Site icon Sanchika

కత్తి లాంటి “ఛురి”

వొక నాజూకు విషయం ప్రేక్షకుడికి అందించడానికి సాధారణం కాని పధ్ధతులు ఉపయోగిస్తారు దర్శకులు. మీరు “అర్థ్” చూసి వుంటే, అందులో వివాహేతర సంబంధం లో వుండి,అది తెగిపోయి మరలా భార్య దగ్గరికి వెళ్ళి పాతవన్నీ మరచిపోయి మరలా కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామా అంటాడు. నీ స్థానం లో నేనుంటే నువ్వు ఏమనేవాడివి అంటుంది. నిజాయితీగా అంటాడు నో అనేవాడిని అని. మరో సినెమా “కమలా” 1984 లో వచ్చినది. భర్త ఒక విలేఖరి. మధ్య ప్రదేశ్ లోని భీల్ ట్రైబ్స్ లో స్త్రీలను అమ్ముతారని అందరికీ తెలిసిన విషయం. అది సాక్షాధారాలతో నిరూపించాలని భర్త నిజంగానే అలాంటి వొక అమ్మాయిని (దీప్తి నవల్) కొని ఇంటికి తీసుకొస్తాడు. (అక్కడ భయంకరమైన సీన్, కొనేవాళ్ళు స్త్రీలను వొళ్ళంతా తడిమి, నలిపి అన్నీ నచ్చితేనే ఎంచుకుంటారు కొనడానికి). మర్నాడు కోర్టులో సాక్ష్యంగా ఆ అమ్మాయిని ప్రవేశపెట్టాల్సి వుంది. ఇంట్లో సోఫా మీద భార్య (షబానా ఆజ్మి) కూర్చుని వుంటుంది, నేల మీద దీప్తి. హాలంతా కలయ జూస్తూ దీప్తి అడుగుతుంది సార్ ఎంతిచ్చి మిమ్మల్ని తెచ్చుకున్నారు అని.

వొక వ్యాసానికి, వొక కళాకృతికి వున్న తేడానే ఇది. చెప్పే విషయం షార్ప్ గా చెప్పడం వల్ల చూసిన వ్యక్తికి గుర్తుండిపోతుంది. అయితే అవి కథ కు, శిల్పానికి అతకాలి, అతికించకూడదు.

ఇప్పటి చిత్రం “ఛురి” దగ్గరికి వస్తే మొట్టమొదటి సీన్ వేలాడుతున్న wind chimes. అది ఇంట్లో వేలాడదీస్తే అదృష్టం అని చైనీయుల నమ్మకం. అందుకే మనదగ్గర కూడా బాగా అమ్ముడుపోతాయి. ఇక హాల్లో సోఫా మీద శరద్ (అనురాగ్ కాశ్యప్) కూర్చుని పేపర్ చదువుతున్నాడు, పిల్లలు స్కూల్ కి తయారవుతున్నారు, వంటగదిలో భార్య మీరా (టిస్కా చోప్రా) వంటమనిషి సాయంతో వంటచేసి టిఫిన్ తినిపిస్తుంది పిల్లలని. పక్కనే వున్న మొబైల్ లో notification alert sounds వస్తే శరద్ అది చూసి చిరునవ్వుతాడు. మీరా కూడా అతన్నే గమనిస్తూ వుంటుంది. అతను వెంటనే తయారై వెళ్ళబోతుంటే, కూతురు అడుగుతుంది నన్ను క్లాస్ కి దిగబెట్టాలి, మరిచిపోయారా అని. అర్జంటు పని పడింది కాస్త నువ్వు ఈ రోజు చూసుకో అని భార్యతో చెప్పి వెళ్ళిపోతాడు. మీరా కార్ లో కూతురిని తీసుకుని బయలుదేరుతుంది. కూతురు కోపంగా వుంది. అమ్మా, నువ్వు ఇంత తేలికగా తీసుకుంటున్నావు, ఏమనవే, నీకేం చాతకాదు, నువ్వొట్టి హోప్లెస్ అంటుంది. ఎదిగే పిల్లలు అన్నీ అర్థం చేసుకుంటారు. ఈ మాట విన్న తర్వాత మీరా సమస్య మరింత జటిలమవుతుంది. అబధ్ధాలు చెప్పి సుర్వీన్ చావ్లా (ఇది నటి పేరు, పాత్రకు పేరున్నట్టు లేదు) ఇంటికి వెళ్తుంటాడని తెలుసు మీరాకి. కూతుర్ని దిగబెట్టాక తిన్నగా ఆ ఇంటికే వెళ్ళి తలుపు తడుతుంది. Spoiler alert ahead. ఇంటిమేట్ క్షణాల్లో మీరా తలుపుబయట వున్నట్టు గమనించి సుర్వీన్ అతన్ని అతని బట్టలతోపాటు వేరే గదిలో దాచేస్తుంది. మంచినీళ్ళు అడిగిన మీరా, లోపలికి వచ్చి కూర్చుని తాగుతాను అంటే తప్పక రానిస్తుంది. నేను షూట్ కి వెళ్ళాలి ఏమనుకోవద్దు అని లేవబోతుంటే, రెండు నిముషాలు చాలు. తిన్నగా విషయానికి వద్దాం, నువ్వు శరద్ ని రెండు రోజులుంచుకో, మిగతా రోజులు ఇంట్లోనే వుండనీ అంటుంది. ముందైతే శరద్ ఇక్కడెందుకుంటాడు అని నాటకం ఆడబోతే, నాకన్నీ తెలుసు మనం వొక ఒప్పందానికి వచ్చేస్తే ఇద్దరికీ బాగుంటుంది, చాటుగా కలిసేప్పుడు వుండే థ్రిల్ వుండదుగాని వొక పధ్ధతంటూ ఏర్పడుతుంది కదా అంటుంది. ఏ రెండు రోజులు అన్నదగ్గర ఇద్దరికీ సమస్యలున్నాయి. అంత టైట్ షెడ్యూల్. ఆరోజు నాకు ఫలానా కారణంగా కుదరదు అంటే మరో రోజు ఫలానా కారణంగా నాకు కుదరదూ అని ఇంకొకరు అంటారు. చివరికి ఆదివారమో, అంటుంది సుర్వీన్. అబ్బే ఆ రోజు పిల్లలు ఇంట్లోనే వుంటారు కుదరదు, పోనీ నువ్వు శనివారం వుంచుకో అంటుంది మీరా. శనివారం అస్సలు కుదరదు, ఆ రోజు విక్రం అని నాలుక కరచుకుంటుంది సుర్వీన్. విక్రం అంటే మీ బాసే కదూ, పోనీ అతను వెళ్ళిపోయాక శరద్ ని పిలుచుకో అంటుంది మీరా. ఇక వెళ్తాను గాని, ఆయనకిచ్చి పాత మేజోళ్ళు పంపు, తక్కువ పడుతున్నాయి అని మెట్లు దిగుతుంది మీరా. చాటుగా అంతా వింటున్న శరద్ బయటికొచ్చి ఒహో, విక్రం కూడానా, నీకు సిగ్గులేదూ అంటాడు. తీక్షణంగా చూస్తుంది అతన్ని సుర్వీన్. మెట్లు దిగిన మీరా కారు తీయబోతుంటే పైనుంచి శరద్ బట్టలూ, బూట్లూ కింద పడతాయి. మీరా పెదాలపై చిరునవ్వు.

ఇక్కడ రెండు విషయాలు చర్చించుకోవాలి. సుర్వీన్ కి మరో వ్యక్తి తో సంబంధం వుండడం అనేది చూపించడం వల్ల ఆ ముగింపు అంత షార్ప్ గా వీలయ్యింది, కాని దాని కోసం విక్రం పాత్ర అవసరమా? శరద్ తో వుండడం మీరా పట్ల అన్యాయం అన్న అపరాధ భావన వున్న సుర్వీన్ కి అబధ్ధాలు చెప్పాల్సి వస్తుంది, కాని సిగ్గు లేదా అని అతను అడిగితే ఆ వొక్క ఎక్స్ప్రెషన్ తో అంతా చెప్పేస్తుంది. వెంటనే మరో చర్య అతని వస్తువులు కిటికీ లోంచి గిరాటెయ్యడం. విక్రం పాత్ర వల్ల అసలు సిసలు శరద్ బయటపడ్డాడు, కాకపోయినా తనను ఇద్దరు పంచుకోవడం అన్న మాటలు విని అతను సగం చచ్చిపోయుంటాడు. మొదట్లో మీరా వున్న ఇంట్లో చూపించిన విండ్ చైంస్ లాంటిదే సుర్వీన్ ఇంట్లో కూడా వుంటుంది. అక్కడ అబధ్ధమాడాల్సి వస్తుంది సుర్వీన్ కు. మనస్సాక్షి తప్పు చేస్తున్నట్టు గమనించిన ఇద్దరూ అబధ్ధాలనే ఆశ్రయిస్తారు. ఇక కథ అవకాశమిచ్చిందని “చాటుగా కలుసుకోవడంలో వుండే థ్రిల్లు తిన్నగా కలుసుకోవడంలో వుండదు” లాంటి విషయాలు పెట్టింది దర్శకురాలు. ఇక లిఫ్ట్ పనిచెయ్యక ఆమె అన్ని అంతస్తులూ నెమ్మదిగా ఎక్కితే, చివర్న అతని బట్టలు పైనుంచి క్షణంలో కింద పడతాయి. కవిత్వంలో అలంకారాలు వాడినట్టు, సినిమాలో కూడా ఇలాంటి ఆలోచనలు, రూపకల్పనలూ చెయ్యాలి కదా. లేకపోతే లిఫ్ట్ చెడిపోవడం ప్రసక్తే ఎందుకు. రెండోది కూతురు నువ్వు ఏమీ అనవెందుకమ్మా అన్నప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఇంటి పట్ల మాత్రమే కాదు వైవాహిక బంధంలో కూడా బాధ్యతా రహితంగా వున్నాడు, అని తనకు తెలుసన్నట్టుగా మాట్లాడుతుంది. భార్యకు వివరంగా తెలిసిన విషయం కూతురుకు చూచాయిగానైనా తెలీదా. పిల్లలకు ఏమీ తెలీదనుకోవడం పెద్దలు చేసే పొరపాటు.

చురి అంటే కత్తి. అదే కత్తి తో సుర్వీన్ మీరా ఇంటిని కోస్తే. అదే కత్తితో మీరా తన భర్తను కోసి సుర్వీన్ తో పంచుకోవడానికి తయారవుతుంది. టైటిల్స్ లో కూడా “ఛురి” అన్నప్పుడు అడ్డంగా వొక గాటు కూడా తెలివిగా పెట్టారు. దీనికి కథా, దర్శకత్వం రెండూ మానసి జైన్. ఈమె కొలంబియా యూనివర్సిటి నుంచి స్క్రీన్ రైటింగ్ లో పట్టా సంపాదించి, కొన్ని లఘు చిత్రాలు చేసి ప్రస్తుతం మరో పూర్తి నిడివి చిత్రం మరియు ఇతర ప్రాజెక్టులకు పని చేస్తున్నది. ఈమె నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. ముగ్గురూ బాగా నటించారు. టిస్కా కాస్త ఎక్కువ. ఈ లఘు చిత్రం చూడమనే నా మాట.

Exit mobile version