[dropcap]చా[/dropcap]వా శివకోటి గారి నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.
1. రైతు
రైతంటే ఎవరు?
నేల కడుపుకొట్టి
మన కడుపు నింపేటోడు
భూమి ముంగల మేరువు
సంతన గంగిగోవు
ముగతాడున్న దుక్కెటెద్దు
తను ఆకటిన చస్తూ
మన ఆకలిని తీర్చే
ఆనామకుడు. బాంచినోడు
2. విదేశీ వస్తు బహిష్కరణ
విదేశీ వస్తు బహిష్కరణ
నాటి గాంధీది
విదేశీ వస్తు ఆవిష్కరణ
ఆయనొదిలేసిన ఖద్దరు టోపీలది
3. జయాపజయాలు
జయాపజయాలు దైవాధీనాలంటారు
ఇప్పుడు మాత్రం అవి ధనాధనాలు
పేదోడి అజా గళ స్థనాలు
4. యుద్ధమంటే
యుద్ధమంటే దున్నమీద వానకాదు
సాకృతిని చంపే సాకార వ్యాపారం
ఆక్రందన ఆకలి కాటకం
మానవతా వలువలూడ్చి అమ్మడం