Site icon Sanchika

చెట్లను కాపాడండి

[dropcap]టిం[/dropcap]కు నిద్ర లేచేసరికి ఇల్లంతా కొత్త మనుష్యులతో హడావిడిగా ఉంది. గబగబా మంచం దిగి అమ్మ దగ్గరకు వెళ్ళాడు. “ఏంటి కన్నా నిద్ర లేచావా? మొహం కడుక్కొని రా, పాలు తాగుదువు గానీ” అన్నది. మళ్ళీ అమ్మ ఆ కొత్త మనుష్యులతో మాటల్లో పడింది. టింకు కేమీ అర్థం కాలేదు. కొత్త వాళ్ళు ఐదారుగురు మనుష్యులు వచ్చారు. అమ్మ వాళ్లకు ఇల్లంతా తిప్పి చూపిస్తున్నది. హాల్లోని బుక్స్ పెట్టుకునే అలమర, వంటింటి అలమరలు అన్నీ తెరిచి చూపిస్తున్నది. ఏం జరుగుతుందో టింకుకు ఏం అర్థం కాలేదు, అమ్మ చెప్పే మూడులో లేదు. టింకూ పాలు తాగి ఆడుకోవడానికి కంప్యూటర్ రూమ్ లోపలికి వెళ్ళాడు.

టింకు ఆడుకొని విసుగు పుట్టి రెండు గంటల తర్వాత హాల్లోకి వచ్చాడు. టింకు వాళ్ళమ్మ ఇంకా బిజీగానే ఉంది. హాల్లోని అలమర లోని పుస్తకాలంతా నేల మీద కుప్పలా పోసి ఉన్నాయి. వాటిని తినేస్తూ బోలెడు పురుగులున్నాయి. అలమర కున్న తలుపులు అన్నీ పీకి కింద పడేస్తున్నారు ఇందాకటి కొత్త మనుష్యులు. వంటింట్లోకి వెళ్తే అక్కడ అలమర తలుపు చెక్కలన్నీ కూడా నేల మీద పడేసి ఉన్నాయి. “అమ్మా అమ్మా!” అంటూ మళ్ళీ హాల్లోకి వచ్చాడు. అమ్మ టింకూ దగ్గర కొచ్చి “ఆకలేస్తుందా కన్నా! ఫ్రూట్స్ ఏమైనా ఇవ్వనా?” అంటూ లాలనగా అడిగింది. అప్పుడే టింకూ చూపు కుప్పలు పోసిన పుస్తకాల మీద పడింది. అందులో టింకూ ఫస్ట్ క్లాస్ పుస్తకాలు కుడా ఉన్నాయి. అంతే ఒక్కుదుటన “అమ్మా నా పుస్తకాలు” అంటూ పరిగెత్తాడు.

పుస్తకాలు చిల్లులు పడి సగం సగం కొరుక్కుతిని ఉన్నాయి. ‘అమ్మో మేడమ్ హోం వర్క్ పుస్తకాలేవీ’ అంటే ఏమీ చెప్పాలి అనుకుంటుండగానే ఏడుపోచ్చేసింది టింకూకు. పెద్దగా ఏడవడం మొదలు పెట్టాడు. టింకూ ఏడుపుకు అమ్మ ఈ లోకం లోకి వచ్చింది. ‘అమ్మా నా పుస్తకాలు’ అని ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మ టింకూ కళ్ళు తుడుస్తూ “మనింట్లో చెదలు పట్టాయమ్మా. ఆ పురుగులు నీ పుస్తకాలు కూడా తినేశాయి. లాక్ డౌన్ లో నువ్వు స్కూలుకు వెళ్ళలేదు కదా! నీ పుస్తకాలు అలమరలోనే ఉండటం వల్ల అన్నీ పుస్తకాలతో పాటుగా నీ పుస్తకాలూ తినేశాయి. నేను మరల నీ కోసం కొత్త పుస్తకాలు కొనిస్తాను. మీ మేడమ్‌కు కూడా చెప్తాను, నిన్ను కోప్పడవద్దని” అని అనునయంగా చెప్పింది.

టింకూ ఏడుస్తూనే “చెదలు అంటే ఏంటమ్మా, అవి పుస్తకాలు ఎందుకు తింటాయి” అనడిగాడు. “టింకూ వీటిని చెద పురుగులు అంటారు. ఇవి పుస్తకాలను, చెక్కలను, ఆహారంగా తీసుకుంటాయి. ఎక్కడ తేమ ఉంటే అక్కడ చెదలు తిరుగుతాయి. ఇల్లంతా పాడుచేస్తాయి. నేను నీకు కొత్త పుస్తకాలను కొనిస్తాను కన్నా. ఏడవకు” అంటూ చెద పురుగుల గురించి చెప్పింది అమ్మ.

టింకూ ఏడుపు ఆపి ఆలోచనలో పడ్డాడు. అసలు ఈ పురుగులు మనింటికి ఎందుకు వచ్చాయి. పుస్తకాలు ఎందుకు తింటున్నాయి. ఇల్లంతా అలమరలు తలుపులు ఎందుకు కొరుక్కు తింటున్నాయి. అమ్మ ఇందాక ఆ కొత్త వాళ్ళతో ‘చాలా డబ్బు నష్టం వచ్చింది.’ అంటున్నది. ఇలా ఎందుకు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి! ఎన్నో ప్రశ్నలు టింకూ మనసులో తిరుగుతున్నాయి.

ఆ రాత్రికి టింకూ కలలో దేవుడు కనిపించాడు. “ఏంటి టింకూ ఏదో ఆలోచిస్తున్నావు” అని అడిగాడు నవ్వుతూ ఉదయం నుంచి మనసులో ముసిరిన ప్రశ్నలన్నింటినీ ఏకరువు పెట్టాడు. దేవుడు చిరునవ్వు నవ్వుతూ “టింకూ నీకూ నేను అన్ని విషయాలూ చెబుతాను” అంటూ మొదలెట్టాడు.

“చెద పురుగులు చనిపోయిన చెట్లను తింటాయి. ముఖ్యంగా కలపను తింటూ జీవిస్తాయి. మనుష్యులేమో చెట్ల కలపను తమ ఇళ్ళకు తలుపులు కిటికీలుగా పెట్టుకుంటున్నారు. పాపం చెద పురుగులకు ఆహరం లేకుండా పోయింది. మనుష్యులు అడవులను ఆక్రమించుకొని అక్కడ జంతువులకు, క్రిమి కీటకాలకు నష్టం కలిగిస్తున్నారు. జీవ సమతుల్యత దెబ్బ తిని అడవుల్లో  చెట్ల మీదుండే క్రిమి కీటకాలు ఇళ్ళలో దూరి మానవుల ఇళ్ళకు నష్టం కలిగిస్తున్నాయి. తమ ఇళ్ళను కొల్లగొట్టిన మానవుల ఇళ్ళను తినేసి ఇబ్బందుల పాల్జేస్తున్నాయి కీటకాలు. భూమి మీద సర్వజీవులకు సమాన హక్కులుంటాయి. టింకూ నువ్వు పెద్దవాడివయ్యాక చెట్లను కొట్టేయకుండా కాపాడుతావు కదూ!” అని విపులంగా దేవుడు చెప్పాడు.

కల నుంచి బయటపడ్డ టింకూ అమ్మకు అన్ని విషయాలు చెప్పాడు. ఈసారి కలప వాడకుండా యూపివిసి తలుపులు వాడారు టింకూ అమ్మానాన్నలు. చెట్లను కొట్టి అడవులు తగ్గిపోకుండా అందరూ ప్రత్యామ్నాయం అలోచించి వాడాలి.

Exit mobile version