‘చందమామ’ కోసం గోడ దూకాం

0
1

[dropcap]నే[/dropcap]ను ఎనిమిదవ తరగతి వరకు ఇంకొల్లులోని జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత మానాన్న చీరాలలో రైస్ మిల్లు కడుతుండడం వల్ల మేము చీరాలకు షిఫ్ట్ అయ్యాము. చీరాలలో కస్తూరి బాలికల పాఠశాలలో చేరాను. ఆ స్కూలుకు దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాము. ఈ ఇంటికి రెండిళ్ళవతలే మా క్లాసులో చదివే అమ్మాయి ఉంది. ఇద్దరం ‘బి’ సెక్షన్ లోనే ఉన్నాం. ఇద్దరం ఒకే ట్యూషన్‌లో చేరాం. స్కూలుకు, ట్యూషన్‌కు ప్రతి పనికి ఇద్దరం కలిసే వెళ్ళే వాళ్ళం. అప్పటి దాకా చదివిన స్కూలు, ఫ్రెండ్స్‌ను వదిలిపెట్టి వచ్చిన నాకు ఈ అమ్మాయి బాగా ఫ్రెండయింది. చీరాలలో మాకు పార్కుకు వెళ్ళటం, అక్కడున్న లైబ్రరీలో పుస్తకాలు చదవటం అలవాటయ్యింది. పాత ఊర్లో కథలు చెప్పుకోవడం, వినడం మాత్రమే తెలుసు. కానీ కథలు చదవటం అనేది తెలియదు. ఇక్కడ లైబ్రరీలో చందమామ, బాలమిత్ర వంటి పుస్తకాలు చదువుకునేవాళ్ళం. స్కూలు అయిపోయాక సాయంకాలాలు పార్కుకు వెళ్ళి చెట్లలో ఆడుకుంటూ, లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ ఉయ్యాలలూగుతూ సరదా పడేవాళ్లం.

ఇలా రోజు సాయంకాలాలు సరదాగా గడిచిపోయేది. కానీ ఈ పార్కుకు ఆదివారం సెలవు. ఆదివారమంటే స్కూళ్లకు సెలవు కాబట్టి ఆడుకోవాలని పార్కుకు వెళ్ళేవాళ్లం. పార్కేమో మూసేసి ఉండేది. గేటుకు తాళం వేసి పక్కనే బల్ల మీద వాచ్‌మెన్ కూర్చునేవాడు. పిల్లలంతా వెళ్ళి వాచ్‌మెన్‌ను తలుపు తీయమని బతిమాలేవాళ్ళం. అతడు అస్సలు ఒప్పుకునేవాడు కాదు. అయ్యో అని పిల్లలంతా తెగ నిరుత్సాహ పడేవాళ్ళం. ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి ఒక మార్గం కనుగొన్నాం.

అదేమిటంటే… పార్కుకు రెండు గేట్లు ఉండేవి. ఒక గేటు ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. ఎప్పుడు తెరవరు. రెండవగేటు రోజు తెరచి ఉండేది, వాచ్‌మెన్ ఉండేది రెండవగేటు దగ్గర. మొదటి గేటుకు తాళం వేసి ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరూ ఉండరు. ఆ గేటును కొద్దిగా నెడితే కొద్దిగా మధ్యలో ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో నుంచి పిల్లలు దూరచ్చు. అలా అందులో నుంచి దూరి లోపలికి పోయేవాళ్ళం. పార్కు అంతా పెద్ద చెట్లు ఉండటం వలన రెండవ గేటు దగ్గర కూర్చున్న వాచ్‌మెన్‌కు పిల్లలు కనిపించరు. అందువల్ల ఆడుకున్నంత సేపు ఆడుకోవటం, చదువుకున్నంత సేపు చదువుకోవటం భలే సరదాగా ఉండేది. ఒక వేళ ఎప్పుడన్నా వాచ్‌మెన్ చూసి కొట్టడానికి వస్తే గేటుకున్న ఖాళీలో నుంచి బయటకు పారిపోవడం. బయటకు పారిపోయిన పిల్లల్ని ఏమి చేయలేక వాచ్‌మెన్ కర్రతో గేటును బాదేవాడు. మేమేమో నవ్వుకుంటూ ఇంకికెళ్ళిపోయేవాళ్ళం.

ఇలా చాలాసార్లు వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఎప్పటిలానే ఒక ఆదివారం నేనూ, మా ఫ్రెండూ కలిసి పార్కుకు వెళ్ళాం. అక్కడ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ చదువుతూ పరిసరాలు మర్చిపోయాం. అందులో భేతాళ కథలు చదువుతూ లీనమై పోయాం. వాచ్‌మెన్ కర్ర శబ్దం మాకు వినపడనే లేదు. మిగతా పిల్లలంతారూ ఆ శబ్దానికి గేటు దగ్గరకు చేరిపోయారు. మేము సడన్ గా చూసి చేతిలో ఉన్న పుస్తకాలు వదిలేసి లైబ్రరీ నుంచి ఒక్క పరుగు అందుకున్నాం. అప్పటికే వాచ్‌మెన్ కర్ర పట్టుకొని దగ్గరగా వస్తున్నాడు. మేం కూడా అందరితో పాటు గేటు దగ్గరకు పరిగెత్తాం. గేటులో నుంచి దూరే దగ్గర చాలామంది ఉన్నారు. లేటవుతే వాచ్‌మెన్‌కు దొరికిపోతామని గేటు ఎక్కేసింది మా ఫ్రెండు. నన్నూ త్వరగా ఎక్కమని తొందరపెట్టింది. నాకేమో గోడలు ఎక్కడం రాదు. ఆ భయంతో ఎలా ఎక్కేశానో ఏమో గేటు ఎక్కేశాను. గేటు అయితే ఎక్కము కానీ ఇటువైపు దూకుదామంటే ఎత్తు చాలా ఎక్కువగా ఉంది. అందుకే మా ఫ్రెండు గేటు నుంచి ప్రహరీ గోడ మీదకు వెళ్లిపోయింది. ప్రహరీ గోడకు చిట్ట చివర్న ఎత్తు తక్కువగా ఉండటమే గాక అక్కడ ఇసుక కూడా ఉంటుంది. దూకినా దెబ్బలు తగలవు. అందుకని “త్వరగా రా” అంటూ మా ఫ్రెండు చకచకా గోడమీద నడిచేస్తోంది. నాకేమో పాత స్కూలులో ఇలాంటివి అలవాటు లేదు. అసలే కొత్త ఊరు. వాచ్‌మెన్ ఎక్కడ కొడతాడో అనే భయంతో నేను ప్రహరీ గోడ మీదికైతే వచ్చాను గాని స్పీడుగా నడవటం రావడం లేదు. మెల్లగా ఒక్కొక్క అడుగే వేస్తున్నాను. మా ఫ్రెండేమో ‘రా, రా’ అంటూ పిలుస్తోంది. వెనకేమో వాచ్‌మెన్ కర్రతో గేటును బాదుతున్నాడు. కిందికి చూస్తేనేమో కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. ఆ భయంతో ప్రహరీ గోడమీద ఎలా నడిచానో ఏమో నాకిప్పటికి గుర్తొస్తే నవ్వొస్తుంది. ఎలాగో చివరకు మీద నుంచి దూకాము. ఇసుక ఉండటాన పెద్దగా దెబ్బలు తగల్లేదు. ఏదో మోచేయి, మోకాలు దొక్కుపోవటం తప్ప. గుండెలు దడదడా కొట్టుకుంటుంటే మెల్లగా ఇంటికి చేరాం.

పోయిన నెలలో 35 సంవత్సరాల తర్వాత అదే ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పార్కుకు వెళ్ళాం. ఇప్పుడు చాలా డెవెలప్ చేశారు. పిల్లలకు రకరకాల ఆట వస్తువులు ఎన్నో ఉన్నాయి. మైక్‌లో నుంచి పిల్లల రైమ్స్ వస్తున్నాయి మ్యూజిక్తో. మా చిన్నతనం నాటి ఆ విషయం గుర్తుచేసుకొని తెగ నవ్వుకున్నాం. పార్కులో చాలాసేపు కబుర్లు చెప్పుకోవడంతో పాటు అన్నీ రకాల అటలూ ఆడుకున్నాం. అక్కడ ఉన్న పిల్లలకు మా చిన్ననాటి విషయాలు చెబితే వాళ్ళూ తెగ నవ్వి మమ్మల్ని ఆట వస్తువులపై ఎక్కించి చక్కని ఫోటోలు తీశారు. ఈ వయసులో ఉయ్యాలలూగితే నవ్వుతారేమోనని భయపడ్డాం. ఫోటోలకు ఫోజులు ఎలా పెట్టాలో కూడా చూపించి ఫోటోలు తీశారు వాళ్ళు. మాకు చాలా ఆనందమేసింది. ప్రస్తుత వయసు మరచిపోయాం.

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here