చప్పట్లు మెషీన్లు ఇక తెప్పించాల్సిందే

1
2

[dropcap]వే[/dropcap]దిక ధగధగా మెరుస్తోంది
విద్వద్దీపాల వెలుగులో
ఆహ్వానం పలికిన అందమైన గొంతు
అతిథుల్ని పరిచయం చేసి మెల్లగా తప్పుకుంది
ఆసీనమైన ప్రతి అతిథి గొంతూ
గొంతు సవరించుకోంటోంది గట్టిగా మాటాడేందుకు,
పదునుబెట్టుకొంటోంది కంఠాన్ని ఖంగున మోగేందుకు

తలపుల తలుపులకు తాళాలేసేసి
వినేందుకై వినయంగా కూచున్నాయి
తలలన్నీ వేదిక ముందే…
ప్రతి తలకూ వినేందుకు చెవులున్నాయి
వాటితో పాటు చేతులూ ఉన్నాయి

పెద్ద దిక్కులాంటి గొంతు
ముక్తసరిగా నాలుగు ముందుమాటలు చెప్పి
ముగిస్తున్నానని చెప్పి
ఎందుకో… ఆశగా ఎదురు చూసింది
నిరాశగా కూర్చుండి పోయింది

వంతవంతుగా గొంతులన్నింటితో
పద్దతిగా మాటాడిస్తూనే ఉంది…

ప్రతి గొంతూ
తనవంతు మాటలు బాగానే చెప్తోంది
మనసుకు హత్తుకుపోయేట్టుగాను
మెదళ్ళో ఇంకిపోయేట్టుగాను
చెవుల తుప్పు వదిలి పోయేట్టుగాను

బల్లగుద్ది చెపుతోన్న గొంతొకటైతే
కొంగుబిగించి చెబుతోంది మరోటి
మీసం మెలేసి చెప్పిన గొంతొకటైతే
వీరావేశంతో ఊగిఊగి పోయిందొకటి

తన మాటల ముగింపులో ప్రతిగొంతూ
ఆశగా ఎదురుచూసింది, దేనికోసమో…
అది తీరక,
నిరాశగానే నిట్టూర్పు వదిలింది

ముక్తాయింపు మాటలతో
ముగింపు ముచ్చట తీర్చేసింది పెద్దదిక్కైన గొంతు
తనవంతు ఆశచావక
తలలవంక మరోసారి చూసి చూసి
నిరాశతో నిశ్చేష్టగా కుర్చీలో కూలబడిపోయింది

తన్మయత్వంతో ఎదుటనున్న
తలలన్నీ ఊగుతూనే ఉన్నాయి
విషయాన్నంతా వినయంగా వింటూనే ఉన్నాయి
కొండొకచో సెల్ఫోన్లతో
ఫోటోలూ, సెల్ఫీలు తీసుకుంటున్నాయి

కానీ

చేతులకు మాత్రం చేతులు రావట్లేదు
చప్పట్ల చప్పుళ్ళు ఏమాత్రం వినరావట్లేదు
ఏదో ప్రొహిబిషన్ ఉన్నట్టుగా
చేతులన్నీ ముడుచుకు కట్టేసుకున్నాయి

ప్రశంసల జడివానలో తడిసి
సంతోషంతో సగంబలం
పొందుదామనుకున్న గొంతులన్నీ
అర్ధబలంతోనే ఉసూరుమన్నాయి

చప్పట్ల చప్పుళ్ళతో
దద్ధరిల్లుదామనుకున్న వేదిక
వెలవెలాబోయి వెర్రిమొహం వేసింది

చేతులు చప్పట్లు కొట్టేట్లు కనిపించటంలేదు
చప్పట్లు మెషీన్లు ఇక తెప్పించాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here