Site icon Sanchika

చెమట చుక్కలు

[dropcap]బ్ర[/dropcap]తుకు బండిని నడిపేందుకు  ఎర్రటి ఎండలో
రిక్షా తొక్కుతున్న ఓ కార్మికుడి శ్రమకి సాక్ష్యం..
చెమటలు కక్కుతున్న అతని దేహం..!

గెలుపే శ్వాసగా ఆడుతున్న  క్రీడాకారుడి
అలుపెరుగని కృషికి సాక్ష్యం..
చెమటతో తడిచి ముద్దైన తన వస్త్రం..!

మండు వేసవిలో తన నెత్తి మండిపోతున్నా
చంకన ఉన్న బిడ్డని చెంగుతో కప్పే అమ్మ మనసుకి
బొట్టు బొట్టుగా రాలుతున్న చెమట చుక్కలే సాక్ష్యం..!

అలసిన మగని నుదుటన చెమటని
తన చీరకొంగుతో తుడిచే ఆ ఇల్లాలి ప్రేమకి సాక్ష్యం..
తన కొంగుకంటిన స్వేదం..!

స్వర్గపు అంచులని చేరి అలసిపోయిన
రతీ మన్మధుల రసభరిత శృంగారానికి సాక్ష్యం..
ఇరు తనువుల పైన పారుతున్న స్వేదపు నదీ ప్రవాహం..!

రక్తాన్ని చెమటగా మలిచి
సేద్యం చేసే రైతన్న శ్రమ ఫలం..
మన కడుపు నింపుతున్న ఆహారం..!

నీతిగా బ్రతికే శ్రమ జీవుల స్వేదం ఎన్నటికి కాదు అశుద్ధం..!
కష్టించే తనువు నుండి జారే ప్రతి చెమట చుక్క అతి పవిత్రం..!

Exit mobile version