చీకటి మనిషి

0
3

[శ్రీ విశ్వజిత్ ‘సపన్’ హిందీలో రాసిన కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు డా. సుమన్‌లత రుద్రావజ్ఝల.]

[dropcap]ఆ[/dropcap]కాశంలో అసంఖ్యాకంగా నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఆయన ఒకసారి సప్తర్షి మండలంలోని త్రిభుజాన్ని చతుర్భుజాన్ని చూస్తే, మరోసారి వృశ్చికంలోని సర్పాకార వలయాలను చూస్తున్నారు. ఒకటి ఉత్తరాన ఉంటే, మరొకటి దక్షిణ దిశగా ఉంటాయి. వాటి కలయిక ఏనాటికీ సాధ్యం కాదు. ఆయన మంచంపైన పడుకునే ఆలోచిస్తూ, ఒత్తిగిల్లటానికి ప్రయత్నించినా, కాని సాధ్యపడటం లేదు. గొంతుక కూడా ఆర్చుకుపోతోంది. ఇంతకుముందే చెంబు నిండా నీళ్లతో గొంతుక తడుపుకున్నారాయన. మళ్లీ ఎండిపోతూ ఉంది. మంచంలోంచి లేవాలని, దాహాన్ని తీర్చుకోవాలనుకుంటున్నా, లేవలేకపోతున్నారు. ఆకాశంలో పరుచుకున్న అసంఖ్యాకమైన నక్షత్రాలు ఆయన నిస్సహాయతను చూసి నవ్వుతున్నాయనిపిస్తుంది. తన నిస్సహాయతను చూస్తే తనకే కోపం వస్తోంది. మరోసారి ఆయన తన పూర్తి బలాన్ని పెట్టి లేచేందుకు ప్రయత్నించినా, ఈసారి కూడా ఆయనకు నిరాశే ఎదురయింది. నేనెందుకు లేవలేకపోతున్నాను అనుకున్నారాయన. ఏమయింది నాకు? పక్షవాతం రాలేదు కదా? మనసులో ప్రశ్న తలెత్తుతోంది.

‘ఇది సార్వకాలిక సత్యం బోసుబాబూ!’

ఇది మిశ్రాగారి కంఠస్వరంలా ఉందే. ఇంత రాత్రయ్యేక ఈయన ఇక్కడ ఏం చేస్తున్నట్లు?

‘కంగారు పడకండి బోసుబాబు. ఈ యథార్థాన్ని గురించిన అవగాహన అందరికీ ఉండాలి!’

నిజంగానే మిశ్రాగారి గొంతుకే! తన జ్ఞానంతో నన్ను ప్రభావితుడిని చెయ్యాలని వచ్చారు. మరో సమయం దొరకనట్టు ఈ సమయంలో వచ్చిపడ్డారు!

‘నక్షత్రాలను గురించి చెప్పేదేమంటే..’ మిశ్రాగారి గొంతుక ఖంగుమంది. ఆయన తనకున్న పరిజ్ఞానంతో ఎప్పుడూ బోసుబాబు, నన్ను ప్రభావితం చెయ్యాలనుకుంటారని భావిస్తారు. హ! హ! హ! అన్న అట్టహాసం గట్టిగా వినిపించి, ఆయనను విస్మయానికి గురి చేసింది. ‘మిశ్రాగారు ఎప్పుడూ ఇలా నవ్వరే! ఎవరు చెప్మా?!!’

హ! హ! హ! అంటూ తిరిగి అదే అట్టహాసం!

ఎవరు నువ్వు?.. చెప్పవేం?..

బోసుబాబు శరీరం మంచంలో పూర్తిగా కూరుకుపోయింది.

ఆయన ఆకాశం వంక చూడక తప్పని పరిస్థితి. వృశ్చికం, సప్తర్షిమండలాల విశాల ఆకారాలు నెమ్మదిగా జారుకుంటున్నాయి. ఒకదానివైపు ఒకటి ఆకర్షింపబడతాయి. ఆయన అనుకుంటారు, ఈ అసంభవం ఎలా సంభవించగలదని? క్షణక్షణానికీ దృశ్యం మారిపోతోంది. నభో మండలమంతా మారుతోంది. ఆయన దాహం మాత్రం అలాగే ఉంది. కాని ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉండిపోవాలన్న కోరిక, దాహాన్ని తీర్చుకోవాలన్న భావాన్ని ఆపుతోంది. ‘సుధా! ఓ సుధా!’ బోసుబాబు కేక వేసే ప్రయత్నం చేశారు. సుధ కూడా ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడాలని ఆయన కోరిక. ఆమె ఆయన జీవిత సహచరి. ఆమెను తోడు తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది. కాని, గొంతుకలోంచి శబ్దం రాదేం? తన గొంతుక పోయిందా? ఇక ఎన్నటికీ తను మాట్లాడలేదా? ‘హ! హ! హ!’ తిరిగి అదే అట్టహాసం ప్రతిధ్వనించింది.

‘అయ్యో! నేను లేవలేకపోతున్నాను. నేను మాట్లాడలేకపోతున్నాను. కేవలం వినగలుగుతున్నానంతే! నన్ను ఇబ్బంది పెడుతున్న ఈ నవ్వు ఎవరిది? నేనెక్కడ ఉన్నాను? నాకేమయింది? ఆయనకు ఆయాసం వస్తోంది. ఆకాశం ఆయన ఈ నిస్సహాయతను చూసి నవ్వుతోంది. కాని ఆయన ఏం చెయ్యలేకపోతున్నారు. బహుశా తన ఆత్మబలం క్షీణిస్తోందేమో! ఉహు! దీనిని క్షీణించనివ్వకూడదు! అన్న నిశ్చయంతో ఆయన ఆఖరుసారి ఒక ప్రయత్నం చేసి, లేచి కూర్చున్నారు. గదంతా అంధకారం పరుచుకుని ఉంది. పక్కన సుధ గాఢనిద్రలో ఉంది. ఆయన తన శ్వాసను నియంత్రించుకుని, మెల్లగా అడుగులు వేసుకుంటూ కూజా దగ్గరకెళ్లి గ్లాసుడు నీళ్లు గడగడ తాగారు. ఇక నడుం వాల్చినా నిద్ర రాదు. లేచి కిటికీ తెరిచారు. తాజా గాలి తాకి, ఆయనకు హాయిగా అనిపించింది.

ఆయన మనసులోనే అనుకున్నారు – బహుశా కిటికీ సుధ మూసి ఉంటుంది. నేను తెరిచే పడుకుంటానే! ఎదురుగా కరెంటు స్తంభానికి ఉన్న బల్బు మిణుకుమిణుకుమంటోంది. ఆయన గదిలోనే అటూ ఇటూ పచార్లు చేస్తూండిపోయారు.

ఈరోజు సూర్యాన్ని కలవటానికి వెళ్లాలి. గత నెల్లాళ్లుగా డీ-ఎడిక్షన్ సెంటరులో తనకు చికిత్స జరుగుతోంది. సుధ కూడా వెళ్లాలని పట్టుబడుతోంది. తననూ తీసుకుని వెళ్లాలి. ఆఫీసుకు ఫోను చేసి ఇవాళ సగం రోజు శలవు కావాలని చెప్పాలి.

మిశ్రాగారు చెప్పింది నిజమే! ఒకసారి మత్తుకు అలవాటయితే కష్టమే! కిందట ఏడాది కూడా వేలరూపాయలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు. సూర్యం ఎంత బాగుపడ్డాడు? మునుపటి సూర్యమే అనిపించాడు. అతడి ఆరోగ్యం కూడా బాగుపడటం మొదలయింది. ఎప్పుడూ ఏదో ఒకటి నవ్వు వచ్చే విధంగా సంభాషించేవాడు. ఎంతో తెలియదు..

ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. లేని పక్షంలో తిరిగి వాళ్లు మత్తుకు బానిసలవుతారు! సెంటరును స్థాపించిన మానసిక రోగ నిపుణుడయిన రామావతార్ సిన్హా జాగ్రత్తలు చెప్పేరు.

‘ఇది పరిశోధించవలసిన విషయమే! పరిశోధనలవుతున్నాయి కూడా! అందుకే నూటికి నూరుపాళ్లు ఏవిషయాన్ని చెప్పటం సాధ్యం కాదు. ఎన్నో విషయాలను గురించి అంచనా వేసుకోవాలంతే!’

నిజమే కదా! బోసుబాబు కూడా ఇలాటి అంచనాలపైనే జీవిస్తున్నారు కదా! ‘సాధారణంగా ఇలాటివారు సెంటరునుండి బైటకు వచ్చాక పూర్తిగా బాగుపడ్డామన్నభావంలో ఉంటారు. తమను, ఈ మత్తుకు బానిసలుగా కాకముందు ఎలా చూసేవారో, అలా తమను నమ్ముతూ చూస్తారని ఇప్పుడిక తాము ఎదుటివారికి ఏవిధంగానూ ఇబ్బంది కలిగించని రీతిలో ప్రవర్తించం గనక తమని నమ్ముతారని అనుకుంటారు. తమకు వెంటనే పూర్వంలా బాధ్యతలన్నీ కూడా అప్పజెప్పేస్తారని కూడా విశ్వసిస్తారు. వారి మనోభావాలను అవసరానికి మించి మన్నించటం జరుగుతుందనుకోవటం లాటి ఎన్నో విధాలయిన కోరికలు హెచ్చవుతాయి కూడా! అలా కాని పక్షంలో మరింత తీవ్రంగా వారి మనసు గాయపడి, తిరిగి అదే వ్యసనం వైపు ఆకర్షితులవుతుంటారు.’

ఆయన చెప్పింది నిజమే! సూర్యం మళ్లీ మత్తుకు లోబడ్డాడు. ఎలా నమ్మెయ్యగలం? ఎలా స్వతంత్రాన్నిచ్చెయ్యటం? సుధకు పెళ్లికి పెట్టిన నగలు ఇక ఆమె వద్ద మిగలలేదు. సూర్యం అన్నీ అమ్మేశాడు. పోలీసుల వద్ద రిపోర్టు చెయ్యకపోవటమే మంచిదయింది, లేకపోతే ఇంట్లోనే దొంగ దొరికేవాడు. అప్పుడిక పరువు ఏం మిగులుతుంది? ఎవరికీ ముఖం చూపించుకోలేని దుస్థితి ఏర్పడేది.

అనవసరంగా సోనూబాయి ఎన్నిసార్లు అవమానానికి గురి కావలసి వచ్చింది? తనపైనే కదా నిందలన్నీ పడ్డాయి. తను ఎంతేడ్చి మొత్తుకున్నా, బీదవారి మాట వినేదెవరు?

బోసుబాబు ఇది తను చేతులారా చేసుకున్న తప్పుకు ఫలితమే అనుభవిస్తున్నాని నిశ్చయించుకున్నారు. సుమారు 20 ఏళ్ల కిందట ఆయన ప్రభావంలో పడి కొట్టుకుపోయారు. స్నేహితులతో పందెం కాయటంలో వెనక ముందు ఏం చూసుకోలేదు. మొదట భంగు, అటుపైన గంజాయి అలవాటు ఎంతలా అయిందంటే వాటికి పూర్తిగా దాసోహం అన్నారు. ఆ పరిస్థితిలో ఆయనకూ ఏమి అర్థమయేది కాదు. అయితే దృఢమైన మనస్సంకల్పం ఉన్న మనిషి కావటం వలన ఆ చెడలవాటును వదిలించుకోగలిగారు. ఈరోజు సూర్యం కూడా అటువంటి దృఢమైన మనసువాడయితే ఎంత బాగుండును?

‘ఇది వంశపారంపర్యం కూడా! తల్లి-తండ్రులలో ఎవరయినా మత్తుకు బానిస అయితే రాబోయే తరంలో వారు కూడా దానికి లోబడే అవకాశం ఉంది!’

సెంటరులోని స్పెషలిస్టు స్వయంగా చెప్పిన మాట ఇది. బోసుబాబు ఏనాడూ తన వ్యసనాన్ని గురించి బైట మాట్లాడకపోయినా తనను తాను దోషిగా భావించుకుని కుమిలిపోతున్నారు. బైటకు మామూలుగా కనిపిస్తున్న బోసుబాబు, మనసులో మనసులోనే తీవ్రమయిన పశ్చాత్తాపాగ్నిలో కాలిపోతున్నారు.

‘పదండి! నేను సిద్ధం!’ అను సుధ గొంతు విని ‘హు!’ అంటూ చెప్పులు వేసుకున్నారు.

కొత్తచీర కట్టుకున్న సుధ ఈ రోజు ఎంత అందంగా ఉంది. తన ముత్యాల హారం కూడా మెడలో వేసుకుని ఉంటే ఎంత బాగుండేది! ఒక్కసారి మాత్రమే తను అది కొనగలిగాడు. తక్కినవన్నీ తనకి పెళ్లినాటి నగలే కదా! ఆయనకు బాగా గుర్తు, హైదరాబాదులో చార్మినారు చూడటానికి వెళ్ళినప్పుడు సుధ వద్దని వారిస్తున్నా ముత్యాలహారం, గాజులు, ముక్కుకు వత్తు చెవులకు జంకాలు కొన్నారాయన. సూర్యం ఒళ్లో పిల్లాడు. ఆ తర్వాత సుధ ఏనాడూ ఏ వస్తువు అడగలేదు. ఎలా అడగగలదు? తన భర్తకు నగలు, ఆభరణాలు కొనేంత ఆదాయం లేదని ఆమెకు బాగా తెలుసు. అటుపైన సూర్యాన్ని గురించి తప్ప ఆమెకు మరొక ఆలోచనే ఉండేది. కాదు. సూర్యం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే బాగుండునన్న ఆలోచనతప్ప మరొక ధ్యాసే ఉండేది కాదు. చెప్పాలంటే పెళ్లి చెయ్యటానికి కూడా తయారీలు ప్రారంభించింది. కోడలి కోసమే ఆమె నగలన్నీ దాచి ఉంచింది.

‘సూర్యం ఎంత చిక్కిపోయేడో కదా!’ అన్న సుధ మాటలతో ఇంటికి వస్తున్నప్పుడు బోసుబాబు గారు ఆలోచనల నిద్రావస్థ నుండి మేల్కున్నట్లయ్యారు.

సెంటర్లో ఆయన మౌనంగానే ఉన్నారు. మాట్లాడేందుకు ఏముంది గనక? మాట్లాడి ప్రయోజనమేంటి? సుధ అయితే ఏడుస్తూనే ఉంది. ఆమె మనసులో పాపం ఏమీ లేదు గనక ఏడ్చి మనసు భారాన్ని దింపుకోగలదు. కొడుకు జీవితం నరకమయింది. తల్లిదండ్రుల కన్న హెచ్చు ఎవరు గ్రహించగలరు?

సుధ వెక్కుతూ అంది – ‘మనం ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే మనం ఒక్కగానొక్క కొడుకును వదులుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది!’

‘నువ్వు చెప్పేది నిజమే! కాని మనమేం చెయ్యగలం చెప్పు? చెయ్యవలసినది సెంటరు వాళ్లు చేస్తూనే ఉన్నారు కదా! మన చేతిలో ఏం లేదిక!’

‘నేను వైద్యం గురించి అనటం లేదు, అది క్రితంసారీ అయింది కద!’ బోసుబాబు గారికి తల్లి హృదయమలా మాట్లాడిస్తోందని అర్థమయింది. ఆయనయితే పూర్తిగా ఆశలు వదులుకున్నారు.

డా. సిన్హా గారు ఆయనను వేరే తీసుకువెళ్లి చాలా స్పష్టంగా చెప్పారు. ‘తన శరీరం తన చెప్పుచేతలలో లేదు. మనసు ముందునుంచే వ్యతిరేకంగా ఉంది. మీరు అతనికి తండ్రి గనక ఏ విషయాన్నీ దాచటం న్యాయం కాదు. నిజానికి అతని పరిస్థితి ఏం బాగులేదు. మరో కొద్దిరోజులు ఇలా మత్తుపదార్థాలు సేవిస్తే, అతడు బతకటమే కష్టమవుతుంది!’

జీవితం అన్నది ఏదో ఒక ఆశ మీదే నిలుస్తుంది. ఆయన కూడా అలాటి ఆశ మీదే జీవిస్తున్నారు. సుధకు నిజం చెప్పలేక కేవలం భరోసా ఇవ్వటం చేస్తూంటారాయన.

సెంటరు వాళ్లు, బాధితుడిని ఆ వాతావరణం నుండి దూరంగా ఉంచాలని చెప్తే, తామెంత ప్రయత్నం చేశారు. కాని సమాజం అలా చెయ్యనిస్తుందా? ఎవరెవరి నోళ్లు మూయించగలం? తాముండే ఏరియాలో వారంతా ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయంగా భావిస్తారు.

వారందరికీ, అతడు సిరెంజితో తీసుకుంటాడా, మందు తింటాడా, తాగుతాడా లేక పీలుస్తాడా. అని తెలుసుకోవాలని మహా ఉబలాటం. వారికి ఇదొక విషయం, ఒక సంఘటన, అంతే! వాళ్లు కేవలం తెలుసుకోవాలనుకుంటారంతే! అలాటప్పుడు బోసుబాబు ఈ సమాజాన్నే దోషిగా భావిస్తే వారిదేం తప్పు అనుకోవాలి?

సుధ నిజమే చెప్పింది – తమ కొడుకు – తమ రక్తం. అతడి కోసం ఏమయినా చెయ్యాలి. లోకంతో మనకేం పని? వారికి మనమంటే లెక్కలేనప్పుడు వారిని మర్చిపోయినా తప్పేం లేదు. ఆఖరికి సమాజం ఎవరికి ఉపయోగపడుతుంది? బహుశా ఎవరికీ లేదేమో! ఇచ్చకాలు ఆడేవారి గుంపుతో నిండి ఉంది – అంతే!

ఈసారి మనం అతడిని మన ప్రేమలో ఎంత ముంచెద్దామంటే అతడికి మత్తు అన్నమాటే గుర్తు రాకూడదు ఎప్పటికీ! ఆనాడు సూర్యం సెంటరు ఉండి వచ్చిననాడు అలాగే ఆలోచించారు. కాని అలా ఏ మాత్రం జరగలేదు. అతడు మళ్లీ సెంటరు శరణుజొచ్చవలసి వచ్చింది. ఈసారి తాము మరింత జాగ్రత్తగా ఉండాలి. సుధ అన్నీ సర్దుతోంది. అతని గది సాపు చెయ్యటం నుండి అతడి చిన్నప్పటి బొమ్మలవరకూ భద్రపరచింది. కాని, ఆ ప్రయత్నం అంతా చేసినది చేసినట్లే మిగిలిపోయింది. కారణం, మర్నాడే సూర్యం సెంటరునుండి పారిపోవటమే! ఎవరికీ ఏం చెప్పలేదు. ఏం చెప్పగలడు? తనకు మత్తు పదార్ధం అర్జెంటుగా కావాలని ఎలా చెప్పగలడు? మత్తు లభించకపోవటమన్న బాధ తీవ్రమయిందని!

మత్తు అన్నది అన్ని బాధలను మరిపింపచేస్తుంది. కేవలం ఒక్క బాధను మినహాయించి, ఆ బాధ స్వయంగా మత్తు బాధే! అలాటి సమయంలో అతడికి ఇంకేమీ గుర్తుండదు – ఇల్లు, సంసారం, తల్లిదండ్రులు, సుఖం-కష్టం వంటి బంధాలన్నీ తెగిపోయి, కేవలం మత్తుతో మాత్రమే బంధం ఉంటుంది.

సిన్హాగారి ఈ మాటలు ఎంత నిజం! బోసుబాబు తనను తాను ఓదార్చుకునేందుకు ఎంతో ప్రయత్నం చేసుకుంటారు. కాని, ఆ తల్లికి ఎలా బోధపరచగలరు? ఎన్నో నెలలు గడిచిపోయినా సూర్యం ఆచూకీ ఏ మాత్రం తెలియలేదు. పేపర్లలో ప్రకటన, టి.విలో ఫొటో, పోలీసు స్టేషన్లో రిపోర్టు వంటివేమీ పనిచెయ్యలేదు. కాలం గడుస్తున్న కొద్దీ ఆశాకిరణం మసకబారుతోంది. సుధ రోదిస్తూనే ఉంటుంది. బోసుబాబుగారిది ఏమీ చెయ్యలేని నిస్సహాయత. ఏం చేయడం? కొడుకును ఎక్కడినుండి వెతికి తెచ్చుకోవటం ఎలా?

తలుపు తట్టిన శబ్దం ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగించింది. చిన్నబోయిన మనసుతో తలుపు తెరిస్తే ఎదురుగా నిల్చిన పోలీసులను చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డారాయన. ఏదైనా..? కాదు, కాదు అవాంఛనీయమైనది ఏం జరిగి ఉండదని ఆయన తనకు తానే సర్ది చెప్పుకున్నారు.

ఊరవతల కాలవలో ఒక శవం లభించింది, దాన్ని గుర్తించడానికి వెళ్లాలి. పోలీసులకు అనుమానంగా ఉంది. ఇప్పుడిక ఆయన మనసులో కూడా అనుమానపు బీజం పడింది. ఆయన సుధకు ఏం చెప్పకుండానే పోలీసులతో బైటకొచ్చారు. తోవంతా కుదుపులతో నిండిన పోలీసు వాహనంలో కూర్చున్న ఆయన గుండె వేగంగా దడదడలాడుతూను ఉంది. కానిదేదైనా జరిగిందేమోనన్న అనుమానం మనసును పట్టిపీడిస్తూనే ఉంది. బండి దిగి మార్చురీలోకి ఎలాగో ప్రవేశించేసరికి ఆయన గుండె చప్పుడు మరింత వేగమయింది. ఊహు! భగవంతుడు మరీ అంత కఠినాత్ముడేం కాదు. ఆయన ధైర్యాన్నిచ్చుకుంటూ ముందుకు కదిలారు.

ఆ గదిలో నాలుగు దిక్కులా శవాలే శవాలు. చూస్తూంటే కడుపులో తిప్పి వాంతి వస్తోంది. అతి కష్టంమీద ఒకదాని మీద బట్ట తీసి చూస్తూనే తల తిరిగి పడిపోయారు. తెల్లటి బట్టలో చుట్టబడిన సూర్యం నిర్జీవంగా పడి కనిపించాడు.

‘నాన్నగారూ! నాకు చీకటంటే భయం’ అనే సూర్యం ఇవాళ ఆ చీకటితోనే జతకట్టాడు. ఎంత భయపడి ఉంటాడో కదా! ఎన్నిసార్లు తండ్రిని పిల్చిఉంటాడో కదా! బోసుబాబు తనని తానెప్పటికీ క్షమించుకోలేరు. డాక్టర్లు ఆయనకు ఆసరా ఇచ్చి నిలబెట్టారు. ఆయన అలా రాయిలా నిలబడే ఉండిపోయారు. ఆయనకు ఇకముందు చెయ్యవలసిన కర్తవ్యం బోధపడటం లేదు. శవాన్ని తీసుకువెళ్లి దహన సంస్కారం చెయ్యాలా? వద్దా? సుధ ఈ దెబ్బను తట్టుకోలేదు. ఆయన మనసు రాయి చేసుకున్నారు. కొడుకును ఎలాగో పోగొట్టుకున్నాను, సుధను కూడా ఒదులుకోలేననుకున్నారు.

‘ఇతడు నా కొడుకు కాదు’ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఆయన గదిలోంచి బైటకు వచ్చేశారు.

‘క్షమించాలి! మీకు అనవసరంగా మేము ఇబ్బంది కలిగించాము. అతడి జేబులో మీ ఆఫీసు అడ్రసు దొరికింది. వాకబు చేస్తే మీ అబ్బాయి గత కొద్ది నెలలుగా కనిపించటం లేదని తెలిసింది. అందుకే మీకు శ్రమ కలిగించవలసి వచ్చింది!’ పోలీసు అధికారి క్షమించమన్న ధోరణిలో వివరించారు.

‘లేదు – లేదు, మీరు మీ కర్తవ్యాన్ని పాటించారు. ఇందులో బాధను కలిగించే ప్రసక్తి లేదు’

‘పదండి, మిమ్మల్ని ఇంటివద్ద దిగబెడతాను’

‘మీరేం శ్రమపడొద్దు. నాకు తొందరేం లేదు, ఇంటికి వెళ్లటానికి.’

‘మీకెలా బాగుందనిపిస్తే అలాగే చేద్దాం!’ పోలీసు ఆఫీసరు కాస్త వినయంగా అన్నాడు. కాస్త ఒణుకుతున్న గొంతుకతో బోసుబాబుగారు, ‘మిమ్మల్ని ఒకమాట అడిగితే తప్పుగా అనుకోరు కదా?’ అన్నారు.

‘అడగండి, తప్పుగా అనుకునేదేం ఉంది? ముందు ఇవి ఎవరివో కనుక్కునేందుకు పూర్తిగా ప్రయత్నిస్తాం. సాధ్యమయినంతవరకూ ప్రయత్నిస్తాం. అటుపైన మున్సిపాలిటీవారికి వారి మతాన్ననుసరించి దహన సంస్కారాలు చెయ్యటానికి అప్పగిస్తాం. తర్వాత చట్టప్రకారం చెయ్యవలసిన పనులను పూర్తి చేస్తాం, కాని మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు?’

‘ఏం లేదు, ఉట్టినే ఇతడి అంత్యక్రియల్లో నేనూ రావాలనుకుంటున్నా!’

‘మీరెందుకు రావాలనుకుంటున్నారు? ఇతడితో మీకు సంబంధం లేదు కదా!’

‘ఇతడిని చూస్తూంటే కనిపించకుండా పోయిన నా కొడుకు గుర్తుకొచ్చాడు. అతడు మరణించినా ఇలా చీకటి గదిలోనే పడుండేవాడు కదా!’

బోసుబాబుగారి మనసులో బాధ ఉబికి వస్తోంది. మరికాసేపు గనక ఆయన అక్కడే ఉంటే భోరుమని ఏడవటం కాయం. ఇక అక్కడ ఉండటం న్యాయం కాదనుకుని, ఆయన కొడుకు దహన సంస్కారం ఎప్పుడు చేసేదీ, తప్పక సూచిస్తామన్న హామీ వారినుండి తీసుకుని ఆయన బరువుగా అడుగులు వేసుకుంటూ బైటపడ్డారు. ఇక అప్పుడు ఎత్తివేస్తున్న ప్రతి అడుగూ వంద మణుగుల బరువున్నట్లనిపిస్తోంది. కాని అడుగులు వెయ్యక తప్పదు.

‘మీరు బైటకు వెళ్తున్నట్లు చెప్పనే లేదు! వీధి తలుపు కూడా తెరిచే ఉంచేసేరు! ఎక్కడికి వెళ్లారింతసేపూ?’ అంటూ ఇంట్లోకి ప్రవేశిస్తూనే సుధ ప్రశ్నిస్తూపోయింది.

నిజానికి ఆయనవద్ద సరియైన జవాబే ఉన్నా, మౌనంగా ఉండవలసి వచ్చింది.

‘ఏదో కాస్తంత దూరం అలా నడచివచ్చాను. ఇంట్లో విసుగ్గా అనిపిస్తే, నాలుగడుగులు అలా నడిచి వద్దామనిపించింది?!’

‘కనీసం చెప్పి వెళ్లాల్సింది కదా! రోజులు బాగులేవు, తెరుచుకున్న తలుపులు చూసి ఎవరయినా దొంగ ఇంట్లోకి దూరి, ఏమయినా చేతికందినవి పట్టుకుపోతే?’

‘సరే-సరే! ఇకముందు ఇలా చెయ్యను. సరేనా?’ ఆయనకు మాట్లాడటం అక్కడే ఆపెయ్యాలని ఉంది. తన మనసులో భావాలు బైటపడకుండా ఉండటానికి అదొక్కటే మార్గం. కాని సుధకేం తెలియదు కదా!

‘బాగా అలిసిపోయినట్లు కనిపిస్తున్నారు, ఏమయింది?’

‘ఏం కాలేదు! బహుశా కాస్తంత ఎక్కువ నడచినట్లున్నాను. అంతే!’

‘ఎవర్నయినా సూర్యం గురించి ఏమయినా తెలిసిందేమో అడిగారా?

‘లేదు’

‘ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో కదా!’

‘ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాడు!’ బోసుబాబుగారి అంతరంగం అరిచింది.

‘పోలీసులను అడిగారా? వాళ్లు అన్ని విషయాలు తెలుసుకుంటారు కదా! నా కొడుకు గురించి కూడా తప్పక కనుక్కుంటారు. ఈరోజు ఆఫీసు నుండి వస్తూ వాళ్లని కాస్త కనుక్కుని రండి!’

‘ఈరోజు ఆఫీసుకు పోను, శలవు పెడుతున్నాను!’

‘ఏం ఏమయింది? నానుండి ఏదో దాస్తున్నట్లున్నారు. ఒంట్లో బాగానే ఉందా?’

‘బాగానే ఉంది! అనవసరంగా కంగారు పడకు!’

‘అయితే ఇవాళ సూర్యాన్ని వెతకటానికి వెళ్లాం పదండి!’

‘ఎందుకు ఇంకా ఆశలు పెట్టుకు కూర్చున్నావు? రావాలనుకుంటే ఈపాటికి వచ్చి ఉండేవాడు కదా! ఇక వాడు తిరిగిరాడు సుధా! వాడు రాడు!’

బోసుబాబుగారి కంటి నుండి అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. మనసులో పేరుకున్న భారం అంతా కరిగి కన్నీరై ప్రవహిస్తోంది.

‘అబ్బే! మీరలా నిరాశపడకండి. తప్పక వస్తాడు. అమ్మని గుర్తుకు రాగానే చూడండి మీరే ఎలా పరుగు పరుగున వస్తాడో!’

కాని సూర్యం రాలేదు. ఎలా రాగలడు? అతడు మార్చురీలో చీకటికొట్లో భయాన్నే తోడు చేసుకుని పడి ఉన్నాడు. కొడుకును చివరిసారి చూసుకుందామని సుధ కళ్లు కాయలుగాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. బోసుబాబుగారు ఈ దుఃఖాన్నంతటినీ సహిస్తూ బతకాలి. వీటన్నిటికీ బాధ్యత ఆయనదే తప్ప మరెవ్వరిదీ కాదు.

నాలుగు రోజుల తరవాత కబురు తెలిసి ఆయన సూర్యం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మున్సిపాలిటీవారు ఆయన కొడుకుని మంటలకు అందించారు. ఆయన దూరంగా చూస్తూ నిల్చున్నారు. తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఆయన దుఃఖంలో తడిసి ముద్దయ్యారు.

ఆ రాత్రి తిరిగి నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ఆయన నిస్సహాయతపైన అట్టహాసం ‘హ! హ! హ!’ అంటూ చేస్తున్నాయి.

‘ఎవరది?.. నా నుంచి ఏంకావాలి చెప్పవేం?’

‘చీకటంటే నీకు భయం కదా? మరి నీ కొడుకును ఎందుకు చీకటి కొట్లోకి? తనకీ భయమే కదా! చెప్పు, ఎందుకు పంపించావో?’

బోసుబాబుగారు ఆకాశం వంక చూసారు. సూర్యం తన రెండు చేతులనూ జాపి ఆ అంధకారాన్ని చీల్చుతూ తనవంక వస్తున్నాడు!’

‘నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదిగో చూడు మా సూర్యం వస్తున్నాడు.’

‘హ హ హ’ అంటూ తిరిగి అదే అట్టహాసం!

‘సుధా! ఓ సుధా! చూడు. మన అబ్బాయి వస్తున్నాడు. ఆకాశం నుండి దిగుతున్నాడు?’ అంటూ బోసుబాబుగారు ఉత్సాహంగా అంటున్నారు. ‘సుధా! మాట్లాడవేం?’ అరే, తనిక్కడ లేదు – ఉండు, ఇప్పుడే పిల్చుకొస్తాను! ఆయన లేవాలని ప్రయత్నించినా లేవలేకపోతున్నారు. హఠాత్తుగా సూర్యాన్ని ఎవరో పట్టుక్నుట్లు కనిపించింది. అతడు పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ పట్టునుండి విడిపించుకుందికి గిలగిలలాడుతున్నాడు.

బోసుబాబు గట్టిగా అరవాలనుకుంటున్నారు. ఆ మనిషిని చంపాలనుకుంటున్నారు. కాని గొంతుకలోంచి శబ్దమే రావట్లేదు. లేవాలని ప్రయత్నించినా లేవలేదు. చాలా దాహం వేస్తున్నట్లు తెలుస్తోంది. గొంతుక ఎండిపోతోంది. బలాన్నంతటినీ కూడదీసుకుని ఆయన కూర్చునే ప్రయత్నం చేశారు.

గదిలో ఎప్పటిలా చీకటిగా ఉంది. సుధ పక్కనే నిద్రపోతోంది. అతికష్టం మీద ఆయన కూజా వద్దకు చేరుకున్నారు. ఒక గ్లాసు నీళ్లు తీసుకు తాగినా దాహం తీరలేదు. మరొకటి, ఇంకొకటి, ఇంకొకటి గ్లాసులకొద్దీ నీళ్లు తాగినా ఈరోజు ఆయన దాహం తీరటం లేదు. ఏమయింది? దాహం ఎందుకు తీరటం లేదు? కూజాలో నీళ్లు పూర్తయాయి. ఇప్పుడేం చెయ్యటం? కొళాయిలో నీళ్లు ఇప్పుడు రావు. సరే వాకిట్లో చేత్తో కొట్టే బోరు పంపు ఉంది. ఆయన బలంగా దాని హేండిల్‌ను కొట్టారు.

గట్టిగా అరిచి సుధను పిల్చేరాయన. కళ్లు విప్పి చూస్తే ఆయన తన మంచంమీదే కూర్చొని ఉన్నారు. ఆయన శరీరం అంతా చెమటతో తడిసిముద్దయింది. గదిలో అన్నివైపులా చీకటి! పక్కన సుధ హాయిగా నిద్రపోతోంది. పడుకోవాలని ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. లేచి అటూ ఇటూ పచార్లు చేస్తూ రాత్రిని గడపటమే.

ఈ పరిస్థితి ఆయన తరుచూ ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు చుక్కలు కనిపిస్తాయి, అదే చిరపరిచితమైన అట్టహాసం వినిపిస్తూ ఉంటుంది. అటుపైన రాత్రంతా జాగారమే చెయ్యాల్సి వస్తోంది. అలా రాత్రంతా జాగారం చెయ్యటం కూడా సులభమేం కాదు.

‘ఏం సంగతి? ఈమధ్య మీ కళ్లు అంతలా వాచి ఉంటున్నాయి? భంగులాటిది తీసుకోవటం లేదు కదా!’

‘సుధా! ఈమధ్య నాకస్సలు నిద్రపట్టటం లేదు. పట్టినా, భయంకరమైన కలలొస్తాయి. కొన్నాళ్లు గాఢంగా నిద్రపోవాలన్న కోరికతో నిద్ర మాత్రలు వేసుకున్నాను. కాని అవి కూడా పనిచెయ్యకపోయేసరికి ఇక ఇప్పుడు భంగునే ఆశ్రయించేను!’

సుధకు తనేదో తప్పు విన్నాననిపించింది. రంజన్ కుమార్ బోసు తన మీద ఒట్టేశారు జీవితాంతం మత్తు పదార్థాలను వేటినీ ముట్టనని. అయితే ఇప్పుడు తను విన్నది నిజమే అయితే, కేవలం కొడుకు కోసం నిరీక్షించడానికి మాత్రమే జీవించాలి తను. ఎన్నో రకాలుగా బోధపరిచినా ఈసారి బోసుబాబు తన ఆత్మబలానికి శక్తి నివ్వలేకపోయారు.

ఇప్పుడిక ఆలస్యంగా లేవటం, ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లటం బోసుబాబు గారి నిత్యకృత్యమయింది. ఎప్పుడూ 5 నిముషాలు ముందే వచ్చే ఆయన, ఇలా ఆలస్యంగా రావటానికి కారరణం ఏమై ఉంటుందన్న ఆలోచనలో అందరూ పడ్డారు. ఆలస్యం అన్నది కేవలం ఒక కారణం మాత్రమే! చేస్తున్న పనిలో అజాగ్రత్త. ఏ పనిలోనయినా అధికారులు చూపించే అసంతృప్తి వంటివి ఆయనకు వార్నింగిచ్చినా ఉపయోగం లేదని అందరికీ తెలుసు. మన కంటే ఆయనకు తన మీద తనకి కంట్రోల్ లేదు గనుక! కాని పని అంటే పనే కద! ఎంతకాలం ఆయన నిర్లక్షాన్ని సహించగలరు! ఆయన్ను ముందుగానే రిటైర్మెంటు తీసుకోమని సూచించడం జరిగింది. ఆయనకు అది తప్ప మరో గత్యంతరం లేదు, ఎందుకంటే ఇక ఏ పాటి తప్పు జరిగినా ఉద్యోగం నుండి డిస్మిస్ చేసే అవకాశాలే హెచ్చు. ఇప్పుడయితే ఓ నాలుగు రూపాయలయినా చేతికొచ్చేయి కద! పి.యఫ్. వాటిలో జమపడిన డబ్బు కాస్తా ఇప్పుడు ఉపయోగపడుతుంది. కాని కాలాన్ని గడపటమే మహాకష్టంగా ఉంది. సుధ ఎంత సేపూ సూర్యం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండటం వలన ఈ బాధను ఎంత మర్చిపోదామని ఆయన ప్రయత్నిస్తున్నారో అంత పెరిగిపోతోంది. ఈ కారణం వలన కూడా ఆయన శరీరం గంజాయినివ్వమని బలవంతం చేస్తుంది. మెల్లిగా మత్తు ప్రభావం ఆయనను ఎంతలా లోబరుచుకుందంటే సుధను చూసుకోవాలన్న స్పృహ కూడా మిగలటం లేదు.

చింత – చితి, ఈ రెండింటిలో చాలా సూక్ష్మం అంటారు. ఎంత సూక్ష్మమంటే ఒక్కొక్కసారి అనుకోకుండా చెరిగిపోతుంది కూడా! సుధ అనుకునే ఈ భేదాన్ని చెరుపుకుందా? కొడుకు లేకపోయినప్పుడు జీవించి ప్రయోజనమేముంది? అదీ కాక, ముందు కొడుకును తన నుండి లాక్కున్న ఆ విషాన్నే ఇప్పుడు భర్త కూడా సేవిస్తున్నాడు.

బోసుబాబుగారు తనను తాను మాత్రమే దోషిననుకుంటే, ఆయన తప్పు నిరూపింపబడుతుంది కూడా! చెప్పాలంటే ఆయన సుధను రక్షించుకోగలరు. కాని తన బాధను ఆయన మత్తుతోనే మరవాలనుకుంటున్నారు. కొడుకు పరిస్థితి చూశాక కూడా ఆయన గుణపాఠం ఏమీ నేర్చుకోక, భార్యను కూడా వదులుకోవలసివచ్చింది. ఇక ఇంతటి కష్టాన్ని మర్చిపోవటానికి మత్తులో మునిగిపోవటం ఒక్కటే ఆయనను పూర్తిగా వశపరుచుకున్న మార్గం.

బోసుబాబుగారు ఒంటరిగా ఉండాలనుకునే వారు కాదు, కాని ఇప్పుడు అలాగే జీవించటం తప్పనిసరి అయింది. చీకటిగదిలో ఆయనకు నక్షత్రాలు తప్ప మరే వస్తువును ఇష్టపడేవారు కాదు.

అలాటప్పుడు ఆయన నిస్సహాయంగా పచార్లు చేసేవారు. కాని ఇప్పుడు అలా కూడా సాధ్యపడటం లేదు. ప్రభావం ఉన్నంతసేపు పడుకునే ఉంటారు. ఆయనకు తను నిద్రపోవటం లేదు, స్పృహ లేకుండా పడి ఉన్నాననిపిస్తుంది. నిజానికి నిద్ర తీరదు, కాని తీరినట్లు భ్రమపడతారంతే!

మిశ్రాగారు ఇప్పటికీ వస్తూ ఉంటారు. బోధపరిచే ప్రయత్నం చేస్తారు. ఆయన సహాయపడాలనుకుంటారు.

‘మీరు ఇలా ఉండేవారు కాదు బోసుబాబూ! కనీసం మీరు మీ ఆరోగ్యం గురించయినా కాస్త ఆలోచించండి. ఈ వయసులో మీకు ఇదెంత మాత్రం తగదు. వెళ్లిపోవలసినవారు వెళ్లిపోయారు. కనీసం వారి ఆత్మశాంతికయినా మీరు ఉపక్రమించాలి!’

‘ఇప్పుడేం చెయ్యగలను నేను? వారు జీవించి ఉండగానే ఏమీ చెయ్యలేకపోయాను. అలాటిది వారు మరణించాక..’

మాట్లాడుతున్న ఆయన కళ్లనుండి గంగా-యమున ధారలు ఆగవు. బహుశా ఆయన మత్తులో ఉన్నప్పుడే అవి ఆగుతాయేమో!

‘ఈ విషాన్ని మానెయ్యరాదూ? వీటివలన ఎవరికైనా మంచి జరిగిందా లేక జరుగుతుంది చెప్పండి?’

చీకట్లో ఉండాలంటే భయమనిపించేది. అయితే ఇప్పుడు అదే చీకట్లోనే ఉండాలనిపిస్తుంది. ఒక్కసారి ఆ అంధకారంలోకి ప్రవేశించాక అక్కడ కేవలం వెల్తురే-వెల్తురు. కనిపిస్తుంది. ఆ వెల్తురే నన్ను జీవింపచేస్తుంది’.

మిశ్రాగారు, దివాకర్ గారు, సిన్హా గారు, గుప్తా గారే కాకుండా ఇంకా ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ బోసుబాబుగారు అంధకారం నుండి బైటకు రాలేకపోయారు. ఇప్పుడు ఆయన చేతుల్లో లేదు. ఒక తెలియని చీకట్లో వెతుకులాటే ఆయన జీవితమయింది. ఒకనాడు ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకుమన్నాయి. నక్షత్రమండలమంతా మారుతోంది.

‘హ! హ! హ!’ అదే అట్టహాసం. ‘ఇప్పుడేం తీసుకుందామని వచ్చావు?’ ‘హ! హ! హ! సూర్యాన్ని, సుధను తీసుకుపోయావు. ఇక ఇప్పుడు నేనొక్కడినే మిగిలాను. నన్నూ తీసుకుపో! నాకేం నువ్వంటే భయం లేదు. నన్ను చీకటితో భయపెట్టాలనుకుంటున్నావా? నీ భ్రమ అంతే! ఇప్పుడు నాకు చీకటంటే ఏం భయం లేదు. నేను దానికన్న మరింత వేగంగా వెళ్లగలను తెలుసా? ఇక నాకేం భయం లేదు’. ‘హ! హ! హ!’ అదే అట్టహాసం!

అయితే ఆ అట్టహాసం ముందులాగ లేదు. అది మెల్లి మెల్లిగా క్షీణమవుతూ పోతోంది. మరింకేదో విచిత్రమయిన హోరులాటిది తీవ్రమవుతూ పోతోంది. బోసుబాబుగారు ఆకాశం వంక చూసి ఆశ్చర్యపోయారు. వృశ్చికం సప్తర్షిమండలం కలవబోతున్నాయి. అవి కలిస్తే పెద్ద శబ్దాలతో భయంకరమైన విస్ఫోటనం జరిగి నాలుగు దిక్కులా ప్రకాశమే ప్రకాశం విస్తరించేదట. ఇదే ఆ పెద్ద శబ్దానికి కారణం! ఆయన కళ్లలోకి గుచ్చుకున్నట్లయింది. దానితో ఆయన తన కళ్లపైన చేతినుంచుకున్నారు. కొంచెంసేపటి వరకు ఆ వెలుగు అంతే ప్రకాశిస్తూ, కాసేపటికి తగ్గింది. ఇప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంది. ఒక పెద్ద నక్షత్రంలో సుధ – సూర్యం పంజరంలో బందీలుగా ఉన్నారు. బోసుబాబు గారి హృదయం ముక్కలవుతోంది. ఆయన ఎగిరి వెళ్లి వారిని చేరాలని ప్రయత్నిస్తే బలమైన గాలి వీచి ఆయనను వెనక్కు నెట్టేసింది. ఆయన వేగంగా కిందపడుతున్నారు. భూమి దగ్గరగా-మరింత దగ్గరగా కానవస్తోంది. ఇప్పుడేం జరుగుతుందో ఆయన ఆలోచించలేకపోతున్నారు. పడుతూనే ఉన్నారు. ఒక పెద్దచెట్టు కొమ్మకు తగిలిన ఆయన శరీరం చీలిపోయి నిర్జీవంగా భూమిపైన పడుతోంది. చుట్టుపక్కల అంతా గుమిగూడారు. ఏదో మాట్లాడుతున్నారు. కొందరు హేళన చేస్తున్నారు. ఆయన స్నేహితులైన మిశ్రా గారు, దివాకర్ గారు, సిన్హా గారు, గుప్తా గారు మరెందరో మిత్రులు ఒకవైపు చేరి కన్నీరు తుడుచుకుంటున్నారు.

హిందీ మూలం: విశ్వజిత్ ‘సపన్’

తెలుగు: డా. సుమన్‌లత రుద్రావజ్ఝల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here