[dropcap]వే[/dropcap]సవికాలంలో ఎండి, బీటలువారిన భూమి తొలకరి చినుకులు పడగానే పులకరిస్తుంది. శుష్కించి ముడుచుకొని పోయినట్లున్న చెట్టుచేమలన్నీ కొత్త ఊపిరితో, కొత్త జీవంతో దర్శనమిస్తాయి. జీవం లేకపోతే జీవనం లేదు కదా! తొలకరి చినుకులతో గంధవతి పరవశిస్తుంది. సుగంధాన్ని విరజిమ్ముతుంది. తడిసిన ఆ మట్టి పరిమళం అనుభవైకవేద్యం. ‘గంధవతీ పృథ్వీ’ అని భూమికి నిర్వచనం. ఆ పరిమళం ఘ్రాణేంద్రియ తర్పణానికయితే ఇక ఆ నేల స్వభావాన్ని తెలియజేస్తూ రకరకాల విత్తనాలు మొలకెత్తుతాయి. చినుకులతో మాలిన్యం తొలగిపోయి ఎండిన చెట్లన్నీ పచ్చదనంతో కళకళలాడిపోతాయి. ఆ నేల సారాన్నిబట్టి వివిధ ఫల, పుష్పాలనిచ్చే చెట్లు బలంగా ఎదుగుతాయి. అలాగే ఒక్కొక్క ప్రదేశంలోని భూమికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆకాశం నుండి పడే చినుకులకు భేదం లేదు. అన్నిచోట్లా ఒకే రకంగా పడతాయి. అయితే ఆకాశం నుండి కిందకు జారిన చినుకులు ఆ ప్రదేశాలను బట్టి రూపాన్ని, గుణాన్ని పొందుతాయి. ఇవి సృష్టిలో మన దృష్టికి కనుపించే చినుకులు.
ఇక సంస్కృతీ సంపన్నమైన కవి హృదయా కాశంనుండి జనుల హృదయ క్షేత్రాలపై పడిన చినుకులు కూడా ఆయా వ్యక్తుల గ్రహణ సామర్థ్యాన్ని బట్టి ఫలాలను ఇస్తాయి; ఆనందాన్ని కలిగిస్తాయి; మార్పుకు కారణమవుతాయి; జాతి సాంస్కృతిక జీవన వాహినిలో చిన్నచిన్న వాగులై కలసి ప్రవహిస్తాయి.చినుకులు చిన్నవే. ప్రావృట్కాల పయోదాలనుండి కిందకు జారిన ఆ చినుకుల ప్రభావం మాత్రం అధికం.
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి లేఖిని చిలకరించిన చినుకులు కూడా ఇంతటి ప్రభావవంతంమైనవే.చిన్న పద్యాలు. కానీ అనల్ప భావసౌందర్య శోభితాలు, గంభీరార్ధ ప్రతిపాదకాలు. పద్యవిద్య పట్టువడిన కవి ఎంచుకున్న చందస్సు ఏదైనా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అందంగా, మనసుకు హత్తుకునేలా చెప్పగలడు. బులుసు వేంకటేశ్వర్లుగారి పద్య కావ్యమైన ‘చినుకులు’ లోని కొన్ని చినుకులను మనమూ దర్శిద్దాం. ఆ చల్లదనాన్ని అనుభవిద్దాం. సారాన్ని ఆకళింపు చేసుకుందాం. చిట్టివలస నుండి వెలువడిన ఈ చిట్టి చిట్టి పద్యాలు ఎంత గట్టివో చూద్దాం. స్థాలీపులాక న్యాయంగా కొన్నిటిని మాత్రం యథాశక్తి పరిచయంచేసే ప్రయత్నం చేస్తాను.
మొదటి పద్యమే అక్షరాకృతి దాల్చిన అమ్మ మ్రోల తలవాల్చేలా చేస్తుంది. చూడండి ఆ పద్యాన్ని
“కచ్ఛపీ నినాద ఘన సామగానమ్ము
నెఱుగలేక తనయుడేడ్చుచుండ
అక్షమాలనిచ్చి యాడుకొమ్మని పల్కు
అమ్మ దలతు- పలుకులమ్మ గొలుతు”
శారదాదేవి చేతిలోని వీణ పేరు కచ్ఛపి. ఆ వీణానాదం సామగానం. సంగీతానికి సామవేదం మూలమంటారు. వేదాన్ని అభ్యసించటానికి కొంత అధికారం ఉండాలి. అభ్యసించిన తరువాత అర్థాన్ని గ్రహించగల బుద్ధికుశలత ఉండాలి. వేదాన్ని, ఆ వీణానాదాన్ని గ్రహించగల నేర్పులేని తనను తల్లి ఊరడించి తన చేతిలోని అక్షమాలనిచ్చిందట. అయితే అమ్మ చేతిలోని అక్షమాల సామాన్యమైనది కాదు. అది మోక్షానికి ప్రతీక. కానీ కవి చమత్కారంగా కచ్ఛపి వెలువరించే సంగీతం అర్థంకాక ఏడ్చే బిడ్డకి తల్లి ఆడుకోమని అక్షమాలనిచ్చిందంటారు. అక్షమాల అక్షరమాల. తల్లి ప్రసాదించే జీవితాధారాలే, జీవధారలే సంగీత సాహిత్యాలు. ఒక విధంగా రెండూ సమానాలే కదా!?
“ఎదుగవచ్చుగాక నెంతేని పైపైకి
తరువు తనువు ఇంద్రధనువు గాగ
మరచిపోదు నాటి మాతృత్వ బంధమ్ము
పూలురాల్చి చేయు పుడమిపూజ”
వ్యక్తి ఎంతగా ఎదిగినా తన అస్తిత్వమూలాన్ని మరచిపోకూడదు. అనేక విషయాలలో ప్రకృతి మనకు పరమగురువు. ముఖ్యంగా వృక్షం-చెట్టు చెప్పే పాఠాలెన్నో! మనిషి తన ఉనికికి కారణమైన తల్లిని, తల్లినేలను, ఇంకా చెప్పాలంటే తల్లి భాషను మరచిపోవటం దుర్మార్గం. భూరుహం ఎంతో ఎత్తుకు ఎదిగినా అక్కడనుండి పూలను రాల్చి భూమిని పూజిస్తుందని అందమైన ఉపమానంతో సందేశాత్మకంగా చెప్పారు కవి.
“మన సుఖమ్ము వెనుక మనవారి కష్టమ్ము
అరసికొనుట గొప్ప ఆత్మ విద్య
పరిమళములు మోసి పది దిక్కులకు పంచు
గాలి కానబడునె కనులకెపుడు”
ఈరోజు మనం సుఖంగా ఉన్నామంటే ఆ సౌఖ్యాన్ని మనకు ప్రసాదించినవారు మనవారు. ఆ విషయాన్ని మరచిపోయి అంతా నా గొప్పతనమే అని అహంకరించటం మంచిది కాదు. ఈ మాత్రం అణకువ, అవగాహన లేకుండా ఆత్మవిద్యను పొందినా అది నిష్ప్రయోజనమే. అసలు అదే గొప్ప ఆత్మవిద్య అంటారు కవిగారు. మహాభారతంలోని కౌశికుని కథ మనకు ఈ విషయాన్నే చెపుతుంది. ప్రస్తుతం వ్యక్తి సాధించిన ఉన్నతి వెనుక అతని పూర్వీకుల కష్టం ఏదో ఒక రూపంలో కచ్చితంగా ఉంటుంది. అది బయటకు కనుపించకపోవచ్చు. పూల పరిమళాన్ని నలుదిక్కులకూ వ్యాపింపజేసే గంధవహుడు మన కంటికి కనిపిస్తాడా? అంటారు. గంధవతిని, గంధవహుని-ఇద్దర్నీ మరువకూడదు మరి.
“లక్ష్య సాధనమున లక్ష్యమ్ము సాధన
ఉండవలయు రెండు నున్నతముగ
గుడిని కూలగొట్టి గుడిరాళ్లతో యిల్లు
కట్టుకొనిన రాదు గౌరవమ్ము”
ఈ చిన్ని పద్యాలలో ఉపమానాలు చూడండి ఎంత ఒద్దికగా ఒదిగి పోతాయో! దేన్నైనా సాధించాలంటే లక్ష్యమూ,సాధనా రెండూ ఉన్నతంగానే ఉండాలంటారు కవి. అంతేకదా! లక్ష్యం ఉన్నతమైనది అయినప్పుడు సాధన కూడా అందుకు తగినట్లుగానే ఉండాలి. ఇల్లు కట్టుకోవటం మంచిదే. అవసరం కూడాను. కానీ మన ఇంటికంటే గొప్పదైన దేవాలయాన్ని కూల్చి ఆ గుడి రాళ్లతో మనకోసం ఇంటిని నిర్మించుకోవటం స్వార్థమే కాదు హేయం కూడా.
“వెలుగు పరమార్థమైన దివ్వెకు జగాన
ప్రాత చీకట్ల నెదిరించుటే తపస్సు
మట్టి ప్రమిదయె దాని సింహాసనమ్ము
ప్రత్తిదారమ్ము దాని వజ్రాయుధమ్ము”
నిస్వార్థంగా పరహితం కోసమే జీవించేవారు తమ కష్టసుఖాలను గురించి పట్టించుకోరు. అంతేకాదు-ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ తాము కష్టాల్లో ఉన్నా ఇతరుల జీవితాలలో వెలుగులు నింపటానికే పాటుపడుతుంటారు. జాతిపిత జీవితమే ఇందుకు గొప్ప నిదర్శనం. ఆంగ్లంలో “Simple living high thinking”అనే ఒక మాట ఉంది. మహాత్ముల జీవితాలు ఆ విధంగానే ఉంటాయి. ఎంతటి శక్తివంతమైన, వజ్రాయుధ తుల్యమైన అభివ్యక్తి!
“ఎంతమంది నడిచిరీ నేలపై మున్ను
పాదముద్రలద్ది- పరవశించి
వారి వారసత్వ వైభవస్ఫూర్తులే
నిత్య విధులు మనకు- సత్యసుధలు”
అలవోకగా ప్రయోగించిన ఆ పదాల పోహళింపు చూడండి. మాతృభూమిపట్ల మమకారంతో పాటు ఈ భూమిపై నడయాడి దివికేగిన పుణ్యమూర్తులను తలచుకోవటం కూడా మన విధి. ఒక జాతి సంస్కృతిని సర్వసంపన్నం చేసిన మహనీయులు పెట్టిన భిక్షే ఈనాటి మన జీవితాలు.వారు మాతృ దేశ రక్షణలో అసువులు బాసిన దేశభక్తులు, వీరులు కావచ్చు. తపస్సుతో ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించిన మహర్షులు కావచ్చు. సత్సంప్రదాయ పాలనతో తమ జీవితాలను గడపి జాతికి మార్గదర్శనం చేసిన కర్మ వీరులు కావచ్చు. అందుకే కవి ఈ భూమిపై నడచిన ఆ మహనీయులను, వైభవోపేతమైన ఆ వారసత్వ సంపదను స్మరించారు.
“తప్పు నొప్పు చెప్పు గొప్ప నేస్తాలున్న
చిత్తమున్న- మంచి పొత్తమున్న
పరుల కష్టములకు కరుగు భావంబున్న
చాలు చాలు భాగ్యమేల మనకు”
జీవితంలో సిరిసంపదలున్నా తృప్తి ఉండదు కొందరికి. వడ్డించిన విస్తరివంటి జీవితం కూడా హాయినివ్వదు. కారణం ఏమిటంటే వీటికంటే విలువైనవి కొన్ని ఉన్నాయన్న స్పృహ లేకపోవటమే. తృప్తిపడే స్వభావం లేకనే. అయితే ఆ చిత్తసంస్కారం అలవడటానికి దోహదం చేసేవి మన హితాన్ని కోరే మిత్రులు, మంచి మనసు, మంచి పుస్తకం, ఇతరుల కష్టాలను చూసి కరగిపోయే కారుణ్య భావన-ఇవి ఉంటే చాలు భాగ్యమేల అంటారు కవి. వీటి విలువ తెలిసిన వ్యక్తికి సహజంగానే తృప్తి అంటే ఏమిటో తెలుస్తుంది. పోతన అన్నట్లు ‘నీ పాద కమల సేవయు….’ మనిషి కోరుకోవలసినవి ఇవే. మనిషి మనిషిగా బ్రతకటానికి భగవంతుని ప్రార్థించి పొందవలసినవీ ఇవే.
“పండితుండు బ్రతుకు ప్రతిపదార్థమ్ములో
తాత్వికుండు పలుకు తత్వము పయి
సహృదయుండు కావ్య సందేశమును జూచు
సారమాచరించు- సజ్జనుండు”
పండితుడు ఒక పుస్తకంలోని ప్రతి పదానికి అర్థాన్ని, ఇంకా నానార్థాలు, వ్యుత్పత్తులు మొదలైనవన్నీ ఉన్నాయో లేదో చెపుతాడు. తాత్వికుడు దానిలోని తత్వాన్ని గురించి చెపుతాడు. సహృదయుడు ఆ కావ్యం ఇచ్చే సందేశాన్ని చూస్తాడు. కానీ ప్రతి పదార్థాలను, తత్వాన్ని, సందేశాన్ని గ్రహించటం మాత్రమే సరిపోదు. వాటిని ఆచరించగలగాలి. అర్థాన్ని, తత్వాన్ని, సందేశాన్ని తెలుసుకోవటంకంటే ఆచరించటం కష్టసాధ్యం. సజ్జనుడు మాత్రమే ఆ కావ్య సారాన్ని ఆకళింపు చేసుకుని ఆచరిస్తాడు. ఎంత లోతైన భావన!
“కన్నులిచ్చి నిలుచు కన్నప్పవలె తోచు
ప్రసవరాజితోడ ప్రతికుజంబు
విశ్వమయుని తాము వీక్షించినవి యేమొ
అవని తరులు నాట్యమాడుచుండె”
కవికి మొక్కలంటే అమితమైన ప్రేమ. ఇది మృదు హృదయానికి చిహ్నం. ఆయన కంటికి విచ్చిన పూలతో ఉన్న పూపొద కన్నులు ఈశ్వరునికి సమర్పించి నిలుచున్న కన్నప్పవలె కనుపించింది. ఇక చెట్లు గాలికి ఊగటం కవికి విశ్వమంతా వ్యాపించిన భగవంతుని చూసి నాట్యం చేస్తున్నట్లు అనిపించింది.పూలమొక్కలకు పూలుపూయటం, గాలికి చెట్లు ఊగటం స్థూలదృష్టికి కనుపించే దృశ్యం. కానీ కవి దృష్టిలో అవి భగవంతుని దర్శించిన ధన్యజీవులు. విశ్వమయుని చూచిన ఆనందమే వాటి కదలిక. ప్రకృతిని చూసి ఆనందించటంతో పాటు దానిలో ఆధ్యాత్మికతను చూడటం మరింత పైస్థాయి.
“సభలయందు కఠిన శాస్త్రప్రసంగమ్ము
హత్యకన్న ఘోర కృత్యమగును
బలము కొలది విసరు వడిసెల దెబ్బకు
పరుగు తీయు జనము పక్షులట్లు”
చాలామందికి సభారంజకంగా మాట్లాడటం తెలియదు. వినేవారి స్థాయిని, మానసికస్థితిని, కదలికలను అర్థం చేసుకోకుండా తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది మనందరికీ తెలిసినదే! కానీ కవిగారు చెప్పిన తీరు చూడండి.ఇది హత్యకంటే ఘోర కృత్యమంటారు. వడిసెల దెబ్బకు పక్షులు పారిపోతాయి. అలాగే శాస్త్రప్రసంగానికి తట్టుకోలేక జనం పక్షుల్లా పారిపోతారని ఎంత హాస్యస్ఫోరకంగా చెప్పారో కదా?!
“బాల రాముడేక పత్నీవ్రతుండౌను
మచ్చలేదు- గురువు మనసుదోచు
వానిముందు నిల్వ వశమౌనె నాకని
సతులతోడ దాగె చందురుండు”
ఇంత చిన్న పద్యంలో కవి సందేశాన్ని, ఉపదేశాన్ని మేళవించారు. పూర్వకథలను గుర్తుచేసారు. బాల రాముడు చందమామ కోసం ఏడవటం, తల్లిదండ్రులు/సుమంత్రుడు ఒక అద్దాన్ని తీసుకొని వచ్చి చూపించటం మనం విన్న కథ. అయితే చంద్రుడు గురివిందగింజలా తన తప్పు తెలుసు కాబట్టి ఈ బాలరాముడు యువకుడు అయిన తరువాత జీవితాంతం ఏకపత్నీవ్రతుడుగానే ఉంటాడు అని తెలిసి తన భార్యలతో కలసి దాగున్నాడట. చంద్రుడిలోని మచ్చ బహుశా ఇదేనేమో! ఇక్కడ బాలరాముని కథతోపాటు తారాశశాంకుల కథను కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంత చిన్న పద్యంలో ఇన్ని విషయాలు చెప్పటం చూస్తే ఆహా! అనిపించక మానదు. కవి పలుకులు శిరోధార్యాలు. అసలు కావ్యానికి పరమ ప్రయోజనం విశ్వశ్రేయస్సే కదా! ఈ ప్రయోజనం ఈ చిన్న పద్యంలో సంపూర్ణంగా ఉంది.
ఇలా ఉదాహరించాలి అంటే పుస్తకంలోని 140 పద్యాలనూ ఉదాహరించాలి. కానీ కవి ప్రతిభకు ఇవి చాలవా? మిగిలినవి పుస్తకాన్ని చదివి మీరే అర్థం చేసుకోండి. ఇది రేఖామాత్ర పరిచయమే.
కేవలం నా ఆనందాన్ని మీతో పంచుకునే ప్రయత్నమే. ఈ ‘చినుకులు’ సహృదయ వేద్యాలు; మానవస్వభావానికి మచ్చు తునకలు; మృదువుగా చెప్పే జీవితసత్యాలు; అనునయంగా నేర్పే పాఠాలు; మెత్తగా అంటించిన చురకలు; జీవితాన్ని ఉన్నతంగా తీర్చుకోవటానికి సాయపడే మెరుపులు. మధురకవి మహితోక్తులే ఈ చినుకులు.