Site icon Sanchika

చేసిన పాపం

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘చేసిన పాపం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆం[/dropcap]ధ్ర ప్రదేశ్‍లో ఆ ఏడాది ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. రాహుల్‌కి 60000 పైన ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ కాలేజీ‌లో సీట్ రాదని వాళ్ళ నాన్న శ్రీనివాసరావు దిగులు పడ్డాడు.

రాహుల్‌కి ఎలాగయినా ఇంజనీరింగ్ చేయాలని కోరిక. ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్‌లో జాయిన్ అయిపోతున్నారు. కొంతమందికి మంచి ర్యాంక్స్ రావడంతో గవర్నమెంట్ కాలేజీలో సీట్లు వచ్చేసాయి. పెద్ద ర్యాంకులు వచ్చిన కొంతమంది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‍మెంట్ కోటాలో జాయిన్ అయిపోతున్నారు. తండ్రి శ్రీనివాసరావుది పోస్ట్ ఆఫీస్‌లో చిన్న వుద్యోగం. డొనేషన్ కట్టలేననీ, కావాలంటే మళ్ళీ ఏడాది కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోమని కొడుకుతో అన్నాడు. రాహుల్ తల్లిని సతాయించడం మొదలు పెట్టేడు.

శ్రీనివాసరావు, శైలజ దంపతులకు ఒక్కడే కొడుకు. శైలజ కూడా రాహుల్‌ని ఇంజనీర్‌ని చేయాలని అనుకుంటోంది. మరో ఏడాది చదివి, కాలం వృథా చేసుకోవరం ఆమెకి ఇష్టం లేదు.

తన అన్నగారు సుబ్బారావుతో విషయం చెప్పింది. ఆయన ఓ 5 లక్షల వరకూ అప్పుగా సాయం చేస్తానని అన్నాడు. శ్రీనివాసరావుకి భార్యని బాధ పెట్టడం ఇష్టం లేదు. అయిష్టంగానే, సరే అన్నాడు.

అప్పుడే మరో చిక్కు వచ్చింది. రాహుల్ NVR ఇంజనీరింగ్ కాలేజీ లోనే జాయిన్ అవుతానంటాడు. అది వూళ్ళో పేరు మోసిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ. అతని ఫ్రెండ్స్ చాలా మంది ఆ కాలేజీలో జాయిన్ అయ్యేరు. అదీ అతని కోరికకి కారణం.

“అక్కడ డొనేషన్ ఎక్కువటరా” అన్నాడు శ్రీనివాసరావు కొడుకుని ఉద్దేశించి.

“ఒక్క నాలుగేళ్లు ఇబ్బంది నాన్నా, 4వ సంవత్సరానికల్లా నాకు వుద్యోగం వచ్చేస్తుంది, తర్వాత ప్రాబ్లమ్ ఉండదు” తేలికగా చెప్పేసేడు రాహుల్.

మోసే భారం తండ్రి కి తెలుస్తుంది కానీ, పిల్లలకేం తెలుస్తుంది.

“అవునండీ, నా వంటిమీద మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు అమ్మేద్దాం.. మా అన్నయ్యని వచ్చే ఏడాది మళ్ళీ బతిమాలుతాను, ఎంతోత సర్దకపోడు” అంది శైలజ.

“నా నగలు అని చెప్పేటప్పుడు కూడా ‘మా పుట్టింటి వాళ్ళు పెట్టిన’ అనే విశేషణం చేర్చకుండా మాట్లాడదు ఇది” అని భార్యని విసుక్కున్నాడు శ్రీనివాసరావు.

అతనికి బావమరిది సుబ్బారావుని అప్పు అడగడం అంటే తాను యెంత లోకువ అవుతాడో తలుచుకుంటే భయంగా వుంది. అసలే, తనని ‘బావగారు’గా చూడడు బావమరిది. ఇంకా లోకువ అయిపోతానని అతని బాధ.

‘తన ఆర్థిక స్థితికి పిల్లవాడిని గవర్నమెంట్ కాలేజీ‌ లోనే చదివించడం కష్టం, అట్లాంటిది, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ అంటే మాటలా’ అనుకుంటున్నాడు అతను.

కానీ ఒక్కగానొక్క కొడుకు చేస్తున్న ఒత్తిడికి, భార్య వంత పాడటంతో ప్రేమ బంధానికి లొంగిపోయేడు శ్రీనివాసరావు.

‘సరే చూద్దాం, నారు పోసిన వాడు నీరు పోయడా?’ అనుకున్నాడు.

ఎదురుగా కనపడుతున్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి దండం పెట్టుకున్నాడు.

రాహుల్ సంబరపడి పోయాడు. NVR COLLEGE లో అప్లై చేయడం జరిగింది.

ఆ రోజు కాలేజీలో ఇంటర్వ్యూ. శ్రీనివాసరావు ఆఫీస్‌కి సెలవు పెట్టి, కొడుకుని తీసుకుని కాలేజీకి వెళ్ళేడు.

ఇంటర్వ్యూకి వెళ్లే దగ్గర వెయిటింగ్ హాల్ చాలా పెద్దదిగా, కోలాహలంగా వుంది. విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులతో హాల్ కిటకిటలాడుతోంది.

చైర్మన్ అండ్ డైరెక్టర్ రూమ్ బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. నేమ్ బోర్డు గోల్డెన్ లెటర్స్‌తో పెద్ద పెద్ద అక్షరాలతో చాలా స్టైల్‌గా రాయబడి వుంది.

కే.శేషగిరి రావు, బి.టెక్., AMIE అని వుంది బోర్డు మీద. శేషగిరి రావు ఆ కాలేజీ చైర్మన్ అవడంతో బాటు, B CATEGORY సీట్స్ అతనే ఫైనలైజ్ చెయ్యాలి. పైగా ఆ కాలేజీ, వాళ్ళ మామగారు కట్టించింది.

చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత రాహుల్ వంతు వచ్చింది. రాహుల్, శ్రీనివాసరావులు ఆ రూమ్ లోకి ప్రవేశించారు. అది చాల పెద్ద రూమ్. పెద్ద టేబుల్ వెనుక రివాల్వింగ్ చైర్‌లో శేషగిరి రావు కూర్చుని వున్నాడు.

“నమస్తే సర్.” ఇద్దరూ విష్ చేసేరు.

“రండి, కూర్చోండి.. సర్టిఫికెట్స్ చూపించండి” అన్నాడు శేషగిరి రావు. రాహుల్ సర్టిఫికెట్స్ ఫైల్ ఇచ్చేడు. ఆయన సర్టిఫికెట్స్ పరిశీలిస్తున్నారు. రాహుల్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. శ్రీనివాసరావు కుర్చీలో ఒద్దికగా కూర్చున్నాడు.

శ్రీనివాసరావు గదిని పరిశీలించి చూసేడు. టేబుల్ మీద ఒక పక్క బొబ్బిలి వీణ కనపడింది. అలాగే, గదిలో ఓ మూల పెద్ద సైజు వీణ స్టూల్ మీద గోడకి ఆనించి వుంది. ఇంకో గోడకి వున్న షో కేసులో మరో వీణ బొమ్మ వుంది.

విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వరకు, బొబ్బిలి వీణ బొమ్మలకి చాలా పేరు వుంది. రాజకీయ నాయకులకి, అతిథులకు, ఆ బొమ్మలని బహుమానంగా ఇస్తూ వుంటారు. అభిరుచి వున్న వాళ్ళు వాటిని వాళ్ళ ఇళ్లల్లో, ఆఫీసుల్లో అలంకరణగా కూడా పెట్టుకుంటూ వుంటారు.

ఫైల్ మూస్తూ, శేషగిరి రావు ఇలా అన్నాడు: “డొనేషన్ 5 లక్షలు అవుతుంది. ఏడాదికి ఫీజు 2 లక్షలు.”

శ్రీనివాసరావు హతాశుడయ్యాడు.

“సార్ నేను అంత ఇచ్చుకోలేను” అన్నాడు.

నవ్వేడు శేషగిరి రావు. “మా కాలేజీ హిస్టరీ తెలిసి వచ్చేరు, మా కాలేజీ స్టాండర్డ్స్‌కి ఆ అమౌంట్ చాలా తక్కువ. ఐనా మీ ఇష్టం, కట్టగలిగితేనే రండి. ఇంకో వారం టైం ఇస్తాను” అన్నాడు.

రాహుల్ మొహం మాడిపోయింది. తండ్రి కట్టనని, బైటకి వచ్చేస్తాడేమో అని అతని బెంగ.

శ్రీనివాస రావుకి అప్పుడు చిన్న ఆలోచన వచ్చింది.

“ఏమీ అనుకోకండి సర్, మీకు బొబ్బిలి వీణ అంటే చాల ఇష్టమని, మీ టేస్ట్ చూస్తే అర్థం అవుతోంది. నేను, బొబ్బిలి లోనే చదువుకున్నాను. ఉద్యోగ రీత్యా బయటికి వచ్చేసాం కానీ.. అది మా స్వంత వూరు” అన్నాడు.

శేషగిరి రావుకి బొబ్బిలి సెంటిమెంట్ వుంది. అప్పుడు శ్రీనివాసరావు కేసి తేరిపారా చూసాడు. ఎక్కడో చూసినట్లుంది. నెమ్మదిగా గుర్తుకు వచ్చింది.

“మీరు కొల్లు శ్రీనివాసరావు కదా.. మీరు బొబ్బిలిలో S.R. కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేరు.” అన్నాడు.

తనని గుర్తించాడు, కొడుకు ఫీజు తగ్గిస్తాడేమో అని, సంబరపడి పోయాడు శ్రీనివాసరావు.. కానీ శేషగిరిరావు వేరే కారణంతో అడిగాడని అతనికి అర్థం కాలేదు.

ముఖంలో చిరునవ్వుతో ఇలా అన్నాడు శ్రీనివాసరావు “అవును సార్, నేను 1990 లో ఇంటర్ చదివేను బొబ్బిలి S .R కాలేజీలో”

ఇప్పుడు శేషగిరి రావుకి పూర్తిగా గతం గుర్తుకు వచ్చింది. మనసులో గుచ్చుకుంటున్న ముల్లుని ఎవరో తీసినట్లయింది. మొహంలో జాలి ప్రవేశించింది.

ఒక నిముషం ఆలోచించాడు. రాహుల్ ముందు విషయం డిస్కస్ చేయడం ఎందుకు అని అనిపించింది.

“రాహుల్! నువ్వు బయట కూర్చో, మళ్ళీ పిలుస్తాను” అన్నాడు.

రాహుల్ బయటకి వెళ్లి పోయాడు.

శ్రీనివాసరావుకి ఉత్సాహం పెరిగింది. తన ‘సెంటిమెంట్’ పాచిక పారింది అని మనసులో అనుకుంటున్నాడు.

“మీరు 1990లో ఎగ్జామ్ హాల్‌లో స్లిప్స్ పెట్టినట్లు, స్క్వాడ్ వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని డిబార్ చేసారు కదా!” అన్నాడు శేషగిరి రావు.

శ్రీనివాసరావు మొహం పాలిపోయింది. తన గతం అనవసరంగా చెప్పాను అనుకున్నాడు. ఇప్పుడు తన క్యారెక్టర్ అడ్డం పెట్టి, కొడుకుకి సీట్ ఇవ్వరేమో అని భయం పట్టుకుంది.

శేషగిరి రావు కేసి చూస్తే, తన ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాడు.

విషాద స్వరంతో ఇలా అన్నాడు.

“సర్! మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ సంఘటన ఆనాడు సంఘంలో ఎంతగా నా మీద విషం చిమ్మిందో తెలుసు. అయితే జరిగిన నిజం నాకొక్కడికే తెల్సు” అని క్షణం ఆగి ఇలా మళ్ళీ వివరించాడు.

“నాకు ఆరోజు అన్యాయం జరిగింది. నేను ఒక వ్యక్తి చేసిన మోసానికి బలి అయ్యాను. మా నాన్న చనిపోవడానికి ఆ సంఘటన కారణం” అని ఆగాడు.

అప్పుడు శేషగిరి రావు ఇలా అన్నాడు.

“నేను ఆ రోజు మీరు రాసిన ఎగ్జామ్ హాల్ లోనే పరీక్ష రాసాను. నేను, మీ పక్క ROW లో కొద్దిగా వెనుకగా ఎగ్జామ్ రాస్తున్నాను. అప్పుడు మీతో పరిచయం లేదు, కారణం మన సెక్షన్స్ వేరు. మిమ్మల్ని డిబార్ చేయడం తెలుసు”

శ్రీనివాసరావు మళ్ళీ వివరించాడు.

“నేను కష్టపడి చదువుకునే వాడిని, ఆ రోజు ఫిజిక్స్ ఎగ్జామ్. పరీక్ష ఇంకొక అరగంటలో ముగుస్తుందనగా, కారిడార్‍లో హడావిడి అయింది. స్క్వాడ్ వస్తున్నారని ఇన్విజిలేటర్ హెచ్చరిస్తున్నారు. ఇంతలోనే స్క్వాడ్ వాళ్ళు మా రూమ్ లోకి ప్రవేశించారు.

ఎవడో దుర్మార్గుడు ఉండ చుట్టి విసిరేసిన స్లిప్స్ నా బల్ల కిందకు వచ్చి పడ్డాయి. ఇదంతా నేను గమనించలేదు. ఆ రూమ్‌లో ఎవరూ కూడా గమనించినట్లు లేదు. ఆ దుర్మార్గుడికి తప్ప హాల్‌లో ఎవరికి ఈ విషయం తెలిసి ఉండదు. ఎందుకంటే, స్క్వాడ్ వాళ్ళతో ఇన్విజిలేటర్ కూడా నా గురించి మంచి గానే చెప్పేరు. కానీ ఆ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ పర్సన్. దొరికిన స్లిప్స్‌తో బాటు నన్ను ప్రిన్సిపల్ రూమ్‌కి తీసుకెళ్లి పోయారు, నన్ను ఒక సంవత్సరం డిబార్ చేయడం జరిగింది. నేను స్లిప్స్ పెట్టలేదన్న నా మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు” అని అక్కడ ఆపి, దీన స్వరంతో మళ్ళీ ఇలా వివరించాడు.

“ఆ సంఘటన మా కుటుంబాన్ని కుదిపేసింది. నేను అవమాన భారం తట్టుకోలేక, నూతిలో దూకి ఆత్మహత్యకి ప్రయత్నించాను. వెంటనే పక్కింటి వాళ్ళు నన్ను నూతిలోంచి తీసి హాస్పిటల్‌లో చేర్చేరు. హాస్పిటల్‌లో డాక్టర్స్ నన్ను బతికించేరు, కానీ నేను చనిపోతానని బెంగపడ్డ మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయనని డాక్టర్స్ రక్షించలేక పోయారు. ఆయన మరణంతో మా కుటుంబం కోలుకోలేక పోయింది. నా చదువు కుంటుపడింది. నెక్స్ట్ యియర్ నేను పరీక్ష పాస్ ఐనా, ఆర్థిక స్థితి బాగులేక, బి.కామ్‌ చదువుతో సరిపెట్టుకున్నాను. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యి, చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తున్నాను” అని ముగించాడు.

శేషగిరి రావు జాలిగా చూస్తున్నాడు. అతని ముఖ కవళికలు మారిపోయాయి.

“మీరేమి వర్రీ అవకండి. మీ అబ్బాయికి సీటు ఇస్తాను, మీ అబ్బాయికి డొనేషన్ కూడా నా విశేష అధికారాలు వుపయోగించి రద్దు చేయగలను” అన్నాడు.

శ్రీనివాస రావు ఆనందంతో ఉప్పొంగి పోయాడు. శేషగిరి రావు కాళ్ళు పట్టుకున్నంత పని చేసేడు.

వారించేడు శేషగిరి రావు. నెక్స్ట్ వీక్ వచ్చి రాహుల్‍ని జాయిన్ చేయమన్నాడు. శ్రీనివాసరావు ఆనందంగా బయటకి వెళ్ళేడు.

శ్రీనివాసరావుకి తెలియదు, ఆ స్లిప్ తన బెంచ్ కిందకు ఆనాడు విసిరింది శేషగిరి రావే అని.

ఆనాటి సంఘటన శేషగిరి రావు గుర్తు చేసుకున్నాడు.

స్క్వాడ్ వాళ్ళు రూమ్ లోకి సడన్ గా ప్రవేశించే సరికి స్లిప్స్‌తో రాస్తున్న వాడు, వులిక్కిపడి, స్లిప్స్ ఉండ చుట్టి టేబుల్ కింద నుండి దూరంగా విసిరేసేడు. అది దొర్లుకుంటూ వెళ్లి శ్రీనివాసరావు టేబుల్ కింద పడింది. అతని అదృష్టం బావుండి ఆ విషయం ఎవరూ గమనించలేదు. అందరూ పరీక్ష రాసే బిజీలో వున్నారు.

స్క్వాడ్ వాళ్ళు శ్రీనివాసరావుని తీసుకెళ్లి పోతున్నప్పుడు శేషగిరి రావు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేడు, కానీ నిజం చెప్పలేకపోయాడు.

మర్నాడు పేపర్‌లో వార్త చూసేడు.. శ్రీనివాసరావు ఆత్మహత్య ప్రయత్నం, అతని తండ్రి గుండె పోటుతో చనిపోవడం.

నిజం చెప్పడానికి ధైర్యం చాలలేదు. ఆ వయసులో ఆ కుటుంబానికి ఏదయినా సాయం చేద్దామన్నా ఎలా చేయాలో తెలిసేది కాదు.. అయినా నెల తిరక్కుండా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లి పోయారని తెల్సింది. ఆ ఏడాది పరీక్షల్లో శేషగిరి రావు ఫెయిల్ అయ్యేడు. తను చేసిన పనికి ఒక కుటుంబం బలి అయిందని కుమిలిపోయాడు. ఆనాటి నుండీ పట్టుదలగా చదివి, బి.టెక్, ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యేడు. AMIE కూడా పూర్తి చేసేడు.

స్వతహాగా డబ్బున్న వాడు అవడం, మామగారు పెద్ద కాలేజీ పెట్టడంతో ఈనాడు ఈ స్థితికి చేరుకోగలిగేడు.

ఆనాటి సంఘటనలో బలి అయిన శ్రీనివాసరావుని ఇన్నాళ్ళకి ఇలా కలుసుకోవడంతో తనకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం వచ్చింది.

ఇలా ఆలోచిస్తున్న శేషగిరి రావు, నెక్స్ట్ కాండిడేట్ తలుపు తీసుకుని రావడంతో ఈ లోకం లోకి వచ్చేడు.

***

ఆ రాత్రి పడుకునే ముందు శేషగిరి రావుకి శ్రీనివాసరావు మరొక సారి గుర్తుకు వచ్చేడు. ఇంకా ఏదో చెయ్యాలని అనిపించింది. రాహుల్‍కి 4 సంవత్సరాల ఫీజు కూడా తానే కట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, రాహుల్ అన్నీ జాగ్రత్తగా నేర్చుకునేటట్టు తాను స్వయంగా పర్యవేక్షించాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు గానీ అతనికి తృప్తిగా అనిపించలేదు. తాను చేసిన పాపానికి అదే పరిహారం అనుకున్నాడు.

ఆ రాత్రి ప్రశాంతమయిన నిద్ర పట్టింది అతనికి.

Exit mobile version