చెన్నై సాహిత్యసభ – నివేదిక

0
2

‘దుర్గా స్రవంతి’ సాంస్కృతిక విభాగం, చెన్నైవారి ఆధ్యర్యంలో, దుర్గాబాయి దేశముఖ్ ఆంధ్ర మహిళా సభ వారు బహుముఖ ప్రజ్ఞా సమన్విత, శ్రీమతి మాలతీ చందూర్ గారి జయంతిని పురస్కరించుకొని, ‘కథావాహిని’ అన్న చక్కని కార్యక్రమాన్ని, 21 డిసెంబరు 2023, గురువారం, సా. 5-30 ని॥ కు, లజ్ చర్చ రోడ్డు, మైలాపూరు లోని ‘ఆంధ్ర మహిళా సభ హల్’ లో, నిర్వహించారు.

బహుముఖ ప్రజ్ఞాన్విత శ్రీమతి మాలతీ చందూర్ గారికి పుష్ప నివాళిని అర్పిస్తూ..

సభకు ప్రయోక్తగా శ్రీమతి డా. ఆముక్తమాల్యద గారు స్వాగతం పలికారు. ఆమె ప్రముఖ విద్వద్విమర్శకులు శ్రీమాన్ తిరుమల రామచంద్ర గారి కుమార్తె.

ప్రార్థనా గీతం ఆలపిస్తూ ఉన్న శ్రీమతి ఎస్. పి. వసంత లక్ష్మి గారు. ఎస్ పి. బాలు గారి చెల్లెలు.

సభ శ్రీమతి ఎస్.పి. వసంతలక్ష్మిగారి (శ్రీ.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు) ప్రార్థనా గీతంతో ప్రారంభమయింది.

ఆచార్య ఎల్.బి.శంకరరావుగారు (విశ్రాంత ఆచార్యులు. తెలుగుశాఖ, రాజధాని కళాశాల, చెన్నై) సభకు అధ్యక్షత వహించి, కార్యక్రమాన్ని నడిపించినారు. వారు సహస్ర చంద్ర దర్శనము పూర్తి చేసుకొన్న యువకులు (86 సం॥). 1962లోనే, ‘నన్నెచోడుని కుమారసంభవము’ పై పరిశోధన చేసి, పి.హెచ్.డి పట్టా పొందినవారు.

సభకు ముఖ్య అతిథిగా శ్రీమతి ప్రేమా ధాత్రి, ఉపాధ్యక్షురాలు, ఆంధ్ర మహిళా సభ, చెన్నై వారు విచ్చేశారు.

ఆనాటి ప్రధాన వక్త, సన్మాన గ్రహీత శ్రీ పాణ్యం దత్తశర్మగారు. శ్రీమతి మాలతీ చందూర్ రచించిన ‘శతాబ్ది సూరీడు’ నవలపై, బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు నిర్వహించిన (2022) సిద్ధాంత గ్రంథాల పోటీలో, పాణ్యం దత్తశర్మగారు ఏకైక విజేతగా నిలిచారు. పొట్టి శ్రీరాములు సేవాసమితి, చెన్నై వారు వారికి ఇరవై ఐదు వేల రూపాయల రివార్డును ఇచ్చిఉన్నారు. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ వై. రామకృష్ణ గారు కూడా ఈ సభకు హాజరైనారు.

వేదికపై శ్రీ దత్తశర్మ ప్రసంగం

అధ్యక్షులు శ్రీ శంకరరావుగారు పాణ్యం దత్తశర్మ గారిని సభకు పరిచయం చేశారు. మహానటి సూర్యకాంతం గారి శతజయంతి స్మారక ‘విశేష సంచిక’లో శర్మగారి వ్యాసం, ఆమెపై వారు వ్రాసిన పద్యకుసుమ త్రయం చదివానని; అప్పుడే ఈయనెవరో సామాన్యుడు కాదని గ్రహించానన్నారు. వారి సిద్ధాంత గ్రంధం, లాక్షణిక సూత్రాలకు అనుగుణంగా ఆంగ్ల, సంస్కృత, తెలుగు సాహిత్యాలను తులనాత్మకంగా పరిశీలిస్తూ సాగిందని ప్రశంసించారు. శర్మగారిని వారు శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు.

సన్మానాన్ని ప్రకటిస్తూ ఉన్న శ్రీ మతి డా. అముక్త మాల్యద, మహా విమర్శకులు శ్రీమాన్ తిరుమల రామ చంద్ర గారి పుత్రిక.
శ్రీ దత్తశర్మని సన్మానిస్తున్న డా. ఎల్. బి. శంకర రావు గారు

సన్మాన గ్రహీత, సిద్ధాంత గ్రంథ పోటీ విజేత శ్రీ పాణ్యం దత్తశర్మ, గ్రంథ రచనలో తాను అనుసరించిన విమర్శనా రీతులను వివరించారు. శ్రీమతి మాలతీ చందూర్ గొప్ప స్త్రీవాది అని, ఇతర స్త్రీవాదుల కన్నా ఆమె భావజాలం ఎందుకో భిన్నమైందో, ఎందుకో గొప్పదో వివరించారు. రావిశాస్త్రిగారివలె, సామాన్య పాత్రల ద్వారా విశ్వసత్యాలను మాలతి గారు ఆవిష్కరించారని కొనియాడారు. ఆమె సాహిత్యప్రస్థానంలో, ఆమె భర్త శ్రీ చందూర్ గారి పోత్సాహాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆమె 47 సంవత్సరాలు ఏకధాటిగా ‘ఆంధ్రప్రభ’ నిర్వహించిన ‘ప్రమదావనం’ శీర్షికను, స్వాతి మాస పత్రికలో 300కి పైగా విదేశీ నవలలను తేట తెలుగులో వివరించిన వైనాన్ని వివరించారు. ‘వంటలు – పిండివంటలు’ అనేక పునర్ముద్రణలు పొందినదని తలుచుకొన్నారు. వారి జన్మదినం సందర్భంగా, తనకు సన్మానం చేసినందుకు ప్రధాన వక్తగా ఆహ్వానించినందుకు ఆంధ్ర మహిళా సభ వారికి సవినయ కృతజ్ఞతలు తెలిపారు.

సభలో ప్రసంగిస్తున్న డా. జెట్టి ఎల్ల మంద గారు

తర్వాత, మరొక ఆహ్వానితులు, వక్త, డా. జెట్టి యల్లమంద గారు ప్రసంగిస్తూ, పాణ్యం దత్తశర్మగారితో తన 40 సంవత్సరాల అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. నవల, దాని లక్షణాలను గురించి క్లుప్తంగా తెలిపారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, గాయకుడిగా, ప్రయోక్తగా, కాలమిస్టుగా శర్మగారి ప్రస్థానం ప్రశంసనీయమైనదన్నారు. తెలుగు భాష మాధుర్యంపై తాను వ్రాసిన సీసపద్యాన్ని రాగయుక్తంగా, శ్రావ్యంగా ఆలపించారు. మాలతీ చందూర్ గారిపై ఆయన రచించి గానం చేసిన పద్యానికి కరతాళధ్వనులు మారుమోగాయి.

సీ॥
సాంకేతికత లేని చాల కాలము క్రింద
గూగులమ్మను మించి కూర్చె నెఱుక
అరశతాబ్దము పాటు ప్రమదావనంబుతో
నలరించిందర నమిత్ర ప్రేమ
ఆ పాత కెరటాల ప్రాభవంబును దెల్పి
విశ్వసాహిత్యంబు విశదపరచె
నవలామణుల నెన్నొ నవనవోన్మేషంబు
గా తీర్చి, సంఘంబు గతిని మార్చె
తే.గీ.॥
మావియైనట్టి చందూరు మాన్యునకును
మాలతీ తీవ యనురాగ బంధురముగ
దివ్యమైనట్టి సాహిత్య దీప్తి మెరయు
మాలతమ్మను మించిన ప్రతిభ గలదె?

~

ఆచార్య ఎల్. బి. శంకర రావు గారిచే డా. జెట్టి యల్లమందగారికి కూడా సన్మానం జరిగింది.

శ్రీమతి ఎస్.పి.వసంతలక్ష్మిగారు వందన సమర్పణ చేశారు. 2023 సం॥ ‘హృదయనేత్రి’ సిద్ధాంత గ్రంథ పోటీ విజేత శ్రీ టేకుమళ్ల వెంకటప్పయ్య గారు కూడా ఆహ్వానితులే. కాని వారు రాలేకపోయారు.

ప్రసంగిస్తున్న శ్రీమతి లావణ్య, గొప్ప సంగీత సాహిత్య వేత్త శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారి కూతురు

ప్రముఖ సినీ దర్శకులు, చిత్రకారులు, శ్రీ బాపు గారి కుమారై శ్రీమతి ప్రభావతి గారు, ప్రముఖ సంగీత సాహిత్యవేత్త శ్రీమాన్ బాలాంత్రపు రజనీ కాంతరావు గారి కుమార్తె శ్రీమతి లావణ్యగారు సభకు విచ్చేశారు. ఎందరో మాలతీ చందూర్ అభిమానులు కూడా వచ్చారు.

సభానంతరం, ఆంధ్ర మహిళా సభ సభ్యులతో..

సభానంతరం అందరికీ నిర్వాహకులు చక్కని ఉపాహారం ఏర్పాటు చేశారు. ఆంధ్ర మహిళా సభ కార్యదర్శి శ్రీమతి జయశ్రీ గారు కార్యక్రమాన్ని చక్కగా పర్యవేక్షించారు. ఆరు గంటలకు ప్రారంభం అయిన సభ ఎనిమిదిన్నరకు ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here