చెట్లే మన ప్రాణదాతలు

0
64

అమరావతి నగరంలో విశ్రాంత అటవీ శాఖాధికారి రాఘవయ్య తాత తన ఇంటి అరుగుపై చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచి “బాలలూ ఈరోజు మీకు చెట్ల వలన మానవాళికి కలిగే ప్రయోజనం తెలియజేస్తాను. పర్యావరణ పరిరక్షణ అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. నేడు మనం యింత ఎండలను భరిస్తున్నాము అంటే అది మన స్వయంకృత అపరాధం. విచక్షణారహితంగా చెట్లు నరకటం వలన ఈ పరిస్ధితి ఏర్పడింది. మనం నివసించే భూమిపై మూడు వంతులు చెట్లు ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటేనే సకల ప్రాణకోటికి క్షేమం. లేదంటే అంతా క్షామం. మనిషి తన అవసరాలకు చెట్లను కొట్టడం వలన ప్రకృతి సమతుల్యత సన్నగిల్లింది. మనిషి ఒకరోజుకు 12 నుండి 15 కిలోల గాలిని (ప్రాణవాయువును) శ్వాసిస్తాడు. ప్రతి మనిషి ఒక రోజుకు మూడు ఆక్సిజన్ సిలిండర్ల ఆక్సిజన్ పీలుస్తాడు, ఒక ఆక్సిజన్ సిలిండర్ వెల రూ. 700/- అయితే మూడు సిలిండర్ల వెల రూ. 2100/- అవుతుంది. అంటే. ప్రతి సంవత్సరం ఆక్సిజన్ కొంటే రూ. 7,66,000/- ఖర్చు అవుతుంది.

మనిషి సగటు ఆయుష్షు 65 సంవత్సరాలు అనుకుంటే అతను ఆక్సిజన్ కొనడానికి దాదాపు రూ. 5 కోట్లు కావాలి. మనకు చెట్ల వలన ప్రాణవాయువు ఉచితంగా లభిస్తుంది. యిలా మనకు ప్రాణదాతలైన చెట్లను మనం ప్రాణప్రదంగా పెంచాలి. చెట్టు పుట్టుక  దాదాపు 41 కోట్ల 50 లక్షల సంవత్సరాలుకు పూర్వం జరిగింది. భూమండలంపై రమారమి 4,25,000 రకాల చెట్లు ఉన్నాయి. నేడు ప్రపంచం అంతటా నిమిషానికి 500 ఎకరాల అడవి కోల్పోతున్నాం, అడవులు నరకడం ద్వారాకాని, అగ్నిప్రమాదాల వలన యిది జరుగుతుంది.

ఈ భూభాగంపై 33శాతం అడవి ఉండాలనే నిభంధన ప్రపంచం అంతటా ఉంది. యిలా అడవులు నరకడం వలన వన్యప్రాణుల జీవనం కష్టతరంగా మారింది. ప్రకృతిసిధ్ధంగా ఒక అంగుళం మెత్తటి సారవంతమైన నేల రూపొందడానికి 300 నుండి 1000 ఏళ్ళు పడుతుంది. భారతదేశంలో ఏడాదికి 600 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి సముద్రం పాలు అవుతుంది. దీన్నినివారించగలిగితే పంటల దిగుబడి అధికం అవుతుంది.

మన దేశంలో ఏటా దాదాపు 15 లక్షల హెక్టార్ల అడవి నాశనం అవుతుంది. నేడు 33శాతం ఉండవలసిన అడవుల శాతం 17 శాతానికి దిగిపోయింది. అంటే మానవాళికి ఎంతటి ముప్పు పొంచి ఉందో ఊహించండి. ఈ కారణంగా భూమిపై ఎడారి శాతం వేగంగా పెరుగుతుంది. పూర్తిగా ఎదిగిన చెట్టు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మనకు ఎన్నో లక్షల లాభాన్ని చేకూరుస్తుంది. ఒక చెట్టు సగటున 1500కు పైగా విభిన్నజాతులకు చెందిన పక్షులకు, కీటకాలు, సరీసృపాలు, పరాన్నజీవులు, క్షీరదాలు తదితరాదులకు జీవనాధారంగా నిలుస్తుంది. ఒక చెట్టు తన 55 ఏళ్ళ జీవితకాలంలో 5.3 లక్షల విలువైన ప్రాణవాయువు అందిస్తుంది. 6.4 లక్షల విలువైన భూసారాన్ని కాపాడుతుంది. 10.5 లక్షల విలువైన గాలిని శుభ్రపరుస్తుంది. 5.5 లక్షల విలువైన పండ్లు. పూలు అందివ్వడమే కాకుండా పకృతి సమతుల్యతను కాపాడుతూ వాతావరణాన్ని తన పరిసరాలను అహ్లదపరుస్తుంది. వర్షం కురిసే సమయంలో చెట్టు గాలిలోని తేమను నియంత్రిస్తుంది. ఇలా చివరకు చెట్టు వంటచెరకుగానో కలపగానో మనకు వినియోగపడుతుంది.

చెట్టు పైభాగమే కాకుండా దాని వేర్లు భూమిలోనికి చొచ్చుకువెళ్ళి నేలకోతను అరికడతాయి. అలా భూమిలో సారత్వ పరిరక్షణ ఏర్పడుతుంది. చెట్లు పెంచడం ద్వారా పండ్లు, కూరగాయలు, తేనె, గింజలు, ఓౌషదాలు, లక్క, జిగురు, కుంకుళ్ళు వంటి వాటిని మనం పొందవచ్చు. సకాలంలో వర్షాలు పడటానికి చెట్లు ఎంతో వినియోగపడతాయి. అలా సరైన సమయంలో వర్షలు పడితే పంటలు బాగా పండి ప్రజలు అందరు సుఖంగా ఉంటారు. పల్లెల్లో పాడిపంటలు బాగుంటే పల్లె ప్రజలు పట్నాలకు వలసపోరు. యిలా ఎన్నో లాభాలు చెట్లు పెంచడంవలన ఉన్నాయి. మనిషి ఆర్థికతను ఓ విధంగా చెట్లే నిర్ణయిస్తాయి. సుడిగాలి మొదలు సునామిల వరకు వచ్చే ఆపదలను నివారించే శక్తి చెట్లకు మాత్రమే ఉంది. రేపటి తరం భావిపౌరులుగా రాబోయే ప్రమాదాన్ని నివారించే శక్తి మీ చేతుల్లో ఉంది. చక్కటి ఆరోగ్యకరమైన అహ్లదకర వాతావరణం ప్రకృతి మనకు ప్రసాదించింది. దాన్నికాపాడుకోవలసిన బాధ్యత, అవసరం నేడు మన అందరిపైన ఉంది. కనుక బాలలు వీలైనన్ని చెట్లు నాటి చక్కగా వాటికి మన స్వాతంత్య సమరయోధుల పేర్లో లేక మీ పెద్దల, మిత్రుల, మీకు యిష్టమైన వారి పేర్లు పెట్టి పెంచండి. ఎవరైనా చెట్లు నరుకుతుంటే వారికి చెట్ల విలువ తెలియజేయండి. మన ఇంట జరిగే ప్రతి కార్యక్రమానికి ఓ చెట్టు నాటి పెంచి, భవిష్యత్తులో మన బిడ్డలు ఆ ఫలాలు ఆరగించేలా చేయండి. నాడు-నేడు-ఏ నాడు చెట్లు మన ప్రాణదాతలే అని మరువద్దు. నేడు దేశ భవిష్యత్తు మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది” అన్నాడు తాతయ్య.

“అలాగే తాతగారు, ఇంటింటా మొక్క- ఊరూరా వనం తప్పక చేపడతాం. మా వంతుగా ప్రకృతి పరిరక్షణకు నిలబడతాం. చెట్లను విరివిగా పెంచుతాం”అన్నారు పిల్లలంతా ముక్తకంఠంతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here