[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[కొత్త గ్రహం ఉపరితలం మీద పడ్తారు నలుగురు వ్యోమగాములు. శరీరబరువు ఒక్కసారిగా రెండింతలైనట్టు అడుగులు భారంగా పడ్తాయి. ఈ గ్రహానికి భూమికంటే మూడు రెట్లు అధిక గురుత్వాకర్షణశక్తి ఉందని అయాన్ష్ చెప్తాడు. ఈ గ్రహం మీద గ్రావిటీ తక్కువే ఉన్నా, తాము ధరించిన ఎంపీరియన్ సూట్ వల్ల గురుత్వాకర్షణ ప్రభావం తమపై సగానికి మించపడదని, తాము సురక్షితమని అంటాడు. తాము జారవిడిచిన స్టీల్ కంటెయినర్‌ని వెతుక్కుంటూ వెళ్తారు. కొంత దూరం నడిచాకా, ఆ గ్రావిటీకి అలవాటు పడి తేలికగానే నడవగలుగుతారు. అక్కడి చెట్లు ఆరడుగులకి మించి ఎత్తు ఉండవు. తలెత్తి పైకి చూస్తే, ఆకాశంలో రెండు సూర్యబింబాలు కనిపిస్తాయి. ఈ గ్రహం రెండు నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తుందని అంటాడు అయాన్ష్. కాసేపయ్యాకా, స్టీల్ కంటెయినర్ కనబడుతుంది. భూమిని తవ్వి, దాన్ని భద్రంగా దాచిపెడతారు. అక్కడ గుర్తుగా నాలుగు చెట్ల బోదెల మీద పదునైన రాతితో ఏ, ఎమ్, ఆర్, ఎస్ అనే ఆంగ్ల అక్షరాల్ని చెక్కుతారు. తర్వాత నడుస్తూ ముందుకు వెళ్తారు. కొంత దూరం వెళ్ళాకా, వారికో వింత పక్షి కనబడుతుంది. అదే సమయంలో ఏదో వింత జంతువు వారికెదురుగా వచ్చి క్రూరంగా చూస్తుంది. ఈ లోపు ఆ పక్షి ఎగురుతూ వచ్చి, పళ్ళతో, ఆ జంతువుని కరచిపట్టుకుని ఎగిరిపోతుంది. అది చూసి, ఆ చోటునుంచి త్వరగా వెళ్ళిపోవడం మంచిదని అంటాడు అయాన్ష్. ఈలోపు నాలుగు వింత ఆకారాలు వాళ్ళని చుట్టుముడతాయి. ఎవరు మీరు, ఎక్కడ్నించి వచ్చారని వాళ్ళ భాషలో ప్రశ్నిస్తే, అయాన్ష్ అర్థం చేసుకుని, తమ గురించి చెప్తాడు. అయాన్ష్ చెప్పినవేవీ వాళ్ళు నమ్మరు. నలుగురిని బందీలుగా చేసి కారాగారంలో ఉంచుతారు. తమ గ్రహంపై దాడి చేయడానికి ఏలియన్స్ వచ్చారన్న వార్త తెలిసి సాల్మోనియస్ గ్రహవాసులందరూ వాళ్ళని చూడడానికి తండోపతండాలుగా వస్తారు. వాళ్ళని నియంత్రించడం కష్టమై, సైనికాధికారులు గ్రహాధిపతి ఓసిరస్‍ని కలిసి సమస్యని వివరిస్తారు. ఏలియన్స్‌ని గాజుగదిలో ప్రదర్శనకి ఉంచి ఉదయం ఎనిమిది గంటలనుంచి సాయంత్రం ఆరు గంటలవరకు ఏలియన్స్‌ని చూడొచ్చని ప్రకటన విడుదల చేయమంటాడు ఓసిరస్. ఇంతకీ వాళ్ళ మన గ్రహానికెందుకు వచ్చారో కనుక్కున్నారా అని అడిగితే, అయాన్ష్ చెప్పిన వివరాలన్నీ ఓసిరస్‍కు వివరిస్తారు అధికారులు. వాళ్ళు చెప్తున్నది నిజమేననిపిస్తోందని సైన్యాధ్యక్షుడు అంటాడు. గ్రహాధిపతి అభిప్రాయం వేరేలా ఉంటుంది. వాళ్ళు దిగిన చోట ఐదు కిలోమీటర్ల పరిధిలో అంగుళం అంగుళం జాగ్రత్తగా గాలించమని, ఏదైనా అనుమానాస్పదంగా కన్పిస్తే మన దృష్టికి తీసుకురమ్మని సైనికులకి చెప్పమని ఆజ్ఞాపిస్తాడు. ఇక చదవండి.]
[dropcap]ఎ[/dropcap]త్తయిన వేదికమీద విశాలమైన గాజు గదిని ఏర్పాటుచేసి, అందులో నలుగురు ఏలియన్స్‌ని నిల్చోబెట్టారు. ఆ గది భూగ్రహవాసులు వాడే లిఫ్ట్‌లకు రెండింతల పరిమాణంలో ఉంది. పైన మూత బదులు స్టీల్‌తో అల్లబడిన నెట్ ఏర్పాటు చేయడంతో వూపిరి తీసుకోడానికి అనుకూలంగా ఉంది. గాజు ఆరంగుళాల మందంలో ఉన్నా పల్చటి గాజుపాత్రలో ఉంచినంత స్పష్టంగా వాళ్ళు సాల్మోనియన్లకు కన్పిస్తున్నారు.
ఏలియన్లని చూడటానికి వందల సంఖ్యలో సాల్మోనియన్లు ఎగబడ్తున్నారు.
“ఇదంతా చూస్తుంటే చాలా నవ్వొస్తోంది నాకు” అన్నాడు అయాన్ష్.
“జూలో ఉంచిన వింత జంతువుల్ని చూడటానికి వచ్చినట్టు మనల్ని చూడటానికి ఈ పిగ్మీ వెధవలు వస్తుంటే నాకు అవమానంతో తల కొట్టేసినట్టుంది. నీకు నవ్వెలా వస్తోంది?” కోపంగా అన్నాడు రాబర్ట్.
“ఇందులో అవమానపడాల్సింది ఏముంది? మన నలుగురమే జూ చూడటానికొచ్చిన పర్యాటకులం, వాళ్ళందరూ ఓపెన్ ఎయిర్ జూలో తిరుగాడుతున్న వింత జంతువులు అనుకుంటే సరి. తప్పకుండా నీక్కూడా నవ్వొస్తుంది” అన్నాడు అయాన్ష్.
“అలా ఎలా అనుకోమంటావు? గాజు సీసాలో జీనీని బంధించినట్టు మన నలుగుర్నే కదా బందీలుగా ఉంచారు” అన్నాడు రాబర్ట్.
“మనం వాళ్ళకు ఏలియన్స్ ఐతే వాళ్ళు మనకు ఏలియన్స్. భూగ్రహంలో ఉండే మనం వాళ్ళ కళ్ళకు వింతగా కన్పిస్తున్నట్టే సాల్మోనియస్ అనబడే ఈ గ్రహంలో మనుషులు ఎంత వింతగా ఉన్నారో చూసి మనం కూడా ఆశ్చర్యపోతున్నాం కదా. ఆ విషయం తల్చుకోగానే నవ్వొచ్చింది. యిక గాజు సీసాలో బంధించడం అంటావా? దీన్నెందుకు బందిఖానా అనుకుంటున్నావు? మన రక్షణ కోసమని ఎందుకనుకోవు?” అన్నాడు.
“రక్షణ కోసమా? ఎందుకు రక్షణ? ఎవరి నుంచి రక్షణ?” అన్నాడు రాబర్ట్.
అదే సమయంలో గుంపులోంచి ఎవరో గాజు గదిపైకి రాయిని విసిరారు. వెంట వెంటనే నాలుగైదు రాళ్ళు వేగంగా వచ్చి గాజు ఎన్‌క్లోజర్‌ని తాకాయి. దాంతోపాటు విద్వేష పూరితమైన నినాదాలు మిన్నుముట్టాయి. “మన గ్రహాన్ని నాశనం చేయడానికొచ్చిన ఈ ఏలియన్లు బతక్కూడదు. వీళ్ళను చంపేయాలి” అంటూ ఒకతను అరిస్తే, మరొకతను “వీళ్ళు మన సాల్మోనియన్లకు శత్రువులు. వీళ్ళకు బతికే హక్కు లేదు. అందరం కలిసి చంపేద్దాం రండి” అంటూ అరిచాడు.
సందర్శకుల గుంపుని అజమాయిషీ చేస్తున్న సైనికులు వాళ్ళని గుర్తించి, లాక్కెళ్ళి పోయారు.
తమ పైన రాళ్ళ దాడి జరుగుతుందని వూహించని రాబర్ట్ శిలా ప్రతిమలా బిగుసు కుపోయాడు.
“ఇప్పుడర్థమైందా మనకు రక్షణ ఎంత అవసరమో” అన్నాడు అయాన్ష్.
“మనల్ని శత్రువులని ఎందుకనుకుంటున్నారు? మనం ఏం నేరం చేశామని మన చావుని కోరుకుంటున్నారు?” బాధగా అన్నాడు రాబర్ట్.
“గుంపు మనస్తత్వం ఏ నియమాలకు కట్టుబడి ఉండదు. అందులో ఎవడో ఒకడు క్షణికావేశానికి లోనవుతాడు. గుంపులోని కొంతమంది గుడ్డిగా వాళ్ళని అనుకరిస్తారు. ఇప్పుడు జరిగిందదే. మనం మంచివాళ్ళమని, వీళ్ళకు నష్టం చేయాలన్న దురుద్దేశమేదీ లేదని రుజువయ్యేకు పరిస్థితి ఇలానే ఉంటుంది. మనకు గాజు తలుపుల్తో రక్షణవలయాన్ని ఏర్పాటు చేసినందుకు కారాగార నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేయాలి” అన్నాడు అయాన్ష్.
“సైనికులు మనం దిగిన ప్రాంతమంతా జల్లెడ పడ్తున్నారని తెలిసింది కదా. లేజర్ గన్స్ ఉన్న స్టీల్ కంటెయినర్ వాళ్ళ కంట పడితే మన పరిస్థితి ఏమిటి? మనం వీళ్ళ గ్రహాన్ని ధ్వంసం చేయడానికే వచ్చామని నమ్మే ప్రమాదముంది కదా” అంది మహిక.
“గుబురుగా ఉన్న పొద మధ్యలో కదా గొయ్యి తవ్వి దాచిపెట్టాం. పైన ఆకుల్తో విరిగిపోయిన కొమ్మల్తో కప్పి ఉంచాం. అది దొరికే అవకాశమే లేదు” అన్నాడు అయాన్ష్.
“వాళ్ళు వెదకడం మొదలెట్టకముందే మనం వాటి గురించి చెప్పి ఉండాల్సింది” అంది సకూరా.
“అప్పుడు మన మీద అనుమానం మరింత బలపడేది” అన్నాడు అయాన్ష్.
“మన చంద్రుణ్ణి ఎవరో ఏలియన్స్ దొంగిలించబోతుంటే వాళ్ళ ప్రయత్నాల్ని తిప్పి కొట్టడానికే ఈ లేజర్ గన్స్ అని వాళ్ళకు నచ్చచెప్తే అర్థం చేసుకునేవారేమో కదా” అంది సకూరా.
“మనం చేప్పేది ఎవరికైనా నమ్మశక్యంగా అన్పిస్తుందా? ఇన్ని శతాబ్దాల చరిత్రలో ఎప్పుడైనా చంద్రుణ్ణి దొంగిలించడం జరిగిందా? ఎవరైనా ప్రయత్నించారా? ఆ వూహే వింతగా లేదూ. ఒకరి చంద్రుణ్ణి యింకొకడు దౌర్జన్యంగా లాక్కోవడం ఏమిటి? ఎవడో దుష్టగ్రహవాసికి వచ్చిన దుర్మార్గమైన ఆలోచన అది. మనకు తెలుసు అది నిజమని. కానీ ఈ విశ్వంలో ఉన్న ఏ గ్రహవాసులు కూడా దీన్ని నమ్మరు. వీళ్ళకు చెప్పి అభాసుపాలు కావడం తప్ప ప్రయోజనం ఉండదు” అన్నాడు అయాన్ష్.
అదే సమయంలో అడవిలో ప్రతి చెట్టుని పుట్టని గాలిస్తున్న సైనికులకు ఓ గుబురు పొద చుట్టూ ఉన్న చెట్ల కాండాల మీద ఏవో గుర్తులు కన్పించాయి. కోసుగా ఉన్న రాతితో కాండం మీద గీసిన కోడ్ భాష.. నాలుగు చెట్ల బోదెల మీద నాలుగు రకాల ఇమేజెస్‌తో రాసుకున్న రహస్య లిపి.. సైన్యాధ్యక్షుడికి వెంటనే ఆ సమాచారాన్ని అందించారు. అతను హుటాహుటిన అక్కడికి చేరుకుని, రహస్యలిపిని జాగ్రత్తగా పరిశీలించాడు. అతనికేమీ అర్థం కాలేదు.
తమ దగ్గర ఉన్న డీకోడింగ్ నిపుణుల్ని పిలిపించాడు. వాళ్ళు చెట్ల బోదెల మీద చెక్కి ఉన్న లిపిని అర్థం చేసుకోడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ భాష అర్థమేమిటో, ఆ నాలుగు ఇమేజెస్‌ని కలిపితే ఏ రహస్యం బహిర్గతమవుతుందో తెల్సుకోలేకపోయారు.
“దీన్ని డీకోడ్ చేయడం మా వల్ల కావడం లేదు. దీని అర్థమేమిటో ఆ ఏలియన్స్ మాత్రమే చెప్పగలరు” అన్నారు.
సైన్యాధ్యక్షుడు హుటాహుటిన కారాగారాన్ని చేరుకున్నాడు. సైనికులు ప్రదర్శనని మధ్యలో నిలిపేసి, నలుగురు ఏలియన్స్‌ని అతని ఎదుట ప్రవేశపెట్టారు.
“మీరు మా గ్రహం మీదికి దిగిన చోటునుంచి కొంత దూరంలో ఓ పొద చుట్టూ ఉన్న చెట్ల బోదెల మీద ఏవో రహస్య సంకేతాలు రాసి ఉన్నాయి. అవి రాసింది మీరేనని నాకు తెలుసు. చెప్పండి వాటి అర్థమేమిటో? ఎవరి కోసం ఆ సంకేతాలు? మరికొంత మంది మీ గ్రహం నుంచి ఇక్కడికి రాబోతున్నారా? వాళ్ళ కోసం వదిలిన రహస్య సమాచారమా? వాళ్ళ వద్ద ఆయుధాలు ఉండే అవకాశం ఉందా?” అంటూ సైన్యాధ్యక్షుడు ప్రశ్నల వర్షం కురిపించాడు.
“అవి ఇంగ్లీష్ భాషలో రాసిన అక్షరాలు మాత్రమే. అందులో ఏ రహస్య సమాచారమూ దాగిలేదు” అన్నాడు అయాన్ష్.
“ఇంగ్లీష్ భాషనా? అంటే ఏమిటి?”
“మా భూగ్రహంలో చైనీస్, స్పానిష్ తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ఇంగ్లీష్. మేము నలుగురం నాలుగు చెట్లను ఎన్నుకుని, వాటిమీద ఒక్కో ఇంగ్లీష్ అక్షరాన్ని చెక్కాం.”
“ఏమిటా అక్షరాలు?”
“ఏ, ఎమ్, ఆర్, ఎస్.”
“వాటి అర్థం ఏమిటి? అవన్నీ కలిపితే ఏమొస్తుంది?”
“ఏమీ రాదు. వాటికి అర్థమంటూ ఏమీ లేదు.”
సైన్యాధ్యక్షుడికి కోపం వచ్చింది. “మీరే తెలివిగలవారమని అనుకుంటున్నారా? మిమ్మల్ని మించిన తెలివిగలవాళ్ళు మా గ్రహంలో కోట్లమంది ఉన్నారు. నాతో పరాచికాలు వద్దు. ఇప్పటివరకు మీరు మా శత్రువులు అనడానికి రుజువులేమీ దొరక్కపోవడం వల్ల క్షేమంగా ఉన్నారు. అటువంటిదేమైనా మా చేతికి చిక్కిందా మిమ్మల్ని చిత్రవధ చేసి చంపేయడం ఖాయం. నిజం చెప్పండి. ఆ కోడ్ భాషకు అర్థం ఏమిటి? ఎవరికోసం రాశారు? ఎందుకు రాశారు?” పులిలా గాండ్రిస్తూ అన్నాడు.
“అవి మేము దిగిన ప్రదేశానికి గుర్తుగా రాసుకున్న అక్షరాలు. వాటికి అర్థం ఏమీ లేదు. మా నలుగురి పేర్లలోని మొదటి అక్షరాల్ని వాటిమీద చెక్కాం. అంతే. ఏ ఫర్ అయాన్ష్. ఎమ్ ఫర్ మహిక, ఆర్ ఫర్ రాబర్ట్, ఎస్ ఫర్ సకూరా” అన్నాడు అయాన్ష్.
“నేను నమ్మను. మీకు రేపుదయం వరకు సమయం ఇస్తున్నాను. రేపు మీరా రహస్య కోడ్‌కి అర్థమేమిటో చెప్పకపోయారో ఎన్ని రకాల హింసలు మా గ్రహంలో అమల్లో ఉన్నాయో వాటన్నిటిని రుచి చూపిస్తాం. వాటిని భరించలేక ఒకేసారి చంపేయమని మీరే మమ్మల్ని ప్రాధేయపడ్తారు. బాగా ఆలోచించుకోండి” అనేసి అక్కడినుంచి వేగంగా గ్రహాధిపతి నివాసాన్ని చేరుకున్నాడు.
నాలుగు చెట్ల బోదెల మీద చెక్కి ఉన్న రహస్య లిపి గురించి పూర్తి సమాచారాన్ని అందచేశాడు.
“ఎంత భయపెట్టినా ఆ ఏలియన్స్ కోడ్ భాషకు అర్థం చెప్తారని నాకన్పించడం లేదు. ఆ రహస్యమేదో మనం ఛేదించకుండా వాళ్ళ మీద ఆధారపడటం మన అసమర్థతను సూచిస్తుంది. అక్కడే బాగా గాలించండి. ఏదైనా జాడ తెలుస్తుందేమో” అన్నాడు ఓసిరస్.
“అణువణువు గాలించాం. ఏమీ దొరకలేదు.”
“మీరు నేల మీదేగా వెతికారు. నేల కింద వెతికారా?”
“లేదు.”
“వెతికించండి. రేపు ఉదయానికల్లా ఫలితం లభించాలి. అర్థమైందా?” అన్నాడు ఓసిరస్.
సైన్యాధ్యక్షుడు అర్థమైందన్నట్టు తల పంకించి, అక్కడినుంచి వేగంగా వెళ్ళిపోయాడు.
ఎక్కువ సేపు శ్రమపడాల్సిన అవసరం లేకుండానే గంటన్నర లోపలే గొయ్యిలోపల దాచిపెట్టిన స్టీల్ కంటెయినర్‌ని బైటికి తీశారు.
వెంటనే దాన్ని సైనిక స్థావరానికి తరలించి, ఆయుధాల తయారీలో నిపుణులైన శాస్త్రవేత్తల్ని పిలిపించి, కంటెయినర్లో ఉన్న ఆయుధాలు ఎలాంటివో, ఎంత శక్తివంతమైనవో కనుక్కోవల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
మరో గంట తర్వాత గ్రహాధిపతి ఓసిరస్ కూడా అక్కడికి చేరుకున్నాడు.
“ఇవి చాలా శక్తివంతమైన లేజర్ గన్స్. వీటితో ఎంతటి విధ్వంసాన్నయినా సృష్టించవచ్చనిపిస్తోంది” అంటూ ఆ ఆయధాల గురించి శాస్త్రవేత్తలు ఓసిరస్‌కి వివరించారు.
“మీరు అనుమతిస్తే వీటిని పరీక్షించి చూద్దాం” అన్నాడు సైన్యాధ్యక్షుడు.
ఓసిరస్ తన అంగీకారం తెలపడంతో ఓ లేజర్ గన్‌ని చేతుల్లోకి తీసుకున్నాడు.
“ఈ లేజర్ కిరణాల రేంజ్ చాలా చాలా ఎక్కువుంది. మన మేధాశక్తికి మించిన రేంజ్. కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఈ కిరణాలు తమ ప్రభావాన్ని చూపగలవు” అని ఓసిరస్‌కి వివరించి, గన్ మీదున్న ఓ మీటను తిప్పి, రేంజ్‌ని బాగా తగ్గించాడు. “వీటి శక్తిని వంద శాతం కాకుండా పది శాతానికి తగ్గించి ప్రయోగించి చూద్దాం. దానివల్ల మరింత విధ్వంసం జరక్కుండా ఉంటుంది” అన్నాడు.
జంట సూర్యుళ్ళు పశ్చిమాకాశాన అస్తమించబోతున్న సమయం..
సుదూరంగా ఎత్తయిన పర్వతం కన్పిస్తోంది. ఆ గ్రహంలో అన్నిటికన్నా ఎత్తయిన పర్వతం అదే. కఠిన శిలల్తో నిండిఉన్న మహా పర్వతం..
లేజర్ గన్‌ని దాని వైపు ఎక్కుపెట్టి మీటను నొక్కాడు.
క్షణం.. మరుక్షణం పెద్దగా శబ్దం చేస్తూ పర్వతం రెండు ముక్కలుగా చీలిపోయింది.
అక్కడున్న అందరూ ఆశ్చర్యంతో నోట మాట రాక కొయ్యబారిపోయారు. ఆ కిరణాలు పర్వతంలో పగుళ్ళను ఏర్పరుస్తాయనో, కొంత మేర ధ్వంసం చేస్తాయనో అనుకున్నారు తప్ప ఇలా పండుని కత్తితో రెండు ముక్కలుగా కోసినట్టు, పర్వతాన్ని రెండు భాగాలుగా విడగొడ్తాయని ఎవ్వరూ వూహించలేదు. అసలు అలాంటి ఆయుధాలు కూడా ఉంటాయనేది వాళ్ళ మేధస్సుకు అందని విషయం.
“ఇటువంటి లేజర్ గన్స్‌ని నేల లోపల దాచిపెట్టడంలో ఆ ఏలియన్స్ ఉద్దేశం ఏమై ఉంటుంది?” ఆశ్చర్యం నుంచి తేరుకుని అడిగాడు ఓసిరస్.
“మన గ్రహాన్ని ధ్వంసం చేయాలన్న ఉద్దేశం తప్ప మరేముంటుంది? ఎంత అమాయకుల్లా మాట్లాడారో.. నిజంగానే వాళ్ళ వల్ల మనకేమీ హాని జరగదని నమ్మాను. ఎంత పొరపాటు జరిగిపోయిందో. వాళ్ళనింక ఉపేక్షించకూడదు. వాళ్ళని కఠినాతికఠినంగా శిక్షించాలి. వాళ్ళ ప్రాణాలు తోడేయాలి” ఉగ్రుడైపోతూ అన్నాడు సైన్యాధ్యక్షుడు.
“తొందరపడకండి. వాళ్ళని నా ముందు ప్రవేశపెట్టండి. మొదట వాళ్ళ సంజాయిషీ ఏమిటో విందాం. ఆ తర్వాత ఏం శిక్ష విధించాలో నిర్ణయిద్దాం” అన్నాడు ఓసిరస్.
వెంటనే గ్రహాధిపతి కార్యాలయ భవనంలో మంత్రులతో, సైనిక ప్రముఖులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది.
ఏలియన్స్ నలుగుర్ని వెంటబెట్టుకుని సైనికులు ప్రవేశించారు.
అక్కడ హాలు మధ్యలో పెట్టి ఉన్న స్టీల్ కంటెయినర్, దాని మీద పెట్టి ఉన్న ఒక లేజర్ గన్‌ని చూడగానే అయాన్ష్‌తో పాటు మిగతా ముగ్గురి గుండెలు గుబగుబలాడాయి.
“మనల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తారు. తప్పదు” అయాన్ష్‌కి విన్పించేంత మెల్లగా గొణుగుతున్నట్టు అన్నాడు రాబర్ట్.
“భయపడకు. ఒకవేళ చంపాలనుకుంటే స్టీల్ కంటెయినర్లో లేజర్ గన్స్‌ని చూసినపుడే, మనల్ని చంపేసేవాళ్ళు. ఇక్కడికి పిలిపించారంటేనే అర్థం మన సంజాయిషీ ఏమిటో, ఏం చెప్తామో వినాలనుకుంటున్నారు. నేను వీళ్ళకు నచ్చచెప్తాను. నా మాటల్ని తప్పకుండా నమ్ముతారు. మనల్ని వదిలేస్తారు” అంతే మెల్లగా చెప్పాడు అయాన్ష్.
“మీరు ప్రయాణించిన స్పేస్‌షిప్‌లో ఈ లేజర్ గన్స్‌ని ఎందుకు తెచ్చారు? ఎవరి మీద ప్రయోగించాలని తెచ్చారు? వీటిని మా గ్రహం మీదకి తీసుకురావడంలో మీ ఉద్దేశం ఏమిటి?” ఆ నలుగురి వైపు కోపంగా చూస్తూ ఓసిరస్ అడిగాడు.
“మా భూగ్రహానికి ఓ చంద్రుడున్నాడు. మాకందరికీ చాలా ప్రియమైన చంద్రుడు. దాన్ని తరలించుకుపోదామనే దురుద్దేశంతో ఏదో ఓ ఏలియన్ గ్రహం బిగ్‌మాస్‌ని ప్రయోగించింది. దానికున్న అత్యధిక గురుత్వాకర్షణ శక్తి వల్ల చంద్రుడు దానివైపుకి లాగబడటం ఖాయం. మా చంద్రుణ్ణి కాపాడుకోడానికి మేము ఈ లేజర్ గన్స్‌ని తయారుచేశాం. వీటి సాయంతో బిగ్‌మాస్‌ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలని పధకం వేశాం. లేజర్ గన్స్ని తీసుకుని చంద్రుడి మీదకి ప్రయాణమైనాం. కానీ స్పేస్‌షిప్ మాల్‌ఫంక్షనింగ్ వల్ల మీ గ్రహాన్ని చేరుకున్నాం. పొరపాటున మీ గ్రహాన్ని చేరుకున్నాం తప్ప మా లక్ష్యం మీ గ్రహం కాదు” అన్నాడు అయాన్ష్.
“మరి ఈ ఆయుధాల్ని మా కళ్ళ పడకుండా నేలలోపల ఎందుకు దాచి ఉంచారు?” ఓసిరస్ ప్రశ్నించాడు.
“మా వద్ద లేజర్ గన్స్ ఉండటం చూసి, మమ్మల్ని శత్రువులనుకుని పొరబడి, మా సంజాయిషీ వినకుండానే మమ్మల్ని మీ సైనికులు కాల్చి చంపేస్తారని భయపడి, దాచిపెట్టాం” అన్నాడు అయాన్ష్.
ఓసిరస్ తన మంత్రుల వైపు తిరిగి “మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగాడు.
“నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన జానపద కథలా ఉంది. ఓ గ్రహం చుట్టూ తిరిగే చంద్రుణ్ణి దొంగిలించడం ఏమిటి? ఎంత నవ్వొస్తుందో వింటుంటే. అదేమైనా ఆకాశంలో వేలాడే దీపమా తీసుకెళ్ళి వాళ్ళ గ్రహం మీద వేలాడదీసుకోడానికి? అంతా కట్టుకథ. ఈ ఏలియన్స్ మన గ్రహాన్ని ధ్వంసం చేయాలనే దురుద్దేశంతోనే వచ్చి ఉంటారు. వీళ్ళు మరణ దండనకు అర్హులు” అన్నాడో మంత్రి.
“చంద్రుడు లేకపోతే ఏమౌతుంది? మనకు తెల్సిన చాలా గ్రహాలకు చంద్రుళ్ళు లేరు. వాళ్ళెవరూ చంద్రుడి కోసం తాపత్రయపడినట్టు దాఖలాలేమీ లేవు. ఐనా ఓ గ్రహానికున్న చంద్రుణ్ణి వాటిమధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తినుంచి విడదీయడం సాధ్యమా? దాన్ని మరో గ్రహానికి తరలించడం సాధ్యమా? వీళ్ళ స్పేస్‌షిప్ నియంత్రణ కోల్పోయి మన గ్రహాన్ని చేరుకున్నట్టు చెప్తున్నదంతా అబద్ధం. వీళ్ళ లక్ష్యం మన గ్రహమే. వీళ్ళు మన శత్రువులు. వీళ్ళకు ఎంతటి శిక్ష విధించినా తప్పు లేదు” అన్నాడు మరో మంత్రి.
“చివరిగా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?” అని అడిగాడు ఓసిరస్.
“మేము చెప్పేది నిజం. మమ్మల్ని నమ్మండి. సాల్మోనియస్ అనే ఓ గ్రహం ఉందని మాకు తెలియదు. ఇటువంటి గ్రహం ఒకటుందని తెలియనప్పుడు, ఇది మా లక్ష్యం ఎలా అవుతుంది? మీ గ్రహాన్ని నాశనం చేయడం వల్లనో లేక ఇక్కడ విధ్వంసం సృష్టించడం వల్లనో మా గ్రహానికి ఒనగూడే ప్రయోజనం ఏముంది? మీరే ఆలోచించండి. మేం నిరపరాధులం. మమ్మల్ని శిక్షించడం అన్యాయం, అధర్మం” అన్నాడు అయాన్ష్.
కొన్ని నిమిషాల సేపు ఓసిరస్ తన మంత్రులతో సైనికాధికారులతో మంతనాలు జరిపాక, ఏలియన్స్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ, “మీరు చాలా శక్తివంతమైన ఆయుధాలని మా గ్రహంలోకి తీసుకొచ్చి, మాకు కన్పించకుండా దాచిపెట్టారు. మీరు మా గ్రహానికి నష్టం కలుగచేయాలనే దురుద్దేశంతోనే వచ్చారని మేము నమ్ముతున్నాం. మీ సంజాయిషీ ఓ కట్టుకథ తప్ప నమ్మతగింది కాదని మా మంత్రిమండలి తీర్మానించింది. మీకు మరణ దండన విధించవల్సిందేనని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ గ్రహాధినేతగా మీకు మరణ దండన విధిస్తున్నాను. మీరు తెచ్చిన లేజర్ గన్స్‌నే మీ మీద ప్రయోగించి, మరణ శిక్షని అమలు పరచాల్సిందిగా సైన్యాధ్యక్షుల వారిని ఆదేశిస్తున్నాం” అన్నాడు.
సైన్యాధ్యక్షుడి వైపు తిరిగి, “మరణశిక్షను వెంటనే అమలు చేయవద్దు. రేపటినుంచి మూడు రోజుల అధికారిక పర్యటన కోసం మా అన్నగారిని ఆహ్వానించిన విషయం మీకు తెలుసు కదా. వారు చాలా సున్నిత మనస్కులు. వారు మన గ్రహంలో విశ్రాంతి తీసుకునే మూడు రోజులు ఈ ఏలియన్స్‌ని కారగారంలో బంధించి ఉంచండి. వారు తిరిగి తమ గ్రహానికి వెళ్ళిపోయిన తర్వాత శిక్షను అమలు పర్చండి” అన్నాడు.
(ముగింపు వచ్చే వారం)