[box type=’note’ fontsize=’16’] తమ కుమారుడు శ్రీ కాళిదాస్ వంశీధర్ – 2021 ఫిబ్రవరి 6 వ తారీకున చెంచుపిల్లలతో ప్రకాశం జిల్లా పాలుట్ల నుంచి బయల్దేరి, ఉత్తరాఖండ్‌లో భీమ్‌తల్ వరకు 3000 కి.మీ. సైకిళ్ళపై సాహసయాత్ర జరిపి ఏప్రిల్ 7న యాత్ర ముగించిన వివరాలను శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు పాఠకులకు అందిస్తున్నారు. [/box]
వేసవి యెండల ప్రతాపం!
[dropcap]మా[/dropcap]ర్చ్ 1వ తారీకు. ఉదయం ప్రయాణం సాగించారు. వేసవి యెండల ప్రతాపం మొదలయింది. ఏమయినా మధ్యాహ్నం 12 గంటలకు కాసేపు శ్రమనుండి విడుదల కోసం ఆగుతారు. జబల్పూర్‌లో నర్మదానదీ తీరంలో ఒక గురుద్వారాలో మకాము చేశారు. ఆ గురుద్వారా పెద్దలు చాలా సహాయం చేశారు. అక్కడ రెండురోజులు బాల సైకిల్ యాత్రికులు విశ్రాంతిగా ఉన్నారు. ఆ గురుద్వారాలోనే ఒక మహిళా కళాశాల ఎన్.ఎస్.ఎస్. విద్యార్థినులు క్యాంపు వేసుకొని ఉన్నారు. ఎన్.ఎస్.ఎస్. ఆఫీస్ డాక్టర్ అనురాధ గారు ఈ చెంచు విద్యార్థులకు కొన్ని విశేషాలు, వ్యక్తిత్వవికాసం గురించి చెప్పారు. ఆమె మాటాలను వంశీధర్ చెంచు పిల్లలకు వివరించి చెప్పాడు. చెంచు పిల్లలను చూడడం విద్యార్థినులకు కూడా కొత్తగా, వింతగా, సంతోషంగా అనిపించింది. సాహసయాత్ర బృందానికి కూడా మంచి అనుభవం. గురుద్వారావారే యాత్రా బృందానికి రెండు రోజులు భోజన వసతిసౌకర్యాలు ఏర్పాటుచేశారు. మలమూత్ర విసర్జనకు టాయిలెట్లను వాడుకోడం అప్పటికే పరిచయం అయినా, ఒక పెద్ద పిల్లవాడు ఆంజనేయులు కొంచం రోత చేసాడు. కావాలనే చేసాడేమో కూడా.
మణిదీప్ సింగ్ సహాయం!
యాత్రికుల బృందం క్యాంపు వేసుకోను అనువైన చోటు వెతుక్కుంటున్న సమయంలో మణిదీప్ సింగ్ అనే చిరువ్యాపారి పరిచయమై గురుద్వారా చూపెట్టడమే కాక, రెండు రోజులూ అప్పుడప్పుడు వచ్చి విచారించాడు. వ్యాన్ రిపేరు చేసుకోడంలో సహకరించి, చిన్న చిన్న విడిభాగాలు కూడా ఉచితంగా ఇచ్చాడు. మూడురోజులు గురుద్వారాలోనే గడిపి, నాలుగవ తారీకు ఉదయం సాహస యాత్రికులు బయలుదేరారు.
బయలుదేరిన కాసేపటికి కొందరు పిల్లలు తమ గుర్తింపు కార్డులను గురుద్వారా లోనే విడిచిపెట్టినట్లు తెలిసింది. కొండయ్య, మణిదీప్ సింగ్ వెనక్కివెళ్లి వాటిని తీసుకొని వచ్చారు. ఈ యాత్రలో సాధారణ ప్రజలు తరచూ చిన్న చిన్న సహాయాలు చేశారు. కార్ల వాళ్ళు డారిలో ఈ బృందాన్ని ఆపి వీడియోలు తీసుకోడం వంటి చర్యలవల్ల చేరవలసిన ప్రదేశానికి సమయానికి చేరలేక పోయేవాళ్లు. మణిదీప్ సింగ్ వంటి సామాన్యులు తరచూ ఏదో ఒక సహాయం చేసారు, దారి చూపుతూ వచ్చారు.
పోలీసుల సహాయం!
4వ తారీకు మధ్యాహ్నానికి మధ్యప్రదేశ్‌లో గోశాల్పూర్ చేరారు. హైవే పోలీస్ జైనమందిరంలో ఉండడానికి సహాయపడ్డారు. జైనమందిరంలో వసతి దొరికింది. గోశాల్పూర్ వెళ్లే దారిలో ఒక ఆంధ్ర పూజారి తారసపడి బృందంలో అందరికి మినరల్ వాటర్ బాటిల్స్ కొనిపెట్టాడు. ఆయన విశాఖ వారట. హైవే నంబర్ 34కు సమీపంలో కట్నికి దగ్గరలో టోల్ ప్లాజా నిర్మాణం జరుగుతోంది. ఆ సమీపంలోనే వీళ్ళు క్యాంప్ వేసుకున్నారు. కట్నిలో ఆ సాయంత్రం అద్భుతమైన అనుభవం. Robinhood Army అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు పిల్లలకు స్నాక్స్ తెచ్చిచ్చారు.
5వ తారీకు NH34 లో కట్ని నుంచి మైహర్ వెళ్లే మార్గంలో యు.పి. వైపు ప్రయాణం సాగించారు. ఆ దినం పిల్లలు 80 కి.మీ సైకిల్ తొక్కారు. దారిలో ఎదురు వైపునుంచి wrong side నుంచి ఒక ఆటో, దానివెనుక మోటార్ సైకిల్ వచ్చి ఒక పిల్లవాడిని గుద్దింది, ఆటోవాడిని మోటార్ సైకిల్ గుద్దింది. హైవేలో ఎదురుగా బండ్లు వస్తాయని పిల్లవాడు ఊహించలేదు. వాడికి మోకాలికి చిన్నదెబ్బ తగిలింది. రెండుగంటలు వ్యాన్లో కూర్చోబెట్టి తీసుకొని వెళ్లారు. అందరు తొక్కుతుంటే వాడూ తిరిగి సైకిల్ ఎక్కాడు. 5వ తారీకు ఉదయం NH 34లో కట్ని నుంచి ఉత్తరప్రదేశ్ దారిపట్టి మధ్యాహ్నం మిహిర్ అనే చోట విడిదిచేసారు. ఈ రోజు పిల్లలు 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు.
అదృష్టం, పెనుప్రమాదం తప్పింది
6 ఉదయం బయలుదేరి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో బచోలిలో క్యాంపు వేసుకున్నారు. 8వ తారీకు హై రోడ్డుమీద మీద వెళుతున్నప్పుడు వంశీధర్ వ్యాన్ టైర్ స్లిప్ అయి రోడ్డు దిగి చాలా లోతుగావున్న పొలాల్లోకి జారి రోడ్డునుంచి చాలా పల్లంలోకి దిగిపోయింది. అదృష్టవశాత్తు కారు పొర్లికింతలు పెట్టకుండా కొంచం ముందుకుపోయి సరస్సు ముందు నిలబడింది. పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. పిల్లలు అగ్రగామిగా వెళుతున్న కొండయ్యకు ఫోన్ చేసి చెప్పారు. ఆతను పిల్లలను ఒకచోట నిలబెట్టి వెనక్కివచ్చి, వ్యానును రోడ్డుమీదికి తెచ్చే ప్రయత్నంలో సహాయపడ్డాడు. ఈ యాత్రలో ఇదొక అనుభవం.
ప్రయాగ పుణ్యక్షేత్రం చేరారు!
9వ తారీకు అలహాబాదు చేరి, (ప్రయాగరాజ్) మార్వాడి అతిథిగృహంలో దిగి, ఆ క్షేత్రంలో రెండు రోజులున్నారు. 11 ఉదయం వారణాసికి ప్రయాణమయ్యారు. దారిలో నౌధన్‌లో ఆగారు. 12వ తారీకు నౌధన్ నుంచి వారణాసి నగరం పొలిమేరల వరకు 91 కి.మీ సైకిల్ తొక్కారు. రాత్రి క్యాంపుకు సరైన స్థలం దొరక్క పిల్లలు అదనంగా గంటపైగా సైకిల్ తొక్కవలసివచ్చింది. అక్కడ స్వర్ణ మహామందిర్ ఆలయం నిర్మాణం జరుగుతున్న స్థలంలో క్యాంపు వేసుకున్నారు. ఆలయ నిర్మాణ శ్రామికులకు, అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సైకిల్ యాత్ర త్ర బృందానికి కూడా శ్రామికులతో కలిపి భోజనం పెట్టారు.
వారణాసిలో నాలుగురాత్రులు!
13, 14వ తారీకుల్లో పిల్లలు వారణాసిలో మార్గాయాసం తీరేవరకు మహామందిర్ ఆలయ నిర్మాణం జరుగుతున్న చోట ఉండి, వారణాసి నగరమంతా తిరుగుతూ, రాత్రిపూట క్యాంపుకు వచ్చి కార్మికులతోపాటు భోజనం చేశారు. మరుసటిరోజు వారణాసి నగరదర్శనం చేస్తూ, గంగానది తీరంలోని ఒక ఘాట్ వద్ద ఉండదల్చుకొన్నారు. ఒక ఆలయం పెద్దలే ఉండడానికి, భోజనానికి ఏర్పాట్లు చేశారు. పిల్లలు గంగానదిలో స్నానాలుచేసి, విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణను దర్శించుకున్నారు. ఇక్కడే పిల్లలు కాస్త ఓర్పు లేకుండా, మాట వినకుండా గంగానదిలో నీళ్లు తాగారు. దాదాపు నెలా పదిహేను రోజులుగా సైకిల్ యాత్రలో ఉన్నారు కనక, బెనారస్ నగరంలో ఆటవిడుపు! 15వ తారీకు బెనారస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు చెంచుపిల్లల్తో కొంతసేపు గడిపి, మంచి విషయాలు చెప్పారు.
అయోధ్యకు ప్రయాణం!
16వ తారీకున యాత్రికులు అయోధ్యకు ప్రయాణమయ్యారు. ఆ రోజు దాదాపు 118 కి.మీ. సైకిల్ తొక్కి రికార్డు సృష్టించారు. పూర్తిగా అలసి సొలసిన పిల్లలు రాత్రికి పాస్ గావ్ కాళీమందిరంలో ఒళ్ళు తెలీకుండా పడిపోయారు. ఈ సాహస యాత్రలో తరచూ బృందం యాదృచ్ఛికంగానే అయినా కాళీమందిరాల్లోనే రాత్రివేళ విశ్రమించారు. సాధారణంగా ఉత్తరదేశంలో ఆలయ పూజారులు, నిర్వాహకులు యాత్రికులకు సహాయపడతారు, విశ్రమించడానికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. పాస్ గావ్‌లో సైకిల్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న యాదవ కుటుంబం ఈ బృందాన్ని చాలా ప్రేమగా చూసింది. 17 రాత్రి వినోద కార్యక్రమాలు, పిల్లల పాటలతో సంతోషంగా గడిచింది. ఉదయం ఆ యాదవ కుటుంబంవారు సైకిల్ యాత్రికులకు జిలేబీలు, చెరకురసం ఫలహారం ఏర్పాటుచేశారు, చెంచు పిల్లలకు వీటి రుచి తెలీక అంత ఇష్టంగా తినలేకపోయారు. 18వ తారీకు రాత్రి కూడా పాస్ గావ్ కాళీమందిర్ లోనే, 19వ తారీకు ఉదయం మళ్ళీ సైకిళ్లెక్కారు. రాత్రికి బైర్గల్, రామ్ జానకీమార్గ్‌లో, పొలాల్లో ఒక ఆఫీసు వెనుకవైపు టెంట్లు వేసుకున్నారు. ఈ బృందంలో జయంతి సూర్యా ఈరోజు ఎందుకో చాలా చిరాకు పడ్డాడు. వంశీధర్ సుర్యాను చాలా దూరం నడిపించుకొని, దూరంగా తీసుకొనివెళ్ళి సమాధాన పరిచాడు. ఇల్లు విడిచి నెలన్నర అవుతోంది. రోజూ ప్రయాణమే. శ్రమ కూడా ఎక్కువే. పాపం తాను ఇంత శ్రమకు ఓర్చుకొన్నవాడు కాదు. మొత్తమ్మీద సమాధానపడ్డాడు.
20వ తారీకు అయోధ్యలో సీతారాంధామ్‌లో రాత్రి మకాం చేశారు.
ప్రయాణంలో రెండు అనుభవాలు!
ఈ యాత్రలో యెక్కడి కక్కడ దారిలో కావాల్సిన సామగ్రి కొనడమే. 21వ తారీకు సెల్లరులో (Celler) కార్డు మీద చౌక బియ్యం దుకాణంలో బియ్యం కోసం ప్రయత్నించారు. ఒక సాధారణ యువతి అప్పుడే తాను కార్డు మీద తీసుకొన్న రేషన్ బియ్యం మొత్తం 30 కిలోలూ వీళ్లకు ఇచ్చేసింది, కొన్నధరకే. తన పేరు కుమారి సోనీ చాయ్ వాలా అట. ఈ బృందం ప్రయాణంలో తరచు ఇటువంటి అవ్యాజమైన ప్రేమను, సుహృద్భావాన్ని చవిచూసింది.
ఇక్కడే హై రోడ్డుమీద ఒకడు తాను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌నని, తనకు పెద్దమొత్తం లంచం ఇస్తే తప్ప రెండు మారుతీ వ్యాన్లను సీజ్ చేస్తానని మొండిగా బెదిరించాడు. అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నా, వాడు చాలా దౌర్జన్యం చేశాడు. దాదాపు అరగంట పైగా కాలయాపన జరిగింది. ఇంతలో ఒక పోలీస్ అధికారి మోటార్ సైకిల్ మీద అటువైపు రావడం గమనించి, వాడు తన బండిమీద వెళ్ళిపోయాడు. పోలీస్ అధికారి విషయం తెలుసుకొని వంశీధర్‌ను తన బండిమీద వాడు వెళ్లిన వైపు తీసుకొని వెళ్ళాడు. కొంతదూరంలో టీ షాపు వద్ద కూర్చొని వాడు కన్పించాడు. పోలీస్ ఆఫీసర్ ఆ నకిలీ ఇన్‌స్పెక్టర్‌ని నిర్బంధించి తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా ఈ బృందం సభ్యులు పెద్ద చిక్కునుంచి విముక్తులయ్యారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శైలేంద్రకుమర్ ఈ బృందానికి దేవుడులాగా ప్రత్యక్షమై సహాయం చేశాడు.
సరయూ తీరంలో!
ఎక్కడ పాలుట్ల, ఎక్కడ అయోధ్య! పిల్లలు ఎప్పడూ కలలో గుడా ఊహించివుండరు. 23వ తారీకు నుంచి నాలుగు రోజులు అయోధ్యలో సరయు తీరంలోని సంత్ తులసీ ఘాట్‌లో ఉన్నారు. సరయు నదిలో స్నానాలు చేశారు. పెద్దపిల్లలు కొందరు నదిలో ఈతలాడాలని మొండికేశారు. కానీ వంశీధర్ వాళ్లకు నచ్చచెప్పి వెనక్కి తీసుకొని వెళ్ళాడు. మరుసటి రోజు అక్కడే నదిలో రెండు శవాలు తేలుతూ కనిపించాయి. ఈతకు వచ్చినవారని తెలిసింది. అయోధ్యలో రెండు అదనపు సైకిళ్ళు భారం కావడం వల్ల వాటిని ట్రాన్స్‌పోర్ట్‌లో హైద్రాబాదు పంపించారు. అయోధ్య చిన్న టౌన్, చాలా అందంగావుంది, ఇక్కడ ఎన్నో గుళ్ళున్నాయి. చూడవలసిన ప్రదేశం. పిల్లలు సైకిళ్ళమీద పాత టౌన్, కొత్త టౌన్ అంతా తిరిగి చూసారు. ఈ నాలుగు రోజులు పిల్లలు స్వయంపాకమే. 25వ తారీకు ఉదయం అయోధ్యలో బయలుదేరారు. 26వ తారీకు సాయంత్రానికి కమలాపురం సమీపంలో సత్యేద్రసింగ్ SVVM High School వద్ద, హైవే పక్కన టెంట్లు వేసుకొన్నారు. వాహనాల రద్దీని తప్పించుకోను లక్నో నగరంలోకి వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్డులో వెళుతున్నపుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ బృందాన్ని కలిసి, ఫోటోలు తీసుకొని, మాగ్లాగంజ్‌లో రాత్రికి ఉండి, నైమిశంలో రెండురోజులు స్థిమితంగా ఉంటే, తాను అధికారులను కలిసి ముఖ్యమంత్రి గారి వద్దకు ఈ బృందాన్ని తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి సైకిళ్ళ మీద ఇంత దూరం రావడం చూసి ఆ జర్నలిస్టు నిజంగానే ఆశ్చర్యపోయారు. మాగ్లాగంజ్‌లో ఒక డాబా ప్రాంగణంలో టెంట్లు వేసుకొని ఆ రాత్రికి ఉన్నారు. అక్కడ వంశీధర్ అస్వస్థతకు గురై విరేచనాలు కావడంతో మాగ్లాగంజ్‌లో ఆర్ఎంపి వద్ద వైద్యం చేయించుకొని, సెలైన్ పెట్టించుకుని కాస్త నెమ్మదించాక క్యాంపు వద్దకు చేరాడు.
నైమిశంలో నాలుగు రోజులు
28వ తారీకు సాయంత్రానికి నైమిశారణ్యం చేరి, ఆంధ్రాశ్రమంలో దిగారు. నైమిశం చిన్న టౌన్. నైమిశంలో ఆశ్రమాలకు సమీపంలోనే గోమతీనది ప్రవహిస్తోంది. అక్కడ స్నానఘట్టంలో పిల్లలు స్నానం చేస్తూ నదిలో యాత్రికులు వదలిన గుడ్డలు దాదాపు ఒక టైరుబండికి సరిపడా వెలికితీసి గట్టుమీద గుట్టలుగా వేశారు. స్థానిక పత్రికలు గోమతి ఘాట్లో చెంచు పిల్లలు మురికినంతా తీసి, శుభ్రం చేసిన కథనం ఫొటోలతో సహా, పత్రికలు వార్తలు ప్రచురించాయి. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది కూడా. హోలీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు తీరిక లేకుండా ఉన్నారనీ, రెండు రోజులు ఓపిక పడితే వారు పిలిపిస్తారనీ కబురువచ్చింది. తమ ఆశ్రమంలో అన్ని రోజులు ఉండేందుకు వీలుపడదని, ఖాళీ చెయ్యమని ఆంధ్రాశ్రమంవారు వత్తిడిచేస్తే, సమీపంలోని మాతాజీ ఆశ్రమంవారు ఆహ్వానించారు. ఇంతలో సైకిల్ యాత్ర బృందానికి రక్షణగా పోలీసు బందోబస్తు ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి గారిని కలుసుకోడం ఖాయమైనట్లు తెలిసింది.
యోగి ఆదిత్యనాథ్ గారితో 40 నిమిషాలు
ఏప్రిల్ 2వ తారీకు ఉదయం జిల్లా కలెక్టర్ లక్నోకు తీసుకొని వెళ్ళడానికి ప్రతేకంగా ఏ.సి. వాహనాన్ని ఏర్పాటుచేశారు. దారిలో పిల్లలకు టిఫిన్ పెట్టించి ఉదయం 9 కల్లా కాళిదాస్ మార్గ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి నివాసానికి తీసుకొని వెళ్లారు. సమావేశం పది నిమిషాలు ఉంటుందనీ విధివిధానాలు పిల్లలకు చెప్పమని అధికారులు వంశీధర్‌ను కోరారు. సరిగ్గా ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలోకి తీసుకొని వెళ్లారు. అందరూ మాస్కులు ధరించి వారి సముఖానికి వెళ్లారు. విశాలమైన హాల్లో పిల్లలను కూర్చోబెట్టి ముందుగా వారికి, ఎన్నో విశేషమైన తినుబండారాలు పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి ఈ యాత్ర తలపెట్టిన కారణం అడిగి తెలుసుకున్నారు.
అడవులకు పరిమితమైన చెంచుపిల్లలకు భారతదేశంలోని వివిధ ప్రదేశాలను, ప్రజలను పరిచయం చేసే ఉద్దేశంతోనే తను ఈ యాత్రకు బయలుదేరినట్లు వంశీధర్ వివరించాడు. వారు ఆర్ధిక సహాయం చేస్తామని చెప్పగా డబ్బు అక్కరలేదనీ, ఢిల్లీ వెళ్ళినపుడు ప్రధానమంత్రిని కలుసుకొనే అవకాశం కల్పించమని వంశీధర్ కోరాడు. వారు చూస్తామనిచెప్పి, మా రాష్ట్రంలో ఉన్నంతసేపు మీకు ఏ సహాయం కావాల్సినా చేస్తామని చెప్పి, పిల్లలను తన చుట్టూ ఉంచుకొని ఫోటోలు తీసుకున్నారు. ఈలోపే పిల్లకు మంచి బట్టలు తెప్పించి ఇచ్చారు. తెప్పించినవి సరిపోకపోతే క్షణాల్లో మళ్ళీ తెప్పించి మొత్తం బృందంలో ప్రతిఒక్కరికీ బహూకరించారు. పది నిమిషాల ఇంటర్వ్యూ 40 నిమిషాలు జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత అధికారులు ఈ యాత్రాబృందాన్ని నైమిశానికి తీసుకొనిపోతూ, దారిలో అధికారులు జిల్లాకేంద్రంలో మధ్యాహ్న భోజనాలు పెట్టించారు. అనుకోకుండా తన బృందానికి గొప్ప వరం లభించినట్లు వంశీధర్ భావించాడు.
3వ తారీకు ఉదయం సైకిల్ యాత్రికులు నైమిశంనుంచి ఉత్తరాఖండ్ ప్రయాణమయ్యేవరకు ఈ బృందానికి పోలీస్ బందోబస్తు కొన సాగింది.
ఆంజనేయస్వామి ఆలయంలో
ఆ సాయంత్రానికి జిల్లా పూర్వి ఠానా బరేలి టౌన్‌కు 30 కి.మీ దూరంలో హైరోడ్డుమీద వున్న ఆంజనేయస్వామి గుడివెనుక పొలంలో టెంట్లు వేసుకుని, వంటచేసుకొని భోజనాలు చేశారు. ఇది జోషి మఠ్‌కి వెళ్లే హైవే. భగవంతపూరు కుందాలో పిల్లల కోసం మిఠాయి వంటి తినుబండారం ఛీవ్ డా కట్టా మీఠా 25 కేజీలు ఆర్డర్ చేస్తే మరుసటిరోజు ఉదయం తయారుచేసి ఇచ్చారు.
5వ తారీకు ఉదయం భావాన్పూర్ నుంచి బయలుదేరి రాత్రి 9 వరకు, క్యాంపుకు అనువైన ప్రదేశం దొరక్క, పిల్లలు రాత్రి చాలా సమయం వరకు సైకిల్ తొక్కక తప్పిందికాదు. రాత్రి 9 గంటలకు ఉత్తరాఖండ్ లోని మాత ఆహ్లదు అనే ఊళ్ళో గురుద్వారాలో విశ్రమించారు. ఇది యూ.పి ఉత్తరాఖండ్ సరిహద్దులో పర్యాటకుల తాకిడి లేని ప్రదేశం.
ఓషో ఆశ్రమంలో
7వ తారీకు భీంతల్ చేరి, ఓషో ఆశ్రమంలో దిగారు. భీంతల్ సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తులో ఉంది. ఓషో ఆశ్రమంలో రెండురోజులున్నారు. ఆశ్రమం చాలా అందంగా ఉంది. ఇంత ఎత్తయిన ప్రదేశానికి సైకిళ్ళు తొక్కుకుంటూ రావడమే ఈ చెంచు పిల్లల జీవితాల్లో ఒక మహాద్భుతం. రెండు రోజులు భీంతల్‌లో తిరిగారు. దూరంగా, మంచు పర్వతాలు హిమాలయాలు, నిర్మలమైన ఆకాశం, భీంతల్ సరస్సు అన్నీ పిల్లలకు అద్భుతంగా అనిపించాయి.
కోవిడ్ సోకి హాస్పిటల్లోజులు 18 రోజులు
భీంతల్ లోనే సైకిల్ సాహస యాత్రికుల బృందంలో కొందరికి జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. ఆశ్రమం నిర్వాహకులు నైనిటాల్ వెళ్లి హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు. భీంతల్‌కు నైనిటాల్‌కు మధ్య దూరం 23 కిమీ మాత్రమే. రక్తపరీక్షలో అందరికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ బృందంలో శ్రీమతి పోతమ్మ, మరో ముగ్గురు పిల్లలకు మాత్రం నెగటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరిని అప్పుడే కొత్తగా ఎర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. వ్యాధి లేనివారిని కూడా అదే సెంటర్లో విడిగా ఉంచారు. ఒక్క పేరాసిటమోల్ టాబిలెట్‌తో రోగాలక్షణాలు మాయమైనాయి. వంశీధర్‌కు తీవ్రమైన కరోనా లక్షణాలున్నందువల్ల తనను ఉత్తరాఖండ్ వ్యాపార కేంద్రమైన హల్ద్వానీలో ప్రభుత్వ వైద్యకళాశాల వైద్యశాలకు తరలించారు. వంశీధర్ వెంట జయంతి సూర్యా కూడా వెళ్ళాడు సహాయంగా. సుర్యాకు పాజిటివ్ వచ్చినా కరోనా లక్షణాలేవీ లేవు. మొత్తం 24 మందిలో వంశీధర్‌ను ఒక్కడికే కరోనా చాలా తీవ్రంగా బాధించింది. ఆ బృందంలో తనొక్కడే 50 ఏళ్ల వాడు.
కబురు హైదరాబాద్‌కు తెలిసింది!
స్థానికవార్తా పత్రికలు సైకిల్ యాత్రికులు కోవిడ్ బారినపడిన విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల పత్రికల్లో, టీవీల్లో వివరంగా వార్తలు ప్రసారమయ్యాయి. వంశీధర్‌కు మంచి వైద్యం అందించమని ఆంద్రప్రదేశ్ అధికారులు, శ్రీమతి రూపా వెంకట్ గారి ద్వారా ఉపరాష్ట్రపతి ఆఫీస్ నుంచి కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమాచారం వెళ్లింది. హైద్రాబాదు మిత్రులు శ్రీహర్షవర్ధన్, మరికొందరు హల్ద్వానీలో మంచి వైద్యం జరిగేట్లు చూసారు. హాస్పిటల్ భోజనం సహించకపోవడంతో, సూర్య డాక్టర్ అమ్మానాన్నలు తమ పలుకుబడితో ఒక ఉడిపి హోటల్ నుంచి రెండుపూటలా సూర్యాకు, వంశీధర్‌కు భోజనం పంపే ఏర్పాటు చేశారు. వంశీధర్ వైద్యకళాశాల హాస్పిటల్లో ఇన్‌పేషెంట్‌గా 20 రోజులు (8 నుంచి 25 వరకు) ఉండి, స్వస్థత చేకూరిన తరువాత డిశ్చార్జ్ అయ్యాడు. ఉడిపి భోజనం బిల్లు 13 వేలు అయినా మనవైపు అన్నం తినగలిగారు ఆ జ్వరం రోజుల్లో. ఇక చెంచు పిల్లల్లో అసలు రోగ లక్షణాలే లేవు.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సేవలందించాయి
ఉత్తరాఖండ్ ప్రభుత్వం, హాల్ద్వాని స్వచ్ఛంద సంస్థలు ఈ సైకిల్ యాత్రికులను చాలా బాగా చూచుకొన్నవి. వంటిమీద బట్టలతో హాస్పిటలుకు పంపించినా, అందరికి మూడు జతల కొత్తబట్టలు, నిత్యావసరాలైన సోపులు, ప్రతివస్తువు ఏ లోపం లేకుండా ప్రభుత్వాధికారులు చూశారు కూడా. జిల్లా కలెక్టర్ స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. పిల్లలు ఆడుకోడానికి ఆటవస్తువులు, టీవిలు ఏర్పాటు చేశారు. వాళ్ళసలు homesick కాలేదు.
మార్చి 26 వంశీధర్, సూర్య హాస్పిటల్ నుంచి విడుదలయి, నైనిటాల్లో చెంచు పిల్లలను కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైకిల్ సాహస యాత్రికుల బృందం తిరిగి రావడానికి అవసరమైన ఆర్ధిక సహాయం చేయడంతో ఒక వ్యాన్‌ను, ముగ్గురు డ్రైవర్లను మాట్లాడుకుని, భీంతల్‌లో సైకిళ్లను ట్రాన్స్‌పోర్ట్‌లో ఎర్రగుంట పాళేనికి పంపించివేశారు. మార్చ్ 27 సాయంత్రం ఓషో ఆశ్రమం ఖాళీచేసి, ఆశ్రమ నిర్వాహకుల వద్ద సెలవు పుచ్చుకొని తిరుగు ప్రయాణమైనారు. 30వ తేదీ హైద్రాబాదు, శ్రీశైలం మీదుగా ఎర్రగుంటపాళెంలో చెంచులందరినీ దింపి, కొండయ్య దంపతులనిచ్చి పాలుట్ల పంపి, సూర్యను హైద్రాబాదులో అమ్మానాన్నలకు అప్పగించి, వంశీ మే 1 వ తారీకు ఉదయం హైద్రాబాదులో తన కుటుంబాన్ని కలుసుకొన్నాడు.
పాపం, వంశీధర్ భార్య అప్పటికే కరోనాతో ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండి వైద్యం చేయించకొంటోంది. వంశీధర్‌కు ఇంకా కరోనాతో పెరిగిన బ్లడ్ షుగర్ పూర్తిగా అదుపు కాలేదు.
అజేయుడు చిన్నారి హనుమంతు
తనవెంట యాత్రకు వచ్చిన చిన్నారులలో 11 సంవత్సరాల హనుమంతు యాత్ర మొత్తం దూరం సైకిల్ తొక్కాడు. మిగతా వాళ్లు గాయపడినపుడు, అలసిపోయినప్పుడు కాస్త దూరం అయినా వ్యాన్లో కూర్చున్నారు. కొందరు పెద్ద పిల్లలు ఆరోగ్యం బాగున్నా పంతానికి వ్యాన్లో కూర్చుంటామని పేచీలు పెట్టారు గానీ ఈ బాలుడు మాత్రం ఒక్క పర్యాయం కూడా వ్యాన్ ఎక్కకుండా పాలుట్ల నుంచి బీమ్‌తల్ వరకు 3000 వేల పైచిలుకు కి.మీ దూరం సైకిల్ తొక్కాడు.
అణకువ, సహనం, వినయం ఈ బాలుడిలో సుగుణాలు. పాలుట్లలో నిత్యం పరుగు ప్రాక్టీస్ చేసేప్పుడు కూడా అందరికంటే మొనగాడుగా నిలిచేవాడు. టీం స్పిరిట్, నాయకత్వ లక్షణాలు అపరిమితంగా ఉన్నవాడు, ప్రోత్సాహం ఉంటే గొప్ప క్రీడాకారుడు కాగలదని వంశీధర్ మెచ్చుకున్నాడు.
చిన్నారి క్రీడాకారులు
మండల రాజేష్ అనే 7 సంవత్సరాల బాలుడు కూడా కఠిన పరిశ్రమ చేస్తాడని, నాయకత్వ లక్షణాలున్న బాలుడని వంశీధర్ అభిప్రాయం. ఈ బృందంలో సభ్యుడైన కుడుముల చిన్నఆంజి 11 సంవత్సరాల వ్యవసాయకూలి, మద్యానికి అలవాటుపడిన తండ్రికి పిల్లలమీద శ్రద్ధ లేదు. ఈ బాలుడికి దేన్నయినా వెంటనే నేర్చుకోగల ప్రజ్ఞ ఉంది. 16 సంవత్సరాల వయసు ఆంజనేయులులో చాలా మార్పు వచ్చిది. listening skills పెరిగాయి. 7 ఏళ్ల చంద్రకళకు వంశీధర్ ‘పరుగులరాణి’ అని పేరుపెట్టాడు. 2020 నుంచి మేరథాన్ పరుగు పందెంలో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తోంది. ఆశయ సాధనకోసం దృఢంగా నిలబడగల శక్తి ఉంది. 7 ఏళ్ళ నిమ్మల అంజనేశ్వరిని యాత్రలో అందరు వంటలక్క అనే పిలిచేది. గృహకృత్యాల్లో ఆరితేరింది. ఇంట్లో అన్నీ అననుకూల పరిస్థితులే. ఐనా నిబ్బరంగా ఉంటుంది. మరో 7 ఏళ్ళ బాలిక చెంచులక్ష్మి, సరైన పోషకాహారం లేకపోయినా మంచి దేహబలం కలిగిన బాలిక. మారథాన్‌కు తయారైనది. మొదట తండ్రి ఈ పాప శిక్షణకు, చదువుకు వప్పుకోలేదు. వంశీధర్ చెంచు పెద్దలచేత చెప్పించి పరుగుపందెంలో శిక్షణ ఇప్పించాడు. ఆ అమ్మాయిని నేస్తులు ఎలుగుబంటని పిలుస్తారు. చెవుల అంజలి సుమారు 13 సంవత్సరాల బాలిక. దూకుడెక్కువ. పిలిచి తగాదా పెట్టుకునే వ్యవహారం. ఈ అమ్మాయికి ఏదో కడుపులో వ్యాధి అని తల్లితండ్రులు రోగిగా ముద్ర వేశారు. ఈ బాలికకు 83 రోజుల సైకిల్ యాత్రలో ఒకసారి కూడా పాలుమాలిక చేయలేదు. ఆఖరుగా దివ్యభారతి, 12 ఏళ్ళ వయసుకే ఎన్నో కష్టాలు అనుభవించి వ్యవసాయకూలీగా మారింది. ఈ యాత్రలో పాల్గొన్న తత్వాత, దివ్యభాత్రాతి మరింత సాధుప్రవర్తన, దివ్యత్వం అలవాటు చేసుకున్నదని అంటాడు వంశీధర్. యాత్రలో అందరూ కొంచం హిందీ అర్థం చేసుకొనే వరకు వచ్చారు. హైదరాబాద్, అయోధ్య, లక్నో, వారణాసి వంటి నగరాల గుండా ప్రయాణించారు. అలహాబాద్, వారణాసి, నైమిశారణ్యం, భీంతల్, జబల్పూర్, వంటి కొత్తప్రదేశాలు చూచారు. ఉత్తరాఖండ్‌లో క్షేత్రదర్శనం, కృష్ణ, గోదావరి, గోమతి, యమునా, గంగానదులను, పెద్దపెద్ద ఆనకట్టలు చూశారు. గోండుల గ్రామంలో రెండు రోజులు గడిపారు. వీరి యాత్ర వార్తలను ఉత్తరభారతంలో టీవీ, ప్రింట్ మీడియా ప్రముఖంగా ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలుసుకోడం, ఒక అపూర్వవిషయం. 8000 వేల అడుగుల ఎత్తుకు, 3000 వేల పైచిలుకు కి.మీ దూరం సైకిళ్లలో ప్రయాణించడం సాధారణమైన విషయంకాదు ఈ చెంచుపిల్లలకు. సీతాపూర్ రోడ్డులో ఒక ముస్లిం సోదరుడు అయాచినంగా 2 లీటర్ల మంచినీరు బాటిళ్లు, సోమాసాలు కొనిపెట్టాడు. కొన్నిచోట్ల దారినిపోయేవాళ్లు పిల్లలకు స్నాక్స్ కొనిపెట్టారు. అయోధ్యలో తెలుగు యాత్రికులు తారసపడి 1800 రూపాయలిచ్చారు. వారణాసిలో లక్ష్మిపుష్ప అనే యువతి గంగానది ఆవలివైపుకు వెళ్ళడానికి పడవ వాణ్ని పరిచయం చేసింది. ఆతను సంతోషంగా నది దాటించాడు. పడవ మనిషి చాలా భాషలు మాట్లాడుతాడు. హాల్డ్వానీ అనే చోట ఒక చెంచు పిల్లవాడు పొరపాటుగా సైకితో పుష్ కార్ట్‌ను ఢీకొట్టి, పొరబాటు గ్రహించి అతని వస్తువులన్నీ తీసి జాగ్రత్తగా పెట్టాడు. ఈ యాత్రలో నేర్చుకొన్న మంచి విషయం యిది. హనుమాన్ గఢ్ హనుమాన్ ఆలయలో సన్నని ఇసుక, ధూళి చాలా ఇబ్బందిపెట్టింది. అన్నిటికన్నా ఒక విషయం తనను చాలా బాధించిందని వంశీధర్ ఆన్నాడు. డూన్ స్కూల్ వద్ద క్యాంపు వేసుకున్నప్పుడు తనకు భోజనం పెట్టలేదని ఒక చెంచు పిల్లవాడు తనమీద ఆరోపణ చేయడం చాలా బాధించిందని, ఏప్రిల్ 6 న ఉద్ధమ్ పూర్లో వాతావరణ కాలుష్యం దారుణంగా ఉందని అన్నాడు. రాజేష్ అనే కుర్రాడు తరచూ వేగంగా వెళ్లే వాహనాలను దాటుకొని పోవడంలో పడిపోవడం జరిగేది. చిన్నపిల్లల సైకిళ్ళు చిన్నచిన్న రిపేర్లు తప్ప చివరివరకు కొత్తవిగానే ఉన్నాయి. బ్రేకు రబ్బర్లు మార్చడం వంటి రిపేర్లు తప్ప. పెద్దపిల్లలు గుంటమిట్ట చూడకుండా తోలడంవల్ల రిమ్ములు మార్చవలసివచ్చింది. పోతమ్మ (కొండయ్య భార్య)ఈ యాత్రలో పర్సనల్ హైజిన్ చాలా నేర్చుకున్నది. అయితే ఆమెకు అందరిని సమానంగా చూడడం తెలీదు. బంధువుల పిల్లలను ప్రత్యేకంగా చూసేది. ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణ ప్రజలు చాలా దూరాభారాలు వెళ్ళడానికి గూడా సైకిల్ వాడతారు.
ఈ సైకిల్ సాహసయాత్రలో వంశీధర్ తనకు గుర్తుండిపోయినవి భీంతల్ మౌంట్ వ్యూ అతిథిగృహంలో నిలబడి చూచిన హిమాలయాల అపూర్వ దృశ్యాలు, యుపి సియంను కలుసుకోడం, పోలీస్ ప్రొటెక్షన్, గోమతిఘాట్ ను పిల్లలు శుభ్రం చేయడం వంటి దృశ్యాలన్నాడు. కరోనా వల్ల ఇబ్బందులు పడినా గూడా క్షేమంగా ఇల్లు చేరడానికి సహకరించిన ఆంధ్రపేశ్ ప్రభుత్వ గిరిజనశాఖ అధికారులు, మిత్రులు, తన కుటుంబ సభ్యులకు రుణపడ్డానన్నాడు. మొత్తంమ్మీద అప్పుడప్పుడే కరోనా తలయెత్తుతున్నవేళ యాత్రకు బయలుదేరడం దుస్సాహసమే. అందుకే దీన్నొక ఎస్కపేడ్ అననాలి.
పాలుట్లలో చెంచుపిల్లల్లు కొత్త సైకిళ్లను తమ మిత్రులకు ప్రదర్శిస్తూ రోజూ అడవి దారుల్లో విహారాలు చేస్తున్నారు. కొండయ్య, పోతమ్మ మా అబ్బాయితో ఉంటూ చెంచుల సేవకు సమాయత్తమవుతున్నారు.
(మా అబ్బాయి ఫోన్లో చెబుతుంటే రాసుకొన్నవి, emails, యాత్రలో ఉన్నప్పుడు తనతో ఫోన్లో చేసిన సంభాషణ ఆధారంగా: డాక్టర్ కాళిదాసు పురుషోత్తం)
(సమాప్తం)