[dropcap]జా[/dropcap]తీయ చేనేత దినోత్సవం సందర్భంగా 7 ఆగస్టు 2020 నాడు డా.భీంపల్లి శ్రీకాంత్ ఈ కవితా సంపుటిని వెలువరించారు. చేనేత కార్మికుల వెతలను ‘మొగ్గలు’ అనే కవితా ప్రక్రియలో ఆర్ద్రంగా వెల్లడి చేశారు.
‘చేనేత గోస’ అనే తన మాటలో “చేనేత రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకులను, నేతన్నల ఆత్మహత్యలను, మగ్గం గుంతల ఆక్రందనలను ఈ చేనేత మొగ్గల్లో ఆవిష్కరించాను. నాటి వైభవాన్ని, నేటి దుస్థితిని ఈ మొగ్గల్లో పూయించాను.” అన్నారు కవి శ్రీకాంత్.
~~
“శ్రీకాంత్‌కు చేనేతవృత్తిలో అవినాభావ సంబంధం ఉంది. ప్రభావవంతంగా, ప్రతిభావంతంగా ‘చేనేత మొగ్గలు’ రచించాడు.
మగ్గం పలక చప్పుళ్ళు, నేతన్నల ఆకలి అరుపులంటాడు శ్రీకాంత్. అంతేకాదు, మగ్గం గుంత నుంచి వచ్చే చప్పుడు నేతన్న గుండె చప్పుడేనని అభివర్ణిస్తాడు. ఇది అనుభవిస్తే కాని తెలియదు.
రాట్నం గిరగిరా తిరిగినా, నేతన్నల బ్రతుకుబండి చక్రం కదలదంటూ మనల్ని ఆవేదనకి గురిచేస్తాడు. కాలానుగుణంగా నడవక, కాలంతో పోరాటం చేసే నేతన్నల జీవితాన్ని అద్దంలో లాగా చూపాడు శ్రీకాంత్.
‘శ్రమైక జీవన సౌందర్యానికి’ ప్రతీకగా నిలిచే చేనేతరంగం ప్రపంచీకరణ నేపథ్యంలో ఏ విధంగా ధ్వంసమైందో శ్రీకాంత్ వెల్లడించాడు” అని తమ ముందుమాట ‘కంటతడి పెట్టించే చేనేత మొగ్గలు’లో ఆచార్య మసన చెన్నప్ప వ్యాఖ్యానించారు.
~~
“ఈ వృత్తి గురించి మిగతా సమాజానికి ఈ కాలంలో అంతగా అవగాహన లేదు. అవగాహన లేమితో నేతన్నల పట్ల పట్టింపు కూడా లేదు. అయితే ఈ లోటు భీంపల్లి శ్రీకాంత్ రాసిన ‘చేనేత మొగ్గలు’ కొంతవరకు తీరుస్తోంది.
శ్రీకాంత్ ఇందులో ప్రపంచీకరణ, బహుళ జాతి సంస్థల అజమాయిషీ, మార్కెటింగ్, మరయంత్రాలు, వలసలు, జాలి లేని ప్రభుత్వాలు, మానసిక రోగుల్లా మారిన నేతన్నల జీవన స్థితిగతులను మూడు పాదాలలో ముచ్చటగా చిత్రించాడు. భరోసానివ్వని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మగ్గం గుంతలో బంది అయిపోయిన నేతన్నల వెతలను పూసగుచ్చినట్టు చెప్పిండు.
నిరంతరం సట్టర సప్పుడు, నేతన్నల గుండె కొట్టుకున్నట్టుగానే ఆగకుండా కొట్టుకునే నాడె నాదాన్ని శ్రీకాంత్ వినిపిస్తున్నాడు. కండెలు, నాడెల ఆత్మకథను చెబుతూ, నేతన్నల గురించి అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే సమాజాన్ని చైతన్యపరిచే ఉద్దేశంతో వెలువడుతున్న ఈ ‘చేనేత మొగ్గల’కు స్వాగతం” అని తమ ముందుమాట ”లో పేర్కొన్నారు శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్.
~~
“ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిన చేనేత జీవితాలను, ఈనాడు వారి యొక్క దీన దుస్థితిని మొగ్గలలో మూడు పాదాల్లో విప్పి చెప్పాడు భీంపల్లి.
తన బతుకు చిత్రాన్ని, తన నేపథ్యాన్ని, తన జాతి ఔన్నత్యాన్ని, విప్పి చెప్పేందుకు ప్రతి అక్షరంలో రాట్నమై తిరిగాడు. దుస్తులనెరుగని మానవుల మానాన్ని కాపాడిన వస్త్రమై ప్రతి పాదంలో చదివేవారి హృదయాలకు చుట్టుకున్నాడు” అన్నారు శ్రీ బోల యాదయ్య తమ ముందుమాట ‘అక్షరాలతో నేసిన వస్త్రం’లో.
~~
దారం పోగులతో జీవం ఉట్టిపడేలా చిత్రాలను నేస్తూ
సృజనాత్మకతతో కళాత్మక చిత్రాలను ఆవిష్కరిస్తరు
అద్భుతమైన చేనేతకళతో అలరించేది నేతన్నలు
~~
కులవృత్తులను నమ్మి కడుపులు నింపుకుంటున్నా
జీవితాలన్నీ గాలికి ఎగిరిపోయే దూదిపింజలయ్యాయి
కలికాలంలో కనిపించిన చేనేత వస్త్ర కళాఖండాలు
~~
పిడికెడు మెతుకుల కోసం కడుపు నింపాల్సిన
మగ్గంగుంత చితికిన దేహాలను వాగ్దానం చేస్తున్నది
బక్కచిక్కిన దేహాలిప్పుడు నేతన్నల పడుగుపేకలు
ఇంకా ఇలాంటి ఎన్నో చక్కని మొగ్గలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
***
రచన: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
పేజీలు: 80, వెల: ₹ 40/-
ప్రచురణ:
పాలమూరు సాహితి
ప్రతులకు:
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,
ఇంటినెంబర్ : 8-5-38,
టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్- 509001
ఫోన్: 9032844017
srikanth.bheempally@gmail.com