[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారవాహికగా అందిస్తున్నాము.]
[నిక్స్ గ్రహపు అధిపతి సిసిరస్, అతని భార్య నిద్ర పట్టక, తమ భవనం తోటలో కూర్చుని వెన్నెలని ఆస్వాదిస్తూంటారు. ఓ అరగంట తర్వాత ఇక లోపలికి వెళ్దామనుకుని, వెళ్లబోతూ, ఆకాశంలోకి చూస్తే ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడుతున్నట్టనిపిస్తుంది. కానీ అవి గ్రహాంతర క్షిపణులని గ్రహించిన సిసిరస్ తన సైన్యాధ్యక్షుడిని అప్రమత్తం చేస్తాడు. తమ రాడార్ల ద్వారా వాటిని గుర్తించామని, వాటి లక్ష్యం తమ ఆయుధాగారాలని, తాము వాటిని ఆకాశంలోనే పేల్చేస్తున్నామని చెప్తాడు సైన్యాధ్యక్షుడు. మనపై క్షిపణులను ప్రయోగించినదెవరిని అడిగితే, నిఫిలిక్స్ గ్రహవాసులని చెప్తాడు సైన్యాధ్యక్షుడు. చెప్పినట్టే అన్ని క్షిపణులను నాశనం చేస్తాడు. ఇది తెలిసిన అజుపస్ కోపంతో ఊగిపోతాడు. మరికొన్ని ఆయుధాలను ప్రయోగింపజేస్తాడు. నిక్స్ సైనికాధికారులు దాడిని తిప్పి కొడ్తుంటారు. మరిన్ని ఆయుధాలను తయారు చేసి, యుద్ధాన్ని కొనసాగిద్దామని నిక్స్ గ్రహం సైన్యాధ్యక్షుడు అంటాడు. సాంస్కృతిక శాఖ మంత్రి అడ్డుపడి, యుద్ధం మనమే మొదలుపెట్టామని, వాళ్ళు ముందు మొదలుపెట్టలేదని, అందువల్ల మనమే విరమిద్దామని అంటాడు. సైనికాధికారి ఒప్పుకోడు. అజుపస్ కూడా మొదట అంగీకరించడు. కానీ మంత్రి నచ్చజెప్పిన మీదట ఒప్పుకుంటాడు. మరి మన గ్రహానికి చంద్రుణ్ణి తెచ్చుకోవాలనే కోరిక ఎలా తీరుతుందని అజుపస్ అడిగితే, భూమికి ఉన్న ఉపగ్రహం చంద్రుడిని తెచ్చేసుకోవచ్చని చెప్తాడు మంత్రి. అజుపస్ సరేనంటాడు. భూమి నుంచి చంద్రుడిపై ప్రయాణానికి అయాన్ష్ బృందం సంసిద్ధమవుతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్యమిహిర ఆ నలుగురికీ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. లేజర్ బీమ్ రేంజ్ లోకి బిగ్‌మాస్ ప్రవేశించిన వెంటనే ఒకేసారి నాలుగు లేజర్ గన్స్‌ని ప్రయోగించమని చెప్తాడాయన. వ్యోమనౌక బయల్దేరుతుంది. కాసేపయ్యాకా, యథాలాపంగా కంట్రోల్ బోర్డ్ వైపు చూసిన అయాన్ష్ పెద్దగా కేక పెడతాడు. స్క్రీన్ మీద కనబడిన మెసేజ్ చూసి అందరూ కంగారు పడతారు. వ్యోమనౌక చంద్రుడి కక్షని దాటుకుని ముందుకు దూసుకువెళ్తోందన్న సమాచారం తెర మీద కనబడుతుంది. రాబర్ట్, సకూరా కాస్త భయపడతారు. స్పేస్‌షిప్‌కి కంట్రోల్ రూంతో ఉన్న సంబంధాలు తెగిపోతాయి. అయాన్ష్ ఆర్యమిహిరతోనూ, గ్రౌండ్ కంట్రోల్ వారితోనూ మాట్లాడడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అంతరిక్షంలోకి స్పేస్‌షిప్ దూసుకెళ్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండటమే చేయాల్సిందని అంటాడు అయాన్ష్. ఏ రకంగా చూసినా కొన్ని రోజుల్లోనే తమ నలుగురి ప్రాణాలు శూన్యంలో కల్సిపోక తప్పదని వాళ్ళకు అర్థమవుతుంది. ఇక చదవండి.]
[dropcap]రా[/dropcap]బర్ట్ మౌనంగా రోదించసాగాడు.
“ఎందుకు ఏడుస్తున్నావు? రోదసిలోకి ప్రయాణం చేయడానికి సన్నద్ధమైనప్పుడే, మృత్యువుని ఏ క్షణంలోనైనా ఆలింగనం చేసుకోడానికి సిద్ధంగా ఉండాలి. కొన్ని శతాబ్దాల క్రితం స్పేస్ ట్రావెల్ క్షేత్రంలో మన శాస్త్రవిజ్ఞానం తప్పటడుగులు వేస్తున్న కాలంలో ఎంత మంది వ్యోమగాములు ప్రాణత్యాగం చేశారో నీకు తెలుసు కదా. సోయుజ్ 11 లో ప్రయాణం చేసిన ముగ్గురు కాస్మోనాట్స్ ప్రాణాలు విడిచారు. స్పేస్ షటిల్ ఛాలెంజర్లో ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్స్ లాంచ్ బూస్టర్ వైఫల్యం చెందడంతో ప్రాణాలు కోల్పోయారు. స్పేస్ షటిల్ కొలంబియాలో ప్రయాణించిన మరో ఏడుగురు వ్యోమగాములు భూ వాతావరణం లోకి ప్రవేశించిన వెంటనే స్పేస్ షటిల్ ముక్కలైపోయి చనిపోయారు. మన మరణం కూడా స్పేస్ వాయేజ్ చరిత్రలో లిఖించబడ్తుంది. మనకు శాశ్వత కీర్తి లభిస్తుంది” నవ్వు తూ అన్నాడు అయాన్ష్.
“మృత్యువు సమీపంగా ఉందని తెలిసి కూడా ఎలా నవ్వగలుగుతున్నావు? నాకో కూతురుంది. స్టెల్లా.. వారం క్రితం ఓ యువకుడ్ని యింటికి పిల్చుకుని వచ్చి, మా అందరితో కలిపింది. వాళ్ళిద్దరు యేడాది నుంచి ప్రేమించుకుంటున్నారట. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది. నేనూ నా భార్య ఎంత సంతోషపడ్డామో.. అబ్బాయి స్పురద్రూపి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ట్రీట్‌మెంట్‌లో యం.డి చేశాడు. నేను చంద్రుడి నుంచి తిరిగి రాగానే వాళ్ళ పెళ్ళి జరిపిస్తానని మాటిచ్చాను. నాకు నా ప్రియమైన కూతురు స్టెల్లా గుర్తొస్తోంది. నేను తనకిచ్చిన మాట గుర్తొస్తోంది.” అంటూ రాబర్ట్ మళ్ళా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
“నాకు చావంటే భయం లేదు. నా భార్య కూడా భయపడే రకం కాదు. పిల్లల గురించి మాకు దిగుల్లేదు. ఎటొచ్చీ నా దిగులంతా మనమీద ఆర్యమిహిర గారు పెట్టుకున్న నమ్మకం గురించే. చంద్రుణ్ణి పరాయివాళ్ళు ఎత్తుకెళ్ళకుండా కాపాడతామనే భరోసాతోనే ఈ మిషన్‌ని మనకప్పగించారు. దాన్ని సాధించకుండానే చనిపోతున్నందుకు బాధగా ఉంది. బిగ్‌మాస్‌ని ధ్వంసం చేశాక, మనకు చావు ముంచుకొచ్చినా, సంతోషంగా చేతులు చాచి మృత్యువుని ఆలింగనం చేసుకుని ఉండేవాణ్ణి” అన్నాడు అయాన్ష్.
“నాకో అనుమానం వస్తోంది అయాన్ష్. భారతదేశం చంద్రుడి మరో వైపుకి చంద్రయాన్ 3 మిషన్ ద్వారా విజయవంతంగా చేరుకుని ఇప్పటికి ఐదు వందల సంవత్సరాలు కావస్తోంది. ఈ ఐదు శతాబ్దాల్లో ప్రపంచ దేశాలన్నీ కలిపి కొన్ని వందల స్పేస్ వాయేజెస్ చేసి ఉంటాయి. కానీ ఎప్పుడూ ఇలా కంట్రోల్ ప్యానెల్ పని చేయకుండా, గ్రౌండ్ కంట్రోల్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయి, అనుకున్న గమ్యస్థానానికి చేరకుండా, ఎక్కడికో అన్నోన్ డెస్టినేషన్ వైపు స్పేస్ షిప్ వెళ్ళడమనేది జరగలేదు. స్పేస్ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ కాలంలో మనమెందుకీ అనూహ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం?” అని అడిగింది మహిక.
అయాన్ష్ కొన్ని క్షణాలు ఆలోచించాక చెప్పాడు. “మన స్పేస్‌షిప్‌లోని కంట్రోల్ పానెల్‌ని ఎవరో హ్యాక్ చేశారనిపిస్తోంది.”
అప్పటివరకు రాతిబొమ్మలా మారిపోయి మౌనంగా దుఃఖిస్తూ కూచున్న సకూరా ఓ కెరటంలా లేచి అయాన్ష్‌ని సమీపించింది. “మన స్పేస్‌షిప్‌ని హ్యాక్ చేశారా? ఎవరు చేశారు?” అని ఉద్వేగంగా అడిగింది.
“ఎవరు హ్యాక్ చేశారో చెప్పలేం. ఏలియన్స్ ఎవరైనా కావొచ్చు. మన గెలాక్సీలోని ఏదైనా గ్రహవాసులు కావొచ్చు. మరో గెలాక్సీలోని గ్రహవాసులైనా కారణం కావొచ్చు” అన్నాడు
“ఎందుకు హ్యాక్ చేశారు?”
“ఆ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా. మన స్పేస్‌షిప్ చంద్రుణ్ణి చేరకూడదు. మనం బతికి ఉండకూడదు.”
“దాని వల్ల వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి?”
“తెలియదు. బహుశా చంద్రుణ్ణి మనం కాపాడుకోబోతున్నామని తెల్సుకుని, మన ప్రయత్నాన్ని విఫలం చేయాలనే ఉద్దేశమై ఉంటుంది. అంటే అర్థం ఎవరైతే బిగ్‌మాస్‌ని ప్రయోగించారో, వాళ్ళే మన స్పేస్‌షిప్‌ని హ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది” అన్నాడు అయాన్ష్.
“చంద్రుణ్ణి కాపాడుకోలేకపోతే ఆర్యమిహిర క్షమిస్తాడో లేదో తెలియదుకానీ భూగ్రహవాసులెవ్వరూ మనల్ని క్షమించరు” అంది సకూరా.
“కనీసం మనం గ్రౌండ్ కంట్రోల్‌కి సమాచారం అందచేయగలిగితే చాలు. లేజర్ గన్స్‌ని తీసుకుని మరో టీం చంద్రుడిపైకి చేరుకుని, మిషన్ని పూర్తిచేయగలుగుతుంది. కానీ మనం నిస్సహాయులం. మన చేతిలో ఏమీ లేదు. రాబోయే విపత్తుని ఎదుర్కోవటం తప్ప మనకు మరో మార్గం లేదు” నిరాశగా అన్నాడు అయాన్ష్.
అప్పుడే మానిటర్ మీద ఏదో మెసేజ్ బ్లింక్ కావడం గమనించి నలుగురూ దాని వైపు ఆత్రుతగా చూశారు.
‘మరికొన్ని నిమిషాల్లో మార్స్ గ్రహాన్ని దాటబోతున్నాం’ అని కన్పించింది.
ఎవరో మాంత్రికుడు చల్లిన మంత్రజలానికి శిలలుగా మారిపోయినట్టు, నలుగురూ స్తబ్ధుగా కూర్చొని, గతానుభవాలని, అనుబంధాల్ని, ఆత్మీయుల్ని తల్చుకోవడంలో మునిగి పోయారు.
సకూరాకి యింట్లో ఒంటరిగా ఉన్న తల్లి గుర్తొచ్చింది. ఎంత అల్లారుముద్దుగా పెంచిందో.. తన ఐదవ యేటనే తండ్రి చనిపోయినా తల్లీతండ్రీ తానేఅయి పెంచిన తల్లి.. ఎన్ని అపురూపమైన బాల్య స్మృతుల్ని తనకు కానుకగా యిచ్చిందో..
తనకు చిన్నప్పుడు చంద్రుణ్ణి చూడటం చాలా ఇష్టంగా ఉండేది. అమావాస్యరోజు చంద్రుడు కన్పించకపోతే వాళ్ళమ్మను పట్టుకుని ‘నాకు చంద్రుడు కావాలి’ అంటూ ఏడ్చేది.
ఓరోజు అమ్మ నవ్వుతూ ‘నీకు చంద్రుడంటే అంత ఇష్టం ఎందుకో చెప్పనా? పూర్వ జన్మలో నువ్వు చంద్రకాంతవై ఉంటావు. అందుకే చూశావా మన జానపద కథల్లో చంద్రుడిపై నుంచి దిగొచ్చిన రాకుమారిలా నువ్వు కూడా ఎంతందంగా ఉన్నావో’ అంది.
‘చంద్రుడిపైనుంచి రాకుమారి దిగొచ్చిందా? ఏంటమ్మా ఆ కథ? నాకు చెప్పవూ’ అంటూ తను మారాం చేసింది.
‘సరే చెప్తాను విను. అనగనగా ఒక వూర్లో అడవిలోంచి కట్టెలు తెచ్చి, అమ్ముకుని బతికే పేద వ్యక్తి ఉన్నాడు. ఒకరోజు కట్టెల కోసం అడవిలో ఉన్న వెదురుపొదల్లోకి వెళ్ళాడు. అతనికి ఒక వెదురు చెట్టు దేదీప్యమానంగా వెలుగుతూ కన్పించింది. దాని కాండాన్ని తొలిచి చూస్తే అందులో బొటన వేలంత పొడవున్న చిన్న పాప కన్పించింది. పిల్లలు లేని ఆ దంపతులు పాపను తమ స్వంత కూతురిలా అపురూపంగా పెంచుకున్నారు. మూడు నెలలకే పాప పద్దెనిమిదేళ్ళ వయసున్న అందమైన అమ్మాయిలా ఎదిగిపోయింది.’
తను అమ్మ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘మూడు నెలలకే అంత పొడవుగా ఎలా ఎదిగిందమ్మా?’ అని అడిగింది.
‘ఆమె దేవతా స్త్రీ కదా. వాళ్ళకు ఏదీ అసాధ్యం కాదు’ అంది అమ్మ.
‘ఏ దేవత?’ మళ్ళా అడిగింది.
‘ఇలా ప్రశ్నలేస్తూపోతే కథ నడిచేదెలా? కథ చెప్పనీ’ అంటూ అమ్మ కథ చెప్పడం కొనసాగించింది.
‘ఆమె అందానికి ముగ్ధులై చాలామంది యువకులు పెళ్ళి చేసుకోడానికి ముందు కొచ్చారు. వాళ్ళకు కఠినాతి కఠినమైన పరీక్షలు పెట్టి పెళ్ళికి తిరస్కరించింది. జపాన్ రాజకుమారుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. తను ఈ లోకానికి సంబంధించినదాన్ని కానని అతనికి నిజం చెప్పింది. రోజూ రాత్రుళ్ళు చంద్రుణ్ణి చూసినపుడల్లా ఆమె ఏడుస్తూ కూచునేది. తల్లిదండ్రులు కారణం అడిగినా చెప్పేది కాదు. మూడేళ్ళ తర్వాత ఆమెను తీసుకెళ్ళడానికి చంద్రుడిపైనుంచి దేవతలు దిగొచ్చారు. ఆమె చంద్రలోకంలో చేసిన తప్పుకి శిక్షగా భూలోకంలో కొన్నాళ్ళు బతకమని చంద్రుణ్ణి పాలించే రాజుగారు ఆదేశించారని, ఆమె చంద్రునిలో నివసించే రాజకుమార్తె అని అప్పుడు అందరికీ తెలిసింది. ఆమె చంద్రుణ్ణి చేరుకుంది. ఇదీ కథ’ అంటూ ముగించింది.
ఆ కథ విన్నప్పటినుంచి తను చంద్రుడిపైనుంచి దిగొచ్చిన రాకుమారి అని తనక్కూడా అన్పించేది. చంద్రుడంటే మరింత ఇష్టం ఏర్పడటానికి అది కూడా ఓ కారణమే.
పెళ్ళి చేసుకోమని అమ్మ ఎంత పోరినా వినలేదు. జీవితాన్ని శాస్త్రవిజ్ఞానానికే అంకితం చేయాలన్న సంకల్పంతో ఒంటరిగా ఉండిపోయింది.
యూనివర్శిటీ చదువులప్పుడు తనకు మరోసారి అమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది. ఆలోచించేకొద్దీ జపాన్ సాహిత్యంలో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ కథ అదేనేమో అన్పించేది. చంద్రుడినుంచి భూమ్మీదకు వచ్చిన మొట్టమొదటి ఏలియన్ ఆ రాకుమారి.. ఆమె తిరిగి చంద్రుణ్ణి చేరుకోడానికి చేసిన ప్రయాణమే మొదటి అంతరిక్ష ప్రయాణం అనుకోగానే నవ్వొచ్చేది.
‘ఆపరేషన్ సేవ్ ది మూన్’ లో తనను భాగస్వామిని చేసినప్పుడు ఎంత సంతోషపడిందో. తను చిన్నప్పటినుంచి ప్రేమించిన చంద్రుణ్ణి చేరుకోబోతున్నందుకు చాలా భావోద్వేగానికి లోనైంది. అమ్మ చెప్పిన కథలో రాకుమారి చంద్రుణ్ణి చేరుకున్నట్టు తను కూడా చంద్రుడిమీదికి చేరుకోబోతుందన్న వూహకే ఎంతగా పులకించిపోయిందో.. కథ లోని రాకుమారితో పోల్చుకుంటుంటే, అది అహేతుకమని తెల్సినా, ఆ భావన ఎంత బావుండిందో..
కానీ ఇప్పుడేమైంది? తన కోరిక తీరకుండానే చనిపోబోతోంది అనుకోగానే అంతులేనంత దుఃఖం ముంచుకొచ్చింది.
వాళ్ళు ప్రయాణిస్తోన్న స్పేస్‌షిప్ జూపిటర్ ఉపగ్రహం యూరోపాని దాటింది. జూపిటర్‌ని దాటింది. శని గ్రహం చుట్టూ ఉన్న వలయాల్ని దాటింది. యురేనస్‌ని కూడా దాటింది.
“మనకు చాలా తక్కువ ఆహారమే మిగిలుంది. మనం మరింత తక్కువ ఆహారంతో సరిపెట్టుకోవడం మంచిది” అన్నాడు అయాన్ష్.
“ఇప్పటికే మనం అర్ధాకలితో గడుపుతున్నాం. యింకా తగ్గించి తింటే నీరసంతోనే ప్రాణాలు పోతాయి” అన్నాడు రాబర్ట్.
“ఐనా తప్పదు. మనం మరికొన్ని రోజులు బతికుండాలంటే ఆహారం, నీళ్ళని అతి తక్కువగా తీసుకోవడం అవసరం” అన్నాడు అయాన్ష్.
రాబర్ట్ విషాదంగా నవ్వాడు. “నీ మాటలు అర్ధరహితంగా ఉన్నాయి అయాన్ష్. నువ్వు చెప్పినట్టు చేస్తే మరో రెండ్రోజులు తినడానికేదైనా ఉంటుందేమో. ఆ తర్వాత? అప్పుడైనా ఆకలితో పోరాడాల్సిందేగా. చావు ఎలాగూ తప్పనప్పుడు గుప్పెడన్నమే తిని ఎందుకు బతకాలి? ఎవరికోసం బతకాలి?” అన్నాడు.
“మన కోసం బతకాలి. భూమ్మీద మనకోసం ఎదురుచూస్తున్న మనవాళ్ళ కోసం బతకాలి. మన ఆపరేషన్ సేవ్ ది మూన్ కోసం బతకాలి” అన్నాడు అయాన్ష్.
“చావు దగ్గర పడ్తుందని తెలియడంతో నీ మెదడు పనిచేయడం లేదనుకుంటాను. మనం బతికి బయటపడే మార్గమే లేనప్పుడు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏమిటీ ప్రయోజనం?” అంది సకూరా.
“మనిషిని బ్రతికించి ఉంచేది ఆశ. మనం బతికే ఉంటామన్న ఆశను నేను కోల్పోలేదు. చెప్పలేం.. ఏ క్షణమైనా ఏదో ఓ అద్భుతం జరిగి మనం ఈ ప్రమాదం నుంచి బైటపడొచ్చు. అటువంటి అద్భుతం కోసం ఎదురుచూస్తూ, అది జరిగేవరకు ప్రాణాల్ని నిలుపుకోవడం అవసరం” అన్నాడు అయాన్ష్.
“ఎటువంటి అద్భుతం కోసం ఎదురుచూడాలంటావు?” చిరాగ్గా అడిగాడు రాబర్ట్.
“ఏమో చెప్పలేను. ఏమైనా జరగొచ్చు. సడన్‌గా మన కంట్రోల్ ప్యానెల్ బాగుపడొచ్చు. గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు మన స్పేస్‌షిప్‌ని మళ్ళా తమ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఏదైనా గ్రహం యొక్క గురుత్వాకర్షణకు లోనై మనం ఆ గ్రహం మీద దిగొచ్చు. గుర్రం ఎగరావచ్చు అనే మాటను విన్లేదా?” అంటూ నవ్వాడు అయాన్ష్.
“అద్భుతమేదో జరిగి పాణ్రాల్తో బైటపడ్తామన్న నమ్మకం నాకు లేదు” నిరాశగా అంది సకూరా.
“శాస్త్రవేత్తలకు నిరాశ పనికిరాదు. ఎన్ని అపజయాలు ఎదురైనా ఎప్పటికైనా విజయం సాధిస్తామన్న నమ్మకమే ఎన్నో శాస్త్రపరిశోధనలకు పునాదిగా మారింది. వెయ్యి సార్లు అపజయాన్ని ఎదుర్కొన్నా మొక్కవోని నమ్మకంతో పరిశోధనల్ని కొనసాగించబట్టే థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్‌ని కనుక్కున్నాడని పుస్తకాల్లో చదివాం గుర్తుందా? మనకిప్పుడు అన్నం నీళ్ళతో పాటు ఆశ కూడా ప్రాణాధారమే” అన్నాడు అయాన్ష్.
ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు. అయాన్ష్ చెప్పినదాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు.
స్పేస్షిప్ కైపర్ బెల్ట్‌ని దాటింది. సౌరమండలపు చివరి అంచుని కూడా దాటి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది.
భోజనపదార్థాలు అయిపోయాయి. అందరూ సరైన తిండిలేకపోవడం వల్ల శుష్కించిపోయారు. నీరసం.. నిస్సత్తువ.. గుక్కెడు మంచినీళ్ళు తాగి ప్రాణాలు నిలుపుకుంటున్నారు.
స్పేస్‌షిప్‌లో ఇంధనం ఐపోయింది. అయినా అది న్యూటన్ ప్రథమ గమన సూత్రం ప్రకారం ఇనర్షియా వల్ల ముందుకు వెళ్తోనే ఉంది.
కొన్ని గంటల ప్రయాణం అనంతరం, అకస్మాత్తుగా స్పేస్‌షిప్ దిశ మార్చుకుని, మరింత వేగంతో కిందికి దూసుకుపోసాగింది.
వెంటనే అయాన్ష్ అప్రమత్తమైనాడు. “మనం ఏదో గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోనై దానివైపుకి ప్రయాణిస్తున్నామనిపిస్తోంది. స్పేస్‌షిప్ ఆ గ్రహం యొక్క ఉపరితలాన్ని తాకితే ముక్కలైపోవటం ఖాయం. అలా జరగడానికి కొన్ని నిమిషాలముందే మనం ప్యారాషూట్ల సహాయంతో కిందికి దిగుదాం. మొదట లేజర్ గన్స్‌ని భద్రపరిచిన స్టీల్ కంటెయినర్‌ని ప్యారాషూట్‌కి కట్టి కిందికి తోసేద్దాం. ఆ తర్వాత మనం బైటికి దూకుదాం. గెట్ రెడీ.. క్విక్” అన్నాడు.
నలుగురూ కలిసి స్టీల్ కంటెయినర్‌ని ప్యారాషూట్‌కి తాళ్ళతో బలంగా కట్టేసి, కిందికి తోశారు. అది కిందికి దిగుతున్న వేగం చూసిన వెంటనే అయాన్ష్‌కి ఓ అనుమానం వచ్చింది. మామూలుగా ప్యారాషూట్ సాయంతో భూమి మీదకి దిగుతున్నప్పుడు, ఎంత వేగంతో దిగుతారో దానికి రెండింతల వేగంతో స్టీల్ కంటెయినర్ కిందికి వెళ్తోంది.
“మనం ఏ గ్రహం మీదికి దిగబోతున్నామో దాని గురుత్వాకర్షణ శక్తి మన భూమి గురుత్వాకర్షణ శక్తి కన్నా చాలా ఎక్కువేమో అనిపిస్తోంది. బహుశా రెండు మూడింతలు కావచ్చు. దిగేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడటం అవసరం” ప్యారాషూట్‌ని నడుముకి కట్టుకుంటూ మిగతా ముగ్గుర్నీ ఉద్దేశించి అన్నాడు.
వాళ్ళు ముగ్గురు కూడా ప్యారాషూట్లని కట్టుకున్నాక, ఒకరి తర్వాత ఒకరు కిందికి దూకారు. చివర్లో అయాన్ష్ దూకాడు. వాళ్ళు కిందికి దూకిన కొన్ని క్షణాల వ్యవధిలోనే వ్యోమ నౌక నేలను ఢీకొని, ముక్కలైపోయింది.
(సశేషం)