[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
పెళ్లిచూపులు
[dropcap]మా[/dropcap]వాడు మేధావి అవునో, కాదో నేను చెప్పలేను గానీ మేధావికి ఉండాల్సిన అవలక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొంచెం బద్ధకం, కొంచెం మతిమరుపు, కొంచెం నిర్లక్ష్యం వంటి సద్గుణాలు అన్నీ ఉన్నాయి.
అలా అని మావాడు బొత్తిగా తీసిపారేయాల్సున మనిషి కాదండీ.
ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీలో పని చేసేవాళ్లను సగం మందిని తీసేశారు. కానీ వీడిని తీసెయ్యలేదు. అంటే వీరు బొత్తిగా తీసిపారెయ్యాల్సిన వాడు కాదన్న మాటే కదా. కాకపోతే వీడి లాంటి మేధావులను లోకం గుర్తించటంలో కొంచెం లేటవుతూ ఉంటుంది. అంతే. అంతకన్నా మరేం లేదు.
అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు. ఏడాదికి లక్షన్నర డాలర్ల జీతం. వయసు చూస్తే ముప్ఫయి దాటినయి. ఇంటర్వెల్ దగ్గర పడుతోంది జీవితం. ఇంకా పెళ్ళి కాలేదు.
నన్ను సంబంధాలు చూసి పెట్టు, ఇండియా వచ్చినప్పుడు ఏదో ఒక సంబంధం ఓ.కే. చేస్తానన్నాడు. సరేగదా అని ఒక లిస్ట్ తయారు చేశా. ఒకరిద్దరు అమ్మాయిలను చూచాయగా కదిపి చూశాను.
“మావాడు ఐఐటిలో చదివాడు, అమెరికాలో యం.యస్. చేశాడు. మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నాడు. బోలెడంత జీతం. అక్కడ ఇల్లు కారూ అన్నీ ఉన్నాయి” అని అంటే –
“సో, వాట్, మేమూ చదువుకున్నాం. మేమూ సంపాదిస్తున్నాం” అని ఎంతో నిర్లక్ష్యంగా ‘కేరే జాట్’ అన్నట్లు మాట్లాడారు. కాపురం చేసే లక్షణం, కాలిగోరు దగ్గరే తెలుస్తుందంటారు. ఇది కుదిరే యవ్వారం కాదులే అనుకుని వదిలేశాను.
సరేమరి. అనుకున్నట్లుగా మావాడు రానేవచ్చాడు. రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాక ఒక్కొక్క సంబంధమే చూడటం మొదలుపెట్టాం. ఒకాయనకు రెడీమేడ్ షాపు ఉంది. పిల్లను చూడటానికి వెళ్ళాం, వయసు తక్కువే అయినా, కొంచెం లావుగా ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడే ఇలా ఉంటే, ఇంకో పదేళ్ల తరువాత ఇంతకు రెట్టింపు ఉంటే ఎలా ఉంటుంది అని వాడు ఆ అమ్మాయి ఫోటోను ఎన్లార్జ్ చేసి చూపించాడు. ఆ షాపు ఆయన వ్యాపారం కిటుకులు తెల్సిన వాడు గనుక, “మీకు కాబట్టి మంచి ఆఫర్ ఇస్తాను” అన్నాడు. ఏమిటా ఆఫర్ అంటే, “బై వన్ గెట్ వన్ ఫ్రీ” అన్నాడు. అంటే మాకు అర్థం కాలేదు. వివరంగా చెప్పమంటే, ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారట. “ఒక కూతుర్ని చేసుకొంటే, మరో ఇద్దరు ఫ్రీ” అన్నాడు. ఒక కూతుర్నే భరించలేనంటుంటే, మరో ఇద్దర్ని మేనేజ్ చేసే ఓపిక ఎక్కడ? అన్నాడు మావాడు.
ఇంకో సంబంధం చూశాం. ఆయన పురావస్తు శాఖలో అధికారిగా పని చేశాడు. అయన ఇంటికి వెళ్లాం. ఇంటి నిండా క్రీస్తు శకం నాటివి, ముక్కులు విరిగినవీ, చేతులూ, కాళ్లూ విరిగినవి శిలా విగ్రహాలు కనిపించాయి. ఆ అమ్మాయిని చూపించారు. నడకలో ఏదో తేడాగా ఉన్నట్లు కనిపించింది. ‘ఒక కాలు పోలియో ఏమో’ అని మావాడు అనుమానం వ్యక్తం చేశాడు.
“అదేం లేదు. నిన్న కొద్దిగా కాలికి దెబ్బ తగిలింది. అందుకని అలా నడుస్తున్నది” అన్నాడా అధికారి. అన్నీ విరిగినవే ఉన్నయి అక్కడ. విరగని అవయవాలు ఉన్న పిల్ల కావాలన్నాడు మావాడు.
రెండు రోజులు ఆగి ఇంకో మ్యాచ్ ఫిక్సింగ్‌కు వెళ్లాం. తల్లి పిల్లా ఇద్దరూ వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చున్నారు. కొంచెం అటూ ఇద్దరూ ఒకటిగానే ఉన్నారు. ‘పిల్ల మొహం ముదురు మొహం’ అని నా చెవిలో గొణిగాడు, ఎప్పటివో లడ్డూలు, బూందీ తెచ్చిపెట్టారు. వద్దన్నా వినలేదు. “తినండి, తినండి” అని బలవంతం చేస్తే టేస్ట్ చేసి, వదిలేశాడు. దానికే కడుపు అస్సెట్ అయింది. రోజంతా అవస్థ పడ్డాడు. వీళ్ల మర్యాదలకు నేను తట్టుకోలేనని అన్నాడు మావాడు.
ఇంకో సంబంధం చూశాం. మేం వెళ్లిన అరగంట తరువాత ఆ పిల్ల ఎవరి కార్లో నుంచో దిగి, మా ముందు నుంచే లోపలికి వెళ్లింది. గంట తరువాత వచ్చి కూర్చుంది. జట్టు తనది కాదన్నట్లు వదిలేసింది. డ్రైస్ మాత్రం చిన్నపిల్లల డ్రెస్ వేసుకున్నట్లు బిర్రుగా ఉంది. అమెరికాలో సోషల్ లైఫ్ గురించి అడిగింది. ఎంత జీతం వస్తే లైఫ్ ఎంజాయ్ చేయవచ్చో అడిగింది. ‘వీకెండ్స్’ ఎక్కడికి ఎక్కడికి తీసుకు వెళ్తారని అడిగింది. రెండు రోజులకు ఒకసారైనా, షాషింగకూ హాటలుకూ వెళ్లకపోతే తనకు పిచ్చెక్కి పోతుందని చెప్పింది. ‘నిన్ను చేసుకునేవాడు ఆరునెలలు తిరగకుండానే పిచ్చాసుపత్రిలో చేరడం ఖాయం’ అనీ అన్నట్లు, అన్నాడు మావాడు. ‘ఐ డోంట్ కేర్’ అన్నదా పిల్ల రాక్షసి.
ఇంకో సంబంధం చూశాం. ఆ అమ్మాయి తెలుగు మాష్టారి కూతురు. మావాడితో మాట్లాడాలని అన్నది. భార్యాభర్తలు శబ్దార్థాల్లా కలిసి ఉండాలని – అన్నదా అమ్మాయి. అంటే ఏమిటో వివరంగా చెప్పమన్నాడు మావాడు. భార్య అనుమతి లేకుండా, భర్త ఎవరితో ఏం చెప్పినా, అవన్నీ ‘అర్థం లేని శబ్దాలే’నట. భర్త భార్యకిచ్చే మాటలు, మూటలు, డబ్బులు, నగలు అవన్నీ శబ్దం లేని ‘అర్థం’గా పరిగణించాలని వివరించింది. “నీ పరిజ్ఞానానికి వందనాలు” అంటూ నమస్కరించాడు.
పట్టు వదలని విక్రమార్కుడిలా మరో అమ్మాయిని చూడటానికి వెళ్లాం. ఆ అమ్మాయి. చామన చాయగా ఉన్నది. పాటలు పాడుతుందట. అన్నీ సినిమా పాటలే. “మీరు పాడువారా?” అని అడిగింది. “నేను పాడువాడ్ని కాదు” అన్నాడు మావాడు. అడగకుండానే ఏ టాపిక్ మాట్లాడినా దానికి తగ్గ సినిమా పాట అందుకుంటోంది. ‘పావురానికీ, పంజరానికీ పెళ్లి చేసెనీ పాడులోకం’ అన్నది. సాయంకాలం అయింది అన్నాడు మావాడు. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే’ అని అందుకుంది. ఇంకో పాట ఏదో అందుకుంది ‘మగని పని సరి, మగని పని సరి, మగని పనిసరి’ అని పదేపదే అంటుంటే, మావాడు ‘వెళ్తున్నాము’ అని కూడా చెప్పకుండా బయట పడ్డాడు.
ఇంకో అమ్మాయిని చూశాం, టీ.వీ.లో యాంకర్ అట. ‘మీగ్రహం – అనుగ్రహం’ అనే కార్యక్రమంలో యాంకర్ అని చెప్పింది. “మీ డేటాఫ్ బర్త్ చెప్పండి” అంది. చెప్పిన తరువాత, గురువుగారికి పోను చేసింది మా ముందే.
ఆయన “మీరు బుధవారం పుట్టారు. భరణీ నక్షత్రం. నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నా, మిగతా గ్రహాలు ఎంత మాత్రం అనుకూలంగా లేవు.. అందు చేత నలభైరోజుల పాటు రావి చెట్టు చుట్టూ రోజూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షణాలు చేయాలి. నల్ల నువ్వులు, కందులూ, మినుములూ, సజ్జలు, రాగులూ – రోజూ ఒకటి చొప్పున వారం రోజులు ఒక్కొక్కటి కిలోకి దానం చెయ్యాలి. మీ ఆదాయంలో అయిదో వంతు, దానం చెయ్యాలి. సుందరాకాండ పారాయణం చేయాలి. శివుడికి ప్రతి సోమవారం అభిషేకం పది సోమవారాల పాటు చేయాలి.. ఇంకా.. నవరత్నాల ఉంగరం పెట్టుకోవాలి.. ఇంకా..” ఆయన వీడియోలోని ఇంకా చెబుతునే ఉన్నాడు. మావాడు వాక్అవుట్ చేశాడు.
ఇంకో కాండిడేట్‌ని చూశాం. వాళ్లదంతా కమ్యూనిస్టుల ఫామిలీ అట. కొన్ని షరతులకు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను – అన్నది. మొదటి షరతు – భార్యకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది. అంటే ఏమిటన్నాడు. భార్య చేసే ఖర్చుల మీద భర్తకు ఎలాంటి అజమాయిషీ ఉండకూడదట. జీతంలో సగం ఆమెకు గ్రాంటుగా ఇవ్వాలి. ఆమె తల్లిదండ్రులు, వారి అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు, వారి పిల్లలు, వారి వారి పిల్లలు, వారిని, వారివారి వారిని స్థానికులుగా అంటే ఇంట్లో మనుషులుగానే గుర్తించాలి. ఎప్పుడొచ్చినా, ఎన్నాళ్లు ఉన్నా ఏమీ అనకూడదు. ఇలాంటివే ఇంకా కొన్ని ఉన్నయిట. వీటికి ఒప్పుకుంటే, షెడ్యూలు రెండులో ఉన్నవి చెబుతుందట. వద్దులే తల్లీ నువ్వు అనవసరంగా శ్రమపడుకు అన్నాడు మా వాడు.
ఇంకో అమ్మాయి ఏ. విజయ, డాక్టరు. కొత్తగా ప్రాక్టీసు పెట్టింది. హైటు ఎంత అని అడిగింది. చెప్పాడు. సైటు ఉందా అని అడిగింది. కుక్కటపల్లిలో ఉన్నదన్నారు. “ఆ సైట్ కాదు. కళ్లజోడు అవసరం ఉందా?” అని అడిగింది. అవసరం లేదన్నాడు. షుగరు, బి.పి, ఆస్తమా, చర్మవ్యాధులు వంటివి ఉన్నవీ అని ఆడిగింది. లేదన్నాడు. ఈ సంబంధం హోల్డ్ పెట్టాడు.
మరో అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి పేరు, ఏ. విజయనే, టాక్స్ కన్సల్టెంటు. అన్ని టాక్స్‌లూ కట్టారా, ఇండియాలో కట్టారా, అమెరికాలో కట్టారా, టాక్స్ కట్టిన రిటర్న్‌లు కిందటి మూడేళ్లవీ తనకు వాట్సప్‌లో పంపించమన్నది. ఈ అమ్మాయి ఓ.కే. అనుకున్నాడు.
ఇద్దర ఏ. విజయల గోత్రాలు, ఇంటి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు అన్నీ తీసుకున్నాడు.
డాక్టరు విజయతో మాట్లాడి పెళ్లికి ఓకే అనుకున్నారు. పెళ్లి శుభలేఖలో టాక్స్ కన్సల్టెంటు అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు పొరపాటున అచ్చు అయినయి.
ఒక విజయతో సంబంధం కుదుర్చుకొని, మరొక విజయ పేరుతో – పొరపాటునే కావచ్చు – శుభలేఖలు అచ్చువేసి పంపటంతో –
“నీకేమన్నా బుద్ది ఉందా?” అని ఇద్దరూ తిట్టిపోశారు.
మొదటే చెప్పాను కదండీ. మా వాడికి మేధానికి ఉండవల్సిన మతిమరుపు, బద్ధకం ఉన్నాయని.
అయినా మావాడు బొత్తిగా తీసిపారెయాల్సిన వాడు కాదండి.