[ప్రసిద్ధ రచయిత్రి గీతాంజలి గారు రచించిన ‘చెప్పాలి!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]తను వచ్చేటట్టే ఉన్నాడు..
తలుపుల్ని కాస్త వారగా నన్నా తెరిచి పెట్టాలి.
నా తోటని మల్లెల్ని కాసిన్ని ఎక్కువే పూయించమని చెప్పాలి.
చంద్రుణ్ణి నా డాబాపైన వెన్నెలని కాసింత ఎక్కువే ఒంపమని చెప్పాలి.
అస్తమయపు సూర్యుణ్ణి సముద్రంలో మెల్లిగా మునగమని చెప్పాలి.
రాత్రిని ఆలస్యంగా పగల్లోకి నడవమని చెప్పాలి.
అతను వచ్చేటట్లే ఉన్నాడు..
అలసిన మనసుని కొంచెం ఉత్సాహ పడమని చెప్పాలి.
వడలిన దేహాన్ని కొంత చేవ తెచ్చుకోమని చెప్పాలి.
మబ్బు పట్టిన కంటి చూపుని కొంత కాంతులీనమని చెప్పాలి.
ముగ్గు బుట్టయిన వెంట్రుకల్ని.. కాటుక రంగేయమని
ఆ కరిమబ్బులని బ్రతిమిలాడుకోవాలి
అతనొచ్చేటట్లే ఉన్నాడు..
గరుకైన అరచేతులను కప్పేయమని గోరింటాకుని వేడుకోవాలి.
తడబడే అడుగులని నిటారుగా నిలబడే ఓపిక తెచ్చుకోమని చెప్పాలి.
ఆగి ఆగి కొట్టుకుంటున్న గుండెని కొద్ది లయ నేర్చుకోమని చెప్పాలి.
సమస్తమూ అతనికి ఇచ్చేసాక ..ఇక నాలో నన్ను నేను వెతుక్కోవడం
మానేయ్యమని నా హృదయానికే చెప్పాలి.
అతనొచ్చేటట్లే ఉన్నాడు.. ఇకనైనా
నేను సమాధిలో చేరేలోపు వచ్చేయమని చెప్పాలి!
అతనొచ్చేటట్లే ఉన్నాడు..