[చెన్నై హిందూ కళాశాల మాతృభాషాదినోత్సవ సభ – నివేదిక అందిస్తున్నారు శ్రీ గోట్ల యోగానంద స్వామి.]
[dropcap]29[/dropcap] ఆగస్ట్ 2024న, చెన్నై నగరములోని చారిత్మాత్మక హిందూ కళాశాల, తెలుగు శాఖ వారి ఆహ్వానంపై, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, కాలమిస్టు, గాయకులు శ్రీ పాణ్యం దత్తశర్మ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, ముఖ్య అతిథిగా, ప్రధాన ప్రసంగం చేశారు.
ఆయన చేసిన కీలకోపన్యాసంలో, భాష మూడు రకాలు అని, గ్రాంథికం, శిష్టవ్యావహారికం, ఆధునికం అని చెప్పారు. వ్యావహరిక భాషా పితామహుడైన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు చేసిన సేవలను ఆయన వివరించారు. సవర భాషకు లిపిని తయారు చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త గిడుగు వారని దత్తశర్మ కొనియాడారు.
ప్రసంగంలో, వాగ్గేయకారుల కీర్తనలలోని తెలుగుతనాన్ని, పోతన, వేమన, మొల్ల, మొదలగు కవుల పద్యాలలోని తెలుగు మాధుర్యాన్ని వివరించారు. కీర్తనలు, పాటలు పద్యాలు శ్రావ్యంగా పాడుతూ, విద్యార్థులను అలరించారు.
పాణ్యం దత్తశర్మ గారి మిత్రులు, ‘మధుర వచస్వి’ బిరుదాంకితులు, డా. జెట్టి యల్లమంద గారు తెలుగు భాష సొగసు పై కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ వారు వ్రాసిన పద్యాన్ని శ్రావ్యంగా ఆలపించి, గిడుగు వారి సేవలను కొనియాడారు.
హిందూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా. కల్విక్కరసి గారు సభకు అధ్యక్షత వహించారు. కళాశాల డైరెక్టర్ డా. రాజేంద్ర నాయుడు హజరై ప్రసంగించారు. తెలుగు శాఖ ప్రొఫెసర్ శ్రీమతి కల్పన గారు సభను ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించారు. తెలుగు ఆప్షనల్ విద్యార్థి చి. ధనుష్ వ్యాఖ్యాతగా వ్యవహరంచారు. తెలుగు శాఖ అధ్యక్షలు (HoD) డా.సురేష్ ముఖ్యఅతిథికి స్వాగతం పలికారు.
పాణ్యం దత్తశర్మ, డా శెట్టియెల్ల మంద గారలను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా జి. కల్విక్కరసి గారు ఘనంగా సత్కరించి, వారి పాండిత్యాన్ని ప్రశంసించారు.
గోట్ల యోగానంద స్వామి