతిలో ఉపయోగించుకోవాలని ‘సామాజిక మాధ్యమ వధ్యశిల’లో ఉపదేశించారు. ఈ ఖండికను ప్రతి ఒక్కరు ప్రతినిత్యం చదువుకోవడం మంచిది.
జయ జయశంకర! ఉద్యమ భాస్కర! అని, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఆచార్యుని పట్ల తమకున్న భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వీరికి గల దేశభక్తి అపారమే. ఆది ‘మాతా తవ వందనమ్’ అను ఖండికలో ఆవిష్కరించబడింది. “ఓ సినారె! నీ ప్రతిభకు జోహారె!” అంటూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి. నారాయణరెడ్డి గారిని ప్రశంసిస్తూ వీరు చేసిన కవితానీరాజనం రసికజన హృదయోల్లాసంగా సాగింది. పల్లె ప్రజలు ‘వేకువ’లో పడే శ్రమను గుర్తించి ప్రశంసించారు.
వీరి సామాజిక పరిశీలనాపటిమ అమోఘం. మానవుల ద్వంద్వ ప్రవర్తనా రీతిని నిశితంగా గమనిస్తూ, జీవితాధ్యయనం చేశారనిపిస్తుంది, వీరి ‘విరోధాభాసం’ చదివితే! కొంతమంది స్త్రీలు కోడలి పట్ల ఒక రకంగా, కూతురి విషయంలో మరోరకంగా ప్రవర్తించడం మనం గమనిస్తుంటాము. ఈ విషయాన్ని ఎంతో హృద్యంగా ఈ క్రింది పద్యంలో వర్ణించారు చూడండి!
కం॥
తనయుడు పెండ్లము మాటను
వినకూడదు, తల్లి మాట వినవలెననుచున్
తన కూతురి పతి మాత్రము
ఘన మగు వినయమును జూపవలె, భళిరా!
చూశారా? చిన్ని చిన్ని పదాలతో ఎంత హాయిగా సాగిపోయిందో, డొంక తిరుగుడు లేకుండా సూటిగ సులభంగా పద్యరచన సాగించిన విధానం ‘వేమన’ను తలపింపజేస్తుంది.
‘మౌనేన కలహంనాస్తి’ అనే ఆర్యోక్తిని గుర్తు చేస్తుంది. ‘నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే’ అనే ఖండిక మౌనపు శక్తిని, విశిష్టతను చాటి చెపుతుంది. అల్పమైన పదాలతో అనల్పమైన భావాలను వ్యక్తీకరించే కవితా శక్తి శర్మగారికి వెన్నతో పెట్టిన విద్య. ‘పాత పేపర్లు కొంటాం’ అనే శీర్షికలో ఇది స్పష్టంగా గోచరిస్తుంది. ‘కదిలెడులేమియోయని కన్నడెవృద్ధుడొకండు’ అని నిరుపేద వృద్ధుని వర్ణించిన తీరు అద్భుతం! శ్రమైక కవులపట్ల వీరికి గల హృదయ స్పందన ఈ ఖండిక వారికి సాధ్యమైనంతగా సాయం అందించాలని ఉద్బోధ చేశారు.
కవి కావ్యం రచిస్తాడు. సహృదయ రసజ్ఞులు దానిని అనుభూతి చెంది ఆస్వాదిస్తారు. ఈ ఖండకావ్యము సహృదయ రంజకమై పండిత పామరుల మన్ననకు పాత్రమై ప్రాచుర్యమును పొందగలదని నా ప్రగాఢ విశ్వాసము. శర్మగారికి పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు!
సాంప్రతి నాగేంద్రనాథ్
***
(ఖండకావ్యము)
రచన: పాణ్యం దత్తశర్మ
పేజీలు: 84
వెల: రూ. 99
ప్రతులకు: నవోదయ, ఇతర ప్రముఖ పుస్తక దుకాణాలు
ఫోన్: 95502 14912