Site icon Sanchika

చెరిపేస్తే చెరిగిపోయేదే చరిత్ర

[వంశీకృష్ణ పరిమళ గారు వ్రాసిన ‘చెరిపేస్తే చెరిగిపోయేదే చరిత్ర’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]బ[/dropcap]తుకమ్మ పండగకి ఇంటికచ్చిన కూతురు, మనమడు, మనమరాళ్ళను చూసి మురిసిపోయింది రంగమ్మ. అల్లుడికి పని ఉండి రాలేకపోయినా కూతురుని పంపించినందుకు సంతోషంగా ఉంది రంగమ్మ.

పిల్లలకి కొత్త బట్టలు పెట్టి, పిండి వంటలు అన్నీ వండిపెట్టి మంచిగ అరుసుకుంటుంది. తాత కిష్టయ్య రంగమ్మ ఆనందం చూసి మురిసిపోతుండు.

రంగమ్మ కూతురు పేరు సరస్వతి. ఆమెకి ఓ కొడుకు, ఓ కూతురు. కొడుకు ఉదయ్, కూతురు రాధిక.

బతకమ్మ పేర్వడానికి కూర్చున్న అమ్మమ్మని “బతుకమ్మ గొప్పతనం ఏంటమ్మమ్మ?” అని అడిగింది 7వ తరగతి చదువుతున్న రాధిక.

“రాత్రి నిద్ర పోయేముందు అన్ని చెప్తా అమ్మా, ముందు బతకమ్మ ఆడటానికి పోదాం పద” అని కూతురిని, మనమరాలిని తీసుకొని చెరువు కట్టకు పోయింది రంగమ్మ.

బతకమ్మ ఆడి వచ్చిన తరువాత తిని నిద్ర పోయే ఏలకు మళ్ళీ బతుకమ్మ గొప్పతనం గురించి అడిగింది రాధిక.

“ప్రపంచంలో ఏ పండగకైనా పువ్వులతో దేవుణ్ణి కొలుస్తరు. కానీ పూలనే దేవునిగా కొలిచే పండగ ఒక్క మన తెలంగాణాలోనే ఉందమ్మా. అదే బతుకమ్మ పండగ. ఇది ప్రకృతిని పూజించే పండగ” అంది రంగమ్మ రాధికతో.

“దీనికి కథ ఏమన్నా ఉందా అమ్మమ్మా?”

“ఉందమ్మా. పూర్వం ఓ మహారాజుకి పుట్టిన బిడ్డలు పుట్టినట్టే పురిట్లోనే చచ్చిపోయిండ్రు. అయ్యింత రాజు ఆ గౌరమ్మకి మంచిగ మొక్కుకొని నాకు బిడ్డలు ప్రసాదించు తల్లి అని వేడుకుంటే ఆ దేవత ఓ మంచి ఆడబిడ్డని ప్రసాదించింది. ఆమెకి బతుకమ్మ అని పేరు పెట్టి, గప్పటి సంది గౌరీ దేవతను బతుకమ్మ పూలతో పూజిస్తూ పండగ చేస్తుర్రు” చెప్పింది రంగమ్మ.

పక్కనే పండుకొని వింటున్న ఉదయ్ అమ్మమ్మతో, “మరి గూగుల్‌లో ఇంకో కథ ఉంది కదా అమ్మమ్మ. తెలంగాణాలో దొరలు ఆడోళ్ళ మీద అఘాయిత్యం చేసేటోళ్లు, ఆ బాధలకు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళను బతుకమ్మ అని ఏడుస్తూ పిలిచేటోళ్ళు అని ఉంది కదమ్మమ్మా” అన్నాడు.

పక్కనే ఉన్న తాత కిష్టయ్య, “అబ్బా అచ్చిండ్రా వకీల్ సాబ్, ఒరేయ్ తిప్పి కొడితే తొమ్మిది సదువుతున్నవ్, నీకు దొరలు, అఘాయిత్యాలు గివన్ని కావన్న. ఆడోల్లు ఆడోల్లు ఏదో ముచ్చట చెప్పుకుంటుర్రు, మధ్యలో నీకెందుకురా పిట్టల దొర, పండు సప్పుడేక” అన్నాడు.

బదులుగా ఉదయ్, “అబ్బా తాత, నిజం చెప్పు అప్పట్లో దొరలు ఎట్ల ఉండేటోళ్ళు, వాళ్ళు నిజంగనే జనాలను హింసించిటోళ్లా?”

“ఆ అవున్రా, దొరలకి ఇంతింతా పొడుగు చేతులు ఉండేయి, లంబ లంబ కాళ్ళు ఏసుకొని దయ్యాల లెక్క జనాలను పీక్కు తినేటోళ్ళు. నీ పిచ్చి కాకపోతే పొద్దున్న పొలం కాడ అందరిని నవ్వుకుంటా మాట్లాడించ్చింది ఎవరు దొర కాదా. ఎవడో దిక్కుమాలినోడు పుస్తకాలల్ల రాస్తే సదివి దిమాక్ ఖరాబ్ చేసుకుంటున్నవ?” అన్నాడు కిష్టయ్య.

“అంటే అవన్నీ అబద్దాల తాతా?”

“అబద్దాలు కాదురా, అతిశయోక్తులు అంతే. ఎవడో వందకు ఒకరిద్దరు వెధవలుంటే దొరలంత ఎదవలు అంటరా, తప్పు కాదూ.”

మొగుడు గిట్ల అనగానే రంగమ్మ, “ఆ వచ్చిండండి పట్వారి, దొరలు ఘోరాలు చెయ్యలే, మన ఊర్లనే రామలింగాన్ని చంపలే దొరలు” అంది.

“నీ బొంద ఏం కాదు. దోస్తులు దోస్తులు లొల్లి పెట్టుకొని, అది హత్యకు దారి తీస్తే దాన్ని దొర హత్య అంటవా?” అన్నాడు కిష్టయ్య.

ఉదయ్ అమ్మమ్మతో “నాకు చెప్పు అమ్మమ్మ, ఆ రామలింగం కథ” అని అడిగాడు.

“రామలింగం లేడు బోడి లింగం లేడు, పండు సప్పుడేక, భూమికి జానెడు లేడు గాని వీడు వీని మాటలు” అని పండుకో పెట్టిండు తాత కిష్టయ్య.

ఆ రోజు నుండి బతకమ్మ పదిరోజులు రోజూ ఉదయ్ అడుగుడు, రంగమ్మ చెప్తా అనుడు, కిష్టయ్య ఆపుడు, గిట్లనే ఐతుంది.

ఇగ దసరా తెల్లారి రాత్రి, రాధిక రంగమ్మతో “అబ్బా, ఆ రామలింగం కథ చెప్పితే ఐపోతది కాదమ్మమ్మ, పాపం పది దినాలకెళ్ళి అన్న ఒక్కటే తీరు అడుగుతుండు. రేపు పొద్దున్న ఎల్లిపోతాం ఇగ పట్నంకి, మల్లెప్పుడు అస్తమో, జర సెప్పరాదే” అంది.

“అంటే మీరు చిన్న పిల్లలు కదరా, హత్యలు గురించి మీకెందుకు అని తాత అనవట్టి ఆగిన” అంది రంగమ్మ.

“అయ్యో పిచ్చి అమ్మమ్మా, ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎన్ని వెబ్ సిరీస్‌లు వస్తలేవు, అవన్నీ క్రైమ్‌వే. నేను, అన్నా అంటే పెద్దగ చూడం గాని, మా దోస్తలల్ల మస్త్ మంది రోజూ ఇవే చూస్తరమ్మమ్మా. నువ్వు చెప్పు, రామలింగాన్ని దొరలు ఉత్తి పుణ్యానికే చంపేసిర్రా?”

“అవునమ్మా, రామలింగం అని ఒక పిల్లగాడు ఉండే, గప్పుడు డిగ్రీ చదువుతుండేటోడు, మస్త్ తెలివి గల పిల్లగాడు. గా పిల్లగాని తెలివి చూసి అన్ని కులాలోళ్ళు దోస్తానా చేసేది ఆనితోని. గంతెందుకు గా రాజు పటేల్ దొర, ఆయన కొడుకు శీను పటేల్ కూడా రామలింగంకి మంచి దోస్త్‌లు ఉండే. కానీ ఆ హవులే శీనుగానికి ఏం రోగం పుట్టిందో కానీ, దోస్త్ అని నమ్మించి విషం పెట్టి సంపిండు” చెప్పింది రంగమ్మ.

అప్పుడు కిష్టయ్య, “ఏ ఊకో, నువ్వు కూడా అబద్దాలు చెప్పుడు షురూ చేసినావ్. జాన్ జీగ్రీ దోస్త్‌ను ఎవడన్నా చంపుకుంటడా. ఏదో మాటలల్ల మాట మాట పెరిగి గట్ల అయింది. అయినా ఆ రామలింగం గాడు అన్నలతోని చేరకముందు ఎంత మంచిగుండే, తరువాత ఎట్ల తయారైండు, తెల్వదా ఊరోళ్లకు” అన్నాడు.

“అసలు నక్సలైట్లకు జనం ఎందుకు మద్దతు తెలిపిర్రు తాతా?” అడిగిండు ఉదయ్.

“బగ్గ బలిసి రా, చేసిన పనికి మంచిగ జీతం ఇస్తుంటే హాయిగా బతకకుండా, సుఖాలకి మరిగి తేరగా అన్ని అచ్చేస్తయి అని అన్నల సోపతి పట్టిర్రు కొందరు. గప్పట్ల ఆ ఎదవలు చెప్పే మాటలు నిజం అని నమ్మి, రామలింగం లాంటోళ్ళు ఆగం అయిండ్రు.”

“అవును, వందల ఏళ్ళ కెళ్ళి భూమి దగ్గర పెట్టుకొని, బిచ్చపోల్లకన్నా కడీనంగ ఎట్టి చేయించుకుంటుంటే అట్లనే చూసుకుంటా ఉంటరు అందరు. జనాలకి సోయి రాదా, ఎదురు తిరగరా, ఎప్పటికి దొరలదే నడుస్తదా కాలం?” అంది రంగమ్మ.

“అబ్బో అచ్చింది తెలివి, ఏం తెలివి, తుపాకులు పట్టుకొని బెదిరియ్యంగనే అయిపోతదా, అందరు దొరలు ఐతే కూలీ పని ఎవడు చెయ్యాలె” అడిగిండు కిష్టయ్య.

“ఎవడు చేస్తడు, ఇన్నాళ్లు ఎట్టి చేయించిన పాపానికి దొరనే చెయ్యాలె” అని రంగమ్మ అనడంతో..

తాత ఉదయ్‌తో, “చూసినవా ఆ రామలింగం గాడు కూడా గిట్టనే ఎడ్డెడ్డి గుడ్డి గుడ్డి మాట్లాడేటోడు, మంది ముందర అన్నడంటే అనుకోవచ్చు. దొర తోని మందు దావత్ చేసుకుంటా, నోటికి అచ్చింది మాట్లాడితే దొరకి కోపం రాదా, అంతెందుకు నువ్వు నన్ను తిడితే నాకు కోపం రాదా, ఆ కోపంల నిన్నో దెబ్బ కొడితే, అది కోపం అయితది కానీ దానికి ఇంకో కారణం తీస్తవా చెప్పు” అన్నడు.

“ఔ తాత, కోపంలో జరిగే దానికి కోర్టులు కూడా శిక్షలు తక్కువగా వేస్తాయి, కావాలని చంపుడు తప్పు గాని, కోపం ల సంపితే కాదు అని కోర్ట్‌లు మస్త్ సార్లు చెప్పినయ్” అని ఉదయ్ అనగానే

“అదిరా వకీల్ పాయింట్ అంటే, మస్త్ చెప్పినవ్ బిడ్డా, జర గా ముసలదానికి చెప్పు” అని, “ఇంటున్నావానే నా మనుమడు చెప్తున్నది, ఇప్పటికన్నా అర్ధం చేసుకుంటవా నేను చెప్పేది,” అన్నడు రంగమ్మతో.

మళ్ళీ ఉదయ్‌తో మాట్లాడుతూ, “ఏం లేదురా, రామలింగం అని ఓ పిల్లగాడు ఉండే, స్కూల్ ల మంచిగా సదువు నేరుస్తుండు అని అందరు మంచి గౌరవం ఇచ్చేటోళ్ళు, దొరల పిల్లగాళ్ళు కూడా దోస్తానా చేసేటోళ్లు, ఊరు మొత్తం వెట్టి చేస్తున్నా, ఈ రామలింగంని మాత్రం దొర ఇంట్లకి కూడా రానిచ్చి కొన్నిసార్లు అన్నం కూడా పెట్టేటోడు. మరి గంత పెద్ద దొర గంత పెద్దరికం ఇస్తే ఎంత మంచిగా మాట్లాడాలే. కానీ వీడేమో అన్నల సోపతి పట్టి ఆగమైండు.” చెప్పిండు కిష్టయ్య.

అప్పుడు రాధిక, “గది కాదు తాతా, అసలు దొర ఇప్పటి దాకా ఎవ్వన్ని చంపలేదా, ఒక్క రామలింగం ముచ్చట మాత్రమే జనం ఎందుకు మాట్లాడుకుంటుర్రు,” అంది.

“అద్దిరబన్న, మస్త్ మంచి ముచ్చట అడిగినవమ్మ, పాపం మా రాజు పటేల్ దొర రాముడులాంటోడమ్మా, ఊరిని కన్నబిడ్డ లెక్క చూసుకునేటోడు, ఇక ఆయన కొడుకు శీనయ్య దొర ఐతే నెహ్రు వాది, జనాలందరు గొప్పోళ్ళే అని మాట్లాడేంత మంచోడు. గీ గాడిద కొడుకు రామలింగం చేయబట్టి, ఆ ఇద్దరు గొప్పోళ్ళు అన్నల చేత అన్యాయంగా చంపబడ్డరు, గందుకే ఈ ఈ ఊరోళ్లు రామలింగం గాన్ని ఇప్పటికి తిట్టుకుంటరు.” అంది రంగమ్మ.

“మీ అమ్మమ్మ అసంటి ఎడ్డి ముండలేమో ఆ రామలింగం గానిదే ఒప్పు అన్నట్టు మాట్లాడతరు” అని కిష్టయ్య అనగానే

ఉదయ్ “ఏంటి అన్నలు, ఇద్దరు దొరలను చంపిర్ర?” అని అడిగిండు.

“మాములుగా కాదు బిడ్డా, ఊరు మధ్యల జనం అందరి ముందర నిలబెట్టి తుపాకులు తోని కాల్చి చంపిర్రు” చెప్పిండు కిష్టయ్య.

“లంగా నా కొడుకులను చంపకుండా, ముద్దు పెట్టుకుంటరా, ఎంత మంది ఉసురు పోసుకోలే వాళ్ళు” అంది రంగమ్మ.

“అది కాదు అమ్మమ్మా, ఒక మనిషిని కావాలని చంపడం నేరం కదా, మరి రామలింగాన్ని అనుకోకుండా చంపితేనే నేరం అన్నవ్ ఇంతకుముందే. తప్పు చేస్తే శిక్ష వేయడానికి కోర్ట్‌లు, పోలీస్‌లు ఉన్నరు కదా” అనిండు ఉదయ్.

గప్పుడు కిష్టయ్య “గట్ల అడుగు బిడ్డా” అన్నడు.

“వాళ్ళు దొరలు రా, వాళ్ళను కోర్ట్ లేం చేస్తాయి?” అంది రంగమ్మ.

కిష్టయ్య “గిదిరా, మీ అమ్మమ్మ తెలివి. కూలీ పని ఇచ్చి, రోజు ఇంత బువ్వ పెట్టినోడు దొర అయ్యిండు, తుపాకులు చేతిల పట్టుకొని బెదురించుకుంటా, అందరి భూములు గుంజుకునే అన్నలు గొప్పోళ్ళు ఐర్రు, గిసంటి ఎడ్డోళ్ల వల్ల పాపం దేవుని లాంటి దొరలు బద్నామ్ ఐర్రు. పోనీ ఆ అన్నలేమాన్న నీతిమంతులా అంటే పక్కూరి దొర కాడ పైసలు తీసుకొని, ఈ ఊరు దొరను చంపి పబ్బం గడుపుకునే ఎదవలు.” అన్నడు.

ఉదయ్ రంగమ్మతో “ఎవరైన తప్పు చేస్తే వారిని అహింసా పద్ధతిలో, న్యాయస్థానాల ద్వారా ఎదుర్కోవటం న్యాయం అవుతుంది తప్ప, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అరాచకం అమ్మమ్మా” అన్నడు.

రంగమ్మ “అంటే నువ్వు కూడా రామలింగంని చంపిన దొరను చంపుడు తప్పు అంటవ?” అంది.

“అది కాదమ్మమ్మా, ఇప్పుడు అన్నలు రామలింగం కోసమే దొరను చంపిర్రు అని నమ్మిక ఏంది, ఆళ్లకేం ఆస్తి తగాదాలు ఉన్నయో, అట్లనే దొర కావల్సుకోని రామలింగాన్ని చంపిండు అని ఆధారం ఏంటి, తాత చెప్పినట్టే అనుకోకుండా అయిందేమో. కాబట్టి నిజానిజాల ప్రకారం శిక్షలు వేయడానికి కోర్ట్‌లు ఉన్నయి అని నేను చెప్పేది” అన్నడు ఉదయ్.

రంగమ్మ “సరే తీ, నీ తాతకే బుద్ది పెరగలే, నీకెప్పుడు పెరగాలి గాని, సరే తీ దొరలే మంచోళ్ళు, పండు ఇగ” అంది.

రాధిక “అయ్యో అమ్మమ్మ, ఇప్పుడు నువ్వు మంచిదానివి కాదు అని ఎవరో నాతోని చెప్పితే, నేను నమ్మి నీతోని లొల్లి పెట్టుకుండు ఒప్పఐతదా? ఏదన్నా పంచాయతీ ఉంటే నీకు నాకు ఉంటది. నా గురించి నీకెరక, నీ గురించి నాకెరుక. గవి మనసుల పెట్టుకొని బతకాలే కానీ. ఎవరో దిక్కుమాలినోళ్లు మా అమ్మమ్మ గురించి నోటికచ్చింది చెప్పితే నమ్మి, నిన్ను తక్కువ చేసుడు ఒప్పేనా. ఓసారి తిడతవ్, ఓసారి పెడతవ్, గదానికే నిన్ను తప్పు అనుకోవన్న” అంది.

రంగమ్మ “అంతేన్నాంటవా, దొరలు మంచోళ్లేనా” అంది.

కిష్టయ్య “లేకపోతే ఈ కమ్యూనిస్టులు, అన్నలు అచ్చి సుత్తి చెప్పేదాకా, అప్పటి మన తాతలకు, తండ్రులకు దిమాక్ లేదానే, ఆళ్ళు ఉప్పు కారం తినలేదా, ఆళ్లకు పౌరుషాలు ఉండయా, ఇగ నీకు ఆ రామలింగం గానికే ఉందా పౌరుషం” అన్నడు.

ఆలోచనలో పడ్డ రంగమ్మతో – “ఏదో సొంత లాభం కోసం ఒకడు మతం పేరు మీద పుల్లలు పెడతడు, ఇంకొకడు కులం పేరు మీద, ఇంకొకడు కమ్యూనిజం పేరు మీద పుల్లలు పెడతడు. వాడు పుల్లలు పెట్టేది ఆడి బాగు కోసమే తప్ప మన మంచి గురించి కాదే. ఆ విశం జనాలకి అర్థం కాక, దొంగలకు సద్ది కట్టుకుంట, ఉన్న కొంపలు కూల్చుకొని ఏడుస్తరు. నొప్పి నీకు లేస్తే నువ్వు ఏడవాల గాని ఎవడో పక్కపొంటి అచ్చి నీకు నొప్పి ఉంది అని కూనిరాగం తీస్తే ఏడుస్తవా చెప్పు?” అన్నడు.

ఇంతలో సరస్వతి వచ్చి “ఓ అమ్మ, ఓ నాయిన. మీకేం పని పాటలు లెవ్వా, పిల్లగాళ్ల దిమాక్ మొత్తం ఖరాబ్ చేస్తుర్రు” అని; పిల్లలతో, “ఏ లోపలికి నడువుర్రా, ఆడనే పందురు, రేపు పొద్దున్న బస్ కే పోవాలే పట్నం” అని ఉదయ్ రాధికలను తీసుకొని ఎల్లిపోతది.

Exit mobile version