Site icon Sanchika

చెట్టు మాట్లాడుతోంది

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘చెట్టు మాట్లాడుతోంది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

గుబురుగా ఆకుపచ్చగా విశాలంగా
నేనిక్కడే నిలుచున్నాను
నచ్చానా

నా కొమ్మల్లో
ఎండిన పుల్లలతో కట్టిన గూడుంది
చూసావా

గూట్లోని జంట పక్షులు
తమ ముక్కుల్ని పైకెత్తి చూస్తున్నాయి
కనిపించాయా

నేలమీద నన్నానుకుని
ఓ యువ జంట ముచ్చట్లు పెడుతున్నారు
వినిపించాయా

దూరంగా పారుతున్న నదీ
గంభీరంగా నిల్చున్న పర్వతాలూ
బాగున్నాయా

చెట్టూ కొమ్మా పక్షీ
నదీ పర్వతాలూ

మహానగరంలో ‘ప్రకృతి’
సుందరంగా వుంది
గమనించావా

గోడమీద వేలాడుతున్న
ఫ్రేములోని
‘చెట్టు మాట్లాడుతోంది’

నేనేమో తడిసిన కళ్ళతో
మౌనంగా వింటూనే వున్నా

Exit mobile version