చిలక జోస్యం

0
2

[dropcap]స్కూ[/dropcap]ల్లో రీసస్ గంట మోగింది. మగ పిల్లలు కొందరు పాడుకుంటూ రోడ్డు మీది కొచ్చారు. కొంత మంది బుద్ధిగా స్కూలు లోపలున్న బాత్ రూమ్‌లలో కెళ్ళారు. బయటికొచ్చిన వాళ్లు అటూ ఇటూ దిక్కులు చూశారు. రోజు ఈ సమయానికల్లా ఐస్ ఫ్రూట్లు అమ్మే అతను, చెరుకురసం బండి అతను, పప్పుండలు అమ్మే అతను, నారింజకాయలు, జామపళ్లు అమ్మే అతను కాని వచ్చి సిద్ధంగా వుంటారు. ఈ రోజు వీరందరికి తోడు చిలుక వున్న పంజరం పట్టుకుని ఒకతను గోనె పట్టా పరుచుకుని కూర్చుని వున్నాడు.

“మనుషులు చెప్పే జోస్యం కాదు బాబులూ. ఇది చిలకమ్మ చెప్పే జోస్యం. నా చిలకమ్మ అచ్చరం పొల్లు బోకుండా జరగబోయేది చెప్పుద్ది. మీరెట్టా చదువుతారో, మీకెన్ని మార్కులు వస్తాయో, నా చిలకమ్మ కరట్టుగా చెప్పుద్దయ్య. ఒక్క రూపాయి ఇయ్యండి చాలు” అంటూ పెద్దగా అరవసాగాడు. తన అరుపులతోపాటు పంజరానికి ఒక చిన్న గంట కట్టి ఆ గంట మోగిస్తూ మరీ చెప్తున్నాడు.

కొంత మంది పిల్లలు అదేంటో చూద్దామని అతని దగ్గర గుమిగూడారు. ప్రసాద్ తను తెచ్చుకున్న డబ్బులతో ఆ రోజు పప్పుండలు కొనటం మానేసి చిలుక జోస్యం చెప్పించుకోవాలనుకున్నాడు. తను ఎట్లా చదువుతాడో చిలుక ద్వారా వినాలనుకున్నాడు.

“చిలుక మాట్లాడుతుందా? ఏదీ మాట్లాడించు చూద్దాం” అన్నాడు ప్రసాద్.

“నా చిలకమ్మకు ఇంకా మాటలు బాగా రావటం లేదు. మాటల్ని నేనయితే నేర్పుతున్నాను. కాని నీ సంగతులన్నీ చెప్పగలదు. ఎలా చెప్తుందో చూద్దూవుగాని ముందు నువ్వు చిలకమ్మ ముందు రూపాయి పెట్టు. డబ్బుల్ని చూస్తే గాని నా చిలకమ్మ మాట వినదు” అన్నడు.

ప్రసాదు రూపాయి బిళ్ల తీసి చిలక ముందు పెట్టాడు. ఆ రూపాయిని తీసుకుని అతను ముద్దు పెట్టుకుని ఆ తర్వాత చిలుక కళ్ల మందు ఆడించి ఆ తర్వాత చిలక పంజరానికీ తాకించాడు.

“ఇదుగో చిలకలమ్మా! నా బంగారు చిలకమ్మా! ఈ బాబు నీకు రూపాయి ఇచ్చాడు. దీంతో నీకు జామకాయి కొంటాను. అదంటే నీ కెంత ఇష్టం కదూ? కొరుక్కుని తిందువుగాని, తింటావుగా!” అన్నాడు.

చిలుక “క్రి… క్రి….” అన్నది. ఈలోగా ఒక అబ్బాయి వెళ్లి జామపండు కొనుక్కునే తెచ్చాడు.

“పంజరం తలుపు తియ్యి. పండును చిలుక్కి నేనే ఇస్తా”నన్నాడు.

“కాస్త ఆగు బాబు చిలుక పండు తింటూ కూర్చుంటే ఎలా? ముందు ఆ బాబుకు జోస్యం చెప్పాలి. ఆ తర్వాత నువ్వే ఇద్దువుగాని” అంటూ పంజరం వాకిలి మూత తీశాడు. చిలకమ్మ బయటి కొచ్చింది. దాని కాలికి సన్నటి తాడు కట్టివున్నది. ఆ తాడు మళ్లీ పంజరానికున్న ఇనప చువ్వుకే ముడివేసి వున్నది.

“చిలుక పారిపోకుండానా? అలా తాడు పెట్టి కట్టేశావు?” అనడిగారు పిల్లలు.

“అవును బాబూ! అదను దొరికితే ఎగిరిపోవాలని చూసుద్ది. నేనెంత పేమగా సాకుతున్నాను దీన్ని” అంటూ దాని తల మీద నెమ్మదిగా నిమరాడు.

“బాబులు మళ్లీ లోపలకి ఎల్లాలి. తొందరగా జోస్యం చెప్పాలి. ఆలీసం చెయ్యకూడదు” అంటూ దాని రెక్కల మీద నిమరాడు అతను.

చిలుక పంజరం దాకా పరచివున్న పట్టా మీదికీ రెండు సార్లు తిరిగింది. ఈలోగా అతను ఏవో మాటలు వ్రాసి వున్న కార్డులు పట్టుకుని పేకముక్కలు కలిపినట్లుగా కలిపి వాటిని దొంతరగా పేర్చాడు. చిలుక తియ్యటానికి వీలుగా పట్టా మీద వుంచాడు. చిలుక ఒకసారి తన ముక్కుతో ఒకసారి వాటిని అటూ ఇటూ కదిపింది. అతను వాటిని మళ్లీ సరిచేశాడు.

“బాగా ఆలోసించి చెప్పాలి చిలకమ్మా. సదువుకునే బాబులికి ఆల్ల సదువు గురించి కరట్టుగా చెప్పాలి. గుర్తు పెట్టుకో” అన్నాడు అతను.

ఈసారి కూడా ఆ కార్డుల్ని తన ముక్కుతో చిలుక అటు ఇటు కదిపి చివరకు ఒక కార్డును బయటి లాగి ఇవతలకు పడేసింది.

“చూశావా బాబూ! నా చిలకమ్మ గభాలున ఏదో ఒకటి అని కార్డును తియ్యకుండా బాగా ఆలోసించి తీసింది. దీంట్లో ఏం రాసుందో చూద్దాం” అన్నాడు. అతను ఆ కార్డును పైకి తీసి చదువుతూ “మార్కులు బాగా వత్తాయి. మంచి కుర్రాడు. అమ్మా నాయనల మాట, సదువు చెప్పే అయ్యి వార్ల మాట ఇంటున్నావు. ఇంకా బాగా ఇంటే ఇంకా బాగుపడతావు. ఇమానం ఎక్కుతావు. బాగా సంపాదిత్తావు అని రాసుదయ్యా” అని చెప్పాడు.

ఆ మాటలు విన్న ప్రసాదు ముఖం చాటంత అయ్యింది. అది విన్న మిగాతా పిల్లలు కూడా రూపాయి ఇచ్చి తమ తమ జాతకాలు చెప్పించుకోవాలని ఉబలాట పడ్డారు. ముందుకు తోసుకొచ్చి ఇద్దరు చెప్పించుకున్నారు. మిగతా వాళ్లకూ ఆతృత పుట్టింది.

“మేం మధ్యాహ్నం అన్నం గంట కొట్టినపుడు వస్తాం. మేం కూడా చిలుక జోస్యం చెప్పించుకుంటాం. నువ్విక్కడే వుండు” అని అతనికి గట్టిగా చెప్పారు.

“నేనూ నా చిలకమ్మా ఇక్కడే వుంటాం. లోనకెల్లే గంట కొట్టారు. మీరంతా ఇప్పుడు ఎల్లండి. మద్దేనం చెప్పించుకుందురు గాని లెండి” అన్నాడు.

“మధ్యాహ్నం మా చెల్లీ, వాళ్లు స్నేహితురాళ్లును కూడా తీసుకొస్తాం. నువ్వు వెళ్లద్దు” అంటూ చెప్పి తిరిగి తిరిగి చూసుకుంటూ లోపలకి కెళ్లారు పిల్లలు.

పప్పుండలు అమ్మే అతను చిలుక జోస్యం చెప్పించుకుని రెండు పప్పుండలు ఇచ్చాడు. అది చూసి. జామ పళ్లతను కూడా చెప్పించుకుని చిలకమ్మ కోసం దోరగా పండిన జామపండ్లు రెండు తీసి “చిలకమ్మకు పెట్టు” అంటూ ఇచ్చాడు.

“ఇయ్యాళ ఇక్కడి కొచ్చిన ఏళ బాగుంది. బేరం బాగా గిట్టుబాటు అవుతుంది” అని అతను తెగ సంతోషపడ్డాడు. ఇంకో గంటన్నర తర్వాత కాని అన్నం గంట కొట్టరు. అప్పుడే పిల్లలు వస్తారు. ఈలోగా ఊళ్లో కెళ్లి ఏ సెంటరులోనన్నా గిరాకీ తగులుతుందేమో చూద్దామనుకుని అతను పంజరం సర్దుకున్నాడు. కార్డులు పరచటానికీ చిలకమ్మ నుంచోటానికీ పరిచే గోన పట్టాను తీసి మడత పెట్టుకుని బుజాన వేసుకుని, నెమ్మదిగా నడవసాగాడు. బయట బేరాలేం తగల్లేదు. ఒక గంట చూసి మళ్లీ స్కూల్ దగ్గరకే వచ్చి కూర్చుని పప్పుండలు నమిలి సీసాలోని మంచి నీళ్లు తాగాడు. పంజరంలోకి చూస్తే జామపండు పూర్తిగా తినేసి చిలకమ్మ విశ్రాంతిగా వున్నది.

“ఇయ్యాళ నీ ఆకలి బాగా తీరిందిలే. నీకూ, నాకూ ఈ రోజు బాగున్నది” అన్నాడు చిలకమ్మ రెక్కలు సవరిస్తూ. బడిగంట ఎప్పుడు మోగుద్దా అని అతను ఎదురు చూస్తున్నాడు.

చిలుకేమో పంజరంలో అటూ ఇటూ తిరుగుతూ క్రీ…. క్రీ…. అని అరవసాగింది. అదీ ఆలోచనల్లో పడింది. “పాపం! ఈ పిల్లలు నేనేదో జోస్యం చెప్తానని ఆశపడుతున్నారు. వాళ్లుకు చెప్పటానికి నాకేం తెలుసని? మిమ్మల్ని, ఇంకా మీలాంటి వాళ్లను ఇతను బాగా మోసం చేస్తున్నాడు. ఎక్కువ కార్డులు మీద ఒకే విషయం వ్రాయించి వుంచాడు. మీరు అదృష్టవంతులు. మీకు ధనయోగం వున్నది. మీకు వాహన యోగం వున్నది. పెద్ద కుర్చీలో కూర్చుంటారు అని వ్రాయించి వుంటాడు. ఆ కార్డులను నా ముందు పేర్చి నా ముక్కుతో పట్టి తియ్యటం నాకు నేర్పాడు. అతను తియ్యమనగానే నేను లాగి ఇవతల పడేస్తున్నాను. అందరికీ జాతకం చెప్పే అతను తన జాతకం చూసుకోడా మరి. ఇతని మోసంలో నేనూ పాలుపంచుకుంటున్నాను. ఎంత తప్పు” అని అనుకోసాగింది.

ఇంతలో అన్నం గంట కొట్టారు. కొంత మంది పిల్లలు ఆదరాబాదరాగా తిన్నారు. పక్క కొచ్చి నుంచున్న కుక్కలకు బాక్సులోని అన్నం వేసేశారు కొంత మంది. మరి కొంత మంది చిలక జోస్యం చెప్పించేవాడున్నా వెళ్లిపోయాడో అని ఆరాటపడుతూ గబగబా తిని లేచారు. వీళ్లందరూ పారేయకుండా తింటున్నారో లేదో అని పి.టి మాస్టారు బెత్తం పట్టుకుని అటూ ఇటూ తిరగసాగారు. మొత్తానికి ఎలాగైతేనేం ముగ్గురు నలుగురు పిల్లలు గేటు బయటకు పరుగెత్తుకొచ్చారు. అమ్మయ్యా, చిలుకతో సహా పంజరం అక్కడే వున్నది. నాకు చెప్పు నాకు చెప్పు అంటూ ఇద్దరు పిల్లలు పోటీ పడి మరీ చెప్పించుకున్నారు.

వాళ్లు సంబరపడేటట్లుగా ఆ కార్డుల్లో వ్రాసున్నది. అది చదువుకుని వాళ్లు తెగ సంతోషపడ్డారు. అది చూసి మరో ముగ్గురు తయారయ్యారు, రూపాయి చేతిలోకి తీసి పెట్టుకుని మరీ సిద్ధంగా నిలబడ్డారు.

చిలుక పంజరం లోపలికీ పట్టా మీదికీ తిరుగుతూ క్రీ… క్రీ… అని గోల గోలగా అరవసాగింది. పిల్లల వంక చూస్తచూ ఇంకా పెద్దగా అరవసాగింది.

“మిమ్మల్ని అందర్నీ చూసి నా చిలకమ్మకు సంతోషం ఎక్కువయింది. చదువుకునే పిల్లల్ని చూస్తే చాలు దానికి ఎక్కడ లేని ఉషారు వచ్చుద్ది. మీరందరూ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తారని ఆ కార్డుల్లో వ్రాసుందిగా. అది విని చిలకమ్మ మరీ సంతోషపడుతుంది. అది మనలాగా మాట్లాడ లేదు గాని దానికన్నీ తెలుసు. ఊరికే గ్రహిస్తుంది” అన్నాడను.

చిలుక పిల్లల వంక చూస్తూ అరుపులు ఎక్కువ చేసింది. అలా ఎందుకరుస్తోందో అతనికీ అర్థం కాలేదు. పిల్లల కసలే తెలియలేదు. పంజరంలో నుంచి బయటకొచ్చింది. మరలా లోపలికెళ్లింది కార్డులు, తీయకుండా. ఇదేంటి ఇవాళ ఇలా తిరుగుతుంది అనుకున్నాడతను. క్రీ…. క్రీ… అని అరుస్తూనే వున్నది. పంజరంలో నుండి బయటికొచ్చింది. దానికేదో కోపం వచ్చినట్లుగా తన నోటితో ఒక్కొక్క కార్డును వెంట వెంటనే తీస్తూ అటూ ఇటూ విరజిమ్మ సాగింది. అవి పల్చగా అటూ ఇటూ పరుచుకుంటున్నాయి.

దీనికివ్వాళ ఏమయింది అని అతను వెలాతెలా పోతున్నాడు.

“రేయ్! శంకర్! నీ కేంటిరా ఇన్ని కార్డులు పడేసింది. ఏ కార్డని చూసుకుంటావు?” అన్నాడు ప్రసాదు.

గుమిగూడిన పిల్లలందరూ తాలా ఒక కార్డు తీసుకుని చదవసాగారు.

దాదాపు అన్నిట్లోనూ ఒకటే వ్రాసున్నది. ధనప్రాప్తి, వాహనయోగం,విమాన ప్రయాణం, విద్యాలో రాణింపు వగైరా వగైరా.

“ఒరేయ్ ఇదేంటిరా అన్నీ ఒకలాగే రాసున్నాయి” అంటూ సుధాకర్ అరిచాడు.

పంజరపు మనిషి గబగబా కార్డులు పోగుచేసుకోసాగాడు. అందిరిలోకి తెలివిగలవాడు సుధాకర్.

అతనికి విషయమర్థమయింది. ఇతను కేవలం డబ్బులకోసం మనుషుల్ని మోసం చేస్తున్నాడు. చిలుక జోస్యమని వంక పెట్టుతున్నాడు. మనందరం నమ్మాం. అంతా వట్టిది అన్న నిర్ణయాని కొచ్చాడు. అతడు చటుక్కున చిలుకను పట్టుకుని కాలుకున్న తాడును విప్పదీశాడు. ఒక్క ఉదుటున చిలుక క్రీ…. క్రీ…. అని అరుస్తూ రెక్కల్ని టపటప లాడిస్తూ పైకెగరబోతూ ముందు తన ముక్కుతో ఇన్నాళ్లు తనని పంజరంలో పెట్టాడని అతని నెత్తిన కసుక్కున ఒక్క కొరుకుకొరికి మరీ ఎగిరి అక్కడున్న చెట్టుకొమ్మ పై వాలింది. మరో సారి క్రీ… క్రీ…. అంటూ బిగ్గరగా అరిచింది.

“నీకు థాంక్స్ చెపుతూందిరా సుధాకర్!” అన్నాడు ప్రసాదు.

“మనమే చిలుకకు బోలెడన్ని థాంక్స్ చెప్పాలిరా. నిజం తెలిసేటట్లు చేసింది” అన్నాడు సుధాకర్.

“ఏయ్ పిల్లలూ! ఏంటి మీరు చేసిన పని నా చిలకమ్మను వదిలి పెటేశారు. బోలెడు డబ్బులు పోసి దాన్ని కొనుక్కున్నాను. ఇన్నాళ్ల నుంచీ నన్నూ నా కుటుంబాన్నీ పోషిస్తున్నది. నేను లోపలి కొచ్చి మీ పెద్ద మాస్టారుగారితో చెప్తా. మీరందరూ కలసి నా చిలకమ్మకు డబ్బులు కట్టండి. లేకపోతే ఊరుకోను” అన్నాడు దబాయింపుగా.

“పద పోదాం మా పెద్ద మాస్టారు దగ్గరకు. సంగతంతా చెబ్దాం. మా పీ.టి మాస్టారు గూడా వస్తారు. నువ్వు చేసే మోసానికి తన కర్రతో నీకే నాలుగు వడ్డిస్తారు. చిలుకనూ పంజరంలో కట్టేసి బాధిస్తున్నావని నీ మీదే అందిరికీ మేం ఫిర్యాదు చేస్తాం. పద పోదాం రా లోపలికి” అంటూ సుధాకర్ ఏ మాత్రం తగ్గకుండా గట్టిగా మాట్లాడాడు.

“ఈ పిల్లవాడు సామాన్యుడు గాదు. తను లోపలి కెళితే అందరి ముందూ తనే నేరస్తుడిగా బయటపడతాడు. ఇంకా నష్టపోతాను. ఇప్పటికి మెదలకుండా ఊరుకోవాలి” అనుకుంటూ తన కార్డుల్ని ఏరుకోబోయ్యాడు. ఈలోగా పిల్లలు ఆ కార్డుల్ని లాగేసుకుని చించిపారేశారు.

అతను పంజరాన్ని ఒక చేత్తో పట్టుకున్నాడు. తన దగ్గరున్న గోనే పట్టాను మడిచి నెత్తిన వేసుకుంటూ “ఇన్నాళ్లు తిండి పెట్టి పోషిస్తే ఇవ్వాళ చిలక వెళ్లిపోతూ నా నెత్తిన ఎంత గట్టిగా కొరికెళ్లింది” అని వాపోయాడు. నెమ్మదిగా కాళ్లీడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here