Site icon Sanchika

చిరుజల్లు 10

నా అందచందములు దాచితి నీకై

[dropcap]చా[/dropcap]లా ఏళ్ళ క్రితం ‘సంఘం’ అనే సినిమా వచ్చింది. అందులో అప్పుడే మొలకెత్తిన పరువపు మొలకలా ఉన్న వైజయంతీమాల ఒక పాట పాడుతుంది – ‘సుందరాంగ మరువగలేనోయ్ రావేలా, నా అందచందములు దాచితి నీకై రావేలా; ముద్దునవ్వులా మోహనకృష్ణా, రావేలా’ అని.

ఎంత ముద్దునవ్వుల మోహనకృష్ణుడి కోసం అయినా సరే, పెట్టెలో దాచిపెట్టుకున్న పట్టు వస్త్రాల లాగా, అందచందములను కూడా వసివాడకుండా దాచిపెట్టుకోగలమా అని? అదే సాధ్యం అయితే, ఈ లోకం మరో సుర లోకంలా ఉండేది.

అందచందాల ప్రాశస్త్యాన్ని గురించి అనేకమంది అనుభవజ్ఞులు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. అందం అనేది దేవుడిచ్చిన గొప్ప రికమండేషన్ లెటర్ అన్నాడు అరిస్టాటిల్. ప్రకృతి ప్రసాదించిన వరం అన్నాడు ప్లాటో. అది స్వల్పకాలం పాటు కొనసాగే నియంతృత్వం అన్నాడు సోక్రటీస్. అంటే అందాల భామ ఏది కావాలన్నా, కొండ మీద కోతిని అయినా తెచ్చిస్తారని ఆంతర్యం.

క్లియోపాత్ర ముక్కు కొంచెం చప్పిడిముక్కు అయితే, ప్రపంచ స్థితిగతులు మరోలా ఉండేవని ఒక చరిత్రకారుడు అన్నాడు. అంటే ఆమె తన అందచందాలతో ఆనాటి యోధానయోధులనందరినీ వశపరుచుకున్న దన్నమాట. నిజానికి క్లియోపాత్ర తన అందంతో కన్నా, యుక్తి తోను, చాతుర్యంతోనూ వారి హృదయాలను దోచుకున్నదని అంటారు.

క్లియోపాత్ర సినిమాలో ఆమె పాత్రను పోషించిన ఎలిజబెట్ టేలర్ కూడా కొంత కాలం పాటు ఒక తరం వారి హృదయాలను ఉర్రూతలూపింది. ఒకరి తరువాత మరొకరిని ఎనిమిది మందిని వివాహమాడింది. అయినా ఆమె జీవితమంతా కల్లోల తరంగంలాగే సాగింది.

మర్లిన్ మన్రో కొంత కాలం పాటు మకుటం లేని మహారాణిలా వెలిగింది. కానీ ఆమె జీవితం విషాదాంతమే అయింది.

ఇప్పటివారు ఎవరూ చూడకపోయినా సీత, ద్రౌపది, అహల్య వంటి సుందరీమణులకు వారి రూపమే ఒక శాపం అయింది.

పురుషులలోనూ అందమైన వారు ఎందరెందరో ఉన్నారు. శూర్పణక రాముని వద్దకు వచ్చి “నా అందచందములు దాచితి నీకై” అన్నది. ఆయన అన్నీ తెల్సినవాడు గనుక, అవుననీ, కాదనీ అనక “నా తమ్ముడున్నాడు చూడు” అన్నాడు. పర్యవసానం రామ రావణ యుద్ధమే జరిగింది.

ద్రౌపది అందం కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారి తీసింది.

సౌందర్యారాధన ఒక రకమైన మానసిక స్థితి. వందమంది ఉన్న సభలోకి ఒక అపురూప లావణ్యవతి అడుగుపెడితే, అందరి కళ్లూ అటే తిరుగుతయి. మరికొందరికి కళ్లు తిరుగుతయి. లేచి నిలబడి తన సీటు ఆమెకు లేదా ఆయనకు ఇస్తారు. సినిమా రచయిత అన్నాడు గదా… ‘సుందరాంగులను చూచిన వేళల… కొందరు ముచ్చటపడనేలా, కొందరు పిచ్చనుపడనేలా’ అని.

అంతటి అతిలోక సుందరి కడగంటి చూపు తగిలినా చాలు జీవనమే పావనమై పోవును అనుకునే వారున్నారు. కొంగు జారితే చాలు గుండెలు చిక్కుకుపోతాయి. ఇందుకు ఎవరూ అతీతులు కారు. భోగులూ, రోగులూ – ఎంతవారలైనా కాంతదాసులే.

సృష్టికి ప్రతిసృష్టి చేయగల గొప్పవాడు విశ్వామిత్రుడు. ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ‘రారా బిగి కౌగిలి చేర, సురలోక భోగాల తేలింతురా’ అనగానే కమండలం, రుద్రాక్షమాల పక్కన పడేశాడు. అందంతో మైమరిపించిన, మురిపించిన కథలూ, గాథలూ ఎనెన్నో.

అమెరికా అధ్యక్షులు యావత్ ప్రపంచాన్నీ శాసించగలరు. వారు అమితమైన అధికార దర్పం, ఎంతటి దేశాన్ని అయినా సర్వనాశనం చేయగల సామర్థ్యం, ఆయుధ సంపత్తి కలిగియుంటారు. అంతటి బలవంతులకీ బలహీనతలున్నయి. వారివీ ఎన్నో ప్రేమ కథలు ప్రచారంలో ఉన్నయి. వాళ్లూ మనుషులే గదా. వైట్ హౌస్ ప్రేమ కథలెన్నో.

అందచందాలకు సత్యమూ, సౌశీలయమూ తోడైనప్పుడే అవి చరితార్థములవుతయి. అటువంటి సత్‍శీలురూ, పరమ నిష్ఠాగరిష్టులూ కూడా లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. ఉంటారు.

అసలు అందం అంటే ఏమిటి? దానికి నిర్వచనం ఏమిటి?

మన చుట్టూ ఎంతో సౌందర్యం పోగుపడి ఉన్నది. దానిని తేరిపార చూడగలిగే అంతర్నేత్రం కూడా ఉండాలి.

ఎక్కడ అందమైన ప్రదేశం గానీ, అందమైన వస్తువు గానీ, చిత్రం గానీ, శిల్పం గానీ కనిపిస్తే తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే, సుందరమైనది ఏదైనా సరే, అది దేవుని దస్తూరియే. మనిషికి ఆక్సీజన్ ఎలాంటిదో, మనసుకు సౌందర్యపిపాస అలాంటిదే. ఏ వయసులోనున్నా, ఏ వేళలోనైనా కంటికి ఇంపుగా కనిపించిన దానిని చూస్తూ పరవశించి పోతుంది మనసు.

చూడగలిగే చక్షువులు ఉండాలేగాని, చీకటి తెరలను తొలగించి, తొలి వెలుగు రథాలెక్కి వచ్చే సూర్యుడు, పగలంతా మార్తాండునిలా వెలిగి, సాయంకాలం క్రమంగా చీకట్లో కరిగిపోయే భానుడు, వెన్నెలలు కురిపించే సుధాకరుడు, ఆకాశాన మిలమిల మెరిసిపోయే నక్షత్రాలు, మబ్బులూ, చిరుగాలులూ, వానచినుకులూ, కొండలూ, కోనలూ, లోయలూ – మొలకెత్తే విత్తనం, కొమ్మలు చాచుకున్న వృక్షాలూ, రంగురంగుల పూలూ, ఫలాలూ – రాలిపోయే ఆకులూ, తొంగిచూసే చిగురుటాకులూ – సృష్టి సమస్తమూ సౌందర్యభరితమే గదా… అయితే ఏదీ చిరస్థాయిగా నిలవదు. ఋతువులు మారేకొద్దీ రమణీయంగా మారుతూనే ఉంటుంది. కాశ్మీరం దగ్గర నుంచీ కన్యాకుమారి వరకూ, ఎటు చూసినా పులకింప చేసే ప్రకృతి విలాసాలే గదా, విన్యాసాలే గదా. అయితే ప్రకృతి మాత ఇచ్చే ప్రతీదానినీ, కాలమనే పురుషుడు లాగేసుకుంటాడు. ఎవరికీ ఏదీ శాశ్వతంగా ఇవ్వడు. ప్రతిదీ అరువుగానే ఇస్తాడు, అరుదైన అందచందాలతో సహా. ఆ గడుగు తీరగానే తాను ఇచ్చినది తాను తీసేసుకుంటాడు చక్రవడ్డీతో సహా.

ఇంతకీ ఈ అందచందాలను నిర్వచించటం కుదరదు. ఎందుకంటే, ఒక్కో ప్రాంతంలో, ఒక్కో సమాజంలో ఉండేవారికి, వారి వారి అందచందాలు వేరు వేరుగా ఉంటయి. అమెరికాలో ఉండేవారికి శ్వేతవర్ణం వారంటేనే ఇష్టం. ఆఫ్రికాలో ఉండేవారికి నల్లవారంటేనే ఇష్టం. చైనా వారి అందం వేరు. జపాన్ వారి అందం వేరు. అందుకే ఒకాయన అన్నాడు ఈ సౌందర్యం అనేది, చర్మాన్ని బట్టే గదా – అని. చర్మాన్ని ఒలిచి, గుండెలోనూ, ఊపిరితిత్తులలో అందాన్ని చూడలేం గదా.

ఒకరికి సన్నగా పొడుగ్గా ఉన్నవారు అందంగా కనిపిస్తారు. మరొకరికి లావుగా ఉంటేనే లావణ్యవతిలా ఉంటారు. గుజరాతీల అందం వేరు. కేరళవారి అందం వేరు. అరవవారి అందం వేరు. అస్సాం వారి అందం వేరు.

ఒకసారి పెరల్ బక్ ఆరునెలల పాటు చైనాలో ఉండవలసి వచ్చింది. అక్కడి వాళ్లంతా ఆమెను వింతగా చూసేవారు. అది ఆమెకీ అర్థమైంది కానీ, ఎవరి భావలావణ్యాలు వారివి.

అందంగా కనిపించాలన్న తపప అందరికీ ఉంటుంది. కోడలు అందంగా ఉంటే, వంశమంతా అందంగా ఉంటుందని, వందమందిని వెతికి ఒక కోడలు పిల్లను తెచ్చుకుంటారు. అంతటితో ఆగరు. మనవళ్లూ, మనవరాండ్రూ రబ్బరుబొమ్మల్లా ఉండాలన్న తపనతో గర్భవతులకు కుంకుమ పువ్వు, కొబ్బరినీళ్లూ ఇంకా ఏవేవో పట్టిస్తారు. అయితే ఈ చిట్కాలు ఏవీ ఫలించవు అని తెల్సినా సరే, ప్రయత్నాలు మానరు. ఆఫ్రికా దేశాల్లో వారికి లావుగా ఉండేవారంటే ఇష్టం. అందుచేత చిన్నపిల్లల చేత విపరీతంగా చిరుతిళ్లు తినిపిస్తారు.

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. ఇప్పుడు మార్కెట్లో, సౌందర్యసాధనాలకు లోటు లేదు. బ్యూటీ పార్లర్లు మొత్తం మనిషినే మార్చేస్తున్నయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. పెళ్లి కుదిరింది. పెళ్లికూతుర్ని చేయడానికి పదిమంది బ్యూటీషియన్లు దిగారు. తీరా మండపం దగ్గరకు తీసుకొచ్చాకా పెళ్లికొడుకు పేచీ పెట్టాడు – తనకు మొదట చూపించింది ఈ అమ్మాయిని కాదని.

తెల్లగానూ, పచ్చగానూ ఉన్నవాళ్లే అందమైన వాళ్లనీ, నల్లవాళ్లు ఏమంత అందమైన వారు కాదనే అభిప్రాయం ఉంది. కానీ రంగు ఏదైనా ప్రాయంలో ఉన్నవారు అందంగానే ఉంటారు. అంచేత చాలామంది ఎప్పటికీ యవ్వనంలో ఉన్నట్లుగానే కనిపించాలని తాపత్రయ పడుతుంటారు. వయసెంతో నోటితో చెప్పకపోయినా, మొహం చెప్పకనే చెబుతుంది గదా – అనేవారూ ఉన్నారు. కనుకనే మొహానికి అన్నేసి రంగులు, తళుకులు, బెళుకులు, పెదాలకు, బుగ్గలకు, కనురెప్పలకు, కనుబొమ్మలకూ అన్నిటికీ అరువు తెచ్చుకునే హంగులు ఉండనే ఉన్నయి. కృత్రిమ అలంకారం, కొండొకచో వికటించి, వికారంగానూ అనిపించవచ్చు. జుట్టుకు నల్ల రంగు వేసుకున్నాడు ఒకడు. భాష తెలియని వాడు ఒకడు ‘తలకు మసిపూసుకున్నాడు’ అని అనేశాడు.

అందంగా కనిపించాలనే తపనతో, బోలెడంత సమయాన్నీ డబ్బునీ వృథా చేసేవారున్నారు. కానీ ఎంత సహజంగా కనిపిస్తే అంత అందంగా హుందాగా కనిపిస్తామన్న విషయాన్ని చాలామంది గమనించరు. ఇక ఆభరణాలతోనూ, అలంకరణతోనూ అందం రావటమూ అంతంత మాత్రమే.

“ఈ చీర ముప్ఫయివేలు పెట్టి కొన్నాం, బావుందా?” అని అడిగితే, పక్కింటామె, “చీరకేం, చీర బానే వుంది” అంటుంది వ్యంగ్యంగా, ఆమె అసలు అందం ఏపాటిదో తెల్సు గనుక.

కనుముక్కు తీరు కుదురుగా ఉంటే దాన్ని మించిన అందం మరొకటి ఉండదు. ఒకరు ఇంతలేసి కన్నులతో చూస్తారు. ఆ అందం ఏ ఆభరణమూ తీసుకురాలేదు. ఒకరి చక్కని పలువరుసతో నవ్వితే, ఆ దరహాసం తెచ్చే అందం మరింక దేనితోనూ రాదు. భార్య నగలు కొనిపెట్టమని అడిగితే, తెలివి గల భర్త – నగలేల, వగలేల, నీ చిరునగవులు చాలవా – అంటాడు. అది నిజం కూడా.

బాహ్య సౌందర్యమే కాదు, పైకి కనిపించని మానసిక సౌందర్యమూ బంధాలను బలంగా కట్టిపడేస్తుంది. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, భర్త భార్యను ప్రేమిస్తూనే ఉంటాడు. ఒక దొంగను, ఒక తాగుబోతును, ఒక తిరుగుబోతును కూడా ప్రేమించేవాళ్లు ఉన్నారు కాబట్టే సంసారాలు సజావుగా సాగుతున్నాయి. చర్మసౌందర్యమే కాదు, ఆత్మసౌందర్యమూ ముఖ్యమైనదే. ఆ మానసిక అనుబంధమే ప్రపంచాన్ని నడిపిస్తోంది. ప్రేమించుకున్న వారు ఒకరికోసం మరొకరు చావటానికి కూడా సిద్ధపడతారు. అందాన్ని మించిన అనుబంధం వారిని కట్టిపడేస్తున్నది.

అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను – అని అంటే అక్కడ శారీరక సంబంధాన్ని మించి మానసిక అనుబంధం ఏర్పడినదన్న మాట. ప్రేమలేఖలను పదిలంగా దాచుకున్నా, ప్రేమగా ఇచ్చిన కానుకలను అపురూపంగా చూసుకున్నా, అవి మనిషి అందచందాల కన్నా విలువైనవి, వెల లేనివి.

ఇక్కడొక చిన్న కథ చెప్పాలి. ఒక ప్రియూడూ, ప్రియురాలూ ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలేఖలు రాసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరి మధ్యా సంబంధాలు తెగిపోయాయి. కానీ ఇద్దరూ ఆ ప్రేమలేఖలను ప్రాణప్రదంగా దాచుకోవటమే కాదు, ఎప్పటికైనా కలుసుకోవాలనీ, పెళ్లి చేసుకోవాలనీ ఎవరి మనసులో వారు నిర్ణయించుకున్నారు. తొంభై ఏళ్ల వయసులోకి అడుగుపెట్టారు. అనుకోకుండా ఒక విషయం బయటపడింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి ఇరవై ఏళ్ల నుంచీ తమ కాంప్లెక్స్ లోనే ఉన్నదని. వయసు మీరినా, అప్పటి వారి ఆనందం వర్ణణాతీతం. వృద్ధాప్యంలో వివాహం చేసుకున్నారు – ఆ ఒంటరి వాళ్లు ఇద్దరూ జంట అయినారు జీవిత చరమాంకంలో.

అందచందాలు శారీరకమైనవే కాదు, మానసికమైనవి కూడా.

అవును గానీ,

ఎవ్వాని పాదపద్మంబుల దర్శన భాగ్యం చేత చరితార్థులమవుతామని తపోధనులూ, మునులూ పరితపించిపోతుంటారో, అట్టి నల్లనివానికి, పద్మనయనంబులవానికి,… పొదల మాటున ఏమి పని?… అందచందాల వెతుకులాటయేనా?

Exit mobile version