[dropcap]పి[/dropcap]ల్లల కోసం రిటైర్డ్ టీచర్ శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు రచించిన కథలతో రూపొందించిన పుస్తకం ‘చిలుక పలుకులు’. ఇందులో కథలన్నీ చిలుకలు చెప్తాయి. దాదాపుగా ప్రతీ కథ పేరులోనూ చిలక ఉండడం విశేషం. కథలకి తగినట్టుగా శ్రీ తుంబల శివాజీ గారు గీసిన బొమ్మలు పిల్లలని ఆకట్టుకుంటాయి.
‘పలుకవే ఓ రామచిలుక’ కథలో రచయిత్రి పక్షులకు పేర్లు పెడితే వాటి ఆనందం ఎలా ఉంటుందో చెప్పారు. ‘ఓ బంగరు రంగుల చిలుకా…’ కథలో మానవుల భావాలు ఎలా ఉంటాయో పక్షులకు తెలిసాకా, అవి ఎలా స్పందించాయో తెలిపారు రచయిత్రి.
‘పచ్చని చిలుకలు తోడుంటే…’ అనే కథలో మానవుల బంధాలలో ఒకటైన స్నేహబంధం గురించి రచయిత్రి పక్షులు గ్రహించేలా చెప్పారు. ‘రాగాల రాచిలుక’ కథ – పెద్దవాళ్లు పిల్లలకు పనులు నేర్పాలి గానీ – అన్ని పనులకు వాళ్ళ మీదే ఆధారపడద్దని చెపుతుంది.
చిన్న పిల్లల పుస్తకాల బరువును తగ్గించే అంశాన్ని గంభీరంగా పరిగణించాలని ‘పలుకు తేనెల చిలుక’ కథలో రచయిత్రి కోరారు. ‘చిన్నారి పొన్నారి చిలుకా’ కథలో పెద్దలు – పిల్లలను బడికి పంపడమే కాదు, వారి అవసరాలను కూడా తెలుసుకోవాలి అని సూచిస్తారు రచయిత్రి.
‘కొమ్మ కొమ్మకో చిలుకమ్మా’ కథలో అందం శాశ్వతం కాదు, అంగవైకల్యం శాపం కాదు అని వివరిస్తారు రచయిత్రి. పిల్లలు బడిలో తోటిపిల్లలతో ఎలా ప్రవర్తించాలో పెద్దలు నేర్పాలని ‘చిన్ని చిన్ని చిలుకమ్మా’ కథలో చెబుతారు.
పిల్లలకి చక్కని పోషకాహారం ఎంత అవసరమో ‘పైరు పచ్చని చిలుకమ్మా!’ కథ చెబుతుంది. పిల్లల, పక్షుల ఆనందాన్ని ‘కిలకిల నగవుల చిలుకలు’ కథ వర్ణిస్తుంది.
పిల్లలను కాపాడుకునే ఓర్పు, నేర్పూ, సామర్థ్యం ఉన్నప్పుడే విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ‘పయనించే ఓ చిలుకా’ కథ చెబుతుంది. తామెంతో ప్రయోజకులమని గొప్పలు చెప్పుకోకూడని సూచిస్తుంది ‘ఊసులాడవే చిలుకా’ కథ.
పిల్లల మేలు విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త వహించాలని చెబుతుంది ‘గూటిలోని రామచిలుక’ కథ. కేవలం పుట్టినరోజుల నాడో, పర్వదినాల నాడో కాకుండా ఎప్పుడూ వీలైన చోటల్లా మొక్కలు నాటితే అందరూ సుఖంగా ఉంటారని చెబుతుంది ‘చిలుకా క్షేమమా’ కథ.
తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల మానవులు నిర్లక్ష్యంగా ఉండకూడదని ‘రామచిలుకా వైనమేమమ్మా’ కథ చెబుతుంది. పిల్లలకు చిన్నతనం నుంచే మంచి మాటతీరు, చక్కని ప్రవర్తన నేర్పాలని ‘రాలుగాయి చిలుక’ కథ సూచిస్తుంది.
చదువులతో పాటు పిల్లలకు లలితకళలలో శిక్షణ నిప్పిస్తే బాగుంటుందని సూచించే కథ ‘రాగాల పల్లకిలో’. బడిలో చిన్నపిల్లల అవసరాలను ఉపాధ్యాయులు గుర్తించి, వెంటనే తీర్చాలని ‘ఓహో ఓహో చిలుకమ్మా’ కథ తెలుపుతుంది.
పిల్లలకి క్రమశిక్షణ నేర్పాలే కానీ క్రౌర్యాన్ని ప్రదర్శించరాదని వివరించే కథ ‘రామచిలుక తెలుపవే’. ‘చిగురాకుల ఊయలలో’ కథలో – పిల్లలకు శ్రమించడం నేర్పాలి కానీ అన్ని పనులకు వాళ్ళనే తిప్పకూడదని సూచించారు రచయిత్రి.
మానవులకు పక్షులతో, జంతువులతో ఉన్న అనుబంధం విడదీయరానిదని ‘చిట్టి చిలుకమ్మా’ కథ చెబుతుంది.
ఈ కథలన్నీ పిల్లలకి, పెద్దలకి కూడా ఆసక్తికరంగా ఉంటాయి.
***
రచన: సమ్మెట ఉమాదేవి
ప్రచురణ: కవీర్ణ ప్రచురణలు
పేజీలు: 80, వెల: ₹ 80/-
ప్రతులకు:
సమ్మెట ఉమాదేవి
C/O శ్రీ బి.డి కృష్ణ,
ఇంటి నెంబర్ 3-2-353, సెకండ్ ఫ్లోర్,
స్వామి వివేకానంద స్ట్రీట్,
ఆర్ పి రోడ్, సికింద్రాబాద్-500003,
మొబైల్ నెంబర్:9849406722
sammetaumadevi@gmail.com