Site icon Sanchika

చెట్టమ్మా..!

[శ్రీ గోలి మధు రచించిన ‘చెట్టమ్మా..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]వృ[/dropcap]క్షమా..
పుడమికి తోరణమై
ప్రాణాధారమై
నువ్వు చేరని
నిన్ను స్మరించని క్షణం
ఎక్కడమ్మా అవని పై?

అవినీతి
నీ నీడన చేరి
అడవుల్లో అడుగులు వేసినా
అవనిని
ఆలింగనం చేసుకుంటూనే ఉంటావు

కత్తులు కాయల్ని
వరి కంకుల్ని కొడవళ్ళు
గడప కోసం గొడ్డళ్లు
నిర్ధాక్షణ్యంగా కరాళ నృత్యం చేసినా
చిగురు తొడిగే
నవజాత శిశువువు

మాటకు రేటు
మంటకు మూల్యం
నీటికి నోటు వాసన
అంటగట్టినా..
పుడమి బిడ్డలందరికీ
ప్రాణవాయువై..
బంధాలను
అనుబంధాల పరిమళాలను
ఆక్సిజన్ రూపాన అందిస్తావు

వాడెవడో
బతుకు మీద విరక్తి చెంది
కొండపై నుండి
దూకి చద్దామని వెళ్తే
బండ రాయిని చీల్చి
వృక్షమై నిలిచి..
నీడనిచ్చీ బతుకు మీద
ఆశలు చిగురించే తల్లివి

చెట్టు కింద పక్షుల్ని
కొట్టుకెళ్ళి
చెట్టుపై వాలే రాబందులు
రెక్కలు చాచినా..
కొంచెమైనా కదలని సడలని
స్థైర్యం నీది

నవ్వుకు ప్రతి రూపం
నీ పువ్వు
శుభానికి అశుభానికి ఆయువై
ఆదరించే ఆమ్మవు

అమ్మకాల గోలలో
శరీర సుఖం మత్తులో
నిను మట్టుపెట్టే
మృగాలు స్వైర విహారం
చేసినప్పుడల్లా..
తల్లై.. తల్లి వేరై
తిరిగి తిరిగి చిగురిస్తూ
పచ్చదనాన్ని
ప్రపంచమంతా పరిచేస్తూ
ఇవ్వడమే తెలిసిన
అమ్మవు…
అవనికి ప్రేమ పాఠం
నేర్పే అనురాగ దేవతవు

నిను నమ్ముకుంటే
బతుకు..
అమ్ముకుంటే చితుకు

Exit mobile version