కాజాల్లాంటి బాజాలు-2: చప్పట్లు కొట్టాల్సిందే…

    4
    3

    [box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

    [dropcap]ప్ర[/dropcap]స్తుతం మనం అంటే సామాన్య ప్రజలందరం వ్యాపారస్తుల చేతుల్లో కీలుబొమ్మలం అయిపోయినట్టు అనిపిస్తోంది.  ఉదాహరణకి పెట్రోల్ ధరలు పెరిగాయనుకోండి, అమ్మకానికున్న ప్రతి వస్తువు ధరా పెరిగిపోతుంది. అదేంటని అడిగితే ట్రాన్సుపోర్ట్‌కు ఆమాత్రం అవదా అంటూ మన నోరు మూయించేస్తారు.

    అదేకాదు. మన గవర్నమెంటు పర్యావరణం దృష్ట్యా పల్చటి ప్లాస్టిక్‍బేగులు వాడకూడదని వాటి మీద నిషేధం విధించింది. అలాంటి కవర్లు వాడిన షాపులవాళ్లకి ఫైన్ వేస్తున్నారు. మరి వ్యాపారస్తులు దళసరి బ్యాగులు ఇవ్వాలి కదా… అబ్బే ఇవ్వరు. వాటికి ధర ఎక్కువవుతుందిట. ఇది కారణంగా తీసుకుని కొంతమంది వ్యాపారస్తులు ఆ కవర్లకి కూడా ఒక రేటంటూ పెట్టేసారు. మీ బ్యాగు మీరే తెచ్చుకోండంటూ గోడలమీద కాగితాలు అంటించేస్తారు. ఒకవేళ ఎవరైనా బ్యాగు తీసికెళ్ళకపోతే చిన్న బ్యాగుకయితే 5 రూపాయలు, మధ్యస్థంగా ఉన్నదానికి 8 రూపాయలు, ఇంకాస్త పెద్దదానికి 10 రూపాయలు మనతో చెప్పి మరీ బిల్లులో కలిపేస్తారు. ఇదెక్కడి న్యాయం!

    ఇవాళ సరిగ్గా అలాంటి సంఘటనే నాకు తారసపడింది. ఆ షాపులో ఒక గృహిణి చేసిన పని నాకెంత నచ్చేసిందంటే, మీకందరికీ చెప్పకుండా ఉండలేనంత.

    సాధారణంగా అందరం నెలకొకసారి ఇంటికి కావల్సిన సామాన్లు తెచ్చేసుకుంటుంటాం. ఈ మధ్య ఆన్‍లైన్ షాపింగ్ వచ్చాక షాపింగ్ మరీ ఈజీ అయిపోయింది. కానీ, ఎన్ని తెప్పించుకున్నా ఎప్పుడో ఒకసారి పనిమీద బయటకెళ్ళినప్పుడు ఏ షాప్ దగ్గరో ఆగి అత్యవసరమైనవి కావల్సినవి కొనుక్కునే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాగే ఇవాళ నేను కూడా ఒక ఫంక్షన్‌కి వెళ్ళి వస్తూ, ఇంట్లోకి అర్జంటుగా కావల్సినవి తెచ్చుకుందుకు దారిలో వున్న ఓ సూపర్ బజార్‌కి వెళ్ళాను. కావల్సిన సరుకులు కొనుక్కుని, కౌంటర్ దగ్గర బిల్లు వేయించుకుందుకు నిలబడ్దాను. అస్తమానం సరుకులు పెట్టుకుందుకు సంచీలు హాండ్‍బ్యాగులో  పెట్టుకు వెళ్ళలేం కదా! అందుకని నేను కొన్న సరుకులకి ఏ ధరలో ఉన్న ప్లాస్టిక్ బ్యాగు తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఒకవైపు అనవసరంగా డబ్బులు పెట్టి బ్యాగు కొనాల్సి వస్తోందన్న బాధని, “ఏం చేస్తాం… ఈ రోజు మనకిలా డబ్బులు వృథా చెయ్యమని రాసిపెట్టుంది” అనే వేదాంత ధోరణిలో పడేసాను.

    ఇంతలో నా ముందు ఒకావిడని సామాన్లు పెట్టుకుందుకు ప్లాస్టిక్ బ్యాగ్ కావాలా అని అడుగుతున్నాడు కౌంటర్‌లో అబ్బాయి. ఈవిడ సరే ఇమ్మంది. తీరా చూస్తే ఆ బ్యాగు మీద ఆ షాప్ పేరు, అడ్రసు, ఫోన్ నంబరు ప్రింట్ చేసున్నాయి. అలా చేసున్నాయి కనక, అది వాళ్లకి పబ్లిసిటీలా ఉపయోగపడుతుంది కనక, ఆ బ్యాగుకి చార్జి చెయ్యొద్దంది ఆ గృహిణి. “అబ్బే, అలా పనికిరాదు, బ్యాగుకి 10 రూపాయలూ ఇవ్వాల్సిందే” అంటాడు కౌంటర్ లో అబ్బాయి. “అలాంటప్పుడు మీ షాప్ పేరు లేనిది, ప్లెయిన్‌గా ఉన్న బ్యాగ్ ఇవ్వండి, డబ్బులు కడతాను, అదైతే మేం ఎవరికైనా ఏమైనా ఇవ్వడానికి కూడా ఉపయోగించుకోవచ్చు, మీ షాప్ పేరున్నదయితే మా కింకెందుకూ పనికిరాదు. ఇంట్లో బోల్డున్నాయి ఇలాంటివి” అంటుంది ఆవిడ.

    “ప్లెయిన్‌వి లేవు, ఇవే ఉన్నాయి, ఇవి కూడా డబ్బులు కడితేనే ఇస్తాం” అంటాడతను.

    ఆవిడ సబబుగానే మాట్లాడుతున్నట్టనిపించింది. వాడి షాప్ పబ్లిసిటీకి మనం ఎందుకు డబ్బులు పెట్టాలి!  ఆవిడ తీసుకున్న సామాన్లు చూసాను. ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగులో పట్టేటన్ని ఉన్నాయి. మామూలుగా రెండు చేతుల్లోను పట్టుకుని తీసికెళ్ళడం కుదరదు. ఇప్పుడీవిడ డబ్బులు పెట్టి ఆ బ్యాగు కొంటుందా… లేకపోతే ఆ సామాన్లు కొనకుండా వెళ్ళిపోతుందా అని కుతూహలంగా చూస్తున్నాను.

    ఆవిడ పక్కనున్నావిడ “ఎందుకండీ పదిరూపాయలకి గొడవ, అందరూ ఇటే చూస్తున్నారు” అంటోంది నెమ్మదిగా. నిజమే… అందరి దృష్టీ అటే వుంది. అదేమీ పట్టించుకోకుండా ఆ గృహిణి చుట్టూ చూసింది. కాసేపు ఆలోచించింది. తను తీసుకున్న సామాన్లవంక చూసింది. వెంటనే ఆ సామాన్లున్న కార్ట్ తోసుకుంటూ ఆ మాల్‌లో ఉన్న కూరగాయల సెక్షన్ వైపు వెళ్ళింది. అక్కడ కూరలు ఏరుకుని వేసుకుందుకు ప్లాస్టిక్ బ్యాగ్ రోల్స్ ఉన్నాయి. అంతే… ఆ రోల్స్ నుంచి పర పరా ఓ అయిదారు బ్యాగులు చింపింది. ఈ సామాన్లన్నీ ఆ బ్యాగుల్లో పెట్టేసింది. ఆ బ్యాగులున్న కార్ట్ తోసుకుంటూ కౌంటర్ దగ్గర కొచ్చి, “బిల్లు ఎంతైంది?” అంది. తెల్లబోయి చూస్తున్న ఆ మాల్‌లో వాళ్లని చూస్తూ, “మీకేనా తెలివుందీ? మాకూ ఉంది..” అంటూ ఆ సామాన్లకి బిల్లు కట్టి ఆ కవర్లు తీసుకుని వెళ్ళిపోయింది.

    నాకైతే ఆవిడ సమయస్ఫూర్తి ఎంత నచ్చేసిందో… నిజమే కదా… ఇలా మనకే తెలీకుండా ఎంతమంది ఊళ్ళో వాళ్ల డబ్బులన్నీ మనమే కడుతున్నాం? అలాంటి గృహిణులు వీధి కొకరుంటే ఎంత బాగుండును అనిపించింది. ఆవిణ్ణి మెచ్చుకుంటూ గట్టిగా చప్పట్లు  కొట్టాలనిపించింది. కానీ చాలామందిలాగే నేను కూడా చుట్టూ నలుగురూ ఏమనుకుంటారోనని అనుకుంటూ చేతులు కట్టేసుకున్నాను.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here