[dropcap]కుం[/dropcap]భకర్ణుడు, గింభకర్ణుడు- రావణుడు, గీవణుడు ఇలా ‘నిందయం దామ్రేడితంబు నాద్యక్షరములకు హ్రస్వ, దీర్గంబులకు గిగీలగు’ అన్నాడు వ్యాకరణకర్త. అందుచేత హరికథలు స్పష్టమేగాని, గిరికథ ఏమిటోకదా? అని హరికథ వద్దు-గిరికథ వద్దు అని విసుక్కునేవారున్నారు. హరినిందార్థ ఆమ్రేడిత పద “గిరి’’ పరిహాసమునకు హరికథా పితామహుడు ఠక్కున సమాధనము చెప్పారు.
‘హరికి’కథేకాదు ‘గిరి’కీకథ చెబుతాను అనిగిరిసుత గిరిజా కల్యాణాన్ని హరికథగా మలిచి అప్పటికప్పుడు గానము చేసిన ప్రతిభాశాలి అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు అని చెబుతారు. .అందుచేత హరికథ నామధేయముగా తెలుగులో నారాయణదాసు ఆధ్యాత్మిక హరికథాప్రక్రియ వస్తువుల సృష్టికి పితామహుడుగ సుస్థిరఖ్యాతి నార్జించారు. హరికథను వృత్తిభిక్షగా ప్రసాదించిన మహానుభావుడ నిపించుకున్నారు. వృత్తి కళాకారులుగా హరిదాసులైన వారికి ప్రాణప్రదమయ్యారు.
హరికథ జీవన స్రవంతిలో ఆధ్యాత్మిక ప్రచారమునకు నేటికీ బాగా వినియోగపడుతోంది. బుర్రకథలు, తోలుబొమ్మలు, వీధినాటకములతో బాటు జీవనాధారముగ హరికథ వృత్తిగా జీవించిన, జీవిస్తున్న హరికథకూడ కాలానుగుణ పరిస్థితులకు ఎదురీదుతోంది. తప్పదు. హరికథల ప్రభావము ఆధ్యాత్మికపరముగ ఈకాలానికి కూడ మరపురానిది. హరిదాసులు, హరికథా సంబంధ విషయములేకాదు ఆధ్యాత్మజీవన దీప్తి రగిలించిన మహాపురుషుల కథలు పురాణపురుషులు కథావస్తువులుగా హరికథలు గానము చేయగలుగు తున్నామని నారాయణ దాసును వినయముగా నేటికీ గుర్తుచేస్తూనే ఉన్నారు. తూర్పుగోదావరిజిల్లా కపిలేశ్వరపురములో హరికథా శిక్షణ కళాశాల నెలకొల్ప బడడమే హరికథ గానము వృత్తిగా స్వీకరించినవారి ప్రాముఖ్యమును తెలియజేస్తుంది.
హరికథ ఆంధ్రప్రాంతమునకు మాత్రమే పరిమితము కాదు. తమిళ, మళయాల, కన్నడభాషలలో కాలక్షేపాలుగా హరికథలు ప్రసిద్ధి. సాయి సచ్చరిత్రలో దాసుగణు అనే మహారాష్ట్ర ప్రాంతపు హరిదాసు ప్రస్తావనుంది. భక్తిప్రధానమైన హరికథగా మహారాష్ట్రలో హరికథలు సాగుతాయి. దాసుగణు హరికథలు ప్రచారము వలననే శిరిడీ సాయిబాగారి మహిమలు ప్రాచుర్యము పొందాయని సాయిసచ్చరిత్ర చెపుతుంది. పదునైదవ అధ్యాయములో దాసుగణు చెప్పిన సాయియోగి భగవాన్ హరికథ విని ప్రభావితుడైన చోల్కరు అనే వ్యక్తి వృత్తాంతము ఉదాహరణ ఇవ్వబడింది.
దాసుగణు హరిదాసు వేషమును బాబాగారు మహారాష్ట్ర హరిదాసు (తలపైని టోపి పొడవైన కోటు, లోపల చొక్కా, పైన నుత్తరీయము) వేషధారణకు భిన్నముగా నారదీయ పద్ధకి మార్చారు. దాసుగణు నడుము మొదలు తలవరకు ఏమియు వేసుకొనెడివాడు కాదు. చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించెడివాడు. నారద మహర్షి త్రిలోక సంచారిగ వేసుకున్న వేషమది. నారదమహర్షియే హరినామసంకీర్తనతో హరికథలు ప్రారంభించిన వాడని హరిదాసు వేషము నారదీయపద్ధతిగా సమ్మతమని బాబా దాసుగణుకు సూచించారు. తెలుగువారు ఇష్టపడే హరికథ హరిదాసులు వేషము ఇంచుమించు ఇలాగే ఉంటుంది.
చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టుధోవతి పంచకట్టు నడుముకు పట్టు కండువా చుట్టుకుని ‘హరికథ చెప్పెద వినుడీ’ అని హరిదాసు కథాగానము చేస్తాడు., నుదుట బొట్టు. మెడలో హారము. హరికథా ప్రారంభమునకు ముందు హరిదాసుకు మెడలో దండ వేయడానికి ప్రేక్షకులు ఉత్సాహము చూపుతారు. హరిదాసును భాగవతార్ అంటారు. స్త్రీ హరిదాసులను భాగవతారిణులు అంటారు. తెలుగునాట భారత,భాగవత, భగవద్గీత, భక్తుల మహాచరిత్రలు హరికథా వస్తువులుగా గానం చేయబడతాయి.. వీరబ్రహ్మంగారి కాలజ్ఞానము హరికథలద్వారా ప్రచారమయింది. ఇప్పటికీ దేవాలయములలో పర్వదినములలో ఒకరోజుకు పరిమితము. అయితే ఒకప్పుడు గ్రామాలలో నెలలతరబడి ధారావాహికగా నెలకుపైబడి హరికథలు సాగేవి. ఆకాశవాణి, దూరదర్శన్, తిరుపతి దేవస్థానములు హరికథకు ప్రోత్సాహము ప్రాచుర్యము ఇస్తూనే ఉన్నాయి.
పాండిత్యము, నటన, పాటలు, హాస్యము, చమత్కారము కలబోసి వేదాంత విషయములు ప్రతిభావంతముగా ప్రజలలో చొచ్చుకుపోయేలా చేయగలది హరికథా ప్రక్రియ. నారాయణదాసు గారు తెలుగుహరిదాసులకు పెట్టిన భుక్తిముక్తిదాయక వృత్తి అని హరిదాసులు కృతజ్ఞతలు చెప్పి హరికథను ప్రారంభిస్తారు. భక్తి, సంగీత, సాహిత్య అభినయాల మేలుకలయికగా హరికథని తూమాటి దోణప్ప అభివర్ణించడం హరికథ విలువను చాటుతాయి.
చిరస్మరణీయ ఆధ్యాత్మిక ప్రక్రియ అనిపించుకోవడానికి హరికథకు అన్ని అర్హతలూ ఉన్నాయి. 5000కు పైగా హరికథలు తెలుగులో వెలిశాయి. ఇకభాగవతారు, భాగవతారిణులను లెక్కకట్టి చూపడము చిన్నబుచ్చడమే అవుతుంది. గండపెండేరములు, సువర్ణ కంకణములు తొడిగించుకుని ప్రజా బాహుళ్యములో అభిమానులను సంపాదించుకుని పేరుమోసిన ఎందరో మహానుభావులు – ఎందరో హరిదాసులు అందరికీ వందనాలు. కవుల చరిత్రవలె స్వయముగా రచయితలైన హరిదాసులు – వారి సాహిత్యము కూడ పుస్తకరూపములో రావలసిన ఆవశ్యకత ఉంది.
హరికథా పండితుడు అంటే వేదపురాణాది పరిజ్ఞానముతోబాటు, సమకాలీన సాహిత్యప్రవేశము పుష్కలముగా ఉన్నవాడని కూడా అర్థముగా తెలుగువారికి అంగీకారమే! హరిదాసు స్వయముగా కవి కావచ్చు, కాకపోవచ్చు. పురాణవిజ్ఞానముతోబాటు, సమకాలీన విషయావగాహన మాత్రము తప్పక కలిగిఉంటాడు. సమయస్ఫూర్తి కలిగి ఉపయోగించ గలుగుతాడు. క అంటే బ్రహ్మము, థ అంటే ఉండునది అని అర్థము చెప్పారు తంగిరాల సుబ్రహ్మణ్యశాస్త్రి. బ్రహ్మమును గూర్చిన విజ్ఞాన కథ హరికథ. హరికథ చెప్పువాడుహరిదాసు..
సామవేదములోని సామగానరూపములె సంగీతసాహిత్యకవిత్వదశకు నాంది. లవకుశులుచే వాల్మీకి రామాయణ గానము హరికథ. శౌనకాది మహామునులు విన్నవి హరిహర, బ్రహ్మకథలు. పురాణ కాలక్షేప రూపాంతరమే ఆధునిక హరికథ. హరిదాసు కేవలము ప్రతిభ వలననే కథా ప్రవచనముతో ఆకట్టుకొనగలడు. అతనికి నృత్యగాన గేయ పాండిత్యప్రతిభకు సహాయముగా ఫిడేలు, హార్మనీ, మద్దెల పక్క వాయిద్యములుంటాయి. సహాయసంగీతకుల పరికరము చివరదాసు పదము చేర్చి వారిని కూడా హరిదాసుతో సమానముగా గౌరవించడము తెలుగు హరికథ సంప్రదాయము.
వసురాయకవి చాటు ప్రబంధములోని ఒక హరిదాసు ప్రస్తావన ఉదహరించదగ్గది. స్త్రీ విద్యావ్యాప్తికి ప్రచారమున్న రోజులవి. వసుకవి 15-9-1905 సంవత్సరమునాడు ఆర్యపురమున, రాజమహేంద్రిలో బాలికాపాఠశాల స్థాపించునవసరమున పదిపద్యములు రచించి శ్రావణ బాద్రపదముల కథను ఆశు పద్యములు ‘వ..సు’ అనగా వడ్డాది సుబ్బారాయకవి సభలో చదివారు.
పండితుడైన భర్త దేశాంతరము వెళుతూ సర్వసంభారములు సమకూర్చాడు. వచ్చేవి శ్రావణ బాధ్రపదాలు. వర్షాకాలము. భార్య ఇబ్బందిపడకుండా ఉండాలనుకున్నాడు. కాని పాండిత్యము ఒలకబోసి శ్రావణ, బాద్రపదాలు వస్తారు, జాగ్రత్తగా చూసుకో అని తమాషాగా చెప్పాడు. చదువురాని కారణముగా శ్రావణ బాద్రపదమాసాలను వ్యక్తులుగా భార్య భావించింది. ఇద్దరు దొంగలు ఇంటికి వస్తే శ్రావణ బాద్రపదాలనుకుంది. భర్త సంతోషిస్తాడని అతిథులుగా మర్యాదలు చేసింది. ఆమె అజ్ఞానమును గ్రహించి దొంగలు వర్షాకాలము కాలు కదపకుండా సకల మర్యాదలు పొందారు. ఆమె భర్త తెచ్చిన సకలసంబారాలు వారికే ఖర్చయ్యాయి. చదువులేని కారణంగా అతిచిన్న విషయాన్ని అర్థము చేసుకోలేని పరిస్థితి ముఖ్యముగా ఆడవారిలో ఉందని,. స్త్రీవిద్య ఆవశ్యకతకు ఆ రోజులలో చెప్పిన కథను వసురాయ కవి చాటుపద్యప్రబంధములో ఉదహరించారు.
ఆ రచించిన పది పద్యముల కాగితములు పోయాయి. అప్పుడొక హరిదాసు తనకు ఏడు పద్యములు కంఠతాగా వచ్చునని, అవి మాత్రమే రాసి పంపుతూ మిగిలిన పద్యములు మూటిని కొత్తగా రాసి పంచమని లేఖాపూర్వకముగా కవిని కోరారట. భద్రాద్రి నుంచి ఒక హరిదాసు కోరికపై చివరి మూడు పద్యములు తిరిగి రాశానని చెప్పుకున్నారు.. ఏడింటిని ఒక హరిదాసు ఆయనకు పంపించారని చెప్పుకున్నారు. హరిదాసులు సామాజిక నేపథ్య సాహిత్యసందర్బోచిత సంస్కరణాభిలాషను కూడ హరికథ మధ్యలో ప్రచారము చేశేవారనడానికి ఈ వృత్తాంతము ఒక ఉదాహరణ.