Site icon Sanchika

చేతులు లేని గాజులు

[dropcap]అ[/dropcap]మ్మమ్మా,

ముప్ఫయి సంవత్సరాలు నువ్వు ఉన్నావు అనే నేపథ్యంలో పెరిగి పెద్దయిన నాకు ఒక్కసారిగా నువ్వు లేవూ అనే నిజం చాలా నొప్పిని కలిగిస్తుంది. నీ మరణం నా జీవితంలో ఇంత వెలితిని కలిగిస్తుందని నువ్వు బతికున్నప్పుడు ఎప్పుడూ ఊహించలేదు. నువ్వున్నప్పుడు నీ మనసుని సంతోషపెట్టే చిన్నచిన్న పనులెన్నో చేయగలిగీ చెయ్యలేకపోయానే అన్న బాధ నన్ను అనుక్షణం వెంటాడుతుంది. నువ్వు బతికున్నప్పుడు నీకెప్పుడూ నేను ఉత్తరం రాయలేదు. అప్పుడు ఆ అవసరం రాలేదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరకు రాగలిగాను. కాని నాకిప్పుడు ఆ అవకాశం లేకుండా చేసింది నీ మరణం.

ఎంతోమంది ఎన్నో సందర్భాలలో నన్ను భోంచేయమనీ, అన్నం తినమనీ అడిగుంటారు. కానీ “కొండా, కొండా, రెండు ముద్దలన్నం తినెళ్లమ్మా” అని నువ్వు అడగటమే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు “కొండా” అని పిలిచినా, నా పేరు పెట్టి పిలిచినట్లే అనిపించింది కాని నీ విశేషప్రేమ నాకందులో అప్పుడు ధ్వనించలేదు. కాని ఇప్పుడు నువ్వు చనిపొయ్యాక “కొండా” అనే నీ సున్నితపు పిలుపు రంగరించిన నీ ప్రేమతో నా చెవులని నింపి పిండేస్తుంది.

నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను ఏమీ అడగలేదు. అడక్కుండానే నువ్వు ఎన్నోసార్లు తాతయ్యను మస్కా గొట్టి పాలకివ్వాలి, బియ్యానికివ్వాలి, నూనెకివ్వాలి అని ఎక్కువ డబ్బులు తీసుకొని చిన్న చిన్న నిథులు పేర్చి నాకిచ్చావు చీరలు గానీ ఇంకేదైనా కొనుక్కోమని. నువ్వు మాత్రం ఎప్పుడూ మూడు చీరలకంటే ఎక్కువ లేకుండా జీవితాన్నే వెళ్లబుచ్చావు.

నేను ఓ సారి నిన్ను చూట్టానికి వచ్చినప్పుడు “ఏ వమ్మమ్మా, చినగిపోయిన చీర కట్టుకున్నావు, కొత్త చీరలు లేవా?”అంటే ‘చీరంతా గట్టిగా ఉందమ్మా. రెండుచోట్ల కాస్త కొర్రు బట్టిందంతే. ఇంకో నాలుగు నెల్లు పని జేస్తది’ అన్నావు. తీసేసిన చీరల్ని గూడా మంచం మీద పక్కలుగా వేసుకొని, ఆ తరువాత వాటినే బండలు తుడిచే గుడ్డలుగా వాడి వాటిని సంపూర్ణంగా వినియోగించుకున్నానన్న తృప్తితో పొదుపుగా బతికావు నువ్వు.

పుట్టిన నాలుగేళ్లకే తల్లీ తండ్రిని పోగొట్టుకొని, పదిహేనేళ్లకే పెళ్లి జేస్తే, ఎనిమిది మంది బిడ్డల్ని కని, అందులో అయిదుగురిని వేరువేరు వయస్సులలో పోగొట్టుకొని, ఆరోగ్యరీత్యా ఎన్నో అవాంతరాల నెదుర్కొని, డెబ్భై ఏళ్లు తాతయ్యతో కాపురం చేసి, ఎనభై ఏళ్లు పైన బతికిన నీ మనోబలం, ఆత్మస్థైర్యం నాకు కావాలమ్మమ్మా.

మానెడు నీళ్లతో మానెడు మినప్పప్పు కడగటం, బియ్యం, కందులు లాంటి వాటిని రాళ్లు, మట్టిగడ్డలు లేకుండా చిటికెలో నువ్వు శుభ్రం చెయ్యటం, చేలో కూలీలు ఒక సాలు కలుపు తీసే లోపు నువ్వు మూడు సాళ్లు పూర్తి చేయటం, వేడుకల్లో విందులకు ఎంతమంది జనానికి ఏ ఏ సరుకులు ఎంతెంత కావాలి అనే నీ అంచనా, నువ్వు జడగానీ, ముడిగానీ వేస్తే మూడు రోజులైనా జుట్టు రేగదని దూరపూళ్లు ప్రయాణాలకెళ్లే వాళ్లు నీ దగ్గరి కొచ్చి తల దువ్వించుకొని వెళ్లటం… ఇలా నీ నైపుణ్యాన్ని చాటి చెప్పే పనులు చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇందులో ఏ ఒక్కటీ నేనెప్పుడూ చెయ్యవలసిన అవసరం రాలేదు. చెయ్యలేదు. చదువు బాటలో నడిచిన నేను వీటన్నింటినీ ముఖ్యమైన పనులుగా ఎప్పుడూ గుర్తించలేదు. వాటిని చెయ్యటంలోని నీ నైపుణ్యాన్ని నీ తోటివాళ్లు పొగుడ్తుంటే విని చిరునవ్వుతో నీ పనితనాన్ని కొట్టిపారేశానే గాని దాన్ని గుర్తించలేదు.

నువ్వు నేర్చుకోలేని సంగీతం, చదువులను మా అమ్మకీ, మామయ్యలకి నేర్పించావు గాని నీ విద్యలేవీ వాళ్లకి నేర్పలేదు. వాళ్ల దురదృష్టం కొద్దీ వంశపారంపర్యంగానైనా వాళ్లకవి అబ్బలేదు.

నువ్వు సంగీతం పంతులు సీతారామయ్య గారికి పాలు, పెరుగు, నెయ్యి, కూరగాయలూ అన్నీ పంపి, నెలనెలా డబ్బులిస్తూ, హార్మోనియం కొని అమ్మకు అయిదారేళ్లు సంగీతం నేర్పించావు. తమ్ముడు అమ్మని ఎన్నోసార్లు ఎలా దెప్పేవాడో నేను నీకు చెప్పాను. “నువ్వు ఎందుకమ్మా వృథా అసలు. మీ అమ్మ నలభై యేళ్ల క్రితమే కష్టపడి నీకు సంగీతం నేర్పించింది. అయినా ఆ రోజుల్లోనే ఆమెకే మాత్రం సంగీతజ్ఞానము లేకపోయినా సంగీతం విలువను తెలుసుకొని నీకు నేర్పించింది. నీకు సంగీతం నేర్పటానికి పెట్టిన ఖర్చుతో ఆ రోజుల్లో రెండెకరాలు పొలం వచ్చి ఉండేది. ఆమెకున్న జ్ఞానం నీకు లేదు. మా కెవ్వరికీ నువ్వు సంగీతం నేర్పించలేదు.” అది విని నువ్వు నవ్విన నవ్వులో నిన్ను నేను చాలా అరుదుగా చూశానమ్మమ్మా.

సంగీతం గొప్పతనాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా ఏ సంగీతం ప్రొఫెసరు కూడా చెప్పలేనంత సోదాహరణంగా చెప్పేదానివి. ఎప్పుడూ ఇల్లూ, ఊరు దాటి వెళ్లని నువ్వు రష్యాలో పొలాలకి సంగీతం వినిపించి చేసిన ప్రయోగం గురించీ, విజయవాడలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ కచేరిలో బాలమురళీకృష్ణ వయోలిన్ వాయించిన విషయం, ఎం.యల్. వసంతకుమారీ, శ్రీరంగం గోపాలరత్నం గురించి ఎలా తెలుసుకున్నావో నాకు ఇప్పటికీ అంతుబట్టని విషయం.

నీ ఒక్కగానొక్క కూతురు, మా అమ్మ, పెళ్లికి వెయ్యి నూటపదహార్లు కట్నమిచ్చి, కోట సచ్చిదానంద శాస్త్రి గారి బృందంచే హరికథ ఏర్పాటు చేసి నూట పదహార్లు పారితోషకం ఇచ్చావు.

ఎవ్వరి ముందూ నీకు పాటలు వచ్చని కానీ, పాటలు చాలా తెలుసు అని కానీ చెప్పుకోవటం నువ్వు ఎప్పుడూ చేయలేదు. బహిరంగంగా, ఎవరైనా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పాడలేదు. కానీ ఎందుకో నాకు మాత్రమే ఎవరూ లేనప్పుడు నీ పాటలు వినిపించే దానివి. నీ దృష్టిలో నేనొక రసహృదయం ఉన్నదాన్ని. నీ పాటలు, కథలు విని నేను ఎలా స్పందిస్తానో తెలుసు కోవాలని నువ్వు నాకవి వినిపించే దానివేమో. కానీ నేను మాత్రం ఒక్క “బాగున్నాయిలే అమ్మమ్మ” తో లేచిపోయే దాన్ని. నీ విషయంలో నేను చాలా ఆలోచనా రహితంగా ప్రవర్తించా నమ్మమ్మా. నువ్వు పూర్తిగా మంచంలో ఉన్న స్థితిలో నైనా నేను ఎవరూ లేకుండా చూసి అమ్మమ్మా పాట ఒకటి పాడవా? వినాలని ఉంది అనుంటే బహుశా నువ్వింకొన్నాళ్ళు బతికే దానివేమో!

చివరిసారి నేను నిన్ను చూడటానికి వచ్చినప్పుడు పది నిమిషాలు మాత్రమే నీతో గడిపాను. ఇక వెళతానమ్మమ్మా, టైం అయిపోయింది అని వెళుతుంటే “కొండా, కొండా ఇవ్వాళుండి రేపెళ్లమ్మా. ఇప్పుడొచ్చి ఇప్పుడే వెళతాను అంటున్నావు మమ్మ గదూ, ఉండమ్మా” అని నువ్వు బతిమలాడావు. “లేదులే అమ్మమ్మా మళ్ళీ ఓ నెల రోజుల్లో వస్తాలే ఇప్పుడు వెళ్లాల్లే” అని పరిగెత్తుతున్న నన్ను ఆపి “కొండా ఒక్క నిమిషం ఉండమ్మా, డబ్బులున్నయ్యి ఇస్తాను. తీసుకెళుదువుండు” అంటూ కావిడి పెట్టెలో నుంచి ఉండగా చుట్టిన నీ చీరెను తీసి, ఆ ఉండను విప్పి అందులో నుంచి ఓ పోలిథీను సంచి తీసి, దాంట్లోంచి ఓ బ్రూక్ బాండ్ కాఫీ పొడి కవరులోనుండి మాసిన ఓ తెల్ల పంచ ముక్కలో ఉండజుట్టిన చిన్న పాత పర్సుని తీసి “కొండా, ఇందులో డబ్బులున్నాయి. నువ్వు తీసుకెళ్ళి ఒక అరశవరీలో ఏదైనా కొనుక్కో” అంటూ పర్సుని నాకు ఇచ్చావు.

“నాకెందుకు అమ్మమ్మా డబ్బులు? నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకొని నీ మందులకీ, తిండికీ ఖర్చు పెట్టుకో. నాకు డబ్బులు నువ్వివ్వ కూడదు”. అని వారించి డబ్బులు వెనక్కిచ్చాను.

“కొండా, కొండా నువ్వు అట్లా అనొద్దమ్మా. నేను బతకను, గుండెల్లో దడ బాగా ఎక్కువైంది. కంటిమీద కునుకనేది లేదు. ఈ పక్కంతా ఒకటే పోటు. అసలిక్కడ చూడు, గుండె ఎలా కొట్టుకుంటుందో” అని నా చేతిని నీ ఎండిన గుండెల మీద పెట్టుకున్నావు. నేను వెళ్లే తొందరలో నీ గోడు ఆలకించలేదు.

డబ్బులు మాత్రం ససేమిరా వద్దంటున్నా నువ్వు నన్ను దీనంగా బతిమాలి పర్సు, కాఫీ పొడి కవరుతో సహా ఇచ్చావు. అవి తీసుకొని పరిగెత్తుతున్న నా వెనుక అస్తిపంజరంలా ఉన్న నువ్వు నీ గొంతు నూతిలో నుంచి అన్న మాటలే నాకు ఎప్పటికీ గుర్తుండి పోయే నీ చివరి మాటలు. “అయ్యో, ఏందమ్మా వచ్చినట్టు లేదు. ఒక్క పూటన్నా ఉండకుండా వెళ్లిపోతున్నావు కొండా… ”

సరిగ్గా నీ నుంచి నేనిలా పరిగెత్తుకుంటూ వెళ్లిన నెలరోజులకి నువ్వు చనిపోయావు. నువ్వు చనిపోయిన తరువాత ఓ రోజు మా అమ్మ నీ గాజులు రెండింటినీ నాకు చూపిస్తూ

“అమ్మమ్మ నీకివ్వమన్నది.” అని చెప్పి ఇచ్చింది. వాటిని చూసి నేను భోరున ఏడ్చాను. అవి నీ చేతులకున్నప్పుడు ఒకటి రెండుసార్లు గమనించాను. కాని వాటిలో ఉన్న నీ చేతుల్ని గమనించలేదు. కాని అమ్మ చూపిన గాజుల్లో లేని నీ చేతులు తప్ప నాకింకేమీ కనిపించటం లేదమ్మమ్మా.*

Exit mobile version