[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘చిగురించిన ఆశ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]కొ[/dropcap]న్ని సంవత్సరాల తర్వాత నీరజ రామాపురం వచ్చింది. అది పల్లే కాదు పట్నమూ కాదు. ఆ మధ్యనే కొన్ని ఆధునిక వసతులు వస్తున్నాయి. సిమెంట్ రోడ్లు, త్రాగునీటి సరఫరా, మంచి పాఠశాలలు వగైరా. రాఘవరావు గారి ఇంటిముందు రిక్షా ఆగింది. గేటు తీసుకుని వస్తున్న నీరజను సీతమ్మ చూసింది. లేచి నిలబడి “రామ్మా నీరజా, అంతా బాగున్నారా” అంది. ఆమె వెనుక సౌమ్య, శరత్ వచ్చారు. మనుమలను దగ్గరకు తీసుకొని సీతమ్మ సంబరపడింది. “అబ్బో పెద్దవాళ్లయ్యేరు. పొడుగు ఎదిగేరు” అంది.
“అవును అత్తయ్యా సౌమ్య ఆరవ తరగతిలోకి, శరత్ 9వ తరగతికి వచ్చారు. మీరు ఎలా ఉన్నారు? మావయ్య గారు కులాసానా?” అంది నీరజ. సామాను లోపల పెట్టి నెమ్మదిగా పనుల్లోకి దిగారు. పూజ జపాలు అయ్యాక టిఫిన్లు కబుర్లలో పడ్డారు.
మామగారి దగ్గరికి వెళ్లి వినయంగా “మామయ్యా మీ ఇర్వురతో మాట్లాడి మీరు దయతో అంగీకరిస్తారనే నమ్మకంతో ఇలా వచ్చాను. విషయాలు మీ అబ్బాయి నేను చర్చించుకున్నాకనే బయలుదేరాను” అంది.
“ఏమిటి విశేషం” అన్నారు రాఘవరావు గారు
“కారణాలు ఏమైనా మేం బాగా దిగువ మధ్యతరగతిలోనే ఉండిపోయేము. మా ఇద్దరికీ ప్రైవేటు కంపెనీల్లోనే పని. పెద్ద జీతాలు రావు. విపరీతమైన పని మాత్రం తప్పదు. రోజులో ఒక కాల పరిమితి అంటూ ఉండదు. ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంకాలం ఆరు ఏడు ఇలా ఇల్లు చేరుతాము. మీ అబ్బాయికి 24 వేలు, నాకు 16 వేలు వస్తాయి. నేను పెళ్లి టైంకి పదో తరగతి చదివేను కదా, కష్టపడి కంప్యూటర్ ఇంగ్లీషు నేర్చుకొని ఆ తర్వాత ఈ ఉద్యోగంలో అడుగు పెట్టాను. ప్రైవేట్‌గా డిగ్రీ పరీక్షలకు తయారవుతున్నాను.
ఇలాంటి ఆర్థిక పరిస్థితులలో పిల్లల్ని పెంచడం చాలా కష్టమైన పని. స్కూలు వదిలేక వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది ఓ సమస్య. ఈమధ్య పిల్లలు ఇతర పిల్లల్ని చూసి మొబైల్ ఫోను కావాలని గునుస్తున్నారు. మాకు ఆ సమర్థత లేదాయె. అన్నిచోట్ల పిల్లలు ఫోనుకు అలవాటై సామాజిక మాధ్యమాలు గేమ్స్ మొదలైన వాటి తోటి సమయం ఎక్కువ గడిపేస్తున్నారు. చదువులు అటక ఎక్కేయి.
పిల్లలను సక్రమంగా పెంచకపోతే మంచి పునాది గణితం, ఆంగ్లంలలో పడుట లేదు. నైపుణ్యం లేని విద్యతో ఏం చదివినా వృథాయే కదా మామయ్యా. అనాదిగా వస్తున్న B.A., B.Sc. కోర్సులకు కాలం చెల్లింది. వృత్తివిద్య కోర్సులకు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ రావాలి. డబ్బు ఖర్చైనా నైపుణ్యాలు లేని చదువులు చదివి ఎందరో ఇంజనీరింగ్ చేసి నిరుద్యోగులుగానే మిగులుతున్నారు కదా, ఇప్పుడు సరైన పునాది ఉన్న చదువు ఒక్కటే కొందరు విద్యార్థులను ఇతరులకు భిన్నంగా నిలపగలదు.
మా అభ్యర్థన వినండి. దయచేసి మీరు మాతో రండి. మనం కలిసి ఉందాం. మీరు ఇంట్లో ఉంటే నిధి ఉన్నట్లే. ఉపాధ్యాయులుగా మీరు వాళ్ళిద్దర్నీ బాగు చేసి సక్రమ మార్గంలో పెట్టగలరు. అత్తయ్య గారు క్రమశిక్షణకు భగవంతునిపై భక్తికి మారుపేరు మీరు మాతో ఉంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
నా ఆఫీసుకు దగ్గరగా ఇల్లు తీసుకున్నాను. ఈ వయసులో మీ ఇర్వురికీ శారీరక శ్రమ కలిగించను. వంట, టిఫిన్లు, అన్నీ నేను చూసుకుంటాను. మీ అబ్బాయి కూడా జాగ్రత్తగా ఏం కావాలో సరుకులు కాయగూరలు అన్నీ సిద్ధపరుస్తారు.
మీ ఇద్దరి పర్యవేక్షణలో వాళ్లకు బేసిక్స్‌లో పునాది పడుతుంది . భవిష్యత్తుకు పెద్ద ఆసరా అది” అంది నీరజ.
“రోజులు చాలా మారాయి మామయ్యా! పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్స్ సాధించుకున్న పేదలకు సాయం చేసి చేయూతనందించే దాతలు నేడు ఎందరో ఉన్నారు. ఈ మధ్య వార్తల్లో ప్రముఖంగా పేర్కొన్న ఒక అతి పేద బాలిక గురించి చెప్తున్నాను. పసుల కాపరి కూతురు, మారుమూల కుగ్రామం; స్వయంకృషితో ఇంటర్ పూర్తి చేసి ఏ విధమైన ట్యూషన్స్ లేకుండా IITలో సీటు సాధించుకున్నది. డబ్బులు లేవని చేరలేకపోయింది. విషయం తెలిసికొన్న విశాల హృదయుడు ఒక పెద్ద మనిషి ఆ గ్రామం వచ్చి, ఆమెను గుర్తించి వెంటనే ఆ కోర్సులో చేర్చారు. ఇది ఎందరికో ఆనందాన్నిచ్చింది.
నీరజ ఒక నిమిషం ఆగింది “అత్తయ్యా, బావగార్లిద్దరూ వారి సంసారాలు బాగున్నాయి. మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము కారణాలు ఏమైనా కానివ్వండి. గతంలోకి వెళ్లి వగచినంత సేపూ ఏమీ ఫలితం ఉండదు. భవిష్యత్తుపై చూపులు పెట్టాలి కదా, చెప్పండి. దయచేసి నా మాట మన్నించండి” అంది.
రాఘవరావు సీతమ్మ అన్నీ విన్నారు. ఆలోచనలో పడ్డారు.
“ఈ ఇంటి పర్యవేక్షణ మీకు తెలిసిన మిత్రులకు అప్పగించండి. పిల్లలకు శలవులు ఇచ్చినప్పుడు మీరు, వాళ్లు ఇక్కడకు వచ్చి ఉండవచ్చును. ఒక్క నాలుగేళ్లు; మీ అండదండలు ఉంటే శరత్ తప్పకుండా మంచి ర్యాంకుతో ఇంజనీరింగ్‌లో సీట్ సంపాదించగలడన్న నమ్మకం నాకున్నది” అంది నీరజ
“నీవు చెప్పిన విషయాలన్నీ విన్నాం. మీ ఆలోచన బాగుంది. నేను ఇక్కడ తెలిసిన వారితో మాట్లాడతాను. ఒక్కసారిగా నగర జీవితంలోకి వస్తే ఆ మార్పు, హడావిడి మేం తట్టుకోగలమా అనేది కూడా ఆలోచించాలి” అన్నారు రాఘవరావు
“అలాంటి భయం అక్కరలేదు మామయ్యా, మనం తీసుకున్న ఇల్లు మంచి పరిసరాల్లో ఉంది. దగ్గరలో పార్కు, రామాలయం ఉన్నాయి జనం రద్దీ ఎక్కువ ఉండదు. నగరం మధ్యలో లేదు” అన్నది నీరజ.
పిల్లలు ఆటలాడుకొని తిరిగి వచ్చారు. వంట నిమిత్తం సీతమ్మ, నీరజ లోపలికి వెళ్లారు
సాయంత్రం కొంతసేపు నీరజ బయట పూర్వం పరిచయం ఉన్న వారిని చూడ్డానికి వెళ్ళింది. రాత్రి భోజనాలు అయ్యేయి. రాఘవరావు గారు “అమ్మా నీరజా , ఇందాక అబ్బాయి కృష్ణ ఫోన్ చేసేడు. తప్పక రమ్మని అమ్మను, నన్ను మరీ మరీ కోరాడు, సరే, రేపు కొన్ని ఏర్పాట్లు చూద్దాం. ఓ మంచి రోజు చూసి బయల్దేరుదాం” అన్నారు
సంబరంతో నీరజ అత్తమామలకు నమస్కరించింది. మర్నాడు బస్సు టికెట్లు రిజర్వేషన్ కోసం వెళ్లింది.
రోజులు గడుస్తున్నాయి. రాఘవరావు పర్యవేక్షణలో శరత్‌లో ఆశించిన మార్పులు వస్తున్నాయి. చదువుపై శ్రద్ధ పెరిగింది. తాతగారిని సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాడు. ప్రవర్తన తీరు మారింది. పాఠశాలలో టీచర్లు గుర్తించి శరత్‌కు వారు కూడా చక్కని సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. పదో తరగతి బోర్డ్ పరీక్షల్లో తృప్తికరంగా మార్కులు వచ్చేయి
నగరంలో పేరుగాంచిన జూనియర్ కళాశాల యాజమాన్యం వారు, శరత్ ఇంటికి వచ్చి, పిల్లవాడిని, కుటుంబాన్ని పరిశీలించి చూసేరు. శరత్ చదివిన హైస్కూల్ హెడ్ మాష్టర్ గారిని సంప్రదించి ఇతడు ప్రోత్సాహం అందిస్తే ఇంజనీరింగ్‌లో ర్యాంక్ తేగలడు అన్న ఆలోచన చేసేరు.
ఫీజులో రాయితీ, వాయిదాల పద్ధతిలో ఆ ఫీజు చెల్లించడానికీ అంగీకరించారు. ప్రిన్సిపాల్ గారి ద్వారా తెలిసిన పుస్తకాలు షాపు వారు పుస్తకాలను ఉచితంగా ఇచ్చారు. మరొకరు యూనిఫార్మ్స్ సమకూర్చేరు. శరత్ బాధ్యతతో చదివి ఇంజనీరింగ్‌లో ర్యాంక్ పొంది ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం సంపాదించేడు.
నీరజ, కృష్ణల కల నెరవేరింది. వారెంతో సంతోషపడ్డారు. ఆనాడు ఆనందం; వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల ఇరుగుపొరుగు వారు అభినందించి మంచి కానుకలిచ్చేరు. రోటరీ క్లబ్ వారు సైకిల్ ఇచ్చి వితరణ చాటుకున్నారు
సౌమ్య అన్నను చూసి స్ఫూర్తి పొందింది. అవకాశం వినియోగించుకోవడానికి ఆడపిల్లలకు గల రిజర్వేషన్ కూడా దోహదపడింది. ఇంజనీరింగ్‌లో తను కోరిన బ్రాంచ్ లో చేరింది.
అవును చక్కని పునాదితో నైపుణ్యాలు పెంచుకున్న వారికి ఉన్నత విద్య సాధ్యం;. ఉద్యోగం పొందడం కూడా మరీ కష్టం కాదు. అందరి కలలూ నెరవేరడానికి, అందరి సమిష్టి శ్రమ వున్నాయి. ముందుచూపు దోహద పడింది.