తెలుగు నాటకాన్ని సినిమాగా మార్చిన దాసరి సృష్టి ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’

0
2

[dropcap]దా[/dropcap]సం గోపాలకృష్ణ గారి ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ నాటకానికి గోదావరి జిల్లాలలో చాలా ప్రాచుర్యం ఉంది. ఇందులో నటించిన రత్నకుమారి అనే నటి ఆ తరువాత వాణిశ్రీగా తెలుగు సినీ జగత్తులో ఒక వెలుగు వెలిగారు. ఆ నాటకాన్నే యథాతథంగా దాసరి నారాయణరావుగారు తెరకిక్కించారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మంచి చిత్రంగా నిలచిపోవాడానికి కారణాలు. 1. సమాజం స్త్రీ జీవితాన్ని నియంత్రించే విధానం గురించి నిజాయితీతో రాసిన కథ. 2. హిజ్రా పాత్రలో మాడా గారి నటన 3. రమేష్ నాయుడు సంగీతం. ఈ మూడు విషయాలను విడి విడిగా చూస్తే ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం తెలుసు సినీ జగత్తులో లభించిన కారణం అర్థం అవుతుంది. రమేష్ నాయుడు గారికి నంది బహుమతి లభించిన చిత్రం ఇది. అప్పటి దాకా హిజ్రాలను వెకిలిగా వ్యంగ్యంగా చూపిస్తున్న సినిమా ప్రపంచంలో మాడా గారి పాత్రలో మంచితనం, కలుపుకోలుతనం, మనుష్యులను ప్రేమించే గుణం చూపిస్తూ హిజ్రాలను వ్యక్తులుగా గుర్తించవలసిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పిన చిత్రం ఇది. ఈ  మధ్య కొత్తగా హిజ్రాలకు సినిమాలలో చోటు కల్పిస్తున్నాం అని గర్వపడుతున్నాం కాని 1977లో ఈ చిత్రంలోని మాడా పాత్ర అన్ని మూసలను బద్దలు కొట్టింది. ఆ పాత్ర మిగతా పాత్రలతో ఎంత సహజంగా ఒదిగిపోతుందంటే, అతన్ని ఆ ఊరు అంతా ఎంత సహజంగా స్వీకరిస్తారంటే ఎ.జీ.బీ.టీ రైట్ల ప్రస్తక్తి లేకుండానే గుణం బట్టి మనిషి అన్న వాదానికి బలం అప్పట్లోనే సమాజంలో ఉందేమో అనిపించకమానదు.

చిట్టి, దత్తుడు చిన్నప్పటి నుండి స్నేహితులు. చిట్టి అందరితో కలుపుగోలుగా ఉండే మనిషి. తనను పలకరించని వారిని సైతం కదిలించి మాట్లాడించే వ్యక్తి. ముక్కు సూటి స్వభావం. జీవితంపై ప్రేమ. ఉన్నంతలో చక్కగా జీవించాలలే తపన ఆమె గుణం. దత్తుడు పై ఆమెకు ఎంతో ప్రేమ. అయితే దత్తుడు తల్లికి జబ్బు చేసినప్పుడు ఆమె తన తమ్ముని కూతురుని దత్తుడు పెళ్ళి చేసుకోవాలని పట్టుపడుతుంది. తన ఆఖరి కోరిక తీరకపోతే కొడుకు వద్ద జీవించనని శాంతిగా మరణించలేనని గొడవ చేస్తుంది. పేదింటి చిట్టి కన్నా డబ్బున్న తన సోదరుని కూతురుని దత్తుడు పెళ్ళి చేసుకుంటే సుఖపడతాడని ఆమె ఆశ. చిట్టీకి ఈ సంగతి తెలిసి దత్తుడుని మరదలితో పెళ్ళికి వప్పిస్తుంది. చనిపోతున్న తల్లి కోరిక తీర్చడం అతని బాధ్యత అని గుర్తు చేస్తుంది. దత్తుడు మరదలిని పెళ్ళి చేసుకుని మరో ఊరు వెళ్ళిపోతాడు. చిట్టి అక్క గర్భవతి. ఆమె భర్త స్వభావం మంచిదే కాని తాగుడుకి బానిస. బిడ్డను ప్రసవిస్తూ ఆమె చనిపోతుంది. బావ మరో వివాహానికి సిద్దపడినప్పుడు పుట్టిన బిడ్డ భవిష్యత్తు పాడు అవుతుందని చిట్టి తనకంటే వయసులో ఎంతో పెద్దవాడయిన బావను పెళ్ళి చేసుకుంటుంది.

సహజంగా జీవితంలో ఇలాంటి స్థితిలో ఉన్న ఆడపిల్ల జీవితం పట్ల నిర్వికార భావంతో మిగిలిపోతుంది. కాని చిట్టి స్వభావం అది కాదు. జీవితాన్ని ఒక సవాలుగా తీసుకునే స్త్రీ ఆమె. బావ జీవితంలో మార్పు తేవాలని ప్రయత్నిస్తుంది. అతని మాట, పద్ధతి మార్చాలని కష్టపడుతుంది. ఇంటిని అద్దంలా పెట్టుకోవడం, ఉన్నంతలో శుభ్రంగా ఉండడం ఆమెకు ఇష్టం. బావను తప్పని పరిస్థితులలో పెళ్ళి చేసుకున్నా అతనితో తన జీవితం ముడిపడి ఉన్నదని అతన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతని వేష భాషలలో  మార్పు తీసుకువస్తుంది. ఇల్లు కూడా కళ కళలాడుతూ ఉంటుంది. శుభ్రమైన చీరలు కట్టుకున్ని చక్కగా తయారయి ఇంటి పనులు చేసుకుంటూ బిడ్డను అంతే గొప్పగా చూసుకుంటుంది చిట్టీ. ఇంటి ఖర్చులు పెరిగాయి కాబట్టి తాను దాచుకున్న డబ్బు పెట్టుబడిగా పెట్టి ఇంటి ముందు చిల్లర కొట్టూ పెడుతుంది. ఆమె తెలివికి భర్తతో పాటు ఊరు వారందరూ ఆశ్చర్యపోతారు. సహజంగా ఆమె పట్ల అసూయ మొదలవుతుంది తోటి ఆడవారిలో. రెండో పెళ్ళి చేసుకున్నానని, తన భర్త ఒక తాగుబోతని ఎవ్వరి దగ్గరా ఏడవకుండా తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఎవరి పైనా నేరారోపణ చేయకుండా, ఖర్మ సిద్దాంతాన్ని సానుభూతి కోసం వాడకుండా నిరంతరం తన ప్రయత్నం చేసుకుంటూ కడిగిన ముత్యంలా కళ కళలాడుతూ ఉండే చిట్టెమ్మను చూస్తే ఊరి స్త్రీలు అసూయతో మండిపోతూ ఉంటారు. ఆమె ఇంటి విషయాలు సేకరిస్తూ ఉంటారు.

ఇవేమీ తెలియని చిట్టి అందరినీ పలకరిస్తూ అందరూ తనలాంటి వారే అనుకుంటూ కలుపుగోలుగా అందరితో కలిసి ఉంటూ ఉంటుంది. ఆమె స్వభావం బాగా తెలిసి ఆమెను సోదరిగా అభిమానిస్తాడు హిజ్రా అయిన మాడా. ఆమెకు చేదోడూ వాదోడుగా ఉంటూ పనులు చేసి పెడుతూ ఉంటాడు. ఊరి ఆడవారి అనవసరపు మాటలు విన్నప్పుడల్లా వారి నోర్లు మూయించి, చిట్టి మంచి గురించి తపిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో పూలు అమ్ముకుంటూ బ్రతుకుతాడు మాడా. ఆ ఉరి బట్టల వ్యాపారి, కంసాలి, చిల్లర కొట్టు కొచ్చి సరుకులు కొనే నెపంతో చిట్టెమ్మను లోబరుచుకోవాలని చూస్తారు. చిట్టెమ్మ వారి బుద్ది అర్థం చేసుకోలేకపోతుంది. వారితో అంతే సరదాగా మాట్లాడుతుంది. వారు బట్టలను, బంగారాన్ని అప్పుగా ఇచ్చినప్పుడు తనకు సహాయపడుతున్నారని అనుకుంటుంది. కాని వారి ప్రవర్తన శ్రుతిమించినప్పుడు ఆమె తిరగబడుతుంది. వారికి బుద్ధి చెబుతుంది. అహం దెబ్బతిన్న ఆ ఇద్దరూ ఆమె మీద దుష్ప్రచారం చేస్తారు. చిట్టి భర్త తాగుడు మానలేకపోతాడు. ఎంత శుభ్రంగా ప్రొద్దున పంపినా రాత్రికి మట్టి కొట్టుకు పోయిన బట్టలతో తాగి ఊగుతూ ఇల్లు చేరే భర్తను మార్చుకోవడానికి చిట్టీ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ లోపల ఆమె మీద అక్కసున్న వ్యాపారులు, ఆమెను చూసి అసూయతో మండి పడే ఊరి ఆడంగులు ఆమె మీద దుష్ప్రచారం మొదలెడతారు.

దీనికి తగ్గట్టు భార్యను పోగొట్టుకుని బిడ్డతో దత్తుడు ఆ ఊరు వస్తాడు. తల్లి లేని ఆ బిడ్దను, దుఖంతో ఉన్న దత్తుడి బాగోగులు చిట్టి చూసుకుంటూ ఉంటుంది. తల్లి కోసం ఏడ్చే పిల్లవాడికి తిండి తినిపించడం, దత్తుడికి ధైర్యం చెప్పడం ఆమె తప్పుగా అనుకోదు. పైగా అది తన బాధ్యత అని నమ్ముతుంది. కాని అదను కోసం చూస్తున్న ఊరివారు ఆమెకు దత్తుకు అక్రమ సంభంధం అంటగడతారు. చిట్టి భర్త మంచివాడే తాగనంతవరకు. అతనే దత్తుడి బాగోగులు చూడమని ముందు భార్యని ప్రోత్సహిస్తాడు. కాని తరువాత అతనిలోని తాగుబోతు లోని మృగం పైకి లేస్తుంది.

ఈ ఊరిలోనే మరో స్త్రీ ఉంటుంది. భర్త కోసం పూజలు చేస్తూ, ప్రతి రోజు అతనికి పాద పూజ చేసి కాని భోజనం చేయని పతివ్రత ఆమె. ఆమె భర్త తన భార్య పెద్దింట్లో పుట్టవలసిన స్త్రీ అని పొంగిపోతూ ఉంటాడు. కాని ఆమె భర్తను పాతివ్రత్యం ముసుగులో ఉంచి మరొకనితో సంబంధం పెట్టుకుంటుంది. నిజం తెలిసిన ఆ భర్త గుండె పగిలి మోసపోయానన్న బాధతో ఆమెను నరికి చంపేస్తాడు. చిట్టి భర్త ఈ సంఘటనను మర్చిపోలేకపోతాడు. ఊరిలో వాళ్లంతా తన భార్యకు దత్తుకు సంబంధం ఉందని మాట్లాడుతుంటే ముందు వారిని ఎదిరిస్తాడు. కాని చిట్టి మిగతా స్త్రీలలా నటించే స్త్రీ కాదు. తాను చేస్తున్న పనిని దాచే వ్యక్తి కాదు. అందువలన చాలా సార్లు దత్తుతో కనిపిస్తుంది. అబద్దాన్ని నిజం అని నమ్మించగల సమాజంలో  ఒక తాగుబోతు ఆ మాటలను నమ్మడం కష్టం కాదు కదా. చివరకు కోపంతో అతను భార్యను గొడ్డలతో నరికేస్తాడు. ఆఖరున చిట్టి నిరపరాధి అని తెలిసి పిచ్చివాడవుతాడు.

స్త్రీ నైతికతను ఆయుధంగా మార్చి ఒక స్త్రీ జీవితాన్ని అల్లకల్లోలం చేసే శక్తి ఉన్న సమాజం గురించి చెప్పిన సినిమా ఇది. చిట్టి పాత్రలో జయచిత్ర చాలా గొప్పగా నటించింది. ఆమె కెరీర్‌లో గొప్ప సినిమా ఇది. ఆమె భర్తగా గోకిన రామారావు జీవించారు. ఇక దత్తుడుగా మురళీ మోహన్ పర్వాలేదు. హిజ్రాగా మాడా సూపర్. అతని నటన తరువాత చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది. ఈ సినిమాకు సి.నారాయణ రెడ్డి గారు, దాసం గోపాల కృష్ణ గారు పాటలు రాసారు. దాసం గోపాలకృష్ణ గారు రాసిన పాటలు గొప్ప సంచలనం సృష్టించాయి. చూడు పిన్నమ్మా పాడు పిల్లడు అనే పాట హిజ్రాల పాట అయిపోయింది. ఆలాగే సువ్వీ కస్తూరి రంగా సువ్వీ అన్న పాట జానపద బాణిలో తెలుగు చిత్రాలలో ఒక చక్కని పాటగా మిగిలిపోయింది. సినారే గారు రాసిన తల్లి గోదారికే ఆటుపోటుంటే తప్పుతుందా మనిషికి అన్న పాటకు రమేష్ నాయడు గారికి ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది అవార్డు లభించింది. సాహిత్యం సినిమాకు ఎప్పూడూ బలమే కాని ప్రస్తుతం కథా సాహిత్యం, నవలా సాహిత్యంలో నుండి సినిమాలు తయారవ్వడం లేదు. ఆ లోటు మనకు ప్రస్తుత సినిమాలలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో సంభాషణలు కూడా బావుంటాయి. ఆడవారికి అక్కరలేని లౌక్యం, నటన వారి స్వభావంలో చేరిపోవడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా కారణమవుతాయి. మనుష్యులను మూసలో పోసి తయారు చేసే సమాజ వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ, ఈ సినిమాలో మగ పాత్రలకన్నా నిజాయిగా జీవించే హిజ్రా పాత్ర ద్వారా తోటి మనిషికి అండగా నిలిచే గొప్ప మనసుకు శరీరం కాదు వ్యక్తిత్వం ముఖ్యం అనే అభిప్రాయాని స్పష్టీకరించిన సినిమా ఇది. అప్పట్లో 225 రోజులు ఏకబిగిన ఆడిన సినిమా ఇది అంటే ఎంతటి జనాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటి జనరేషన్ కూడా ఈ సినిమా బోరు కొట్టదు. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద సాహిత్యాన్ని, ఆ భాషను, యాసను చూపించిన చక్కని తెలుగు సినిమా ఇది. యూ ట్యూబ్‌లో ఉంది. తెలుగుతనం మరచిన తెలుగుసినిమాల మధ్య తెలుగు జీవితాన్ని మరోసారి గుర్తుకుతెచ్చుకోగల అనుభవం మీ సొంతం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here