[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]ఇ[/dropcap]వాళ ఖాళీ అయిన మా ఎదురింట్లో అద్దెకు చూసుకుందుకు ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళు ఇల్లు చూసుకుని వెడుతుంటే ఆ యింట్లో పదిహేనేళ్ళక్రితం వుండి వెళ్ళిన దంపతులు గుర్తొచ్చారు.
ఆ దంపతులకి యిద్దరు కొడుకులు. ఒకడు ఇంటరూ, మరొకడు నైన్త్ క్లాస్ చదివేవారు. ఆయన ఏలూరులో ఇంజనీరింగ్ చదివి, ఇంకెక్కడో ఎమ్‌టెక్ చదివి ఏదో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా చేసేవారు. ఆవిడ ఇంట్లోనే వుండేది. కానీ ఆవిడ పూనాలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారి అమ్మాయిట. ఇంగ్లీష్ మాట్లాడినా రాసినా అద్భుతంగా వుండేది. ఆ ఇంగ్లీషు ఆయనకి వచ్చేది కాదు. అందుకని ఆయన ముందు దడాదడా ఇంగ్లీష్‌లో మాట్లాడేసి ఆయనకి దడ తెప్పించేసేది. ఈయనేమో ఏలూరులో చదివాడాయె. ఇంగ్లీష్ అంతంత మాత్రంగా వచ్చేది. దానికన్నా కూడా ఆవిడ పూనాలో చదువుకుందేమో స్కూటర్ ఝామ్మని నడిపేసేది. కానీ ఆ విషయం ఆయనకి తెలీదు పాపం. ఈరోజుల్లో అంటే అందరూ నడిపేస్తున్నారు కానీ ఆరోజుల్లో యింకా ఆడవాళ్ళు నడపడం తక్కువే. ఆయన కాలేజీకి వెళ్ళిపోయాక (కాలేజికి బస్సులో వెళ్ళేవారు లెండి) ఈవిడ స్కూటరేసుకుని, బజారు పన్లన్నీ చేసుకుని, పిల్లల్ని తెచ్చేసుకుని, స్కూటర్కి పైన బట్ట కప్పేసి, ఆవిడ ఓ నేతచీర కట్టేసుకుని, కూర్చుని పప్పులు బాగుచేసుకుంటుండేది. ఆయన వచ్చి ఆవిణ్ణి చూసుకుని మురిసి ముక్కలైపోయేవారు.
అలాంటిది ఓరోజు పొద్దున్నే ఆయనింకా లేవలేదు కదాని, ఆవిడ చప్పుడు కాకుండా స్కూటర్ తీసుకుని వెళ్ళి పాలు తెచ్చుకొచ్చింది. శబ్దం చెయ్యకుండా దానికి స్టాండ్ వేస్తుంటే కిటికీలోంచి ఆయన దిగ్భ్రాంతిగా చూడడం చూసాను. ఇంకేముంది… ఎదురుగా గేట్లో వున్న నాకు ముచ్చెమటలు పోసాయి. ఇంకిప్పుడు వాళ్ళింట్లో రామరావణ యుధ్ధమే అయిపోతుందనుకుని కాస్త సర్దుకుని వినడానికి రెడీ అయిపోయాను.
కానీ, ఆవిడ ఇంట్లో కొచ్చేలోపలే ఆయన కిటికీ దగ్గర్నుంచి వెళ్ళిపోయారు. భీకర శబ్దాలకోసం వేచి చూస్తున్న నాకు యేమీ వినిపించలేదు. గుమ్మంలో ముగ్గేస్తున్న ఆవిడని “పాలు తెచ్చుకున్నారాండీ..” అని పలకరించాను. “తెచ్చేనండీ… ఇంకా మావారు లేవలేదు. టైమైపోతోంది. లేపి కాఫీ ఒవ్వాలి. వస్తానండీ…” అంటూ వెళ్ళిపోయారు. అంటే ఆయన చూసినా చూడనట్లు వుండిపోయారా? హు… పొరుగింటి కయ్యం విన వేడుకంటారు.. ఆ ఛాన్స్ పోగొట్టేసుకున్నానే….