చిరుజల్లు

0
2

నూతన సంవత్సర శుభాకాంక్షలు

[dropcap]మ[/dropcap]రో నూతన సంవత్సరం వచ్చేసింది అత్యంత కోలాహలంగా. ఎటు చూసినా అంబరాన్ని అంటే సంబరాలే. అమితమైన ఆత్మీయతతో ప్రేమాస్పదమైన పలకరింపులతో, ఆనందలోకాల్లో విహరింపజేస్తూ, గాలి తరంగాల మీద తేలియాడుతూ… కొత్త సంవత్సరం వచ్చేసింది.

ఈ ఏడాది అయినా సుందర స్వప్నాలు ఫలిచాలనీ, భవిష్యత్ ప్రణాళికలు ఉజ్వలంగా వెలుగొందాలనీ, ఆశిస్తూ గుండె గడపకు ఆశల తోరణాలు కట్టుకుందాం.

చుట్టుముట్టిన చీకట్లతో పాటే, వెన్నెల కాంతి లాంటి భ్రాంతి తొలగిపొయ్యాక, కటువైన వాస్తవం కళ్ళ ముందు నిలబడుతుంది, క్రూరంగా చూస్తూ.

గడిచిన రెండేళ్ళ నుంచీ అనుభవిస్తున్న కష్టాల నీడలు పూర్తిగా తొలగిపోలేదు. నిర్మానుష్యంగా మారిన రాదారుల్లో గాలి రాపిడికి చెట్ల కొమ్మల నుంచి రాలి పడిన చేదు జ్ఞాపకలు లాగా, పీడకలల్లా వెన్నాడుతూనే ఉన్నాయి. కనిపించని చెయ్యి ఏదో అయినవాళ్ళ మధ్య నున్న ఆప్యాయతలనీ, అనుబంధాలనీ తెంచేసి, ప్రాణభయంతో వణికించేసిన సమయం అది. రోజంతా రికామీగా గాలికి తిరిగేవాళ్ళకీ, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయి… పోయిన రోజులవి. లక్షలు ధారపోసినా, ఉచితంగా ప్రకృతి ప్రసాదించే ప్రాణవాయువు దొరక్క, అయినవాళ్ళు ప్రాణాలు కోల్పోతే, చివరి చూపుకైనా నోచుకోలేని దుర్భర పరిస్థితులవి. ఎవడి ఇల్లు వాడికి కారాగారం అయింది. సూక్ష్మాతిసూక్ష్మమైన క్రిమి ఏదో, అదృశ్యంగా లక్షల మంది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్నీ, ఆయువునీ, సరీసృపంలా మారి మింగేస్తుంటే, సమస్త మానవాళీ చేష్టలుడిగి, నిస్సహాయంగా చూస్తు ఉండిపోయిన కాలమది. ఎంతటివాళ్ళకైనా ఒక్కొక్కప్పుడు కష్టాలు, కడగండ్లూ తప్పవు. సూర్యుడినీ, చంద్రుడినీ కూడా రాహుకేతువులు, అప్పుడప్పుడు పీడిస్తూనే ఉంటారు.

ఇవేవీ చాలవన్నట్టు వానొచ్చి, వరదొచ్చి, కృష్ణాగోదావరి నదులే గుమ్మాల్లోకి తరలొస్తే, గుక్కెడు మంచినీళ్ళు దొరక్క, కడివెడు కన్నీళ్ళు కారుస్తూ, మోకాలి లోతు నీళ్ళల్లో ఈదుతున్నప్పుడు, కాళ్ళకు చుట్టుకున్న పాములు తప్ప, వచ్చి పరామర్శించినవాడు ఒక్కడూ లేడు. కష్టాల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే, కష్టాలు తెచ్చిపెడుతుంటే, ఎవడికి మొర పెట్టుకోవాలి?

ఆశ

మనిషిని ఎప్పటికప్పుడు నిలబెట్టేది, ముందుకు నడిపించేదీ ఆశే. కేవలం ఆశతోనే బ్రతకలేము. అలా అని ఆశలేకుండా బ్రతకలేము. చుట్టూ ఆవహించిన తిమిరంతో జరిపే సమరంలో, ఆశ ఒక్కటే మనకున్న వజ్రాయుధం. నేనే ఎందుకిలా ఉన్నాను? నాకే ఎందుకీ కష్టాలు – అంటూ జీవితం పొడుగునా సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. వీటి అన్నిటి మధ్యా, అనుకున్నవన్నీ చేసేందుకు, అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న పనులే, ఆశలు చిగురింప చేస్తయి. మనసు పేకమేడలు కడుతూనే ఉంటుంది. అంటే సగం పని అయినట్లే. ఆ పేకమేడల కింద గట్టి పునాదులు వెయ్యటమే మిగిలి ఉన్న పని. కోరికలు లేని మనిషి అంటూ ఉండడు. పక్షులకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు. అటుగా ఎగిరిపోతుంటాయి. అలాగే మనిషికీ తన కోరికలు ఎలా తీరుతాయో తెల్సు. చేయవలసినదంతా అందుకు తగిన కృషి. అదే తపనతో ఆలోచిస్తుంటే, ఏదో ఒక క్షణంలో విచక్షణా జ్యోతి వెలగక పోదు. దారి సుగమం చేయకపోదు. జీవితంలో బాగు పడాలంటే లక్షలు ఉండాల్సిన పని లేదు. ఒక లక్ష్యం ఉంటే చాలు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలన్న దీక్ష ఉంటే చాలు. అయితే అన్నిటికీ ఉన్నట్లే, ఆశకూ పరిమితులుంటాయి. అర్హతలూ ఉంటాయి. వాటిని గుర్తెరిగి మెలగాలి.

కాలం

కాలాన్ని తల్చుకుంటే చాలు. చాలా చిత్రంగా కనిపిస్తుంది. గాయాలను చేసేది కాలమే.  ఆ గాయాలకు లేపనం పూసేదీ కాలమే. దాన్ని అనుభవించటానికీ, ఒక క్రమ పద్ధతి ఉంది. ఒకడికి అరవై ఏళ్ళ వయసు ఉందనుకుందాం. దాన్ని క్షణాల్లో, గంటల్లో, రోజుల్లో, నెలలలో, సంవత్సరాలలో, ఒక్కొక్క క్షణం చొప్పున మాత్రమే అనుభవించాలి. రెండేసి రోజులు ఒకేసారి, రెండేసి నెలలు ఒకేసారి, తొందర తొందరగా కావాలంటే కుదరదు. అలాగే ఆలస్యంగా కాలం గడవటానికీ వీలుండదు.

టైం ఈజ్ మనీ అని అన్నారు అనుభవజ్ఞులు. అది కొంత వరకూ నిజమే. బ్యాంకులో ఒకడి పేరు మీద పదివేలు ఉన్నాయనుకోండి. ఆ డబ్బు రేపయినా తీసుకోవచ్చు. ఏడాది తరువాత అయినా తీసుకోవచ్చు. అప్పటిదాక ఆ పదివేలు అలాగే ఉంటాయి. కానీ టైం విషయంలో అలా కాదు. రోజుకు ఇరవై నాలుగు గంటలు నీ పేరున డిపాజిట్ అవుతయి. నిరుపేదకయినా, అపర కుబేరుడికి అయినా రోజుకు ఇరవై నాలుగు గంటలే లభిస్తయి. వాటిని సద్వినియోగం చేసుకున్నా, చేసుకోకపోయినా, మరునాటికి ఆ ఇరవై నాలుగు గంటలలో అర నిముషమైనా నీకు మిగిలి ఉండదు. దాని విలువ తెలిసినవాడు సమయాన్ని వృథాగా గడపడు. ఒక ఇంగ్లీషు రచయిత అంటాడు – “నేను వీధి చివర నిలబడి, టోపీ చేతిలో పట్టుకొని, యాచిస్తుంటాను. మీరు వృథా చేసే గంటలను నా టోపీ లోకి విసిరేసి పొండి” అని. కొంతమంది ఏ పని చేయకుండా ‘టైం కిల్’ చేస్తున్నామని అంటారు. నిజానికి టైమ్ వాళ్ళని నెమ్మది నెమ్మదిగా కిల్ చేస్తున్నదని గ్రహించరు. ఒక వస్తువు కొనే ముందు, అది అంత ఖరీదు చేస్తుందా, చెయ్యదా అని ఆలోచించినట్లే, ఒక పని చెయ్యబోయే ముందు, దానికి అంత సమయం వెచ్చించటం అవసరమా లేదా అని ఆలోచించాలి. మొదటి ఎలిజబెత్ రాణి అన్నది “గడిచిపోయిన రోజును ఎవరైనా నాకు తిరిగి ఇప్పించగలిగితే, నాకున్నవన్నీ ఇచ్చేస్తాను” అని. గడిచిన సమయం మళ్ళీ రాదు మరి.

కాలాన్ని డబ్బు కింద మార్చుకోవటం ఒక గొప్ప ఆర్ట్. రోజులో నీకు లభించిన ఇరవై నాలుగు గంతలలో కొంత సమయాన్ని ఏదైనా ఉపయోగపడే పని చేస్తే, అంటే ఒక వృత్తి పని గానీ ఉద్యోగం గానీ, చేసినట్లయితే ప్రతిఫలంగా డబ్బు లభిస్తుంది. కొందరు డాక్టర్లు, లాయర్లూ, నాయకులూ ఉంటారు. వాళ్ళు ఇరవై నాలుగు గంటలూ పని చేసినా, ఇంకా కొంత పని మిగిలిపోతుంది. అలాంటివారు కొందరు అసిస్టెంట్స్‌ను పెట్టుకొని, తమ పని కొంతమేర తగ్గించుకుంటారు.

ఇటలీ దేశపు ఫిలాసఫర్ ఒకాయన “టైం అనేది నాకున్న ఎస్టేట్” అని అన్నారు. అయితే ఎస్టేట్‍ను అలా ఉంచుకుంటే అతనికి ఒరిగేదేమీ ఉండదు. పది మంది కూలి వాళ్ళను పెట్తి, ఆ ఎస్టేట్‍ను దున్ని పంట పండించితే, లేదా మొక్కలు నాటి తోటను పెంచితే, వచ్చే ఫలసాయంతో అతను లాభం పొందడమే గాక, కూలి వాళ్ళకూ లాభంలో కొంత భాగం ఇవ్వవచ్చు. పారిశ్రామికవేత్తలు చేసే పని ఇదే. ఒక ఏడాదిలో కొంత పని చేయటం లక్ష్యంగా పెట్టుకుంటాడు. చేయగల నేర్పు, దక్షత ఉన్నా, సమయం సరిపోదు. కనుక ఓ కంపెనీ పెట్టి, వందమంది ఉద్యోగులును నియమించుకుని, వస్తువులను లేదా సేవలను అందించి లాభాలు పొంది, తన క్రింది వాళ్ళకూ డబ్బును పంచి ఇవ్వగలుగుతాడు. కాలం విలువ తెలిసినవారు ఎన్నెన్నో గొప్ప పనులు చేయగలుగుతారు.

సంపద

టకాధర్మః టకా కర్మ – టకాహి పరమం పదం

టకాయస్య గృహేనాస్తి – హాటకే టక్ టకాయతే

ధనమే ధర్మము, ధనమే పరమ పదం. ఎవ్వని ఇంట ధనము లేదో, వాని ఇంట కుండలు టకటకలాడును.

అన్ని దేశములలోనూ, అన్ని కాలములలోనూ, ధనము ఉన్నవాడికే విలువ. భార్యాబిడ్డలను పోషించుకోవటానికీ డబ్బు సంపాదించాల్సిందే. ధనవంతుడికే సభలో గౌరవం. సిరిసంపదలు వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్లు వస్తాయని అంటారు. అయితే ఆ ధనార్జన న్యాయబద్ధంగా సంపాదించినప్పుడే గౌరవం. నోట్ల కట్టల మీద చితి పేర్చగలిగినన్ని నోట్ల కట్టలు గడించినా, చివరకు జైలు గదిలో నిద్రించాల్సి వస్తే, ఆ డబ్బు కష్టాలను తెచ్చిపెట్టినట్లే గదా. మనిషికి ఎంత అవసరమో ఆ మేరకు సంపాదించుకోగలిగిన వాడే నిజమైన ధనవంతుడు. ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకుంటే వాడంత భాగ్యశాలి మరొకడు ఉండడు. ఉమర్ ఖయ్యాం లాగా – ‘చెట్టు నీడుండి, రుచియైన రొట్టె ఉండి, దివ్యమైనట్టి శృంగార కావ్యముండి, పరవశము చేయగల మధుపాత్ర ఉండి, పాడుచును హాయిగా నీవు పక్కనుండ, వట్టి బయలున స్వర్గమే ఉట్టి పడును’ అని పాడుకుంటూ నిశ్చింతగా జీవిస్తున్న కోట్లాదిమంది నిజగా అసలైన ధనవంతులు.

సంతోషం

సంతోషం సీతాకోకచిలుక లాంటిది. పట్టుకుందామని దాని వెంట పడితే, అది చిక్కనే చిక్కదు. అటే చూస్తూ నిశ్చలంగా కూర్చో. కాసేపటికి అదే వచ్చి నీ భుజం మీద వాలుతుంది.

కోరికలు అనంతం. ఎంత ఉన్నా, ఇంకా ఏదేదో కావలన్న కోరిక నిరంతరం వేధిస్తునే ఉంటుంది. కోరుకునే దానితో ఉన్నదానిని పోలిస్తే అసంతృప్తే మిగులుతుంది. కానీ నీకున్న అర్హతలకూ, నీకున్న దానికీ పోల్చి చూసుకుంటే, సంతోషించాల్సి ఉంటుంది మరి. ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఆడంబరాలకే అగ్రతాంబూలం. సముద్రుడు పట్టు పీతాంబరాలు ధరించేవాడికి పిల్లనిచ్చాడు. చర్మాంబరధారికి కాలకూట విషాన్ని ఇచ్చాడు. అయినా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. ఆ సంతృప్తి లేకపోతే అన్నీ భయాలే.

భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, ….. సర్వం వస్తు భయాన్వితం…

భోగము లందు రోగ భయము, కులము నందు అది పోవుననే భయం, ధనము విషయమున రాజనీతి, ఈ జగత్తులోని సర్వవస్తువులున్నూ ఏదో ఒక భయాన్ని కలిగిస్తూనే ఉన్నాయని అన్నారు. నిర్భయమే సంతోషానికి ఆలవాలం.

అయితే అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరిని అదృష్టం అయాచితంగా వరిస్తూ ఉంటుంది. కనుక విశ్వనాథ వారు అన్నట్లు ‘సుఖము ఫాలము నందు రాసుకుని ఎవ్వరు పుట్టిరో, వారికి వసంతమ్ము సుమనోహరమైన గానిమ్ము’. అంతేగదా. నుదుటి వ్రాతను చెరుపనెవ్వరి తరము? నోచినవారి సొమ్ములవి, నోచనివారికి దక్కునే?

సరేమరి. మీకు నూతన సంవత్సరం సుఖ సంతోషాలనూ, అష్ట ఐశ్వర్యాలనూ సమకూర్చాలని ఎందరెందరో శుభాకాంక్షలు తెలియజేశారు గదా. నేనూ అదే ఆకాక్షింస్తున్నాను. వాటిని సఫలం చేసుకునే ప్రయత్నం ప్రారంభించండి ఇంక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here