[dropcap]కెం[/dropcap]జాయరంగు నీలినీలి ఆకాశంలో
సంజెవెలుగులు సెలవులు తీసుకుంటుంటే
దిగంతాల తలుపులు తెరుచుకుని
కొండల మలుపుల్లోంచి కనుమల దారుల్లోంచి
రేయికొలువుకు వేళయ్యిందని
వడివడిగా వచ్చేస్తుంటుంది చీకటి
తూరుపు గోడతో మొదలెట్టి
దిక్కుదిక్కును నలుపురంగుతో మేగేస్తోంది
ఆకాశంకప్పునుండి నుసిలాగా రాల్చేస్తూ
కళ్ళముందర మసిపరదాలు కట్టేస్తోంది
పగలంతా
వెలుగుతో అంటకాగిన వేడిమిని
సాదరంగా సుదూరంగా సాగనంపుతూ
చక్కదనాల చల్లదనానికి
సమ్మోహన స్వాగతాన్ని అందిస్తోంది
వెలుగు పరదాల వెనుకన నక్కిన
తళుకుబెళుకుల చెమక్కు చుక్కలను
వెతికి వెతికి వెలుపలికి తెచ్చి
అంచులులేని ఆకాశం కప్పుమీద
అక్కడక్కడా అతికించి అలంకరిస్తోంది
తిరిగి తిరిగి పగలంతా
అరిగి కరిగి అలసిన సొలసిన శరీరాలను
లయబద్దంగా జోకొడుతూ
మౌనసంగీతపు జోలపాటలు పాడుతూ
నింపాదిగా నిశ్చింతగా నిదురపుచ్చుతోంది
రాతిరి కాపలా అంతా తనదే అనుకుంటూ
రంగులకు చిక్కకుండా నలుపునే నమ్ముకుంది
అస్తమయానికీ ఉదయానికి మధ్య
లోలకం కదలికల్లో కాలాన్ని ముందుకుతోస్తూ
లోకం లావాదేవీల్లో అంటీముట్టనట్టు ఉంటోంది
కాలంగోళపు చెరోసగాన్ని ముందుకు తోసేందుకై
వెలుగుతో విడాకులు తీసుకున్న వెఱ్ఱిమొహంది
పాపం చీకటి… ఎప్పటికీ ఒంటరిదే!