Site icon Sanchika

చిన్న కథ ‘మారథాన్’ కాదు!

[dropcap]క[/dropcap]థానికకు కావలసిన గుణవిశేషాల్లో మొట్టమొదటిది క్లుప్తత. క్లుప్తత కథానిక అల్లికకు బిగువుని తెస్తుంది. ఆ బిగువులో ఒక Rhythm, ఒక ఊపు, జిగి వస్తాయి. ఉత్కంఠ నిబిడంగా సాగుతుంది. ఆ దృష్ట్యా కథానికలో క్లుప్తత ఒక వందమీటర్ల పరుగు పందం వంటిది. మారథాన్ వంటిది కాదు!

కథానికలో చూపవలసిన జీవితపార్శ్వం లేదా ఒక సంఘటన గాఢత, లేదా ఒక చీకటి కోణంలో ఆగిన వెలుగురేక-ఇవన్నీ క్లుప్తత వల్లనే సాధించబడాలి. చర్వితచర్వణమూ, పిష్టపేషణమూ అయిన జీవితమంతా రాస్తే, కథానికకు భారమవుతుంది. జీవితమూ, సమాజమూ నేపథ్యంగా కథనంలో కలగలిపి ఇమిడిపోవాలి. అవి పూసల్లో దారంలా ఉండాలి.

కథానిక చరిత్రలో చాలా గొప్ప కథలుగా చెప్పుకోవలసిన ఎన్నో కథానికలు-క్లుప్తతని శిరోభూషణంగా చేసుకున్నవే. చిత్తగించండి.

శ్రీశ్రీ ‘చావూ-పుట్టుకా’ నిండా 20 లైన్ల లోపు కథానిక. ఆపరేషన్ ద్వారా ఒక స్త్రీ హాస్పిటల్‍లో బిడ్డకి జన్మనిస్తుంది. పోలీస్ స్టేషన్‌లో ఒక అమాయక యువకుడు వారి ‘ట్రీట్‌మెంట్’ ద్వారా మరణించాడు. రెండు చోట్లా హింస జరిగింది. ఒకటి పుట్టుకకు కారణమైంది. మరొకటి చావుకు కారణమైంది. ఒక్క అతి చిన్న కథానికలో రెండు కథావస్తువుల్ని తన అసాధారణ కథన కౌశలాన్ని దేశానికిచ్చి పోయాడు శ్రీశ్రీ. శిల్పపరంగానూ ఇదొక మాస్టర్ పీస్. ఎందువలన అంటే – బేసి పాదాలు ఒక కథనీ, సరిపాదాలు ఒక కథనీ, రెండూ కలిసి చదివితే ఒక కథనీ చెప్తున్నాయి. లక్ష కథానికల పెట్టు-ఈ ‘చావు పుట్టుకా!’ ‘కథా రచయితని’ అనుకొనే ప్రతి వారూ చదవవలసిన మొదటి కథ ఇదే!

చాసో గొప్ప కథానికల్లో ఒకటి- ‘మట్టి’. ఆమె పుస్తెలు అమ్మేసి పొరుగు రాష్ట్రం పంపింది. వలసకూలీ అనుకుందాం. బాగు పడ్డాడు ఆ మట్టిలో. ఇంకో మట్టిలో పుట్టిన ఉత్తరాదిపిల్లని పెళ్ళి చేసుకున్నాడు! చాలా ఏళ్ళకి తిరిగి తన ఊరు వచ్చాడు. ఎనెన్ని జ్ఞాపకాలు!

ఊరంతా తిరిగి అన్నీ చూశాడు. ఒకే మట్టి! భూమే ఒక పెద్ద మట్టి ఉండ! వస్తువులో, శిల్పంలో గుణనైశ్చిత్యం పరచుకుని వుంది. అచ్చులో నాలుగు పేజీల కథానిక వ్యష్టి – సమష్టి – భవిత – అన్నీ ఎంత పొందికగా ఒదిగిపోయాయో! పెద్ద సమాజపు హోరు, మనుషుల ఘోష- సమస్తమూ చదువరి మేధని ‘ఖరాబు’ చేస్తాయి!

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ‘కథాఋషి’ మునిపల్లెరాజు గారి ‘నిశ్శబ్దం ఒక పదం కాదు’ ఒక తాత్విక వస్తు మణిదర్పణం. 4 పేజీల్లో ఎంత జీవితం చెప్పవచ్చునో తెలుస్తుంది ఈ కథ చదివితే!

త్రిపుర ‘భగవంతం కోసం’ రాశారు. మనిషిలోపలి మనిషి ఆవిష్కారం – పరమాద్భుత శిల్పంతో, శైలిలో జరిగింది. ‘మనం శుద్ద వెధవలం, మనకి కేరెక్టరొకటా?’ చెర్నాకోలదెబ్బ! అందుకే అతను రాడు! ఆరు పేజీల్లోనే మనిషి అంతరంగ చిత్రణ వచ్చింది. స్వామి ‘చమ్మీదండ’ – శిల్పపరంగా తెలుగు కథానికల్లోని గొప్ప కథల్లో ఒకటి. చమ్కీదండ-జ్ఞాపకాలమాల. ప్రతీకాత్మక కథనం. ఐదు పేజీల కథే!

కె.వివేకానందమూర్తి రాసింది తక్కువ. కానీ, నిఖార్సయిన వాక్యాలు రాశారు. ‘నేను చూసిన నక్షత్రం వుంది’. అనేకమంది యాతన జీవులు సినిమాల్లో ఎక్స్‌ట్రాలు-తాజ్ మహల్ కట్టిన కూలీల్లా-ఎలా మిగిలిపోతారో తెలిపే కథ. ఒక వేలుమణి చరిత్రని ఎంతో ఆర్ద్రంగా చిత్రించారు. బలివాడ కాంతారావు గారి ‘గోపురం’, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు ‘చిల్లుల కంబళి’, పోలవరపు కోటేశ్వరరావుగారి ‘ముచ్చట్లు’, మాలతీ చందూర్ గారి ‘కొత్త దుప్పటి…’ ఇలా ఎన్నో మంచి కథానికలు క్లుప్తతని ఒక శిల్ప గుణవైశిష్ట్యంగా తమలో మేళవించుకున్నై. పీడిత జనపక్షమైన వస్తువుతో ఆచార్య ఇనాక్ గారు రాసిన ‘సూర్యుడు తలెత్తాడు’ కూడా చిన్న కథానికే. ఇక, అమరావతి కథలు క్లుప్తతలో అజరామరం కదా! జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజగారి కథల్లో చాలా కథలు ఎంతో క్లుప్తతతో భాసిస్తున్నాయి.

అసలు మాండలికానికి ఆద్యుడు మాగోఖలే కథలన్నిటా క్లుప్తతే మణిమకుటం. పతంజలి శాస్త్రి కథల్లో నాకు బాగా నచ్చిన, బాగా గుర్తుండిపోయే ‘వాస్తవం’ కథానిక – మూడు పేజీలదే! ఆ మాటకొస్తే ఆనాటి ‘భారతి’లో మా మొదటి కథ ‘మెరుపు మెరిసింది’ చాలా చిన్న కథానికే. ఎందరో పెద్దలకి నచ్చిన కథ. నలభైఐదేళ్ళ తర్వాత మొన్న మొన్న ఒక సాహితీవేత్త ఒక కథాసదస్సులో గుర్తుచేసుకున్నాడు. కె.ఎన్.పతంజలి గారి ‘చూపున్న పాట’, జగన్నాథశర్మ ‘నాన్న’ మహర్షి ‘మనిషి విధ్వంసం’, కొల్లూరి సోమ శంకర్, తణికెళ్ల భరణి, అదృష్టదీపక్, సత్యప్రసాద్, మెడికో శ్యామ్ అనన్య సామాన్యమైన విలక్షణ శైలిలో రాసిన ఎన్నో కథలూ మాత్రం చాలా చిన్నకథానికలు కావూ? వాటికి జనం పెట్టిన ప్రశంసా కిరీటాలు ఎన్నెన్ని?! సి.ఎస్.రాంబాబు ‘పిత్రూణం’, గౌరీలక్ష్మి ‘చిరుదీపాలు’, భవానీదేవి ‘నిప్పుగుండ’, ఒమ్మి ‘అన్నసంతర్పణ’, రామాచంద్రమౌళి ‘జరిమానా’, శిరంశెట్టి కాంతారావు ‘వ్యామోహం’, చదివినా, పలమనేరు బాలాజీ ‘స్పర్శ’ చూసినా – కథా వస్తువుని క్లుప్తతతో ఎలా కథనం చేయవచ్చో తెలుస్తుంది. ఇక, ఆదూరివారి ‘శిల్పి’, పెద్దింటి ‘అదృశ్యరూపాలు’ ప్రతిమ ‘పొదరిల్లు’, గోపిని ‘నీటిగాజులు’. కె.వి.నరేందర్ ‘చీపురు’ వంటి కథానికలన్నీ క్లాసిక్స్! ఆకాశమంత సమాజాన్నీ, సముద్రమంత మనిషి ఘోషనీ అనంతమైన శిల్పంగా ఆవిష్కరించిన చిన్న కథానికలే! సామాజిక తాత్త్వికత, దార్శనికత ప్రతిఫలించే ఎన్నో మంచి కథలు రాసిన బి. ఎస్. రాములు గారి ‘చేయూత’ అంత పెద్దదేమీ కాదు.

సరే. కొంచెం ముందుకు నడుద్దాం. ‘మీల్స్ టికెట్’ తో కథాదీపస్తంభం కట్టిన ప్రభాకర్ జైనీ మంచి కథ ‘పాల ఐస్ క్రీమ్’, నాలుగు పేజీలదే!

శ్రీ కంఠస్ఫూర్తి ‘డబ్బు తినే మనిషి’ కథ ఉంది. తీర్చిన అప్పు తీర్చలేదని, బడుగుల్ని తినేసే దౌర్భాగ్యుడి కథ! మల్లాది వెంకటకృష్ణమూర్తి కథనంలో క్లుప్తత లోక ప్రసిద్ధం. ఆయన ‘మిస్టరీ స్టోరీస్’లో ప్రతీ కథా క్లుప్తతకు నమూనానే! గోపరాజు నారాయణరావు ‘సలాం బాంబే’ కథ వెంటాది వేధించే కథ. కళాఖండమని ప్రసిద్ధిచెందిన సినిమాలోని దరిద్రాన్నీ, దౌర్భాగ్యాన్ని చూసి మెచ్చుకుని బయటికొచ్చి కారుదగ్గర అడుక్కొనే కుర్రాడికి ఏ ఒక్క ఘనుడూ పైసా విదల్చడు. గొప్ప రియలిజమ్ నిండిన కథారత్నం! రెండు పేజీలే! పి.వి.ఆర్.శివకుమార్ ‘కిరణం’ కథలో సహజసూర్యరశ్మికీ, కృత్రిమ వాతావరణానికీ మధ్యగల చిన్న తేడాని చూపారు. వి. రాజారామమోహనరావుగారు ‘చిరిగిన తెరచాప’ కథలో మధ్యతరగతి బతుకు వెతక్కి ధ్వనిమంతమైన కథనం ఇచ్చారు. రావులపాటి సీతారాంరావుగారు ‘చెత్తకుండీ’ రాశారు. ఆ కథ వస్తురూపాల్లో ఎన్నదగిన తెలుగు గర్వవీచి! చిన్నదే మరి!

తెలుగు సాహితీలోకంలో ఈనాడు ఒక వ్యక్తిగా కాక, శక్తిగా బహుముఖీన ప్రతిభావ్యుత్పత్తులతో అవిరళంగా విభిన్న ప్రక్రియల్లో రచనలు చేస్తున్న సాహితీవేత్త-కస్తూరి మురళీకృష్ణ. ఆయన ‘కాశ్మీర రాజతరంగిణి’ కథలూ రాశారు. దేశభక్తి కథలూ సంకలించారు. ఉజ్జ్వలభారత మహెజ్జ్వల గాథలూ చెప్పారు. తెలుగులో తొలిసారిగా భయానక కథల్నీ విడిగా అక్షరీకరించారు. ఇవికాక క్రైమ్ స్టోరీస్ అసంఖ్యాకంగా ప్రచురించారు. ఆయన కథా రచనలో వస్తుగాఢత, కథనంలో సూటిదనం, వేగం, శైలిలో స్పష్టత వంటి గుణ విశేషాలతోపాటు, క్లుప్తత కూడా ప్రధానమైనదే. ఆ విశేషాంశాల వివరాలు ప్రత్యేక వ్యాస పరిధిలోనివి. వాణిశ్రీ, ప్రతాప రవిశంకర్, జొన్నలగడ్డ అరుణ వంటి వారు క్లుప్తతని పాటిస్తూనే మంచి క్రైమ్ కథలు రాస్తున్నారు. .

ఇక, మరీ ప్రస్తుతంలోకి వస్తే, డా॥ జడా సుబ్బారావు మంచి గుణ వైశిష్ట్యం కలిగిన రచనలు చేస్తున్నారు. రమ్యభారతి వారి కథల పోటీలో, ప్రథమ బహుమతి పొందిన ఆయన కథ ‘మంచుకింద ఉక్కపోత’ వస్తుశిల్ప పరంగా ఒక ఉత్తమ రచన. వస్తువు మంచుకొండల్లో, యుద్ధవాతావరణంలో నిలిచిన సైనికుని మనోవేదన, మననధార! సామాజికంగా చూస్తే అతని తండ్రి అవినీతిపరుడు. ఆ యువకుడు పెరిగిన వాతావరణం అంతా అలాంటి తండ్రి నీడ అయినా, ఇతను ఆ ప్రభావానికి లోనుకాకుండా దేశభక్తికి అంకితమై-స్వచ్ఛమైన జీవనానికి అంకితుడైనాడు. వ్యక్తిత్వవికాసానికి స్ఫూర్తి ప్రదమైన గాథ. కథా పాఠశాలల్లోని పాఠ్యప్రణాళికలో చేర్చుకుని పదిమందికి చెప్పదగిన రచన. జెన్నీ ‘అమ్మకో అక్షరం’ నాలుగు పేజీల్లో నవరస బంధురంగా, చివరికి అనుభూతి ప్రదంగా సాగి బహుమతి కొట్టేసింది! డా॥ అల్లూరి విజయలక్ష్మి గారి ‘పేషెంట్ చెప్పే కథలు’ని చదివి కనుచెమరింపు చెందని పాఠకుడు ఉండడు. అవన్నీ నిఖార్సయిన చిన్నకథలే.

ఇలాగే, ఫన్‌డేలో ‘కొత్త కథలోళ్లు’ శీర్షికన వస్తున్న కథల్లో చాలా కథల్లో ఈ క్లుప్తత ఒక భూషగా అలరిస్తోంది.

జయంతి ప్రకాశశర్మగారి ‘అయ్య కోనేరుగట్టు’ కథల్ని వెలువరించారు. అవన్నీ క్లుప్తతతో రంగులీనుతున్నవే. నిన్న మొన్న సుప్రసిద్ధ రచయిత్రి, నాటకకర్త్రి- శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిగారు ‘లాక్‌డౌన్ వెతలు’ అని Topical issue మీద కథాసంపుటి తెచ్చారు. ఆ కథలన్నీ-ఏ మినహాయింపూ లేకుండా – క్లుప్తత గుణానికి పట్టంకట్టినవే.

ఇక – ఒక ప్రత్యేక విషయం – కథ రాస్తే, ఇలాంటి చిన్న కథే రాయాలి అనిపించే ‘సారీఘర్’ని కొండేపూడి నిర్మల రాశారు. ఆడబిడ్డ పుట్టుక ప్రసవవేదన, ఈ దౌర్భాగ్య సమాజం వ్యతిరేకత – కథాంశం! దాన్ని రాయడానికి ఆమెకి చాలా ‘గట్స్’ ఉన్నాయి. చదివేవారికే గుండు బిగించి అతలాకుతలం చేస్తుంది – ఆ కథ. చదవండి! లబ్దప్రతిష్ఠులైన పత్రికా సంపాదకులు, రచయిత, మీడియా అనుభవజ్ఞులు శ్రీ వల్లీశ్వరి గారు ’99 సెకన్ల కథలు’ పేరుతో చాలా చిన్న కథలు రాస్తున్నారు. చిన్న కథలే అయినా, అవి మానవ సంబంధాల్లోని వైచిత్రినీ, మనుషుల మనస్తత్వ వైరుథ్యాల్నీ అద్భుతంగా వెలువరిస్తున్నాయి. ఇవన్నీ వారంవారం ‘సంచిక’లోనే ప్రచురింపబడుతున్నాయి.

‘దీర్ఘత వలన గాఢత వస్తుంది. వస్తువు పఠిత మనస్సులో నిలుస్తుంది’- అనేది సాధారణీకరణం చేయబడిన ‘అతి’ ‘స్టేట్‌మెంట్! వస్తు ప్రాధాన్యతని ఉన్నతీకరించటానికి శిల్ప నైపుణ్యాన్ని సాధించిన కథకులు సంక్షిప్తతని పాటిస్తూనే గొప్ప కథానికలు రాయగలరు, రాస్తున్నారు కూడా. ‘అణురోరణీయాన్ మహతో మహీయాన్!!’

Exit mobile version