[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారవాహికగా అందిస్తున్నాము.]
[ప్రఫంచంలోని ఖగోళ శాస్త్రవేత్తల సమావేశం జరుగుతుంటూంది. విలేకరులు కూడా హరజవుతారు. అందరూ తమ తమ ఆసనాల్లో కూర్చున్నాకా, ఆర్యమిహిర సభని ఉద్దేశించి మాట్లాడుతాడు. తాను టెలిస్కోప్‌ల్లోంచి ఆస్టరాయిడ్ బెల్ట్‌లని చూస్తున్నప్పుడు, గోళాకారంతో కదుల్తున్న పదార్థమొకటి కన్పించిందని, మొదట దాన్ని గ్రహశకలం అనుకున్నాననీ, కానీ ఆస్టరాయిడ్లు గోళాకారంలో ఉండవు కనుక, దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఓ స్పేస్‌షిప్ లా ఉందనీ, చంద్రునితో సమానమైన ద్రవ్యరాశి కలిగి ఉందని తెలియడంతో, నాసాతో పాటు ప్రపంచంలోని మిగతా శాస్త్రవేత్తలను అప్రమత్తం చేశానని చెప్తాడు. దాని ఎవరు ప్రయోగించి ఉంటారని మీ అనుమానం అని ఓ విలేకరి అడిగితే, ఏలియన్స్ ప్రయోగించారని తన నమ్మకం అంటూ అందుకు కారణాలను వెల్లడించి, ఆ పదార్థానికి ‘బిగ్‌మాస్’ అని పేరు పెట్టానని చెప్తాడు. దాని లక్ష్యం ఏమిటని మరో విలేకరి అడగగా, మొదట అది భూమి వైపు దూసుకుని వస్తుందేమోనని కంగారుపడ్డామనీ, కానీ కొన్ని లెక్కల అనంతరం దాని లక్ష్యం మన చంద్రుడని తేలిందని చెప్తాడు నాసా చీఫ్ సైంటిస్ట్. చంద్రుడితో బిగ్‍మాస్‌కి ఏం పని, చంద్రుడిని ధ్వంసం చేసినా, భూమి నుంచి దూరంగా తీసుకెళ్ళినా వాళ్ళకి ఏమొస్తుంది అంటూ ప్రశ్నలు వేస్తారు విలేకరులు. అదే తమకి అర్థం కావడం లేదనీ, అందుకే చంద్రుడిని కాపాడుకునే మార్గాల కోసం ఆలోచనలు పంచుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్తాడు ఆర్యమిహిర. మిస్సైల్స్ ఉపయోగించి, బిగ్‍మాస్ కక్ష్యని మళ్ళించవచ్చు కదా అని ఓ శాస్త్రవేత్త అడిగితే, బిగ్‍మాస్‌ని బలంగా ఢీకొట్టే మిస్సైల్స్ మన వద్ద లేవనీ, పైగా అన్ని మిస్సైల్స్ ప్రయోగిస్తే, చంద్రుడికి కూడా నష్టం కలగవచ్చని, ఇంత శ్రమపడినా అనుకున్న ఫలితం రాకపోతే మనం చంద్రుడిని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని అంటాడు ఆర్యమిహిర. విలేకరులకు, యువశాస్త్రవేత్తలకు కలిగిన సందేహాలను తీరుస్తాడాయన. ఆపరేషన్ సేవ్ ద మూన్ అని పేరు పెట్టిన ఈ ఆపరేషన్ లక్ష్యాలను వివరిస్తాడు. ఈ ఆపరేషన్‍లో పాల్గొనే నలుగురి పేర్లను ఇస్రో ఛైర్మన్ ప్రకటిస్తాడు. ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తలు అయాన్ష్, మహిక, నాసా శాస్త్రవేత్త రాబర్ట్, జపాన్ శాస్త్రవేత్త సకూరా ఈ బాధ్యతకి ఎంపికవుతారు. వాళ్ళకి రెండు వారాల గడువిస్తారు. మెటలర్జీలో నిపుణురాలైన మహికని, ఆస్ట్రో కెమిస్ట్రీలో ప్రవీణురాలైన సకూరాని వారం రోజుల్లోపల బిగ్‌మాస్ ఏ పదార్థంతో చేయబడిందో, దాని భౌతిక, రసాయనిక లక్షణాలు కనుగొనాలని చెప్తారు. మరో వారంలో అయాన్ష్, రాబర్ట్ తమ సిబ్బందితో అహర్నిశలూ పనిచేసి బిగ్‌మాస్‌ని ముక్కలుగా కోయగల లేజర్ బీమ్స్‌ని తయారుచేయాలని నిర్ణయిస్తారు. అందరూ దీన్నొక ఛాలెంజ్‍గా తీసుకుంటారు. ఇక చదవండి.]
[dropcap]రెం[/dropcap]డు సంవత్సరాల క్రితం..
విశ్వాంతరాళంలో భూమికి సుదూరంగా ఉన్న ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు గ్రహాలు.. నిఫిలిక్స్, నిక్స్.. భూమి కొలతల్తో పోలిస్తే దాదాపు సమానమైన వైశాల్యం, ద్రవ్యరాశిని కలిగి ఉండటంవల్ల ఆ రెండు గ్రహాల్లో గురుత్వాకర్షణ శక్తి కూడా భూమి గురుత్వాకర్షణ శక్తితో సమానం.
నిఫిలిక్స్ గ్రహానికి అధినేత అజుపస్..
రాత్రి పది గంటల సమయం.. అత్యంత అధునాతనమైన, విశాలమైన తమ భవంతిలో బాల్కనీలో కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు అజుపస్, అతని భార్య మోజో..
“ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా ఈ రాత్రి.. మలయమారుతంలా వీస్తున్న ఈ గాలి.. మత్తెక్కిస్తున్న నీ జడలోని మల్లెపూల సుగంధం.. నల్లటి మేలి ముసుగు కప్పుకున్న జవరాలిలా వూరిస్తున్న ఈ చీకటి..” అన్నాడు అజుపస్.
మోజో తల యెత్తి ఆకాశంలోకి చూసింది. నల్లటి దుప్పటిలో అక్కడక్కడా సన్నటి చిరుగుల్లా కన్పిస్తున్నాయి నక్షత్రాలు. మిగతా ఆకాశమంతా తారు పూసినట్టు నల్లగా ఉంది. ఆమెకు రెండేళ్ళ క్రితం నిక్స్ గ్రహంలో గడిపిన అందమైన వెన్నెల రాత్రులు గుర్తొచ్చాయి. నిక్స్ గ్రహానికున్న రెండు చంద్రుళ్ళు ప్రతి రాత్రిని పుచ్చపువ్వులాంటి వెన్నెలతో తడిపేస్తూ ఉంటాయి. అమావాస్య ఎలా ఉంటుందో తెలీని మనోహరమైన రాత్రులే అన్నీ.
“వెన్నెల కురవని రాత్రుళ్ళు అందంగా ఉండవు” నిరాశగా అంది మోజో.
“ఏం చేస్తాం చెప్పు.. మన నిఫిలిక్స్ గ్రహానికి ఒక్క చంద్రుడు కూడా లేడు. అదే నిక్స్ గ్రహానికి రెండు చంద్రుళ్ళు ఉన్నాయి. అది వాళ్ళ అదృష్టం, ఇది మన దురదృష్టం” అన్నాడు నిఫిలిక్స్.
“అదృష్ట దురదృష్టాల్ని నమ్ముకుని బతికే కాలంలో ఉన్నామా మనం? శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించాం. టెలిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా మనో వేగంతో ప్రయాణించగలుగుతున్నాం. జైగోట్లోని జన్యువుల్లో అవసరమైన మార్పులు చేసి, మనక్కావల్సిన రూపురేఖల్తో పిల్లల్ని యంత్ర గర్భాల సాయంతో తయారు చేసుకుంటున్నాం. తెల్ల రక్త కణాలంత సూక్ష్మపరిమాణంలో ఉండే రోబో వైద్యుల్ని శరీరంలోకి పంపించి రోగాలు రాకుండా కట్టడి చేయగలుగుతున్నాం. మనకు సాధ్యం కానిదంటూ ఏమైనా ఉందంటారా?”
“అవన్నీ మనం సాధించిన మాట నిజమే. కానీ గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే చంద్రుళ్ళు, నక్షత్రాలు.. ఇవి మన ఆధీనంలో ఉండే విషయాలు కాదు. మన గ్రహానికి ఉపగ్రహం లేదు. లేనిదాన్ని ఎలా సృష్టించగలం? అందుకే దాన్ని అదృష్టంతో ముడిపెట్టాను” అంటూ నవ్వాడు.
“సంకల్పబలం ఉంటే దేన్నయినా సాధించవచ్చు” అంది మోజో.
ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ “నీ మనసులో ఏముందో చెప్పు. దాని సాధ్యాసాధ్యాల గురించి ఆలోచిస్తాను” అన్నాడు.
“రెండేళ్ళ క్రితం నిక్స్ గ్రహం యొక్క అధిపతి సిసిరస్ ఆహ్వానం మేరకు మనిద్దరం ఆ గ్రహానికి వెళ్ళాం కదా. వారం రోజులు వాళ్ళు చేసిన అతిథిమర్యాదల్ని ఆస్వాదించాం కదా.”
“అధికారిక పర్యటన మూడు రోజులనే నిర్ణయించబడింది మో.. నీ బలవంతం వల్ల ఏడు రోజులు వాళ్ళ అతిథిగృహంలో నివసించాల్సి వచ్చింది.”
“మరేం చేయమంటారు? అక్కడి వెన్నెల నన్నంతగా ఆకర్షించింది. అసలా గ్రహాన్ని వదిలి రావాలనిపించలేదు తెలుసా?”
“నీకు వెన్నెలంటే అంతిష్టమా? సరే. ఏం చేస్తే ఆ వెన్నెలని లాక్కొచ్చి మన ఆకాశంలో కట్టేసుకోడానికి వీలవుతుందో చెప్పు” అన్నాడు.
“వాళ్ళకున్న ఇద్దరు చంద్రుళ్ళనుంచి ఓ చంద్రుణ్ణి లాక్కొచ్చి మన గ్రహం చుట్టూ తిప్పుకోవడమే.”
“అదెలా సంభవం?”
“మనం తిరుగుప్రయాణమైనప్పుడు, అతి విలువైన కానుకల్ని మన స్పేస్ షటిల్లో పెట్టించాక, మనకు వీడ్కోలు చెప్తూ సిసిరస్ ఏమన్నాడో గుర్తుందా? ‘మన నక్షత్ర కుటుంబంలో ఉన్నవి మన రెండు గ్రహాలే. మనవి ట్విన్ ప్లానెట్స్. మనం ఒకరికొకరం సోదరుల్లా మెలుగుదాం. మీకూ మీ గ్రహవాసులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని కదా అన్నాడు.”
“అవును. నాకు గుర్తుంది.”
“వాళ్ళ గ్రహానికి రెండు చంద్రుళ్ళున్నాయి కదా. ఒకదాన్ని మనకివ్వమని అడగండి. వాళ్ళయినా రెండింటిని ఏం చేస్కుంటారు? ఒక్కటి చాలు కదా. తను ఇచ్చిన మాటను నిలుపుకునేవాడిలానే ఉన్నాడు. తప్పకుండా ఓ చంద్రుణ్ణి మనకిస్తాడు.”
అజుపస్ ఆలోచనలో పడ్డాడు. అదేమైనా వాడుకునే వస్తువా అడగంగానే ఇవ్వడానికి? వాళ్ళ గ్రహం నిక్స్ చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ ఉపగ్రహం.. దాన్ని ఎందుకిస్తాడు? ఒక వేళ యివ్వాలనుకున్నా ఎలా ఇస్తాడు? వాళ్ళకు రెండు చంద్రుళ్ళున్నాయి కాబట్టి గొప్ప మనసుతో ‘ఇచ్చేశాం. తీసుకెళ్ళండి’ అంటే ఎలా తీసుకురావడం? అదెలా సాధ్యపడ్తుంది?
“దాన్ని అతనెలా ఇస్తాడు? ఒకవేళ యిచ్చినా మనమెలా తెచ్చుకుంటాం మో? నీ కోరిక వింతగానే కాదు వెర్రిగా కూడా అన్పిస్తోంది” అన్నాడు.
“మన శాస్త్రజ్ఞులందర్నీ సమావేశపర్చండి. నిక్స్ గ్రహం చుట్టూ తిరుగుతున్న చంద్రుణ్ణి లాక్కొచ్చి మన గ్రహం చుట్టూ తిరిగేలా చేయడానికి మార్గాలేమిటో ఆలోచించమనండి. ఎవరైతే అందుకవసరమైన సరికొత్త ప్రయోగాలు చేసి విజయం సాధిస్తారో వాళ్ళకు అంతులేని సంపదను బహుమతిగా ఇస్తామని ప్రకటించండి. మొదట చంద్రుణ్ణి తెచ్చుకునే మార్గం కనుగొన్నాకే, మనం నిక్స్ అధిపతిని ఓ చంద్రుణ్ణి మనకివ్వమని అడుగుదాం. ఏమంటారు?” అంది మోజో.
“నా ప్రియసతి కోరుకున్నాక ఇక కాదనేదేముంది? రేపే మన శాస్త్రవేత్తలతో మాట్లాడతాను” అన్నాడు అజుపస్.
మరునాడు తన గ్రహంలో నివశిస్తున్న ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యాడు.
“అసంభవం.. అసాధ్యం.. యిప్పటివరకు విశ్వంలోని ఏ గ్రహవాసులు కూడా ఇటువంటి పనికి పూనుకుని ఉండరు. ప్రయోగాల కోసమని విలువైన సమయంతో పాటు ధనరాశుల్ని పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు” అన్నాడో శాస్త్రవేత్త. అక్కడ సమావేశమైన శాస్త్రవేత్తలందరిలోకి అతనే వయసులో పెద్దవాడు. చాలా గొప్ప శాస్త్రవేత్తగా మన్ననలు అందుకుంటున్న వ్యక్తి.
“ఎందుకు సాధ్యం కాదు? సాధ్యమే. విశ్వంలోని మిగతా గ్రహవాసులు పూనుకోనంత మాత్రాన మనం ప్రయత్నించకూడదని ఎక్కడుంది? ఒకవేళ ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే ఓ గ్రహం చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాన్ని ఆకర్షించి, మన గ్రహానికి ఉపగ్రహంలా మార్చిన విశ్వవిఖ్యాత జాతిగా మనం చరిత్ర సృష్టించినవాళ్ళమవుతాం” అన్నాడో యువ శాస్త్రవేత్త. అతని పేరు క్రిస్టోస్.
అతని వైపు మెచ్చుకోలుగా చూశాడు అజుపస్.
“ఎలా సాధ్యపడ్తుందో చెప్పు. ఆవేశంలో ఏదో అనేయడం కాదు, ఆచరణలో కూడా పెట్టగలగాలి” ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు సీనియర్ శాస్త్రవేత్త.
“ఏదైనా గ్రహం తన ఉపగ్రహం మీద ప్రయోగించే గురుత్వాకర్షణ శక్తి వల్లనే, దాన్ని తననుంచి విడిపోకుండా పట్టి ఉంచి, తన చుట్టూ తిప్పుకుంటుంది. మనం ఆ గ్రహానికున్న గురుత్వాకర్షణ శక్తి కన్నా ఎక్కువ శక్తి గల వస్తువుని ఉపగ్రహానికి సమీపంగా తీసుకెళ్ళగలిగితే, అది ఆ వస్తువు వైపుకు ఆకర్షించబడి, గ్రహం నుంచి దూరంగా జరిగే అవకాశం ఉంది” అన్నాడు క్రిస్టోస్.
“ఈ ఆలోచన మాకు రాక కాదు, నీకంటే వయసులోనూ విజ్ఞానంలోనూ సీనియర్లయిన ఎంతో మంది శాస్త్రవేత్తలు నోరు మెదపకుండా కూచుని ఉంది. నిక్స్ గ్రహానికున్న గురుత్వాకర్షణశక్తి కన్నా మరింత ఎక్కువ శక్తి గల పదార్థం ఎక్కడ దొరుకుతుంది? అటువంటి ఆకర్షణ శక్తి కలిగి ఉండాలంటే నిక్స్ కన్నా పరిమాణంలో పెద్దదైన గ్రహాన్ని మనం ప్రయోగించగలిగి ఉండాలి. అది సాధ్యమా? ఓ చిన్న ఉపగ్రహాన్ని ఇక్కడికి తరలించడం కోసం మన గ్రహం కన్నా వైశాల్యంలో పెద్దదైన గ్రహాన్ని అక్కడికి పంపడమనే ఆలోచనే హాస్యాస్పదంగా లేదూ..” అంటూ నవ్వాడు సీనియర్ శాస్త్రవేత్త.
క్రిస్టోస్ మొహం చిన్న బుచ్చుకోవడం గమనించిన అజుపస్ కలుగచేసుకుంటూ “యువ శాస్త్రవేత్తల అభిప్రాయాలను, ఆలోచనల్ని ఓపిగ్గా విని, అవసరమైతే సీనియర్ శాస్త్రవేత్తలు సలహాలు ఇవ్వాలి తప్ప ఇలా అందరి ముందు ఎగతాళి చేయడం సబబు కాదు” అన్నాడు సీనియర్ శాస్త్రవేత్తతో.
క్రిస్టోస్ వైపు తిరిగి, “మన సీనియర్ శాస్త్రవేత్త లేవనెత్తిన అనుమానం సరైనదే. మన గ్రహం కన్నా వైశాల్యంలో పెద్దదిగా ఉన్న వస్తువుని పంపడం ఎలా సాధ్యం? అసలు అటువంటి వస్తువు ఎక్కడ లభ్యమౌతుంది? నీ మనసులో ఏదో ప్రణాళిక రూపుదిద్దుకునే ఉంటుందిగా. అదేమిటో చెప్పు” అన్నాడు.
“పెద్ద పరిమాణం అవసరం లేదు. పరిమాణం కన్నా ముఖ్యం ద్రవ్యరాశి. చిన్న గ్రహశకలమంత పరిమాణంలో ఉండే వస్తువు.. కానీ దాని ద్రవ్యరాశి నిక్స్ గ్రహానికున్న ద్రవ్యరాశితో సమానంగా ఉండాలి. ఆ వస్తువు రేడియస్ చాలా తక్కువ కాబట్టి, గురుత్వాకర్షణ శక్తి రేడియస్ యొక్క స్కేర్‌కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి, అది చంద్రుణ్ణి సునాయాసంగా లాక్కొచ్చేలా చేయవచ్చు” అన్నాడు క్రిస్టోస్.
“అంత చిన్నపరిమాణం ఉన్న వస్తువులో ఓ గ్రహానికున్నంత ద్రవ్యరాశి ఉండటం ఎలా సంభవం?” మరో శాస్త్రవేత్త ప్రశ్నించాడు.
“బ్లాక్‌హోల్స్ ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకుంటే, ప్రయోగశాలలో మనం కూడా అటువంటి దాన్ని తయారుచేయవచ్చు. తనకు సమీపంలో ఉన్న ప్రతి పదార్థాన్ని తనలో కలుపుకుని, ద్రవ్యరాశిని అమితంగా పెంచుకునే బ్లాక్‌హోల్ లాంటి పదార్థం.. నేను ఎన్నుకునే నలుగురు శాస్త్రవేత్తల్ని నాకివ్వండి. ఓ యేడాది సమయం ఇవ్వండి. మేం ఐదుగురం కలిసి అటువంటి పదార్థాన్ని ప్రయోగశాలలోనే తయారుచేయగలమన్న నమ్మకం నాకుంది” అన్నాడు క్రిస్టోస్.
“బ్లాక్‌హోల్ లాంటి పదార్థమా? అది నిన్నూ, నీ టీమ్ లోని సభ్యుల్నే కాదు నీ ప్రయోగశాలని, చుట్టుపక్కల ఉన్న వూళ్ళనీ, పట్టణాల్ని, చివరికి మన గ్రహాన్నే మింగేసే ప్రమాదం ఉంది కదా. ఆ విషయం గురించి ఆలోచించావా?” అని అడిగాడు సీనియర్ శాస్త్రవేత్త.
“ఆలోచించాను. మనం తయారుచేసేది బ్లాక్‌హోల్‌ని కాదు. బ్లాక్‌హోల్ కుండే లక్షణాల్ని ప్రదర్శించే పదార్థాన్ని.. దాని స్విచాన్, స్విచాఫ్ కూడా మన నియంత్రణలో ఉండాలి. తన చుట్టూ ఎంత పరిధిలో ఉన్న పదార్థాల్ని మింగేస్తుందో మనం నిర్ణయించే స్థితిలో ఉండాలి. అంటే దాని ఈవెంట్ హొరైజన్ మన కంట్రోల్లో ఉండాలి. మనం ఎంత ద్రవ్యరాశి అవసరమనుకుంటున్నామో అంత ద్రవ్యరాశిని పొందాక, దాన్ని స్విచాఫ్ చేయగలిగి ఉండాలి. స్విచాఫ్ చేశాక అది బ్లాక్‌హోల్‌లా తన సమీపంలో ఉన్న పదార్థాల్ని మింగేసే లక్షణాన్ని కోల్పోవాలి” అన్నాడు క్రిస్టోన్.
“ఇదంతా నువ్వూ నీ టీం ఒక్క సంవత్సరం లోపల సాధించగలరా?” అని అడిగా డు అజుపస్.
“తప్పకుండా. మొదట తక్కువ పరిమాణంలో ఉండి కూడా అనంత ద్రవ్యరాశిని తనలో పొదువుకోగలిగి, అత్యంత సాంద్రతను తట్టుకోగలిగే పదార్థమేదో దాన్ని కనుక్కోడానికే ఎక్కువ సమయం పడ్తుంది. మిగతాది అంత కష్టమనుకోను” అన్నాడు క్రిస్టోన్.
“చంద్రుణ్ణి మన గ్రహానికి లాక్కొచ్చే ప్రయత్నంలో చంద్రుడికేమీ నష్టం జరగదు కదా. మనం ప్రయోగించే పదార్థం యొక్క గురుత్వాకర్షణ మరీ బలంగా ఉంటే చంద్రుడు దాని వైపుకు వేగంగా ఆకర్షించబడి దాన్ని గుద్దుకునే ప్రమాదం ఉంది కదా” అన్నాడు అజుపస్.
“మనం పంపేదాని వ్యాసార్థాన్ని దృష్టిలో పెట్టుకుని, నిక్స్ గురుత్వాకర్షణ నుంచి ఉపగ్రహాన్ని బైటికి లాగి, దాంతో పాటు లాక్కు రావడానికి అవసరమైనంత ద్రవ్యరాశినే దాన్లో నింపుతాం. దాన్ని స్పేస్ షటిల్‌కి అనుసంధానించి పంపుతాం. అది చంద్రుణ్ణి సమీపించి, దాన్ని తన వైపుకు ఆకర్షించాక, తిరుగు ప్రయాణమయ్యేలా ఏర్పాటు చేస్తాం” అన్నాడు క్రిస్టోన్.
అతను తన టీమ్‌కి అవసరమైన నలుగురు శాస్త్రవేత్తల్ని ఎన్నుకున్నాడు. అందులో ఇద్దరు సీనియర్ శాస్త్రవేత్తలు, ఇద్దరు యువ శాస్త్రవేత్తలు ఉన్నారు. యువ శాస్త్రవేత్తల్లో ఒకరు అతని భార్య ఎథీనా.
(సశేషం)