[పాలస్తీనా యుద్ధం మీద మౌమితా ఆలం రచించిన కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Moumita Alam’s poem by Mrs. Geetanjali.]
~
[dropcap]యు[/dropcap]ద్ధం జరిగే చోటు అది!
అక్కడి కుళాయిలు తెరిచే ఉన్నా
వాటిలో నుంచి చుక్క నీరు కారదు!
అక్కడ యుద్ధం చేసే వాళ్ళకి మాత్రం
రొట్టెల నుంచి నీటి దాకా అన్ని సౌకర్యాలు ఉంటాయి.
వాళ్ళందరూ ఏకచత్రాధిపత్యం చేసే తెల్ల దొరలు మరి!
అయినా పిల్లల గురించి ఎవరికి పట్టిందని?
ఇదేమి తెలీని అమాయకమైన..
చిన్ని చిన్ని మొఖాలేసుకున్న పిల్లలందరూ
ఒక చోట.. కొత్తగా నేర్చుకున్న ఆటలను ఆడే ప్రయత్నం చేస్తుంటారు.
మిగతా పిల్లలను తొందరగా ఆటకి రమ్మని అరుస్తూ.. పిలుస్తుంటారు.
ఎవరికి తెలుసు.. ఏ లాంచర్‌కి ఏ పేరుందో..?
దూరాన ఉన్న ఒక పాప.. తన చిన్నారి బొమ్మను దీక్షగా కాగితంపై వేస్తుంటుంది.
ఆమెకేమీ తొందర లేదు మరి!
బొమ్మ వేస్తున్న ఆమె చిట్టి వేళ్లు..
బొగ్గు ధూళితో దుమ్ము కొట్టుకుని ఉంటాయి.
అప్పుడున్నట్లుండి ఒక విస్ఫోటనం..
పేలుడుతో అక్కడి పిల్లలు కకావికలమై
తలలు కిందకి చేసి దాక్కోమని కేకలు వేస్తుంటారు..
అక్కడ చేరిన బొమ్మలు వేసే పాపతో కూడా
తల కిందికి చేస్కో అని అరిచి మరీ చెప్తారు.
అప్పుడా పాప “చనిపోయిన మన పిల్లల బొమ్మలు వేస్కోడానికి
స్వర్గంలో ఏమైనా కాగితమ్ముక్క దొరుకుతుందా” అని ఆశగా అడుగుతుంది!
మిగతా పిల్లల దగ్గరే కాదు.. ఎవరి దగ్గరా సమాధానం లేదు ఆ ప్రశ్నకి!
~
మూలం: మౌమితా ఆలం
అనుసృజన: గీతాంజలి