Site icon Sanchika

ఛెళ్!

[‘అభినందన’ సంస్థ (విజయనగరం) జూలై 2022లో నిర్వహించిన మినీ కథల పోటీలో బహుమతి పొందిన కథ]

[dropcap]భ[/dropcap]ద్రానికి తగలిరాని చోట తగిలింది!

మనస్సు చివుక్కుమంది. కోపం నషాలానికంటింది.

ఒక్క ఉదుటన ఎగిరి ఛెళ్ మనిపించాడు. మార్వాడీ సేఠ్ అవాక్కయి చెంప తడుముకుంటుండగా, షాపులో ఉన్న ఇద్దరు పనివాళ్లు వచ్చి భద్రాన్ని అడ్డుకున్నారు. “నో బోడి ఉద్యోగం నీ దగ్గరే ఉంచుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పీక కోస్తా” అంటూ గుడ్లురుమి గుర్రుగా చూస్తూ విసవిసా బయటకు వెళ్ళిపోయాడు భద్రం.

అసలు భద్రానికి అంత కోపమెందుకొచ్చింది?..

ఆ రోజు డ్యూటీకి అరగంట ఆలస్యంగా వచ్చాడు భద్రం. దానికీ ఓ కారణముంది. సరిగ్గా బయల్దేరే ముందు కడుపులో విపరీతమైన నొప్పి అంటూ గిలా గిలా కొట్టుకుంటోంది భార్య రమ. పరుగెత్తి ఓ ఆటోవాడిని కేకేసి, ఇంటి దగ్గర నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. పరీక్షల అనంతరం ఓ ఇంజక్షన్‌తో రెండు మాత్రలు మింగించిన తర్వాత కాస్త కుదుటపడింది రమ. తనని ఇంటిదగ్గర జాగ్రత్తగా దించి విశ్రాంతి తీసుకోమని చెప్పి, ప్రక్కింటివారిని కాస్త గమనించమని, అవసరమైతే ఫోన్ చెయ్యమని అప్పజెప్పి బయల్దేరాడు భద్రం.

తప్పదు మరి. హఠాత్తుగా డ్యూటీ మానేస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు మార్వాడీ సేఠ్. బట్టల షాపులో చిరుద్యోగి భద్రం. అరగంట ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకోవచ్చు అనుకుని షాపుకి వస్తే కన్నెర్రజేసాడు సేఠ్. అవాకులూ చెవాకులూ పేలాడు. అంతే కాదు.. “మీ తెలుగు నా కొడుకులు అంతా ఇంతే” అనగానే భద్రానికి చురక అంటింది. కాలింది. ఉక్రోషం తన్నుకొచ్చింది. ఆవేశంతో మార్వాడీ సేఠ్ చెంప మీద ఐదు వ్రేళ్ళ ముద్ర వేసేసాడు!..

ఓ రెండు రోజుల తర్వాత తోపుడు బండిపై బొండాలతో బట్టల షాపు ముందు ప్రత్యక్షమయ్యాడు భద్రం. ఎడమ చేతిలో బొండాలు. కుడి చేతిలో కత్తి.

“నా లెక్క తేల్చేయ్” అన్నాడు కోపంగా.

వణికిపోతున్నాడు మార్వాడీ సేఠ్. గబగబా సొమ్ము తీసి అందించాడు.

“భారతదేశంలో పల్లెకొక్కడు చొప్పున తిష్ట వేసిన వలస బ్రతుకులురా మీవి. ఊళ్ళ మీద పడి వ్యాపారం పేరున దోచుకుతింటున్న రాబందులు మీరు. నాది ఈ మట్టి. నేను పుట్టిన నేల ఇది. తినడానికి మెతుకులు లేకపోతే పస్తు ఉంటాం. అంతే కాని ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే సహించం. ఇష్టపడి కష్టపడే జీవులం. అటువంటిది ఎక్కడ్నుంచో బ్రతుకు తెరువుకై ఇక్కడికి వచ్చిన నువ్వు మమ్మల్ని హీనంగా ‘తెలుగు నా కొడుకులు’ అని తిడతావురా.. ఖబడ్దార్. నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే నాలుక చీరేస్తా” అన్నాడు భద్రం ముక్కు పుటాలెగరెస్తూ.

షాపులో ఉన్న ఇద్దరు పనివాళ్ళు లేచి వచ్చి భద్రాన్ని సముదాయించారు. కాస్త శాంతించిన తర్వాత బొండాల్ని చెక్కి పనివాళ్ళకు రెండూ, సేఠ్‌కి ఒకటి అందిస్తూ అన్నాడు.. “త్రాగు”.

మార్వాడీ సేఠ్ భయపడుతూ అందుకున్నాడు. చెక్కిన బొండాం.. అతనికి తల తెగిన మొండెంలా కనిపిస్తోంది!

Exit mobile version