Site icon Sanchika

చంద్రునికో నూలుపోగు-5

[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారవాహికగా అందిస్తున్నాము.]

[క్రిస్టోన్ బృందం విజయవంతంగా తమ ప్రయోగాలను నిర్వహిస్తారు. కృత్రిమ బ్లాక్‍హోల్‍ను రూపొందించి, దాన్ని స్విచాన్, స్విచాఫ్ చేయడం మీద పట్టు సాధిస్తారు. అత్యంత సాంద్రతను, తద్వారా ఏర్పడే అత్యధిక పీడనాన్ని తట్టుకోగల పదార్థం కోసం రకరకాల లోహాలతో ప్రయత్నించి విఫలమవుతారు. చివరికి ఎథీనా సూచనతో, తమ శాస్త్రవేత్తలు కొరోట్ 25 బి  అనే గ్రహం నుంచి తెచ్చి తమ మ్యూజియంలో ఉంచిన రాయి లోని లోహాన్ని గుర్తించి,  ఆ లోహంతో స్పేస్‌షిప్ తయారు చేస్తారు. క్రిస్టోన్ అజూపస్‌ని కలిసి అంతా సిద్ధమని చెప్తాడు. సమయం ఆసన్నమైనప్పుడు చెప్తాననీ, అప్పటి వరకూ దాన్ని భద్రంగా కాపాడమని చెప్తాడు అజుపస్. మోజో సూచన మేరకు నిక్స్ గ్రహం అధిపతి సిసిరస్‌ని అతని భార్యని తమ గ్రహానికి ఆహ్వానిస్తాడు.వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇస్తాడు. వాళ్ళు వెళ్ళే రోజు దగ్గర పడుతున్నప్పుడు – వాళ్ళ గ్రహానికి ఉన్న రెండు చందమామల్లోంచి ఒక చందమామని తమకివ్వమని అడుగుతాడు. తమ మంత్రులని సంప్రదించి తన నిర్ణయం చెబుతానని చెప్తాడు సిసిరస్. తన గ్రహానికి వెళ్ళాకా మంత్రుల, ప్రజల అభిప్రాయం తీసుకుని – ఒక చందమామని నిఫిలిక్స్ గ్రహానికి ఇవ్వడానికి తిరస్కరిస్తాడు. అప్పుడు అజుపస్ కోపగించుకుని, ఒక చంద్రుడిని బలవంతంగా లాక్కుంటామని అంటాడు. మీరు చేస్తున్న ప్రయోగాలు, కనిపెట్టిన స్పేష్‌షిప్ అన్ని సంగతులు మాకు తెలుసననీ, మీరేమీ చేయలేరని అంటాడు సిసిరస్. ఏం చేద్దామని మంత్రులని, సైన్యాధ్యక్షుడిని అడుగుతాడు. మంత్రుల సూచనని పట్టించుకోకుండా, నిక్స్ గ్రహం మీద దాడి చేద్దామంటాడు సైన్యాధ్యక్షుడు. శత్రువుని దెబ్బకొట్టే వ్యూహరచన చేస్తానంటాడు. ఇక చదవండి.]

[dropcap]ని[/dropcap]క్స్ గ్రహంలో రాత్రి పదకొండు గంటల సమయం..

ఆకాశం నిండా వేనవేల ప్రమిదలు వెలిగించినట్టు వెన్నెల దేదీప్యమానంగా వెలుగును విరజిమ్ముతోంది.

మంచం మీద అసహనంగా దొర్లుతున్న భార్యతో “నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నా వు?” అని అడిగాడు సిసిరస్.

“వెన్నెల ఎంత మనోహరంగా ఉందో చూశారా? మనం వెన్నెట్లో తడుస్తూ వూసులా డుకుని ఎన్ని రోజులైందో కదా” అంది సిసిరస్ భార్య.

“నిద్ర రావడం లేదా?” తన భార్య వైపు సమ్మోహనంగా చూస్తూ అడిగాడు సిసిరస్.

“విరహిణిలా వగలు పోతున్న ఈ వెన్నెలని ఆస్వాదించడం కోసం ఎన్ని నిద్రల్ని త్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అంది.

“సరే.. నీ ముచ్చటను ఎందుకు కాదంటాను? పద. మన తోటలోకెళ్ళి కూచుం దాం” అన్నాడు.

విశాలమైన తోట.. ఎటు చూసినా రకరకాల పూల మొక్కలు.. విరిసి మురిపిస్తున్న రంగు రంగుల పూలసోయగంతో నేలమీదికి దిగొచ్చిన వేనవేల హరివిల్లుల్ని తలపిస్తోంది.

తోట మధ్యలో వేసి ఉన్న ఉయ్యాల్లో కూచుని, మెల్లగా వూగుతూ “ఈ వెన్నెలని చూస్తుంటే మీకేమనిపిస్తోంది?” అని అడిగింది సిసిరస్ని అతని భార్య.

అతనికి రేపు పూర్తి చేయాల్సిన ప్రభుత్వపరమైన పనులు గుర్తొస్తున్నాయి తప్ప, వెన్నెల ఎటువంటి అనుభూతిని కలిగించడం లేదు. అదే విషయం చెప్తే తన భార్యకు నచ్చదని అర్థమై, “ఈ తోటనిండా వెన్నెల వొలికిపోయి, మడుగు కట్టినట్టు అన్పిస్తోంది” అన్నాడు.

ఆమె మనోహరంగా నవ్వింది.

ఓ అరగంటసేపు ఇద్దరూ కబుర్లు కలబోసుకున్నారు.

“యిక లోపలికెళ్ళి పడుకుందామా?” అన్నాడు సిసిరస్.

ఆమె లేచి నిలబడి, ఆకాశంకేసి చూసింది. వెంటనే ఆశ్చర్యంతో తన భర్త వైపు తిరిగి, “ఏంటవి ఆకాశంలో? ఉల్కలు రాలిపడ్తున్నాయా?” అంది.

సిసిరస్ తలయెత్తి పైకి చూశాడు. అది ఉల్కాపాతం కాదు, గ్రహాంతర క్షిపణుల రూపంలో దూసుకొస్తున్న మృత్యుపాశం అని అర్థం చేసుకున్నాడు. వెంటనే తన సైన్యాధ్యక్షుడ్ని అప్రమత్తం చేశాడు.

“మన రాడార్ల ద్వారా వాటినెప్పుడో గుర్తించాం. వాటి లక్ష్యం మన ఆయుధాగారాల్ని ధ్వంసం చేయడమే.. వాళ్ళకా అవకాశం ఇవ్వం. మరికొన్ని క్షణాల్లో వాటిని ఆకాశంలోనే పేల్చేయబోతున్నాం. మీరు నిశ్చింతగా ఉండండి” అన్నాడు సైన్యాధ్యక్షుడు.

“మన మీద దాడి చేస్తున్నది ఎవరు? మన నక్షత్ర కుటుంబంలో ఉన్నది రెండే గ్రహాలు కదా. నిఫిలిక్స్ గ్రహంతో మనకు మిత్రత్వమే ఉందిగా. విశ్వంలోని ఏదైనా అపరిచిత గ్రహం నుంచి ఈ ముప్పు ఎదురౌతుందా?” అని అడిగాడు.

“లేదు. మన గ్రహం వైపుకు దూసుకొస్తున్న మిస్సైల్స్‌ని ప్రయోగించింది నిఫిలిక్స్ గ్రహవాసులే” అన్నాడు సైన్యాధ్యక్షుడు

“ఎంత ప్రశాంతంగా ఉండే నక్షత్ర కుటుంబం మనది! ఒకే తల్లికి పుట్టిన యిద్దరు పిల్లల్లా కదా మన రెండు గ్రహాల వాళ్ళం ఇన్నాళ్ళూ కలిసినున్నాం. ఇప్పుడీ ఉపద్రవం ఏమిటి? ఎప్పుడైనా వూహించామా ఇలాంటి విపత్తుని ఎదుర్కోవాల్సి వస్తుందని? ఏలియన్స్ ఎప్పుడైనా మన గ్రహం మీద దాడిచేస్తే ఎదుర్కోడానికి తయారుచేసి పెట్టుకున్న ఆయుధాల్ని మన సోదర గ్రహం మీద వాడాల్సిన దుస్థితి కలగడం చాలా బాధ కలిగిస్తోంది” అన్నాడు సిసిరస్.

అదే సమయంలో ఆకాశంలో మెరుపులు మెరిసినట్టు కన్పించింది.

“అన్ని మిస్సైల్స్‌ని ధ్వంసం చేశాం. కానీ ఇంతటితో నిఫిలిక్స్ గ్రహం మిన్నకుండి పోతుందని అన్పించడం లేదు. మన మీద యుద్ధానికి తలపడటం ఖాయం. మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు ఆదేశిస్తే చాలు వాళ్ళ ఆయుధాగారాల్ని, సైనిక స్థావరాల్ని నిమిషాల్లో బూడిద చేసేయగల సత్తా మనకుంది” అన్నాడు సైన్యాధ్యక్షుడు

“వద్దు. మన వైపు నుంచి ఎటువంటి దాడికి పాల్పడవద్దు. వాళ్ళు దాడి చేస్తే దాన్ని తిప్పి కొట్టండి. ఆత్మరక్షణకే ఆయుధాల్ని వాడండి. నిఫిలిక్స్ గ్రహంలోని ప్రజలకు, అక్కడి భవన సముదాయాలకు నష్టం కలిగించే పని చేయకండి” అన్నాడు సిసిరస్.

తాము ప్రయోగించిన గ్రహాంతర క్షిపణులు ధ్వంసమయ్యాయని తెలిసి అజుపస్ కోపంతో వూగిపోయాడు. ప్రతీకారవాంఛతో రగిలిపోయాడు.

“నిక్స్ గ్రహాన్ని నాశనం చేయండి. అక్కడి స్థిరచరాస్థుల్ని కాల్చి బూడిద చేయండి. మారణహోమం సృష్టించండి. ఆ గ్రహం నాకు కావాలి. రెండు గ్రహాలకు నేనే అధిపతిని కావాలి. మన దగ్గరున్న అన్ని రకాల మారణాయుధాల్ని ప్రయోగించండి” అంటూ అజుపస్ పెట్రేగిపోయాడు.

విరామం లేకుండా నిక్స్ గ్రహం మీద ఆయుధాలు ప్రయోగించారు. అక్కడి సైనికాధికారులు వాటన్నిటిని గాల్లోనే విజయవంతంగా పేల్చేశారు.

నెల రోజుల వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరువైపులా జరుగుతున్న యుద్ధం కాదు. ఏకపక్షంగా సాగుతున్న యుద్ధం. ఆయుధాగారంలో నిల్వ ఉంచిన ఆయుధాలన్నీ అయిపోవచ్చాయి.

పరిస్థితిని సమీక్షించడానికి అజుపస్ తన మంత్రిమండలితో పాటు సైన్యాధ్యక్షుడితో సమావేశమయ్యాడు.

“ఏం చేద్దామంటారు?” అని సైన్యాధ్యక్షుడ్ని అడిగాడు.

“మరిన్ని ఆయుధాలు తయారుచేద్దాం. యుద్ధం కొనసాగిద్దాం” అన్నాడు సైన్యాధ్యక్షుడు.

“ఎందుకు మన గ్రహాధిపతికి తప్పుడు ఆశలు కల్పిస్తారు? ఇప్పటివరకు మన ఆయుధాగారాలే ఖాళీ అయ్యాయి. మళ్ళీ ఆయుధాలు తయారు చేయడమంటే మన ధనాగారాలు కూడా ఖాళీ అయ్యే ప్రమాదముంది” అన్నాడు సాంస్కృతికశాఖ మంత్రి. అజుపస్‌తో “ఇప్పటివరకు మనకు జరిగిన నష్టం చాలు. యుద్ధాన్ని ఆపేయడమే ఉత్తమం” అన్నాడు.

“అలా చేస్తే మనం ఓడిపోయినట్టు కాదా? అది మనకు అవమానం కాదా” అన్నాడు అజుపస్.

“యుద్ధం మనం చేశాం. వాళ్ళు దాన్ని తిప్పి కొట్టారు తప్ప మనమీద ప్రతిదాడికి దిగలేదు. వాళ్ళు మన మీద యుద్ధం చేసి, మన మీద ఆధిపత్యాన్ని పొందినప్పుడు కదా మనం ఓడినట్టు, వాళ్ళు గెల్చినట్టు. ఇక్కడ గెలుపోటముల ప్రసక్తి లేదు. మనం యుద్ధం మొదలెట్టాం. మనమే దాన్ని విరమిద్దాం. దానివల్ల మనకు గౌరవం కూడా” అన్నాడతను.

“యుద్ధాన్ని విరమించడం కూడా ఓటమితో సమానమే. ఓటమి కూడా మరణంతో సమానం. ప్రాణం పోయేవరకు పోరాడటమే వీరుల లక్షణం. మన నిఫిలిక్స్ గ్రహవాసులం దరూ వీరులే” అవేశంగా అన్నాడు సైన్యాధ్యక్షుడు.

“ఎందుకు మన గ్రహాధిపతిని రెచ్చగొడ్తారు? మన సైనికుల లేదా ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఎక్కడుంది? నిక్స్ గ్రహవాసులు మన మీద ఆయుధాలు ప్రయోగించ లేదు. మనం ప్రయోగించిన ఆయుధాల్ని ధ్వంసం చేశారు. అంతే. దీన్ని బట్టే సిసిరస్ ఎంత గొప్పవాడో, అతనిది ఎంత మంచి మనసో అర్థమౌతోంది. అతను మన గ్రహానికి నష్టం చేయదల్చుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాడు” అన్నాడు సాంస్కృతికశాఖ మంత్రి.

“గొప్పవాడు కాదు పిరికివాడు. మన గ్రహం మీద ఆయుధాలు ప్రయోగించడానికి భయపడి, నక్కి కూచున్నాడు” అన్నాడు సైన్యాధ్యక్షుడు

“వాళ్ళ దగ్గరున్న ఆయుధ సంపత్తి మీద మీకు సరైన అవగాహన ఉన్నట్టు లేదు. అక్కడి సైనికాధికారుల్లో ఒకరిద్దరు నాకు సన్నిహితులున్నారు. వాళ్ళద్వారా తెల్సిన సమాచారమేమిటంటే వాళ్ళ దగ్గర అత్యాధునికమైన ఆయుధాలున్నాయని. వాటిని ప్రయోగిస్తే నిమిషాల్లోనే మన గ్రహం మాడి మసైపోతుందని. వాటిని ప్రయోగించలేదంటే కారణం వాళ్ళ ఔదార్యం. అది మన అదృష్టం. ఇప్పటివరకు చేసింది చాలు. వాళ్ళను మరింత రెచ్చ గొట్టడం మంచిది కాదు. ఎవరి సహనానికైనా ఓ హద్దుంటుంది” అన్నాడతను.

“మీరు మనకు వ్యతిరేకంగా, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గ్రహ ద్రోహులు మాత్రమే అలా మాట్లాడతారు” కోపంగా అన్నాడు సైన్యాధ్యక్షుడు.

“నేను మన గ్రహం యొక్క సంక్షేమాన్ని కోరుకుంటున్న వాడిని కాబట్టే నిజాలు మాట్లాడుతున్నాను. నిజాలెప్పుడూ నిష్ఠూరంగానే ఉంటాయి” అన్నాడు ప్రశాంత వదనంతో మంత్రి.

మంత్రులందరిలోకి వయసులో పెద్దవాడైన సాంస్కృతిక శాఖ మంత్రితో అంత పరుషంగా మాట్లాడినందుకు సైన్యాధ్యక్షుడ్ని అజుపస్ మందలించాడు. ఆ మంత్రి వైపు తిరిగి “మీ సలహా ఏమిటో చెప్పండి” అన్నాడు.

“మొదట యుద్ధాన్ని విరమించండి” అన్నాడతను.

“మరి మన గ్రహానికి చంద్రుణ్ణి తెచ్చుకోవాలనే కోరికను ఏం చేయాలి? చంపుకో మంటారా?”

“అవసరం లేదు. సుదూరవిశ్వంలో మన గ్రహంతో పోల్చదగ్గ మరో గ్రహం ఉంది. భూమి.. దానికో చంద్రుడున్నాడు. నిక్స్ గ్రహానికున్న చంద్రుళ్ళ పరిమాణంతో, గురుత్వాకర్షణ శక్తితో పోల్చదగిన ఉపగ్రహం.. దాన్ని లాగేసుకుంటే చాలు. మీ కోరిక తీరుతుంది. భూగ్రహవాసులకు దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు. అంతేకాదు. దాన్ని ఎవరు ఎందుకు తీసుకెళ్ళిపోయారో కూడా తెలిసే అవకాశం లేదు. మన గ్రహం గురించి వాళ్ళ వద్ద సమాచారం ఉంటుందని నేననుకోను” అన్నాడు మంత్రి.

“సరే. అలానే కానివ్వండి” అన్నాడు అజుపస్.

***

చంద్రుడి మీదకు ప్రయాణం చేయడానికి వ్యోమనౌక తయారుగా ఉంది.

అయాన్ష్, మహిక, రాబర్ట్, సకూరాలు ప్రత్యేకమైన పదార్థంతో తయారుచేసిన ఎంపీరియన్ సూట్లు ధరించి, ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో ప్రయాణం చేయడానికి వ్యోమగాములు వాడిన స్పేస్‌సూట్లు చాలా రకాల రక్షణని కలుగచేసేవి. వాటిని ఎక్స్‌ట్రా వెహిక్యులర్ మొబిలిటి యూనిట్స్ అనేవారు. వ్యోమనౌకలో ఏర్పాటుచేసిన రక్షణమార్గాలన్నీ స్పేస్‌సూట్ లోపల కూడా ఉండటంతో, దాన్ని తొడుక్కున్న వ్యోమగామిని కూడా ఆరున్నర అడుగుల పొడవున్న స్పేస్ షిప్‌లా మార్చేసేవి.

కానీ ఒక్కో సూట్ దాదాపు యాభై కిలోల బరువుండేది. ఆక్సిజన్, నీరు వంటి ప్రాణాధారమైన బ్యాక్‌పాక్ లని కలుపుకుంటే మొత్తం బరువు నూరుకేజీల్ని మించిపోయేది. అందువల్ల నడవడం ఇబ్బందిగా ఉండేది. పరుగెత్తడమైతే అసాధ్యమే.

ఎంపీరియన్ సూట్లు ఒకప్పటి స్పేస్‌సూట్‌ల కన్నా ఎక్కువ రక్షణను అందిస్తాయి. స్పేస్‌సూట్‌లలా అసౌకర్యంగా ఉండవు. మామూలు బట్టల్తో భూమ్మీద పనులు ఎంత సునాయాసంగా చేసుకోవచ్చో, ఎంపీరియన్ సూట్లలో కూడా అంతే సౌకర్యంగా ఉంటుంది.

“మనం వెళ్తోంది చంద్రుడి మీదికేగా. ఎప్పటినుంచో కాలనీలు కట్టుకుని మనుషులు నివసిస్తున్న ప్రాంతం.. మనుషులు బతకడానికి అనుకూలమైన పరిస్థితులన్నీ కల్పించబడి ఉన్నాయి కదా. మరి ఈ ఎంపీరియన్ సూట్ల అవసరమేముంది?” అయాన్ష్‌కి మాత్రమే విన్పించేలా మెల్లగా అన్నాడు రాబర్ట్.

రాబర్ట్‌కి, సుకూరాకి చంద్రుడి మీదికి ప్రయాణం చేయాల్సి రావడం ఇదే మొదటిసారి.

అయాన్ష్ మెత్తగా నవ్వాడు. “అంతరిక్షయానం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రమాదాలమయం. ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. ఆస్టరాయిడ్స్‌తో ఢీకొనవచ్చు, అదృష్టం ఏమిటంటే ఆస్టరాయిడ్స్ మధ్య చాలా విశాలమైన ఖాళీ స్థలం ఉండటం. కాబట్టి అలా జరగడం చాలా చాలా అరుదు. మన స్పేస్‌షిప్‌లో టెక్నికల్ సమస్య తలయెత్తవచ్చు. గ్రౌండ్ కంట్రోల్‌లో సంబంధం తెగిపోవచ్చు. మనం చంద్రుడి మీద కాకుండా మరో గ్రహం మీద ల్యాండ్ కావొచ్చు. అందుకే ఈ జాగ్రత్త” అన్నాడు.

“ప్రయాణం చేయబోతూ ఆ నెగెటివ్ ఆలోచనలేమిటి?” అంటూ కసురుకుంది మహిక.

ఈసారి అయాన్ష్ పెద్దగా నవ్వాడు. “విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందడానికి అటువంటి నెగెటివ్ ఆలోచనలు కూడా దోహదపడ్డాయన్న విషయం మర్చిపోతున్నావు. ఎన్ని రకాల ప్రమాదాలు రావడానికి అవకాశం ఉందో తెల్సుకుని, వాటినుంచి రక్షణ కల్పించడానికి శాస్త్రవేత్తలు తయారుచేసిన ఉపకరణమే ఎంపీరియన్ సూట్. చంద్రుడి మీదికి ప్రయాణం వరకైతే అది మన ఇళ్ళలో ఉంచుకునే అగ్నిమాపక పరికరంతో సమానం. దాని అవసరం ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ కొన్ని విపత్కర పరిస్థితుల్లో దాని అవసరం ఏర్పడితే తప్పకుండా అది మన ప్రాణాల్ని కాపాడుతుంది.”

ఆర్యమిహిర నలుగురితో కరచాలనం చేసి “ఆల్ ద బెస్ట్” అన్నాడు. అయాన్ష్‌తో “ఈ మిషన్ విజయం అంతా మీ నలుగురిపైనే ఆధారపడి ఉంది. రెండు వారాల్లోపల బిగ్‌మాస్ ఏ పదార్థంతో తయారుచేయబడిందో కనుక్కుని, దాన్ని ముక్కలు చేయగల లేజర్ గన్స్ తయారుచేయమని మిమ్మల్ని ఆదేశించినప్పటికీ, ఆ సమయం చాలదేమో అని మనసులో మథనపడ్తూనే ఉన్నాను. కానీ మీరు మీకప్పగించిన పనిని పదమూడు రోజుల్లోపలే పూర్తిచేయడం సంతోషాన్ని కలుగచేసింది. మీలాంటి శాస్త్రవేత్తలున్నందుకు గర్వపడ్తున్నాను. లేజర్ బీమ్ రేంజ్ లోకి బిగ్‌మాస్ ప్రవేశించిన వెంటనే ఒకేసారి నాలుగు లేజర్ గన్స్‌ని ప్రయోగించండి. ఆపకుండా ప్రయోగిస్తూనే ఉండండి. బిగ్‌మాస్‌ని ఎన్ని చిన్న ముక్కలుగా చేయగలిగితే అంత మంచిది” అన్నాడు.

వ్యోమనౌకలో నలుగురూ కూచున్నాక, బిగ్‌మాస్‌ని ఛేదించడం కోసం తయారుచేసిన నాలుగు లేజర్ గన్స్‌ని ఓ స్టీల్ కంటెయినర్లో పెట్టి లోపల భద్రంగా ఉంచారు. కంట్రోల్ పానెల్ దగ్గర అయాన్ష్ కూచున్నాడు. కానీ అతనేమీ చేయాల్సిన అవసరం ఉండదు. మిషన్ కంట్రోల్ సెంటర్ వాళ్ళే దాని గమ్యస్థానాన్ని ఫీడ్ చేసి ఉంచారు. దాని వేగం, దిశ, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది, గమ్యస్థానం యింకెన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, దాన్ని చేరుకోడానికి ఇంకెంత సమయం పడ్తుంది లాంటి వివరాలు కంట్రోల్ పానెల్ పైనున్న డిస్‌ప్సే బోర్డ్ మీద కన్పిస్తుంటాయి.

వ్యోమనౌక ఆకాశంలోకి ఎగిరింది. భూమి గురుత్వాకర్షణనుంచి బైటపడి, ముందుకు సాగింది.

భూమి నుంచి చంద్రుణ్ణి చేరుకోడానికి ఒకప్పుడు మూడు రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం మూడు గంటల సమయం చాలు. వ్యోమనౌకలో ఉన్న నలుగురూ కబుర్లలో పడ్డారు.

నూట పది నిమిషాలు గడిచిపోయాయి. వెనక్కి తిరిగి మిగతా ముగ్గురితో మాట్లాడుతున్న అయాన్ష్, రాబర్ట్ చెప్పిన జోక్‌కి పెద్దగా నవ్వుతూ, యథాలాపంగా కంట్రోల్ బోర్డ్ వైపు చూసి, పెద్దగా కేక పెట్టాడు. గమ్యస్థానం దూరం అన్‌నోన్ కిలోమీటర్లని చూపిస్తోంది. డెస్టినేషన్ ఎదురుగా ఇంతకు ముందున్న మూన్ బదులు అన్‌నోన్ ప్లానెట్ అని కన్పిస్తోంది. కంగారుగా మానిటర్ మీద కన్పిస్తున్న మెసేజ్‌ని చదివాడు. అప్పటికే చంద్రుని కక్ష్య లోకి ప్రవేశించాల్సిన వ్యోమనౌక, దాన్ని దాటుకుని ముందుకు దూసుకు వెళ్తోందన్న సమాచారం మానిటర్ స్క్రీన్ మీద బ్లింక్ అవుతోంది.

“ఏమైంది? ఎందుకలా అరిచావు?” మహిక తన సీట్లోంచి వేగంగా కదిలి అయాన్ష్ పక్కకొచ్చి నిలబడింది. మానిటర్ మీద బ్లింక్ అవుతున్న మెసేజ్ చదివిన మరుక్షణం “ఏం జరుగుతోంది? ఎందుకిలా అవుతోంది?” అంటూ భయంతో అరిచింది.

“నాకూ అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు మనం స్పేస్‌షిప్‌లో భూమి నుంచి చంద్రుడికి, అక్కడి నుంచి భూమికి ప్రయాణం చేయలేదూ? ఇలా ఎప్పుడూ జరగలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్” అన్నాడు అయాన్ష్.

రాబర్ట్, సకూరాలు కూడా కంట్రోల్ బోర్డ్ వైపు చూసి, కొయ్యబారిపోయారు.

అయాన్ష్ భూమ్మీద ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్‌ని సంప్రదించడానికి ప్రయత్నించాడు. స్పేస్‌షిప్‌కి కంట్రోల్ రూంతో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. భూమితో కమ్యూనికేషన్‌కి ఉపయోగపడే డీప్ స్పేస్ నెట్వర్క్ పనిచేయడం లేదు. ఆర్యమిహిరతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కాల్ గానీ, మెసేజ్ గానీ ఏదీ వెళ్ళడం లేదు.

ఒకవేళ కంట్రోల్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయినా స్పేస్‌షిప్ గమనాన్ని, దిశను, లక్ష్యాన్ని మాన్యువల్‌గా మార్చే వీలుంటుంది. అయాన్ష్ అది కూడా ప్రయత్నించాడు. మీటలేవీ తిరగడం లేదు. బటన్స్ ఏవీ పనిచేయడం లేదు.

“ఏమై ఉంటుంది?” భయంతో సన్నగా వణుకుతూ అడిగింది సకూరా.

“కంట్రోల్ బోర్డ్‌లో మాల్‌ఫంక్షనింగ్ ఏర్పడి ఉంటుంది” అన్నాడు అయాన్ష్.

అందరి గుండెల్లో భయం వేయికాళ్ళ జెర్రిలా పాకసాగింది.

“ఇప్పుడేమిటి దారి?” అని అడిగింది మహిక. ఆమె కళ్ళలో మృత్యు భయం తాండవిస్తోంది.

“మన గ్రౌండ్ కంట్రోల్ టీం మాల్‌ఫంక్షన్‌ని సరిదిద్దితే తప్ప స్పేస్‌షిప్ మన నియంత్రణలోకి రాదు” అన్నాడు అయాన్ష్.

“అప్పటివరకు మనమేం చేయాలి?” సకూరా అడిగింది.

“ఏం చేయలేం. అంతరిక్షంలోకి స్పేస్‌షిప్ దూసుకెళ్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండటమే.”

“అలా ఎంత దూరం ప్రయాణించగలం? ఇంధనం ఎంత మిగిలుంది?”

“స్పేస్ నూక్లియర్ ఫిషన్ రియాక్టర్ నుంచి అందుతున్న శక్తితో స్పేస్‌షిప్ ముందు కెళ్తోంది. నాకు తెల్సినదాన్నిబట్టి చంద్రుడిమీదకి చాలాసార్లు వెళ్ళిరావడానికి అవసరమైనంత నూక్లియర్ ఇంధనం ఉంది.”

“ఒకవేళ ఇంధనం అయిపోయే లోపల గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు మాల్‌ఫంక్షన్‌ని రిపేరు చేయకపోతే మన పరిస్థితి ఏమిటి?” అని అడిగాడు రాబర్ట్.

ఏం జరుగుతుందో తల్చుకోగానే అయాన్ష్ వెన్నులో వణుకుపుట్టింది. ఇంధనం అయిపోయినా న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ప్రకారం వ్యోమనౌక అదే మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటుంది. అంతరిక్షంలోని ఏదైనా పదార్థంతో ఢీకొట్టినపుడో లేదా ఏదైనా గ్రహం తన గురుత్వాకర్షణశక్తితో దాన్ని తన వైపుకు లాక్కున్నప్పుడో దాని దిశ, వేగం మారతాయి. ఏ రకమైన ఆటంకం కలగకపోతే సంవత్సరాల తరబడి అది ప్రయాణిస్తూనే ఉంటుంది.

తమ గమ్యం చంద్రుడే కాబట్టి చాలా పరిమితంగా నీళ్ళు, భోజనపదార్థాలు వ్యోమనౌకలో భద్రపరచుకున్నారు. ఎంత జాగ్రత్తగా వాడుకున్నా నాలుగు పూటలకు మించి రావు. ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటి? ఆకలితో, దాహంతో చనిపోవడం ఖాయం.

ఒకవేళ ఏదైనా అధిక గురుత్వాకర్షణ శక్తి గల ఖగోళ పదార్థం తన వైపుకు లాక్కున్నా, ఆ వేగాన్ని నియంత్రించుకుంటూ స్మూత్ ల్యాండింగ్ చేయడానికి ల్యాండింగ్ మాడ్యూల్ పని చేయడం లేదు కాబట్టి అత్యంత వేగంతో ఆ పదార్థం వైపుకు దూసుకెళ్ళి, దాన్ని ఢీకొని, వ్యోమనౌకతో పాటు తమ శరీరాలు కూడా తునాతునకలు కావడం తథ్యం.

ఏ రకంగా చూసినా కొన్ని రోజుల్లోనే తమ నలుగురి ప్రాణాలు శూన్యంలో కల్సిపోక తప్పదని వాళ్ళకు అర్థమైపోయింది.

(సశేషం)

Exit mobile version