చెత్తోడు!

0
1

[dropcap]యా[/dropcap]దిగాడు పదిహేను లక్షలు పెట్టి ‘డూప్లెక్స్’ ఇల్లు కట్టించుకున్నాడంటే కాలనీవాసులకు నమ్మశక్యంగా లేదు. ఈ విషయం విన్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. ఎవ్వరికీ నమ్మబుద్ధి కాలేదు.

యాదిగాడు లోక్లాస్ ఫెలో! గంజి తాగను కూడా గతి లేనోడు. ఇల్లిల్లూ తిరిగి మాదాకవళం అడుక్కునేటందుకు అతగాడికి మనస్కరించేది కాదు. నామోషీ అనిపించేది. అడుక్కోడం నామర్దా అనిపించడంతో పదిహేనేళ్ళ ప్రాయంలోనే కూలీ పని చేసి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బుతో విధవరాలైన తల్లిని పోషించటానికి, తాను బ్రతకటానికి కూడా ఆ సంపాదన చాలేది కాదు.

ఆ పని మానేసి… రిక్షా తొక్కితే నాలుగు డబ్బులు ఎక్కువ రావచ్చు అని ఆశించి వాళ్ల కాళ్లు వీళ్ళ కాళ్లు పట్టుకొని ఎట్లాగ అయితేనేం ఓనర్‌కి రోజువారి అద్దెకింద పాతిక రూపాయలు ఇస్తూ… రిపేరొస్తే తానే బాగు చేయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

దీక్షా తొక్కడం కూడా ఒక ఆర్టే! నడపగలిగే శక్తి వుంటే చాలదు… ఎలా నడపాలనేది నేర్చుకుని తెలుసుకోవాలనే ఆపేక్షతో ఎన్నో ఏళ్లుగా రిక్షా తొక్కి జీవనం చేస్తున్న జానయ్యను ఆశ్రయించి ఓ వారం రోజులు వాడి వద్ద మొత్తానికి నేర్చుకోగలిగాడు. తరువాత బాడుగకు రోజూ ఎనిమిది గంటలకు మించి రిక్షా తొక్కకూడదు అంటూ నిబంధన పెట్టి… ఏ రోజు పాతిక ఆ రోజు ఇవ్వకపోతే రిక్షా అద్దెకు ఇచ్చేది లేదనే నిబంధన యజమాని పెట్టిన అందుకు సరేనని తలూపాడు యాది గాడు.

తాను ఊహించినట్టే రోజుకు వంద రూపాయలు కష్టపడి సంపాదించి రోజూ బాడుగ చెల్లిస్తూ మిగతా డబ్బుతో ఇద్దరూ బ్రతుకుతూ భవిష్యత్ నిధి కింద ఓ పాతిక చీటీ కడుతూ బ్రతుకు గడపడానికి అలవాటు పడ్డాడు.

ఓ అయిదేళ్ళు గడిచేక మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే పని వస్తే నెల తిరిగేసరికి జీతం వచ్చి చేతిలో వాల్తుంది కదాని  తెలిసినోళ్ళు సలహా ఇవ్వడంతో యాదిగాడి గాలి అటుకేసి మళ్ళింది.

వయసులో ఉన్నా తాను రిక్షా తొక్కలేకపోతున్నాడు. తీవ్రమైన ఎండవేడిమి తట్టుకోలేకపోతున్నాడు. తొక్కటమంటే మాటలు కాదని గ్రహించాడు, కాళ్ళనొప్పులతో రాత్రిళ్ళు రోజూ బాధపడేవాడు

రిక్షా కన్నా… స్వీపరు ఉద్యోగమే శానా మంచిదన్పించడంతో తనకిచ్చిన సలహాతో ఓ రోజు మునిపల్ ఆఫీసు ముందుకొచ్చి గేటుకాడ నిలబడ్డాడు. స్వీపరుద్యోగం కావాలంటే తానెవరిని కలుసుకోవాలో అర్థం కాలేదు. అక్కడున్నవాళ్ళని… వీళ్ళనీ అడిగి తెలుసుకుని కడకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ని కలిసి చేతులు జోడించాడు,

ఆయనగారు గవర్నమెంట్ ఉద్యోగి కావటాన యాదిగాడి అవతారం చూచి ‘ఛీ’ అన్నాడు… ‘ఛ’ అన్నాడు. చివరకు వదలకుండా కాళ్ళమీద పడటం చూచి చీదరించుకున్నా… కాళ్ళకు చుట్టుకున్న పాము కరవకమానదనే సూక్తి గురొచ్చి “సర్లే… లేచి నిలబడు ముందు” అనటంతో పైకి లేచి వినయంగా చేతులు కట్టుకు నిలిచాడు యాదిగాడు.

“ఇప్పుడు రోడ్లు వూడ్చే పన్లను కాంట్రాక్ట్‌కిచ్చాం. నువ్వెళ్ళి ఆ కాంట్రాక్టర్ని కలు! వీలుంటే నిన్ను పన్లో పెట్టుకుంటాడు…” అన్నాడు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌.

బుర్ర గోక్కున్న యాది “ఆ దొర యాడుంటాడు సారూ?” అడిగాడు.

“ఇక్కడికే వస్తాడు కాసేపట్లో. రోజూ నన్ను కలవనిదే పోడు. మోటారు బైక్ మీదొస్తాడు. కాంట్రాక్టరు నల్లగా మసిబొగ్గు రంగులో…  రాక్షసుడంతటి లావు, గిరజాల జుత్తు… ఎత్తు పళ్ళు… మనిషి అవుపించగానే అతడిని గుర్తించటం తేలికేలే… నువ్వు మెయిన్ గేట్ దగ్గర వుండు. నేను చెప్పిన పోలికలతో ఆయన కనిపించగానే… అప్పుడు నువ్వొచ్చి నన్ను కలు… పో….” శానిటరీ ఇన్‌స్పెక్టర్‌  చెప్పి ఆఫీసులోకెళ్ళాడు.

ఆ వచ్చే కాంట్రాక్టర్ మంచోడు అవునో కాదో? – దయ గలవోడు కాకుంటే వచ్చిన పని గోవిందే అనేసి గొణుక్కుని మెయిన్ గేటు వద్ద నిలబడి వచ్చిపోయేవారిని పరీక్షగా చూడసాగేడు యాది.

యాదిగాడి అయ్య చౌదరిగారి గొడ్ల కొట్టాంలో పేడ ఎత్తటం… ఊడ్చి శుభ్రం చేయటం.. అయ్యగారే పని చేస్తే అది చేస్తుండేవాడు. ఆయన పెళ్ళాం చౌదరమ్మ గారు శానా దయగల తల్లి. బువ్వకు లేదంటే నూకలు ఇచ్చేది…   దొడ్లో కాచిన సొరకాయో పొట్లకాయో ఇస్తుండేది. అప్పుడప్పుడు వాళ్ళ కోళ్ళపారం నుండి వచ్చిన కోడిగుడ్లు… మాంసం ఇచ్చి పుణ్యం కట్టుకునేది పుణ్యాత్మురాలు.

చౌదరిగారి కాడ చేసినందుకు టీతం ఏమీ ఇచ్చేవారు కాదు. పండక్కో పబ్బానికీ అమ్మకి అయ్యకి నాకూ కొత్త బట్టలిస్తుండేవాడు.

చల్లంగ ఆరి అండతో బతుకుతున్న మాకు పొలంలో ఎద్దు కుమ్మటంతో ఎగిరి అల్లంత దూరంలో పడ్డ నాయన అక్కడికక్కడే సచ్చిపోయిండు.

అప్పటి నుండి యాదికి బతుకు తెరువు కరువైంది, అయ్య చేసే పన్లు చౌదరిగారి కాడ చెయ్యడానికి యాదికి మనసొప్పేది కాదు. అందుకే బయట పన్లకోసం వెతుక్కోవలసిన కర్మ పట్టింది.

ఇంతలో ఇన్‌స్పెక్టరయ్య చెప్పిన ఆనవాళ్ళున్న ఒకాయన లోపలికి రావడం కంటపడగా తనూ ఆఫీసులోకి లగెత్తుకెళ్ళాడు.

తను ఆఫీసు గది గుమ్మంకాడ నిలబడ్డాడు. కాంట్రాక్టర్ లోనికెళ్లి ఇన్‌స్పెక్టర్ గారికి నమస్కారం చేసి లోగడ ఇవ్వాల్సిన నెల మామూలు తాలూకు డబ్బు రహస్యంగా కవర్లో పెట్టి ఆయనకు అందించటం చూశాడు యాది,

“ఒరేయ్ యాదిగా.., లోనికి రా” అని పిలిచి, “వీడిని నీవద్ద రోడ్డు ఊడ్చే స్వీపర్ పనిలో పెట్టుకోవాలి దరమయ్యా. చాలా బీదవాడు. తిండికి నానా యాతన పడుతున్నాడు…” విషయాన్ని క్లుప్తంగా కాంట్రాక్టర్‌తో చెప్పాడు.

“దండాలు దొరా…” అని కాంట్రాక్టర్ ముఖంలోకి వినయంగా చూస్తూ చేతులు కట్టుకు నిలబడ్డాడు యాది.

“ఏరా దొంగ నా కొడకా… ఇచ్చిన పని జాగర్తగా చేసుకుంటావా? – అవునూ లోగడ దొంగతనాలు ఎక్కడైనా చేశావా ఏంటి? నీ వాలకం చూస్తుంటే నిన్ను నమ్మబుద్ధి కావటంలేదే…” యాదిని నఖశిఖపర్యంతం చూస్తూ అన్నాడు దరమయ్య

“దేవుడి తోడు దొరగారూ… అట్టాంటి ఏబ్రాసి పన్లు నే చెయ్య…” లెంపలేసుకున్నాడు,

“కుర్ర నా కొడుకు రోడ్డేం ఊడుస్తాడు గానీ… నీకు సైకిలు రిక్షా ఇస్తా… ఇంటింటికీ తిరిగి ఇళ్ళల్లో వాళ్ళు వేసే చెత్త నీ రిక్షాలో చేసుకుని ఊరి పొలిమేరలో ఆ చెత్తను పడేసి రావాల రోజూ. రోజుకు నాలుగైదు ట్రిప్పులు తిరగాల! నీ మీద పని సరిగా చేయటం లేదని ఫిర్యాదులు చేయకూడదు, అర్థమైందా? ఏంది? చేత్తావా? అవునూ నీకు రిక్షా తొక్కటం వచ్చా…”

‘ఓ యస్సు సారూ! రిక్షా బెమ్మాండంగా తొక్కుతా” ముసిముసిగా నవ్వుతూ… బుర్ర గోక్కుని బదులు చెప్పాడు యాదు.

“తోక జాడించావో… నీ కాళ్ళు విరిచేస్తాను. అప్పుడు గుడిమెట్ల కాడ అడుక్కునే బిచ్చగాడినై పోతావ్… జాగర్త!”

“సర్లేరా యాదీ… నువ్వు బైటుండు. ఈయనొచ్చి నిన్ను కలుస్తాడు” ఇన్‌స్పెక్టర్ అనటంతో గదిలోంచి బయటపడ్డాడు.

యాది మనసంతా సంతోషంతో నిండిపోయింది. పూనకం వచ్చినవాడిలా చిందులేస్తుండగా దరమయ్య ఆఫీసులోంచి బయటకొచ్చి తనవద్దకు రమ్మని చెయ్యి వూపాడు యాదిగాడిని చూచి.

లగెత్తుకెళ్ళి దరమయ్యను చేరుకున్నాడు యాది. –

“నువ్వు పనిచెయ్యాలనుకునే ఎస్వీ కాలనీలో మొత్తం పదిహేను అడ్డరోడ్లున్నయ్, కాలనీవాసుల ఇళ్ళు, అపార్ట్‌మెంట్స్ అన్నీ కలిసి ఐదువేల కాపురాలుంటున్నాయ్. నీవంటి వాళ్ళు నలుగురు రిక్షా ఫుల్లర్స్ చెత్త సేకరించే పనిలో వున్నారు, నువ్వు పనిలో కొత్తగా వస్తున్న అయిదోవాడివి!… తెల్సిందా?”

“అర్ధమైంది దొరా!” అనేసి తలూపాడు.

“మీ అయిదుగురూ కాలనీ సెక్రటరీ కింద పనిచెయ్యాల, నెల జీతం మనిషికి రెండువేల చొప్పున ఆయనే ఇస్తాడు. మనమిప్పుడు సెక్రటరీ రెడ్డిగారిని కల్సుకోవాలి, నిన్ను ఆయనకు అప్పగిస్తాను, అక్కడితో నా పని అయిపోయినట్టే. ఇకనుండి కాలనీ సెక్రటరీ ఏం చెప్తే అది చెయ్! కష్టపడి వినయంగా వుండాల! మంచి వర్కర్‌గా పేరు తెచ్చుకోవాలి. నువ్వు నా వెనుక కూర్చో. మనం రెడ్డి గారింటికి వెడుతున్నాం..” బండి స్టార్ట్ చేశాడు దరమయ్య. వెనకగా వొద్దికగా కూర్చున్నాడు యాది.

***

ఇల్లిల్లూ తిరిగి చెత్త సేకరించటం… రిక్షా నిండగానే దాన్ని సిటీ శివార్లలో పడేయటం! ఈ పని యాది కష్టించి చేస్తున్నాడు.

అకస్మాత్తుగా తల్లి కన్నుముయ్యటంతో యాది వంటరివాడే అయినాడు. ఇన్నాళ్ళూ తనకు కొండంత అండగనున్న తల్లి చనిపోవటంతో దిక్కులేనివాడైనాడు. ఇక తనకు పెళ్ళి ఎవరు చేస్తారు? తోడులేని ఒంటరి బతుకు ఎన్నాళ్ళు? ఇంక తనకు తిండి ఎట్లా? అమ్మ చచ్చిపోయింది… తనకు ఎవరు వండిపెడతారు? తన   బాగోగులు చూచేదెవరు? ఇవన్నీ ఆలోచిస్తుంటే దుఃఖం పొంగుకొచ్చింది. తనను పెళ్ళి చేసుకుంటావాని తనకై తాను ఎవర్ని అడగగలడు?

“అత్తమ్మా… ఒకవైపు డ్యూటీ చేస్తూ రెండోవైపు కూడు వండుకు తినాలంటే నావల్ల కావటంలేదే… ఏం చెయ్యాల?” బుర్ర గోక్కున్నాడు అపుడే ఇంట్లోకొచ్చిన పక్కింటామెను చూచి.

“నువ్వు కట్టపడలేవు గానీ… పెళ్ళి చేసుకో… ఆ పిల్ల నీకింత వుడకేసి పెట్టుద్ది…”

“నాకెవరిత్తారే పిల్లని? నాకెవరుండారని?”

“అట్టాగంటావేందిరా…  నా అప్ప కూతురు నీకు ఈడైందే! పిల్ల సక్కని సుక్కనుకో – నువ్వు సరేనంటే నీ పెళ్ళి నే చేయిత్తారా…” భరోసాగా అంది,

“అట్టనేలే! పిల్ల నీ అప్ప కూతురైతే నేను చూసేదేముంది… నచ్చేదేముంది? నాకాడ ఇప్పుడు డబ్బుకేం కొదవలేదు. పంతులు గారితో నువ్వే మాటాడి పెళ్ళి ఏర్పాట్లు చేసెయ్యవే అత్తా…”

“అట్టనే… నువ్వేం దిగులు పడమాక…” వీపు తట్టి బయటికి నడిచింది తన్లో తాను నవ్వుకుంటూ హుషారుగా.

***

చెత్తతోపాటు కాలనీవాసులు వాడి పారేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను తాను రోజూ సేకరిస్తూ శుభ్రపరిచి సెకండ్ హ్యాండ్ వ్యాపారికి అమ్ముతూ అదనంగా నెలకో ఐదారువేలు ఆర్జిస్తున్నాడు యాది. వాడి బ్యాంక్ బ్యాలన్స్ ఇప్పుడు నాలుగైదు లక్షలు దాటింది.

యాదికి అత్తమ్మ అప్ప కూతురితో పెళ్ళయింది. తానుండే మురికివాడలోంచి వెళ్ళిపోదామనుకొని తాను చెత్త సేకరించే కాలనీలో రెండువందల గజాల స్థలం కొని వుంచాడు. ఏనాటికైనా తన కష్టార్జితంతో మంచి డూప్లెక్స్ భవనం కట్టించాలనీ… దానికి ‘చెత్తోడి నిలయం’ అనే పేరు పెట్టాలనే కోరిక యాది మదిలో గాఢంగా ముద్ర వేసుకుంది.

తాను చేస్తున్నది రిక్షాలో చెత్త ఎత్తుకెళ్ళే దుర్గంధభూయిష్ఠమైన నీచపుపనే అయినా వీలైనంత ఎక్కువ డబ్బు ఆర్జించి తన బిడ్డల బ్రతుకులైనా బాగుండాలనే తాపత్రయం యాది మదిలో రానురాను పెరిగి వటవృక్షమవసాగింది.

రిక్షాలను రద్దుచేసి వాటికి బదులు మున్సిపాలిటీ చెత్త సేకరణకు ట్రక్కులు త్వరలో శాంక్షన్ చేయబోతోందనే విషయం యాది తెల్సుకుని… తనూ ట్రక్ డ్రైవరవటం కోసం డ్రైవర్‌కి కావలసిన ట్రైనింగ్ తీసుకుని లైసెన్స్ సంపాదించాడు.

ఇప్పుడు యాదిగాడు కాలనీలో గల ఇళ్ళల్లో చెత్తని రిక్షాలో తరలించనవసరం లేకుండా తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంతో ట్రక్కు డ్రైవర్‌గా ప్రమోషన్ పొందాడు. నెల జీతం పదివేలకు పైగానే వస్తోంది. వాడి విసిరేసిన ప్లాస్టిక్ కవర్లు అమ్మకంలో మరో పదివేలు నెలకు సంపాదించగలస్థాయికి ఎదిగాడు. కానీ మనిషిలో వ్యక్తిగతమైన శుభ్రతలో మాత్రం ఎలాంటి మార్పు కన్పించకుండా తగిన జాగర్త వహిస్తుండటంతో ఒకవైపు కాలనీవాసుల అభిమానాన్ని మరోవైపు మునిసిపాలిటీ అధికారుల ఆదరణ పొందగలిగే స్థాయికి ఎదిగాడు యాది.

తానెంత కష్టించి సంపాదించినా మంచి బట్టలు వేసుకుని దర్జాగా బ్రతకలేకపోతున్నాడు. అవే మురికిబట్టాలు.. కంపుకొట్టే శరీరం! తను కష్టం చేసి సంపాదించేది పుట్టిన ఇద్దరు కొడుకుల కోసమే! వాళ్ళు చక్కంగ చదివి దర్జాగా వుద్యోగాలు చేయాల! తనలాంటి దుర్గంధ భూయిష్ఠమైన మురికి బ్రతుకులు పిల్లల దరిదాపులకు రాకూడదన్నదే యాది ధ్యేయం.

చెత్తోడి డూప్లెక్స్ ఇల్లు యాది అనుకున్నట్టే కట్టించాడు. లోగడ మనసులో నిర్ణయించుకున్న విధంగా దానికి ‘చెత్తోడి నిలయం’ అనే పేరు పెద్ద అక్షరాలతో రాయించాడు.

పంతులు గారిని కలిసి కొత్త ఇంట్లో ఎప్పుడు చేరాలో నిర్ణయించుకున్నాడు. ఆహ్వాన పత్రికలు అచ్చేయించి కాలనీవాసులకు… మున్సిపల్ అధికారులకు స్వయంగా అందచేసి తప్పక రావలసిందిగా కోరాడు.

బుర్రనిండా యాదిగాడికి ఆలోచనలే! తాను నిశానీదారుడు! పొట్ట పొడిచినా అక్షరం ముక్కరాదు. తనను చూచి చెత్తట్రక్కుల డ్రైవర్లు ఈర్ష్య పడేవారే! తన పై తోటివారంతా కక్ష కట్టారు. తనను పనిలోంచి ఊడపీకించాలని ఎవరికి తోచిన ప్రయత్నం వారు చేశారు. కానీ తనను పనిలోంచి తొలగించుట ఎవరివల్లా కాలేదు.

చెత్త ఎత్తికెళ్ళే పనిలో తాను చక్రవర్తి! అందరి మన్ననలు పొందగలిగాడు. పండుగ పబ్బం వస్తే కాలనీవాసులు తనకింత ముట్టచెప్తారు. యాభయ్యో పాతికో చేతిలో పెడతారు.

తనకు మిగతా చెత్త పనిచేసే వారంతా ఎక్స్ పార్టీనే! అప్పోజిషన్ అభ్యర్థులే! తన ఎదుగుదల చూచి ఏడ్చేవాళ్ళే. తన వెనకాల వారంతా కుట్ర పన్నుతున్నారనీ తెలుసు! తనకు దేవుడి అండ వుంది! తననెవ్వరూ ఏమీ చేయలేరు.

గృహ ప్రవేశానికొచ్చే కాలనీవాసులు, ఆఫీసర్లు తాను కట్టించిన కొత్త ఇంటిని చూచి ముక్కున వేలేసుకోవాల! తనను పొగడాల… ఆశీర్వదించాల!

ఓ చెత్త బండోడు ఇంతస్థాయికి ఎదగటం చరిత్రలోనే లేదని ఆశ్చర్యపోవాల! తాను వినయంగ వంగి వంగి అతిథులందరి కాళ్ళకు మొక్కాల,

ఇంకా ఎన్నోరకాల ఆలోచన్లతో యాది పురోహితుడింటికి వడివడిగా నడుస్తూండగా…. ఒక చెత్త ట్రక్కు వేగంగా వెనుకవైపు నుంచి వచ్చి యాదిని గుద్దేసింది. కింద పడ్డాడు. తల పగిలింది. ఇది తన తోటి వాళ్ళ దుర్మార్గపు పన్నాగమే అని గొణుక్కుంటూ తుదిశ్వాస విడిచాడు చెత్తోడు యాదిగాడు!

యాదిని పొట్టన పెట్టుకున్న చెత్త ట్రక్కు వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. ఇది ప్రత్యర్థుల పనే! సాటి చెత్తోడికి భూమ్మీద నూకల్లేకుండా చేశారు, దుర్మార్గులు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here