Site icon Sanchika

చంద్రునికో నూలుపోగు-2

[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారవాహికగా అందిస్తున్నాము.]

[చంద్రుడిపై ఉన్న ఇండియన్ మూన్ రీసెర్చ్ స్పేస్ ఏజన్సీలో పనిచేస్తూంటారు అయాన్ష్, అతని భార్య మహిక. తనని అక్కడ నియమిస్తున్నప్పుడే సంబంధిత అధికారులకు తన షరతు తెలియజేసి వారి ఆమోదం పొందుతాడు అయాన్ష్. అదేంటంటే నెలలో కనీసం మూడు నాలుగు రోజులు భూమి మీద తన ఇంట్లో ఉంటూ వెన్నెలని ఆస్వాదించాలని. ఎందుకింత దూరం రావడం అని మహిక అడిగితే, మూడు నాలుగు రోజులైనా సేద తీరకపోతే మనసు లగ్నం చేసి పని చేయలేం అంటాడు. చంద్రుడి మీద కూడా రిలాక్స్ అవ్వచ్చుగా అని భార్య అడిగితే, అక్కడ వెన్నెల ఉండదు కదా అని అంటాడు. వెన్నల తన మొదటి ప్రేయసి అని అంటాడు. నువ్వో శాస్త్రవేత్తవి, చంద్రుడు ఓ గ్రహశకలం మాత్రమే అని తెల్సుకదా, వెన్నెలంటే అంత పిచ్చి ఇష్టం ఎందుకంటుంది మహిక. వయసుతో పాటు భార్య మీదా, వెన్నెల మీదా ఇష్టం పెరుగుతూనే ఉందంటాడు. ఒకవేళ చంద్రుడు అకస్మాత్తుగా మాయమైపోతే ఏం చేస్తావని అడుగుతుంది. అలా జరిగే అవకాశాలు స్వల్పమని, చంద్రుడు భూమి నుంచి దూరంగా జరుగుతున్న మాట నిజమేననీ, కానీ ఆ లెక్కన చంద్రుడు శాశ్వతంగా కన్పించకుండా పోవడానికి యాభై బిలియన్ సంవత్సరాలు పడుతుందని చెప్తాడు. అలా కాకుండా వేరే కారణాల వల్ల చంద్రుడు మనల్ని విడిచి వెళ్ళే అవకాశం లేదా అని అడిగితే, రెండు అవకాశాలున్నాయంటూ వాటి గురించి చెప్తాడు. అలా జరిగితే, అయాన్ష్ పిచ్చివాడయిపోతాడేమోనని భయపడతుంది మహిక. అతన్ని అలా వెన్నెల్లో వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి ఆస్టరాయిడ్స్‌ని గమనించడంలో నిమగ్నమైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఆర్యమిహిరకు అంతరిక్షంలో ఓ వింత గ్రహశకలం పూర్తి గోళాకారంలో ఉన్నది కనబడుతుంది. పైగా దాని ఉపరితలంలో ఒక బిలం కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరింత జాగ్రత్తగా పరిశీలించి అది ఆస్టరాయిడ్ కాదని గ్రహించి,  దాని ద్రవ్యరాశిని లెక్కిస్తాడు. అంత చిన్న వస్తువుకి దాదాపు మూడువేల నాలుగు వందల డెబ్బయ్ అయిదు కిలోమీటర్ల వ్యాసం ఉన్న చంద్రుడి ద్రవ్యరాశితో సమానమైన ద్రవ్యరాశి ఎలా ఏర్పడిందో ఆయనకి అర్థం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులని, అంతరిక్ష పరిశోధనా సంస్థలని అప్రమత్తం చేస్తారాయన. కొన్ని లెక్కలు కట్టి, ఆ వస్తువు లక్ష్యం భూమి కాదని, చంద్రుడని గ్రహిస్తారు. అదో స్పేస్ షిప్ అనీ, దాన్ని ఏలియన్స్ తయారు చేసి రిమోట్ కంట్రోల్‌తో నియంత్రిస్తున్నట్లు గ్రహిస్తారు. ఆ మరునాడు ప్రపంచంలోని ఖగోళ శాస్త్రవేత్తలు సమావేశమవుతుతారు. ఆ సమావేశానికి విలేకరులు కూడా హాజరవుతారు. ఇక చదవండి.]

[dropcap]వే[/dropcap]దిక మీద ఆర్యమిహిరతో పాటు, ఇస్రో ఛైర్మన్, నాసా అడ్మినిస్టేటర్, చీఫ్ సైంటిస్ట్ ఆసీనులై ఉన్నారు. మిగతా శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు తమ తమ ఆసనాల్లో కూచున్నాక, ఆర్యమిహిర సభనుద్దేశించి, మాట్లాడసాగాడు.

‘‘మై డియర్ లెర్నెడ్ ఫ్రండ్స్, నేను టెలిస్కోప్‌ల్లోంచి ఆస్టరాయిడ్ బెల్ట్‌లని చూస్తున్నప్పుడు, గోళాకారంతో కదుల్తున్న పదార్థమేదో కన్పించింది. మొదట దాన్ని ఆస్టరాయిడ్ ఏమో అని అనుకున్నాను. కాని దాని పరిమాణం చిన్నదిగానే ఉంది. విశ్వాంతరాళంలో అంత చిన్న పరిమాణమున్న పదార్థమేదీ గోళాకృతిని సంతరించుకునే అవకాశం లేదని మనందరికీ తెలుసు. అటువంటి వింత ఆకృతిలో ఉన్న పదార్థం ఏమిటో తెల్సుకుందామని దాని ద్రవ్యరాశిని లెక్కించిన వెంటనే నేను కొయ్యబారిపోయాను.

దాదాపు వంద మీటర్ల వ్యాసంతో ఉన్న ఆ గుండ్రటి వస్తువు మన చంద్రుని ద్రవ్యరాశితో సమానమైన ద్రవ్యరాశిని కలిగి ఉండటం ఎలా సంభవమో నాకు అర్థం కాలేదు. అది మనకు టెలిస్కోప్‌లో సాధారణంగా కన్పించే కాస్మిక్ పదార్థం కాదని, ఎవరో దాన్ని తయారు చేసి, ప్రయోగించారని స్పష్టం కావడంతో నాసాతో పాటు ప్రపంచంలోని మిగతా శాస్త్రవేత్తలను అప్రమత్తం చేశాను.’’

‘‘దాన్ని ఎవరు ప్రయోగించి ఉంటారని మీ అనుమానం?’’ హిందూ పత్రిక విలేకరి అడిగాడు.

‘‘ఏలియన్స్.. భూగ్రహవాసులకన్నా అత్యంత మేధోసంపన్నులైన ఏలియన్స్’’ అన్నాడు ఆర్యమిహిర.

‘‘ఎందుకలా అనుకుంటున్నారు?’’ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి వచ్చిన విలేకరి అడిగాడు.

‘‘అంత చిన్న పరిమాణం గల పదార్థంలో చంద్రుడితో సమానమైన ద్రవ్యరాశిని కలిగిఉండేలా చేయడం మానవమాత్రులకు సాధ్యంకాని విషయం. దీన్ని మనం ఒప్పుకుని తీరాలి. మనకు తెలిసి బ్లాక్‌హోల్స్ మాత్రమే ఓ క్యూబిక్ మీటర్ పదార్థంలో అత్యధిక  ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఈ వింత వస్తువు బ్లాక్‌హోల్ కాదు.  కానీ బ్లాక్‌హోల్ లోంచి తెంపుకొచ్చిన చిన్న ముక్కలా ప్రవర్తిస్తోంది. అదెలా సంభవం? ఇది మన వూహకు అందని విషయం. దాన్ని ఎవరు ప్రయోగించారో వాళ్ళు తప్పకుండా మనకన్నా అత్యంత  తెలివిగల ఏలియన్స్ అయిఉండాలి. దాని ద్రవ్యరాశిని దృష్టిలో పెట్టుకుని, దానికి ‘బిగ్‌మాస్‌’ అని  పేరు  పెట్టాం’’ అన్నాడు.

‘‘బిగ్‌మాస్‌ని ఎందుకు ప్రయోగించి ఉంటారు? వాళ్ళ లక్ష్యం ఏమిటి?’’ ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక విలేకరి అడిగాడు.

ఆ ప్రశ్నకు నాసా చీఫ్ సైంటిస్ట్ సమాధానం చెప్పాడు. ‘‘మొదట అది భూమివైపుకు దూసుకుని వస్తుందేమో అని కంగారు పడ్డాం. కానీ కొన్ని క్యాలిక్యులేషన్స్ తర్వాత దాని లక్ష్యం మన చంద్రుడని నిర్ధారణకు వచ్చాం.’’

‘‘అంటే ఏలియన్స్ ఉద్దేశం మన చంద్రుడ్ని ఢీకొట్టి దాన్ని ధ్వంసం చేయడమా? దాని వల్ల వాళ్ళకేం లాభం? ఏమాశించి అటువంటి దుర్మార్గానికి పూనుకున్నారు?’’ అని మళ్ళా అతనే ప్రశ్నించాడు.

‘‘బిగ్‌మాస్‌ ప్రయాణిస్తున్న మార్గం, దాని వేగం లెక్కలోకి తీసుకుంటే, చంద్రుడికి సమీపంగా వెళ్ళే అవకాశం కన్పిస్తోంది. ఒకవేళ తమ గ్రహం నుంచి రిమోట్ కంట్రోల్‌తో ఏలియన్స్ దాని దిశను కొద్దిగా పక్కకు జరిపితే మాత్రం చంద్రుణ్ణి ఢీకొనడం ఖాయం. అలా కాకుండా ఇప్పుడు ప్రయాణిస్తోన్న దిశ మారకుండా ఉంటే అది చంద్రుణ్ణి సమీపించగానే, దాని గురుత్వాకర్షణ శక్తికి లోనై చంద్రుడు దానికి అనుసంధానించబడి, దాంతో పాటు ప్రయాణం చేయవచ్చు. ఏలియన్స్ ఉద్దేశం ఏమిటో తెల్సుకోవాలంటే మనం వేచి చూడాలి తప్ప వూహకు అందడం లేదు’’ అన్నాడు చీఫ్ సైంటిస్ట్.

‘‘చంద్రుణ్ణి మననుంచి దూరంగా లాక్కెళ్ళడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏమిటి?’’ ద వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రతినిధి అడిగాడు.

‘‘నాకూ అదే అర్థం కావడం లేదు. చంద్రుణ్ణి ధ్వంసం చేసినా లేదా మన భూమి నుంచి దూరంగా లాక్కెళ్ళిపోయినా వాళ్ళకు ఒనగూడే ప్రయోజనమేమిటో తెలియదు కానీ మనకు అపార నష్టం వాటిల్లుతుంది. అటువంటి ప్రమాదం జరక్కుండా మన చంద్రుణ్ణి కాపాడుకునే మార్గాల గురించి ఆలోచనల్ని పంచుకుందామనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది’’ అన్నాడు ఆర్యమిహిర.

‘‘భూమివైపుకు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లను పక్కకు మళ్ళించే ప్రయోగం కొన్ని శతాబ్దాల క్రితమే నాసా చేపట్టింది కదా. డార్ట్ ప్రయోగం.. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్.. ఆస్టిరాయిడ్ డిడిమాస్ యొక్క మూన్లెట్ డైమార్ఫోస్‌ని అంతరిక్షనౌకతో ఢీ కొట్టడం ద్వారా దాని కక్ష్యలో తిరిగే సమయాన్ని  ముప్పయ్ రెండు నిమిషాలు తగ్గించడంలో విజయం సాధించింది. మనం ఇప్పుడు చంద్రుని వైపుకు దూసుకొస్తున్న  బిగ్‌మాస్‌ అనే గోళాకార వస్తువుని కూడా ఇదే పద్ధతిలో దారి మళ్ళించవచ్చు కదా’’ అన్నాడు రాబర్ట్. అతను నాసాలో పనిచేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త.

‘‘డైమార్ఫోస్ మూన్‌లెట్‌తో పోలిస్తే ఈ వింత బిగ్‌మాస్‌ యొక్క ద్రవ్యరాశి కొన్ని వేల రెట్లు ఎక్కువ. దాన్ని చంద్రుడి నుంచి దూరంగా జరపాలంటే చాలా బలమైన మిస్సైల్స్‌తో ఢీకొట్టాలి. మన దగ్గర ఉన్న మిస్సైల్స్ ఆ పనిని ఎంత సమర్థవంతంగా నిర్వహించగలవనే విషయంలో మనకు స్పష్టత కావాలి. అది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అన్పిస్తోంది’’ అన్నాడు నాసా ఛైర్మన్.

‘‘అందులో ఏం రిస్క్ ఉంది?’’ అని అడిగాడు రాబర్ట్.

‘‘రిస్క్ ఉంది. మనం  బిగ్‌మాస్‌ని ఎంత దూరం వరకు నెట్టగలం అనే దానిమీద మన విజయం ఆధారపడి ఉంటుంది. దాని గురుత్వాకర్షణ శక్తి మన చంద్రుడిమీద ప్రభావం చూపనంత దూరం నెట్టేయగలగాలి. దానికోసం ఎంతో శక్తివంతమైన, కొన్ని వందల మిస్సైల్స్‌ని వాడాల్సి వస్తుంది. వాటిద్వారా కలిగే విస్ఫోటనాల వల్ల కూడా చంద్రుడికి ప్రమాదం ఏర్పడవచ్చు. మిస్సైల్స్ ధాటికి బిగ్‌మాస్‌ నుంచి వెలువడే శకలాల వల్ల కూడా చంద్రుడికి నష్టం కలగొచ్చు. ఇంత చేసినా మనం అనుకున్న ఫలితం లభించకపోతే,  మనం పడిన శ్రమంతా వృథా అయిపోతుంది. మనం చంద్రుణ్ణి శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది’’ అన్నాడు ఆర్యమిహిర.

‘‘నాకో విషయం అర్థం కావడం లేదు సర్. చంద్రునితో సమానమైన ద్రవ్యరాశి ఉన్న పదార్థం చంద్రునికి సమీపంగా వస్తే, చంద్రుడెందుకు దాని వైపు ఆకర్షించబడి, దాంతోపాటు వెళ్ళిపోతాడు? చంద్రుడే  దాన్ని ఆకర్షించి, తనతోపాటు భూమి చుట్టూ తిరిగేలా చేసుకోవచ్చు కదా’’ అని అడిగాడు వాషింగ్టన్ పోస్ట్ నుంచి వచ్చిన విలేకరి.

‘‘మీ అందరికీ తెల్సిన విషయమే అయినా కంగారులో కొన్ని విషయాలు మర్చిపోవడం సహజం. ఓ వస్తువు యొక్క గురుత్వాకర్షణ శక్తి దాని ద్రవ్యరాశికి అనులోమాను పాతంలోనూ అంటే ప్రపోర్షనేట్ గానూ, దాని  రేడియస్ యొక్క స్క్వేర్ రూట్‌కి విలోమానుపాతంలోనూ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ గానూ ఉంటుంది. ఇప్పుడు ఏలియన్లు ప్రయోగించిన పదార్థం యొక్క ద్రవ్యరాశి చంద్రుడి ద్రవ్యరాశితో సమానమైనప్పటికీ, దాని రేడియస్ చంద్రుడితో పోలిస్తే కొన్ని వేల రెట్లు తక్కువ కాబట్టి  గురుత్వాకర్షణ శక్తి కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఆ పదార్థం మన చంద్రుణ్ణి తనతో పాటు లాక్కెళ్ళిపోగలుగుతుంది’’ అన్నాడు ఆర్యమిహిర.

‘‘మరి ఈ సమస్యనుంచి బైటపడే మార్గమేమిటో మీరే చెప్పండి’’ అన్నాడతను.

ఆర్యమిహిర ఓ దీర్ఘ శ్వాసను తీసుకుని చెప్పసాగాడు. ‘‘ఎటువంటి లోహాన్నయినా కోయగల లేజర్ గన్స్ మన వద్ద ఉన్నాయి. చివరికి వజ్రాన్ని కూడా సునాయాసంగా ముక్కలు చేయగల శక్తి వాటికుంది. మనం మొదట ఏలియన్లు ప్రయోగించిన బిగ్‌మాస్‌ ఏ లోహంతో చేయబడిందో తెలుసుకోవాలి. అది మన  భూగ్రహవాసులకు తెల్సిన లోహం కాదని ఖచ్చితంగా చెప్పగలను. యూనిట్ వాల్యూమ్‌కి అంతటి ద్రవ్యరాశి కలిగిన లోహం గురించిన అవగాహన మనకు లేదు. మొదట మన శాస్త్రవేత్తలందరూ దాని భౌతిక, రసాయనిక లక్షణాల్ని కనుక్కోవాలి. తర్వాత దాన్ని ముక్కలుగా కోయగల లేజర్ కిరణాల్ని తయారు చేసుకోవాలి. ఆ గోళాకార పదార్థం మన చంద్రుణ్ణి సమీపిస్తున్నప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేయాలి. అలా ఏర్పడిన ముక్కల గురుత్వాకర్షణ శక్తి చంద్రుణ్ణి ఆకర్షించే స్థాయిలో ఉండదు. భూమ్యాకర్షణ శక్తికి లోనై అవి కూడా భూమి చుట్టూ  తిరుగుతాయి. చంద్రుణ్ణి రక్షించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. దీనికి ‘ఆపరేషన్ సేవ్ ద మూన్’ అని పేరు పెట్టాం’’ అంటూ తన మనసులో ఉన్న వ్యూహం ఏమిటో చెప్పాడు.

‘‘అది లోహనిర్మితమని కూడా ఖచ్చితంగా చెప్పలేముగా. మనకు తెలియని ఏదైనా పదార్థంతో కూడా తయారుచేసి ఉండొచ్చు. అదేంటో తెల్సుకుని, దాన్ని కోయగల లేజర్ కిరణాల్ని తయారుచేసుకుని, ప్రయోగించడానికి చాలా సమయం పడ్తుంది కదా. మన కంత సమయం ఉందా సర్?’’ అని అడిగాడు ‘ద అసాహి సిన్బు’ అనే జపాన్ పత్రిక నుంచి వచ్చిన విలేకరి.

‘‘ఎక్కువ సమయం లేదు. కానీ తగినంత సమయం ఉందని మాత్రం చెప్పగలను. ఏలియన్స్ ప్రయోగించిన ‘బిగ్‌మాస్’ కున్న అధిక ద్రవ్యరాశి వల్ల అది ప్రయాణించే వేగం కొంత మందగించింది. బిగ్‌మాస్ మన చంద్రుణ్ణి  సమీపించడానికి ఈ రోజు నుంచి సరిగ్గా ఇరవై రోజుల సమయం పడ్తుంది. మన శాస్త్రజ్ఞుల ప్రతిభా పాటవాల మీద నాకు చాలా నమ్మకముంది. ఈ ఆపరేషన్‌కు అవసరమైన లేజర్ గన్ తయారుచేసుకోడానికి రెండు వారాల వ్యవధి సరిపోతుందనుకుంటున్నా. ఈ మిషన్‌కి ఆధిపత్యం వహించగల సమర్థులైన నలుగురు శాస్త్రవేత్తల పేర్లని, వేదిక మీద ఉన్న మిగతా పెద్దల్తో సంప్రదించి, మరికొన్ని నిమిషాల్లో వెల్లడి చేస్తాను’’ అన్నాడు ఆర్యమిహిర.

సభలో గుసగుసలు మొదలయ్యాయి.

ఆ నలుగురిలో తన పేరు తప్పకుండా ఉంటుందని అయాన్ష్‌కి అన్పించింది. దానిక్కారణం అతను ఆర్యమిహిర దగ్గర దాదాపు ఇరవై యేళ్ళపాటు పని చేయడమే. ఆర్యమిహిరకు అతనంటే చాలా ఇష్టం. అతని ప్రతిభ మీద చాలా నమ్మకం. ‘నా శిష్యు ల్లోకెల్లా నువ్వే ద బెస్ట్. ఏదో ఓ రోజు నువ్వు అత్యున్నత స్థాయికి చేరుకుంటావు’ అంటూ చాలాసార్లు తనని పొగిడిన విషయం గుర్తొచ్చింది.

‘‘ఆయనకు ప్రియశిష్యుడివి కదా. నీ పేరుని ప్రతిపాదిస్తారని అన్పిస్తోంది అయాన్ష్. నువ్వు లేకుండా నేను కొన్ని రోజులు చంద్రుడిమీద పని చేయాల్సి వస్తుందేమో’’ దిగులుగా అంది మహిక.

‘‘మెటలర్జీలో అద్భుతమైన ప్రయోగాలు చేసిన నువ్వు లేకుండా ఆ మిషన్ పరిపూర్ణం కాదు. మొదట బిగ్‌మాస్‌ ఏ లోహంతో తయారుచేయబడిందో కనుక్కోవాలి కదా. నువ్వు కూడా ఆ మిషన్‌లో భాగస్వామివి అవుతావనే నా నమ్మకం’’ అన్నాడు.

‘‘వెన్నెలంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు కదా. నీకిష్టమైన చంద్రుణ్ణి  కాపాడే ఈ మిషన్లో పని చేయడానికి అవకాశం ఇస్తే, నా సర్వశక్తులూ ఒడ్డి, బిగ్‌మాస్‌ పుట్టుపూర్వోత్తరాలన్నీ కనిపెడ్తాను’’ అంటూ మెత్తగా నవ్వింది.

పావుగంట సమయం గడిచాక, ఆర్యమిహిర గొంతు మైక్లో విన్పించింది. ‘‘ఆపరేషన్ సేవ్ ది మూన్‌కి ఆధిపత్యం వహించే నలుగురు శాస్త్రజ్ఞుల పేర్లని ఇస్రో ఛైర్మన్ గారు వెల్లడిస్తారు.’’

ఇస్రో ఛైర్మన్ నలుగురి పేర్లని ప్రకటించాడు. ‘‘మా ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తలు అయాన్ష్, మహిక, నాసా శాస్త్రవేత్త రాబర్ట్ మరియు జపాన్ శాస్త్రవేత్త సకూరా. వీళ్ళు నలుగురి ఆధ్వర్యంలో మిగతా శాస్త్రవేత్తలందరూ పని చేస్తారు. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మెటలర్జీలో ప్రావీణ్యత ఉన్న శాస్త్రజ్ఞురాలు మహికని, ఆస్ట్రో కెమిస్ట్రీలో  ప్రతిభావంతురాలైన జపాన్ శాస్త్రజ్ఞురాలు సకూరాని మేము కోరేదొకటే. వారం రోజుల్లోపల బిగ్‌మాస్‌ ఏ పదార్థంతో చేయబడిందో, దాని ఫిజికల్ మరియు కెమికల్ లక్షణాలేమిటో తెల్సుకుని మాకు రిపోర్ట్ చేయాలి. అయాన్ష్ మరియు రాబర్ట్ తమ సిబ్బందితో అహర్నిశలూ పనిచేసి వారం రోజుల్లోపల బిగ్‌మాస్‌ని ముక్కలుగా కోయగల లేజర్ బీమ్స్‌ని కనుక్కోవాలి’’ అన్నాడు.

మహిక తల తిప్పి ఆశ్చర్యంగా అయాన్ష్ వైపు చూసింది. ‘‘వారం రోజుల్లోపల్నా? ఇంపాజిబుల్. కనీసం రెండు వారాలైనా సమయం కావాల్సి వస్తుంది’’ అంది.

‘‘నో ఛాన్స్. మనకిప్పుడు ఏదైనా కనుక్కోవడం కన్నా అతి తక్కువ సమయంలో దాన్ని కనుక్కోవడ మే ముఖ్యం. మానవాళికి ముప్పుగా పరిణమించబోతున్న బిగ్‌మాస్‌ని ఎదుర్కోవడంలో మనం కాలంతో   పోటీపడి, బ్రేక్నెక్ స్పీడ్‌లో పరుగెత్తక తప్పదు. ఛైర్మన్ గారు ఉదారంగా వారం రోజుల సమయమిచ్చారు. నేనైతే మూడు రోజులే ఇచ్చేవాణ్ణి’’ అంటూ నవ్వాడు అయాన్ష్.

‘‘లేజర్ కిరణాల్ని తయారుచేయడానికి మీకు వారం రోజులు సరిపోతాయా?’’ అని అడిగింది.

‘‘అది మీరిచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది.’’

‘‘సరే. నేను దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటాను. వారం రోజుల్లోపలే బిగ్‌మాస్‌ పదార్థంలో దాగున్న రహస్యాన్ని ఛేదిస్తాను’’ అంది మహిక.

(సశేషం)

Exit mobile version