Site icon Sanchika

చెంచు బాలలతో హిమాలయ సైకిల్ యాత్ర -1

[box type=’note’ fontsize=’16’] తమ కుమారుడు శ్రీ కాళిదాస్ వంశీధర్ – 2021 ఫిబ్రవరి 6 వ తారీకున చెంచుపిల్లలతో ప్రకాశం జిల్లా పాలుట్ల నుంచి బయల్దేరి, ఉత్తరాఖండ్‌లో భీమ్‌తల్ వరకు 3000 కి.మీ. సైకిళ్ళపై సాహసయాత్ర జరిపి ఏప్రిల్ 7న యాత్ర ముగించిన వివరాలను శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు పాఠకులకు అందిస్తున్నారు. [/box]

ఒక ఆలోచన అంకురంగా

[dropcap]మా[/dropcap] పెద్దబ్బాయి వంశీధర్ కొన్నేళ్లుగా శ్రీశైలం ప్రాంతంలో చెంచుల జీవితాన్ని అప్పుడప్పుడు వెళ్లి అధ్యయనం చేస్తున్నాడు. 2013 వరకు సున్నిపెంట వెళ్లి అక్కడి చెంచులతో సంబంధాలు పెట్టుకొని పనిచేశాడు. అది చాలా చిన్న గ్రామం. తర్వాత ప్రకాశం జిల్లాలో పాలుట్ల చెంచులకు తన సేవలు ఆందించాడు. పాలుట్ల దట్టమైన అరణ్యమధ్యలో ఉంది. అక్కడ చెంచుల జనాభా ఎక్కువ. సుమారు 400 మంది వరకు ఉన్నారు. ఆ చెంచుల గూడెం కృష్ణానదికి కుడి గట్టుకు ఏడు కిలోమీటర్ల దూరంలో, ప్రకాశంజిల్లా యర్రగొండ్లపాలెం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. గూడెం దట్టమైన అడవి మధ్య చాలా అందంగా ఉంటుంది. అక్కడ కరెంటు, టెలిఫోన్ సౌకర్యం, పోస్టాఫీస్ లేదు. ఊరు దాటితే వన్యమృగాలు, ఎలుగుబంట్లు ఎక్కడ పడితే అక్కడ తారసపడతాయి. వైద్యసౌకర్యం కోసం ఎర్రగొండ్లపాలెం వెళ్లాల్సిందే. లేదా ఎగువపాలెం వెళ్ళాలి. చెంచులు సున్నిపెంట నుంచి గాని, యర్రగొండ్లపాలెం నుంచి గాని కాలినడకన ఆరుగంటల్లో పాలుట్ల చేరుతారు. సాధారణ పౌరులకు నడిచి వెళితే 12 గంటలు పడుతుంది. 2012లో పాలుట్ల గూడెం మొత్తం కాలి బూడిదైంది. సుమారు రెండేళ్లుగా మా అబ్బాయి తరచూ పాలుట్ల చెంచులకు బట్టలు, వంటపాత్రలు, పిల్లలకు పుస్తకాలు, ఆట వస్తువులు ఇవ్వడం వంటి పనులు చేస్తూ వచ్చాడు. 2020-21 మధ్య పిల్లలకు చదువు చెప్పడానికి, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా పాలుట్లలో చాలా విశాలమైన, 300 చదరపు అడుగులు పర్ణశాల, చెంచుల సహకారంతో నిర్మించి అందులోనే ఉంటూ చెంచుల పిల్లలకు బడి మొదలుపెట్టాడు. చెంచులకు చదువు మీద ఆసక్తి లేదు. చిన్న పిల్లలందరూ బడికి నామం పెట్టి గాలికి తిరిగేవారే. ఒక బృందంగా కలిసి పని చేయడం రాదు. చిన్న పెద్ద ప్రతివారి చేతిలో చిన్న గొడ్డలి ఉంటుంది. నడుస్తూ దారిలో ప్రతి చెట్టు కొమ్మను నరుకుతూ పోవడం ఒక దురలవాటు. చెంచులు ఇంకా ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. విపరీతమైన తాగుడుకు బానిసలు. కొందరికి జూదం వ్యసనం. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ఉంది కనుక అన్నానికి కొదవ లేదు. వాళ్ళు వండి పారేసే అన్నం ఊరకుక్కలకు కూడా ఎక్కువై తినవు. కట్టుకునేందుకు బట్టలుండవు. అతి బాల్య వివాహాలు, 13 ఏళ్లకే బాలికలు తల్లులు కావడం, శిశు మరణాలు, ప్రేమవైఫల్యాలు, ఆత్మహత్యలు సాధారణం. పాలుట్లలోనే ఒక భాగంలో లంబాడీల తండా ఉంది. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే అన్ని సౌకర్యాలను చక్కగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందారు. ఆ సమాజం కళ్ళ ఎదురుగా ఉన్నా దాని ప్రభావం చెంచుల మీద లేదు.

విలువిద్యలో శిక్షణ

మొదట వంశీధర్ చెంచు పిల్లలకు విలువిద్యలో శిక్షణ ఇప్పించడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే అందులో ఉన్న ఇబ్బందులు గమనించి, వాళ్లకు సైకిళ్ళు తొక్కడం నేర్పించి, పాత సైకిళ్లు సేకరించి ఇచ్చాడు. ఆ బాలబాలికలకు సైకిల్ తొక్కడం చాలా ఇష్టం అని తెలిసింది. అయితే దేన్నీ జాగ్రత్త చేసుకోడం, వాళ్లకు తెలియదు. వస్తువు పాడయితే పడేస్తారు.

మేరథాన్ పరుగుపందెంలో శిక్షణ

2020 నుంచి తాను పాలుట్లలో ఉండి చెంచు బాలబాలికలచేత ఆరునెలలు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయించాడు. ప్రతిరోజూ సుమారు 40 మంది బాలబాలికలు 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తి, మధ్యాహ్నం 12 కల్లా వెనక్కి నడిచి వస్తారు. వంశీధర్ కూడా ప్రతిరోజు వాళ్లవెంట ఉండేవాడు. చెంచు బాలలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇందులో నైపుణ్యం సాధించారు. మేరథాన్ లో పాల్గొనడానికి ప్రోత్సాహకాలుగా నెల్లూరులో ఒక ఉదార హృదయుని వితరణ, సహకారంతో లక్ష రూపాయల విలువైన స్పోర్ట్స్ షూస్, బట్టలు వగయిరా ఆ బాల బాలికలకు పంచాడు. రోజు వారికి వ్యాయామం తర్వాత వేరుశెనగ ముద్దలు, పప్పులు వంటి పౌష్టికాహారం ఇచ్చేవాడు. పిల్లలకు రాగిజావ, పప్పుచెక్కలు, గుగ్గెళ్ళు, చిక్కీలు, చిరుతిండ్లు ఒక ఆకర్షణ. వారంలో ఒకటి రెండు సార్లు భోజనం కూడా ఏర్పాటు చేసేవాడు. కరోనా కారణంగా ఆ పిల్లలను క్రీడాపోటీలలో పాల్గొనేందుకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేకపోయింది.

ఈ పరిస్థితుల్లో చెంచు బాలబాలికలచేత సైకిల్ యాత్ర చేయిస్తే యెట్లా ఉంటుందనే ఆలోచన తన మనసులో పొటమరించింది. వాళ్ళు ఊరిగెవిని దాటి యెరగరు.

వంశీధర్ చెంచుబాలల తల్లితండ్రులతో తన ఆలోచను వివరించి వారిని వప్పించి, వారి అనుమతితో 2021 జనవరిలో “చెంచు బాలల హిమాలయ యాత్ర” పేరుతో ఒక కార్యక్రమం రూపొందించాడు. ఇందుకు ఉదారులైన మిత్రులు, స్నేహితులు, వితరణశీలురు సహకరించారు. రెండేళ్లుగా తనవెంట 10 వ తరగతి వరకు చదివిన జయంతి సూర్య అనే ఒక పాతిక సంవత్సరాల యువకుడు ఉన్నాడు. తనకు దేన్లోనూ ఉత్సాహం ఉండదు. చాలా స్తబ్దుగా ఉంటాడు. అతని తల్లితండ్రులు ఇద్దరు డాక్టర్లు. సూర్యాను ఈ సాహస యాత్రలో వెంట తీసుకొని వెళ్ళడానికి వారు అంగీకరించారు. ఈ రెండేళ్లలో కొండయ్య అనే 31 సంవత్సరాల పాలుట్ల చెంచు యువకుడు, అతని భార్య 24 ఏళ్ళ చెంచు యువతి చేవూరి పోతమ్మ మా అబ్బాయితో కలిసి పనిచేస్తూ తనకు అన్ని విధాలా చేదోడుగా ఉన్నారు. చేవూరు కొండయ్య ఒకాసారి భార్యతో తిరుమల చూచివచ్చాడు, కారు నడపడం వచ్చు. దంపతులిద్దరికీ తెలుగు తప్ప మరొక భాష రాదు. పోతమ్మ కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్గొనడానికి ఒప్పుకుంది.

యాత్రలో పాల్గొనే చిన్నారులు

ఈ సైకిల్ సాహస యాత్రలో 8 నుంచి 14 సంవత్సరాల మగపిల్లలు 7 గురు, 13 నుంచి 17 సంవత్సరాల పిల్లలు. 8మంది, 7నుంచి 13 సంవత్సరాల మధ్య బాలికలు 5 మంది, మొత్తం 20 మంది చెంచు బాల బాలికలు, ఇద్దరు యువజనులు (కొండయ్య దంపతులు) చెంచుపెద్దల సమక్షంలో యాత్రాబృందంలో చేరారు.

అవసరమైన వస్తుసామగ్రి

వంశీధర్ తన మిత్రులతో, చర్చించి ఈ సుదీర్ఘ సాహసయాత్రకు అవసరమైన సామగ్రి నంతా చాలా ముందుగానే పాలుట్ల చేర్చాడు. 3 కుక్కర్లు, 4 డీజిల్ స్టవులు, వంటకు అవసరమైన పాత్రసామాగ్రి, 20 లీటర్ల హాండ్ వాష్, హ్యాండ్ వాష్ బాటిల్స్, ప్రతి ఒకరికి ఒక భోజనం ప్లేట్, ఒక గ్లాస్, స్పూన్లు, 200 ఫేస్ మాస్కులు, 6 టార్పాలిన్ షీట్లు 30 లీటర్ల నీళ్ళకేన్, ఒక వారం రోజులకు సరిపోయే ప్రొవిషన్లు వగైరా, యాత్ర ముఖ్య ఘట్టాలను రికార్డు చేయను వీడియో కెమెరా. సైకిల్ యాత్ర చేసే పిల్లల బృందానికి ముందు వెనక రక్షణగా వెళ్లేందుకు, సామాగ్రిని వెంట తీసుకొని వెళ్ళడానికి రెండు మారుతి వ్యాన్లు – ఒకటి ఏసీ మరొకటి నాన్ ఏసి. సమకూర్చుకొన్నారు. ఈ ప్రయత్నం వెనక ఎంతోమంది మిత్రులతో సలహాలు సంప్రదింపులు సాగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనికేషన్ నిరాటంకంగా కొనసాగడానికి హైదరాబాద్‌లో మిత్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, కొన్ని ఏర్పాట్లు చేశారు

అవసరమైన బట్టలు

ఈ కార్యక్రంలో పాల్గొంటున్న బాలలకు ఒక్కొక్కరికి 6 జతల బట్టలు, 1 జర్కిన్, 1.స్వెట్టర్ ,6 టిషర్ట్స్, 3 నిక్కర్లు, అన్ని విధాలుగా వాడుకోడానికి సరిపోయే 5 ట్రాక్ ప్యాంట్లు, రెండు మంకీ టోపీలు, రెండు జతల ఊలుమేజోళ్ళు, ఒక్కొక్కటి 3000/- ఖరీదు చేసే స్లీపింగ్ బ్యాగ్, వీపుకు కట్టుకొనే బ్యాక్ ప్యాక్ ఇచ్చారు. శిక్షణ పూర్తయి, బయలుదేరే తేదీ నిర్ణయమయినా పిల్లల్లో నమ్మకమే కుదరలేదు. వాళ్ళలో చాలామంది పాలుట్ల దాటి బాహ్యప్రపంచాన్ని చూడలేదు. బాలల అమ్మానాన్నలకు అసలు దేనిమీదా ఆసక్తిలేదు.

ఒక రోజు ముందు

2021 ఫిబ్రవరి 5 సాయంత్రం, రేపు సాహసయాత్రకు బయలుదేరుతారనగా, పాలుట్లలో గ్రామదేవత, ఆంజనేయస్వామి గుడివద్ద సైకిళ్ళు పెట్టి పూజచేశారు. తెల్లవారితే యాత్రకు బయలుదేరాలి. 14 ఏళ్ళలోపల పిల్లలంతా పూజా కార్యక్రమానికి వచ్చారు. సైకిళ్ళు తెచ్చి పూజ చేయించారు. యాత్ర వివరాలు, విధి విధానాలు అన్నీ వంశీధర్ వివరించి చెప్పాడు. పెద్ద పిల్లలు రాలేదు. వాళ్ళకు నిజంగా ఈ సాహసయాత్ర జరుగుతుందన్న నమ్మకం కుదరలేదు. కొందరు కుర్రాళ్లు పూజకు వచ్చినా ప్రసాదం పెట్టేవరకు నిలబడే ఓపిక లేక వెళ్లిపోయారు. ముగ్గురు దంపతులు తప్ప, బాలబాలికల తల్లిదండ్రులు కూడా పూజకు హాజరుకాలేదు. త్రాగుడు మత్తులో పెందరాడే నిద్రలేచే అలవాటు కొందరికిలేదు. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత చిన్నపిల్లలు తమ సైకిళ్ళను వంశీధర్ కట్టించిన కమ్యూనిటి పాకలోకి చేర్చారు. పెద్ద పిల్లలు పూజకు తెచ్చిన సైకిళ్ళను అక్కడే విడిపెట్టి వెళ్ళిపోతే రాత్రి పొద్దుపోయిన తర్వాత, ఏడెనిమిది ఏళ్ళ పిల్లలే సైకళ్ళన్నీ సాముదాయిక కేంద్రంలో భద్రంచేశారు.

సైకిల్ సాహసయాత్ర బయలుదేరింది!

ఫిబ్రవరి 6 వ తారీకు ఉదయం సైకిల్ సాహసయాత్రాబృందం బయలుదేరింది. ఫలహారం పాలుట్లలోనే చేశారు. ముగ్గురు పిల్లల అమ్మానాన్నలు మాత్రమే వీడ్కోలు పలకడానికి వచ్చారు. కొందరు పెద్దపిల్లలు చివరి క్షణాల్లో వచ్చి తమ కిట్లను, వస్తువులను అడిగి, తీసుకొని హడావుడిగా బృందంలో కలిశారు. బృందం వెనుక ముందు మారుతీ వ్యాన్లు. మధ్యాహ్నానికి అందరూ ఎర్రగుంట్ల గురుకుల పాఠశాల చేరారు. పాఠశాల అధికారులు భోజనాల ఏర్పాటుచేశారు. ఒక కుర్రాడు ఇక్కడకువచ్చి కలిశాడు. ఆ రాత్రి, మరుసటి రోజు అక్కడే విశ్రాంతిగా ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలు తప్ప అందరూ మొదటిసారి బయటి ప్రపంచంలోకి వస్తున్నారు. ఈ వాతావరణం అలవాటు పడడానికి సమయం కావాలి.

జిల్లా కలెక్టరు జండా ఊపారు!

7వ తారీకు ఉదయం పత్రికలవాళ్ళు యాత్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 11గంటల సమయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్రు వర్చువల్ విధానంలో యాత్ర జయప్రదం కావాలని శుభాకాంక్షలు తెలుపుతూ జెండా ఊపి వీడ్కోలు చెప్పారు. నాగార్జునసాగర్ వెళ్లే దారిలో చిగురుపాడులో, దారిప్రక్కన డాబా హోటల్ లో మద్యహ్న భోజనం చేశారు. చెవులరాజు, బుద్ధా వీరడు అనే ఇద్దరు బాలురు చిగురుపాడు వద్ద బృందంలో కలిశారు. దారిలో పెద్దఅంజి అనే కుర్రాడి సైకిల్ పంక్చర్ అయింది. వ్యాన్లో ఒక సైకిల్ ఉంటే ఆ కుర్రాడికి ఇచ్చారు. ఆడపిల్లల సైకిల్ అని దాన్ని తీసుకోడానికి ఆ పిలగాడు ససేమిరా అంగీకరించలేదు. రాత్రి 8 గంటలకు సాగర్ ఎడమ గట్టుకు చేరి అక్కడి కాళీమందిరంలో విశ్రమించారు.

కాళీమందిరంలో మొదటి మూడు రాత్రులు!

కాళీ మందిరంలోచిగురుపాడు నుంచి ఇక్కడకు షుమారు 65 కి. మీ. ఈ రెండు రోజుల్లో పిల్లలు షుమారు 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. మరుసటి రోజు ఉదయం ప్రయాణమయ్యే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కార్యక్రమాలు సాగర్ సమీపంలో జరుగుతున్నాయని, వారు వెళ్లిపోయే వరకు బయలుదేరవద్దని హైదరాబాద్ నుంచి సూచన అందింది. మూడు రాత్రులు కాళీ మందిరంలోనే వండుకొని తింటూ ఉండిపోయారు. పిల్లలు వంటలు, పాత్రలు శుభ్రం చేసుకోడం వంటి పనులకు అలవాటు పడి ఉన్నారు కనక ఇబ్బందేమీలేదు. ఈ బృందంలో 24 ఏళ్ళ యువతి పోలమ్మ పర్యవేక్షణ ఉందనే ఉంది.10 వ తారీకు మధ్యాహ్నం సమతా ప్రసాదు గారు లంచి ఏర్పాటు చేసి, పిల్లల కోరిక ప్రకారం చేపలకూర ప్రత్యేకంగా వండించిపెట్టారు. పైలట్ వ్యానులో కొండయ్య, రియర్ వ్యానులో వంశీధర్ ఉంది మొత్తం ప్రయాణమంతా డ్రైవ్ చేశారు. సాగర్ లో పత్రికలవాళ్ళు కలిశారు. ఇక్కడ, యాచారం గ్రామం సమీపంలో డాక్టర్ రెడ్డి లాబ్స్ వారు నిర్వహిస్తున్న “పుడమి” స్కూల్లో 11 రాత్రి విశ్రాంతిగా ఉన్నారు. ఆ స్కూల్ వాళ్ళే భోజనం ఏర్పాట్లు చూశారు.

12 వ తారీకు ఉదయం బయలుదేరి హైద్రాబాద్‌లో వంశీధర్ నిర్వహిస్తున్న గణితయోగ ఆఫీస్ లో దిగారు. 12 రాత్రి కుడుముల వెంకటేశం 18 ఏళ్ళ చెంచు పిల్లవాడు ఒంటరిగా హైదరాబాద్ వచ్చి సైకిల్ యాత్రాబృందంలో చేరాడు.

తొలి తిరుగుబాటు

13 వ తారీకు ఉదయం మగ పిల్లలందరికీ సౌకర్యంగా ఉంటుందని శుభ్రంగా మిలిటరి క్రాఫ్ మట్టసంగా, పొట్టిగా కొట్టించారు. హైద్రాబాదుకు వచ్చి కలిసిన వెంకటేశం అందుకు సమ్మతించకుండా వెనక్కి వెళ్ళిపోతూ, బృందంలోని చెవులరాజును కూడా తనతో తీసుకొని పోయాడు. చదువు, బయటి ప్రపంచం ఎరగని పిల్లలతో ఏగడానికి ఏంతో సహనం, సంయమనం ఉండాలి. మా వంశీధర్‌కు భూదేవి కున్నంత సహనం, ఓర్పు ఉన్నాయి. లేకపోతే అసాధ్యమయిన ఇటువంటి యాత్రను ఎవరు తలపెడతారు?

తాలుగింజలు, గట్టిగింజలు

నికరంగా యాత్రకు 7నుంచి 13 సంవత్సరాల వయసు ఆడపిల్లలు 5 మంది, మొగపిల్లలలు 7 మంది, 14-18 మధ్య వయసు మగపిల్లలు 6 మంది మొత్తం 20మంది బాలబాలికలు తేలారు. సహాయకుల బృందంలో కొండయ్య, పోతమ్మ కూడా చెంచులే. ఆవిధంగా ఈ యాత్రలో 22 మంది చెంచులు పాల్గొంటున్నారు. 13వ తారీకున పిల్లలని యేగించుకొని హైద్రాబాదులో Decathlon షాపుకు వెళ్లారు ఆర్గనైజర్లు. పిల్లల ఎత్తును బట్టి సైకిళ్లను ఎంపిక చేశారు. వంశీధర్ మిత్రులు శ్రీ పృథ్వి గారు వెంటవుండి కొత్త సైకిళ్లు కొనే ప్రక్రియను పూర్తిచేశారు. ఒక్కో సైకిల్ ఖరీదు 6500/ రూపాయలు. అన్ని సైకిళ్లకు రిఫ్లెక్టర్స్ బిగించారు. హెల్మెట్లకు కూడా రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అందరికి చేతులకు గ్లోవ్స్ ఇచ్చారు. కొత్త సైకిళ్ళు ఇస్తారన్న సంతోషం, పిల్లల ఉత్సాహం చెప్పనలవి కాదు, మురిసిపోయారు. అప్పటికే ఈ బృందంలో ప్రతి ఒక్కరికి సైకిళ్ల రిపేరు అంతో ఇంతో తెలుసు. తగినన్ని స్పేర్ పార్టులు సమకూర్చుకున్నారు. 14 వతారీకు Decathlon కంపెనీ సైకిళ్లను డెలివరీ చేసింది. నెక్లిస్ రోడ్డులో రోటరీ గవర్నర్ ఈ చెంచు బాలల హిమాలయ సైకిల్ యాత్రకు జండా ఊపారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమమంతా రోటరీ వారే ఏర్పాటుచేసారు. ప్రింట్ మీడియా, విజువల్ మీడియా ఈ కార్యక్రమాన్ని బాగా కవర్ చేసింది.

15, 16 రెండు రోజులు అందరు హైద్రాబాదులోనే విశ్రాంతిగా ఉన్నారు. వంశీ చివరినిమిషాల్లో చేయవలసిన ఏర్పాట్లమీద మనసు లగ్నం చేశాడు. సత్యసాయి ట్రస్ట్ వారు ఈ సాహస యాత్రికులకు 30 రోజులకు సరిపడా 100 కె.జిల Health drink Ensure ప్యాకెట్లు బహుకరించారు.

సుదీర్ఘ ప్రయాణం మొదలైనది!

19వ తారీకు సికిందరాబాదు ఎంపీగా పోటీ చేసిన శ్రీ సతీష్ అగర్వాల్ సైకిల్ సాహస యాత్రికులను పూలమాలలు వేసి, శాల్వలతో సత్కరించారు. చెంచుపిల్లలు మురిసిపోయారు. ప్రయాణంలో బాలలు శాల్వలను తువ్వాళ్లుగా వాడుకొన్నారు. అగర్వాల్ గారు అందరికి ఉదయం ఫలహారం, అరటిపళ్ళు కూడా ఏర్పాటు చేశారు. 19వ తేదీ సాహస యాత్రికుల బృందం హైద్రాబాదు నుంచి సుమారు 80 కి.మీ సైకిళ్లపై ప్రయాణం చేసి, రాత్రి నాగపూర్ మార్గం NH 44 లో ఒక కాళీమందిరంలో విశ్రమించింది. వంశీధర్ శ్రీమతి చి. సౌ. మాధవి, కుమారుడు చిరంజీవి శ్రీరమణ శాండిల్య, ఇతర బంధువులు వచ్చి కలిశారు. సుదీర్ఘ యాత్ర వెళుతున్న సందర్భం. వారికి దిగులు, విచారం ఒకవైపు, సాహసయాత్రకు వెళుతున్నందుకు సంతోషం మరొకవైపు.

ఫిబ్రవరి 20 వ తారీకు ఉదయం సుదీర్ఘ ప్రయాణం మళ్ళీ మొదలయినది. . దారిలో NH 44 కు పది కి.మీ దూరంలోని వివేకానంద స్కూల్ వారు ఉదయం ఫలహారం తయారుచేసి ఉంచితే, వ్యానులో వెళ్లి తెచ్చుకొన్నారు, ఆ రాత్రి రోడ్ ప్రక్కన రోడ్డు పక్కన కృష్ణ మందిరంలో మకాము. పిల్లలు బట్టలు ఉతుక్కొన్నారు, స్నానాలు చేశారు. మందిరంలో పూజలు, భజనల్లో చాలా కుతూహలంగా పాల్గొన్నారు.

21 వ తారీకు ఉదయం బయలుదేరి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ఖిల్లాలో రామాలయం కళ్యాణ మండపంలో రాత్రికి విశ్రమించారు. వంశీధర్ కుమారుడు శ్రీరమణ శాండిల్య, తోడల్లుళ్ల అబ్బాయిలు చందు, మిక్కీ, శ్రీను మోటార్ సైకిళ్ళలో వచ్చి తనను కలిసి ప్రోత్సహించి సెలవు తీసుకున్నారు. రెండు రోజులు సైకిల్ యాత్రికులు అక్కడే సుఖంగా ఉన్నారు. పిల్లలు క్రమంగా సుదీర్ఘ ప్రయాణానికి అలవాటు పడుతున్నారు. రోజుకు సరాసరి 70 నుంచి 80 కి.మీ సైకిల్ తొక్కగలుగుతున్నారు. మొదట్లో అత్యుత్సాహంతో ఒక్కరోజే 120 కి.మీ. తొక్కిన సందర్భాలున్నాయి.

ఈ బృందం సభ్యలు రోజూ వేకువన అయిదు గంటలకే నిద్రలేచి వంతుల వారీగా పాత్రలు శుభ్రం చేసి, వంటలు చేస్తారు. డారిలో వారానికి సరిపడా కూరలుకొని వ్యాన్లో సర్దుతారు. చవకగా ఉన్నచోట దండిగా కొంటారు. కూర ముక్కలతో పప్పు దండిగా చేస్తారు. చెంచులు నిద్రలేవగానే ఆహారం తీసుకొంటారు. వారి పద్ధతిలోనే ఈ ప్రయాణంలోనూ అన్నం తింటారు. 10 గంటల సమయంలో తినడానికి కొంచెం ఆహారం వెంట తీసుకొని వెళ్తారు. యెంత దూరమైనా మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ రహదారి సమీపంలో చెట్లక్రిందనో, స్కూల్ భవనంలోనో, గుడిలోనో వెంట తెచ్చుకున్న భోజనం తిని కాసేపు విశ్రమిస్తారు. మరల రెండు గంటలకు ప్రయాణం కొనసాగిస్తారు. కొండయ్య వ్యాన్ ముందు వెళుతూంటుంది. వెనక పిల్లలు రోడ్ మార్జిన్ లో చీమల బారులాగా ఒకరివెనుక ఒకరు, చివరన వంశీధర్ వ్యాన్ వస్తుంది. వాహనరద్దీ ఎక్కువగా ఉన్న జాతీయ రహదారులు దాటవలసివస్తే, కూడలిలో ట్రాఫిక్కును ఆపి పిల్లలను దాటిస్తారు. అరుదుగా తప్ప గ్రామాల్లోపలికి వెళ్లరు. సాయంత్రం 5 గంటలకు అనువైన చోటు చూచుకొని హైవే పక్కనే టెంట్లు వేసుకొని విశ్రమిస్తారు. లేదా గుళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే విశ్రమిస్తారు. రాత్రివేళ కొండయ్య దంపతులతో ముగ్గురు బాలికలు పడుకొంటారు.

మగపిల్లలకు వేరుగా ఓక టెంట్. మిగిలిన ఇద్దరు ఆడపిల్లలు వంశీధర్‌తో పాటు అతని టెంట్లో పడుకుంటారు. మంచినీరు కొనడమో, దారిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రాగునీరు సౌకర్యం తారసపడితే అక్కడ పట్టుకోడమో చేస్తారు. పిల్లలకు కాఫీ, టీ అలవాటు చేయలేదు. వంశీధర్, సూర్య, కొండయ్య దంపతులు అరుదుగా టీ చేసుకొని తాగిన సందర్భాలు ఉన్నవి.

తోలి పదిరోజు ప్రయాణంలోనే పిల్లలు బట్టలు, షూస్ అన్నం తినే పళ్లేలు ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టి వచ్చారు. వాళ్లకు పోగొట్టుకున్నామనే చింత ఏమీ ఉండదు. టూత్ బ్రష్లు , పేస్ట్ సంగతి చెప్పనవసరం లేదు. ఆహార సేకరణ, వేటాడడం దశనుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. చిన్నపిల్లలు క్రమంగా క్రమశిక్షణ అలవర్చుకొంటున్నారు. వీళ్ళను కొస దాకా పట్టుకొని రావడం సాధ్యమవుతుందా?

తొలి మజిలీలు

23వ తారీకు ఉదయం సైకిల్ యాత్రికులు ప్రయాణమై శ్రీరాంసాగర్ ఆనకట్ట సమీపంలోని ఒక గ్రామం చేరారు. దత్తసాయి SRST Trust శ్రీ గోవిందు మహాదేవ్, శ్రీమతి స్వర్ణలత దంపతులు ఈ బృందానికి ఆతిధ్యం ఇచ్చారు.

24 ఉదయం బయలుదేరి ‘ఇచ్చోట’ గ్రామం షిర్డీసాయి మందిరంలో దిగారు. ఈ గుడిలో శ్రీ విస్తారి ఆరాత్రి ఆతిధ్యం ఇచ్చారు. 25 ఉదయం ఇచ్చోటలో స్థానికులు స్వచ్ఛందంగా ఉదయం ఫలహారం ఏర్పాటు చేశారు.

25 వ తారీకు ఉదయం మళ్ళీ యాత్ర కొనసాగించారు. ఆ రోజు ఆదిలాబాద్ టౌన్‌కు దగ్గరగా, తిర్మల్ ఫంక్షన్ హాల్ యెదుట క్యాంపు వేసుకున్నారు. SWASS సంస్థ ఆతిధ్యమిచ్చింది. తరువాత మజిలీ మహారాష్ట్రలో ఉంటుంది. ఆ రాష్ట్రంలో కరోనా విజృభించి ఉందనీ, ఆ రాష్ట్రం గుండా సైకిల్ యాత్ర కొనసాగించవద్దని హైద్రాబాదులో సలహాదార్లు సూచించారు. మెదక్ సరిహద్దుల్లో అతికష్టంమీద ఒక లారీ మాట్లాడుకొని సైకిళ్లన్నీ అందులోవేసుకొని, పిల్లలను వ్యాన్లలో ఎక్కించుకొని మహారాష్ట్రం దాటి మధ్యప్రదేశ్ సరిహద్దులో ఖేతి గావ్ అనే చిన్న గోండు తండా గ్రామంలో దిగారు. 220కి.మీ ప్రయాణం, ఆరుగంటలు పట్టింది. లారీ వాడు 22వేలు తీసుకున్నాడు.

ఖేతీగావ్ చేదు అనుభవాలు!

ఖేతి గావ్ అనే చిన్న గోండు తండా గ్రామ పంచాయతీ ఆఫీసులో రెండు రాత్రులు, ఒక పగలు ఉన్నారు. గోండు తండా పెద్దలు సాదరంగా ఆహ్వానించారు కానీ ఈ బృందంలో ఎదిగిన పిల్లలు అక్కడి యువతులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పెద్దగొడవైయింది. గోండుపెద్దల చొరవతో సమస్య సద్దు మణిగినా, హద్దులు దాటి ప్రవర్తించిన ముగ్గురు ఎదిగిన పిల్లలను మొదటి సారి భౌతికంగా దండించవలసి వచ్చింది. చెంచు పిల్లలకు లంబాడాలు తప్ప మరొక ఆదివాసీ ప్రజలను గురించి తెలియదు. మొదటిసారి గోండుతెగవారు పరిచయం అయ్యారు. వారి ఆతిథ్యం తెలిసింది. కొత్తచోట్లకు వచ్చినపుడు నడుచుకోవాల్సిన తీరు కొంచం తెలిసింది.

పిల్లలతో సమస్యలు

28 తారీకు ఉదయం బయలుదేరి బండల్ సియోని జిల్లాలో డెహరాడూన్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా టెంట్లు వేసుకున్నారు. ఇక్కడ నాగన్న, అంజి, మరొక పిల్లవాడు కొట్లాడుకొన్నారు. జంతుప్రవృత్తి, స్వార్థం, ఎవరికి వారే విడిగా జీవించడం చెంచుల జీవన విధానంలో భాగం. నాగన్న అనే పిల్లవాడు తనకు అన్నం పెట్టలేదని అన్నాడు. నిజమేమిటో వంశీధర్‌కు తెలియదు. మొత్తం యాత్రలో ఈ మాట, ఈ అభియోగం తనని కలచివేసిందని వంశీధర్ భావించాడు. ఆంజనేయులు అనే కుర్రాడు, మరికొందరు ఈ యాత్రాబృందంలో చంద్రకళ అనే 7 సంవత్సరాల చిన్నపిల్లతో అసహ్యంగా ప్రవర్తించి, వేధించారు. ఇటువంటి సందర్భాల్లో కఠినంగా నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ఒకడికి బాగా దెబ్బలు పడ్డవి. యాత్రలో రోజులు గడిచేకొద్దీ పిల్లలు క్రమంగా ఒకరితో ఒకరు సద్దుకొని పోవడం అలవాటు చేసుకొంటున్నారు. బాలికలు, మగపిల్లల్లో చిన్నవాళ్లు త్వరగా కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారగలుగుతున్నారు. 16 సంవత్సరాలు దాటిన పిల్లల్లో వ్యక్తిత్వం లక్షణాలు లక్షణాలు అభివ్యక్తమవుతూ, వాళ్లలో మార్పు తొందరగా రాలేదు.

(సశేషం)

Exit mobile version