Site icon Sanchika

చిరుజల్లు-102

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

మొదలు నరికిన చెట్లు

[dropcap]చం[/dropcap]ద్రమతి ఫోన్‍లో మాట్లాడుతోంది. అవతల వైపు నుంచి రాధిక మాట్లాడుతోంది.

“పెద్దమ్మా, ఈ రోజు సాయంత్రం మా అమ్మ పార్టీ ఇస్తోంది. మిమ్మల్ని రమ్మనమని చెప్పమంది” అన్నది రాధిక.

“ఏమిటి విశేషం?” అని అడిగింది చంద్రమతి.

“మా నాన్నకు ప్రమోషన్ వచ్చింది కదా. అందుకని సాయంత్రం మా ఇంట్లో ముఖ్యమైన వాళ్లందరికీ పార్టీ ఇస్తున్నాం. మిమ్మల్ని కూడా పిలవమని మమ్మీ చెప్పింది” అన్నది రాధిక.

“అలాగే, తప్పకుండా వస్తాం” అన్నది చంద్రమతి.

హరిశ్చంద్ర రావు, కాంతారావు ఇద్దరూ అన్నదమ్ములే. అయినా రెండు కుటుంబాల మధ్యా సత్సంబంధాలు లేవు. ఒకరిది ఉత్తర ధృవం అయితే మరొకరిది దక్షిణ ధృవం, నిజాయితీకి హరిశ్చంద్ర రావు ప్రతిరూపం అయితే, అవకాశవాదానికీ, అంతులేని స్వార్థానికీ మారుపేరు కాంతారావు.

హరిశ్చంద్ర రావు కూడా ఉన్నత స్థాయిలో, కీలక పదవిలో ఉన్న ప్రభుత్వ ఆఫీసర్. కావాలనుకుంటే లక్షలు, కోట్లు సంపాదించి, నోట్లకట్టల మీద నడవగలడు. కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలే ఆయన చేతులు కట్టేస్తున్నాయి. అప్పుల్లో ఉన్నా, ఆదర్శాలు విడువని మనిషి. భార్య చంద్రమతి, కూతురు ప్రత్యూష కూడా ఆయన ఆలోచనలకు, అభిప్రాయాలకు ఎంతో విలువనిస్తారు.

కాంతారావు విషయం వేరు. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న తాపత్రయం ఎక్కువ. ధన మూలమ్ ఇదం జగత్ – అన్న సూక్తిని గుర్తెరిగి, డబ్బు సంపాదించటమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. బ్రహ్మాండమైన బంగళా కట్టించాడు. కార్లూ, నగలూ, షేర్లు, బ్యాంక్ బాలెన్స్‌లూ – వేటికీ కొదవలేదు. ఎలా సంపాదించాడూ అన్నది కాదు, ఎంత సంపాదించాడూ అన్నది ఆయనకు ముఖ్యం.

చంద్రమతి సాయంత్రం పార్టీకి రమ్మన్న పిలుపు గురించి కూతురు ప్రత్యూషకు చెబితే, కోపంతో అన్నది – “ఇప్పుడు గుర్తొచ్చామా వాళ్లకి? మన మీద ప్రేమతో నిన్ను పిలువలేదు. వాళ్ల గొప్పదనం చూపించటానికి నిన్ను పిలిచారు.” అన్నదామె.

“అయితే నువ్వు రానంటావా?”

“చచ్చినా రాను. నువ్వు కూడా వెళ్లక్కర్లేదు”

చంద్రమతి ఎటూ నిర్ధారించుకోలేక, భర్తకు ఫోన్ చేసింది.

“మీ తమ్ముడి ఇంట్లో సాయంత్రం పార్టీ ఇస్తున్నారట. రమ్మనమని చెప్పారు”

“ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు?”

“రాధిక ఫోన్ చేసి చెప్పింది “

“నిన్ను పిలిస్తే, నువ్వు వెళ్లాలనుకుంటే, వెళ్లు. నన్ను ఎవరూ పిలవలేదు. నేను ఎక్కడికీ రాను” అన్నాడాయన.

చంద్రమతి ఆలోచనలో పడిపోయింది. ఆమె ఇంతగా మథనపడిపోవటానికి కారణమూ ఉంది. ముప్ఫయి ఏళ్ల కిందట ఆమె హరిశ్చంద్ర రావుని వివాహం చేసుకుని ఆయన చిటికిన వేలు పట్టుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు కాంతారావు చిన్న కుర్రాడు. చదువుకుంటున్నాడు. వంచిన తల ఎత్తకుండా కాలేజీకి వెళ్లి వస్తుండేవాడు. అన్నగారి ఎదుటపడి ఇవి కావాలీ అని అడగటానికి భయపడేవాడు. పుస్తకాల దగ్గర నుంచీ, కాలేజీ ఫీజుల దగ్గర నుంచి, పాకెట్ మనీ దాకా వదినగారితో చెప్పుకుంటే, ఆమే అన్నీ సమకూర్చి పెట్టేది. తెల్లవారకుండానే ఇంట్లో నుంచి బయటపడి, ట్యూషన్లకనీ, లెక్చరర్ల ఇళ్ళకనీ, ఫ్రెండ్స్ ఇళ్లకనీ, ఎక్కడెక్కడో తిరిగి వేళాపాళా కాకుండా కొంపకొచ్చేవాడు. విసుక్కోకుండా చంద్రమతి అతనికి కాఫీలు, టిఫిన్లూ, భోజనాలూ అందించేది. పరీక్షల సమయంలో అర్ధరాత్రి పూట లేచి, టీ ఇచ్చేది. కన్న తల్లి కన్నా ఎక్కువగా సేవ చేసింది.

చదువు పూర్తి అయింది. ఉద్యోగం రాలేదుగానీ వయసొచ్చేసింది. వయసులో పాటు పరువాల రాగాలు పలుకుతూ వలపు కోరికలూ ముసురుకున్నాయి. కాంతారావు వర్ధనితో ప్రేమలో పడ్డాడు. తనువూ, మనసూ తొందరపడినందువల్ల, ప్రియురాల చేరరావేల, ఇంకా సిగ్గు నీకేలా అని అని డ్యూయెట్లు పాడుకున్నాడు. డాక్టరేమో అ అమ్మాయి నెల తప్పింది – అన్నాడు. ఇది తెలిసి ఆ అమ్మాయి తల్లీ తండ్రీ నెత్తి నోరూ మొత్తుకున్నారు. వర్ధనిని చావగొట్టారు. ఆ అమ్మాయి చావటానికి సిద్ధపడింది. గదిలో బంధించారు. మన హీరో తిండీ తిప్పలూ మానేసి గడ్డాలూ, మీసాలూ పెంచేశాడు. ఇంత జరిగాక, చంద్రమతి కలగ జేసుకుని భర్తను ఒప్పించి సమస్యను సామరస్యంగా పరిష్కరించింది.

వాళ్ల ఇద్దర్నీ ఒక ఇంటివాళ్లను చేసింది. అతనికి ఒక ఉద్యోగం దొరికేదాకా, తమ ఇంట్లోనే ఉంచుకుంది. ఆశ్రయం ఇచ్చి, రెండు పూటలా పిల్చి భోజనం పెట్టి ఆదుకుంది. ఆ ఆపద సమయంలో కొండంత అండగా నిలబడింది.

అతనికి చిన్న ఉద్యోగం వచ్చి, చాలీ చాలని రాజుల్లోనూ, పండగనీ పబ్బమనీ పిల్చి విందులూ, వినోదాలూ చేసేది.

పది పదిహేనేళ్ల తరువాత కాంతారావు దశ తిరిగింది. రెండు మూడు ప్రమోషన్లు వచ్చాయి. మనుషులూ మారిపోయారు. కాంతారావుకి, అన్ననూ, వదిననూ తల్చుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఒకే ఊర్లో ఉంటున్నా ఒకరి నొకరు చూసుకోవటమూ అరుదైపోయింది.

చంద్రమతికి అర్థం కాని విషయం ఒక్కటే, ఇప్పటికీ, ఎప్పటికీ తాము వాళ్ల శ్రేయస్సు కోరే వాళ్లమే కానీ, వాళ్ల పురోగభివృద్ధికి ఏ విధంగానూ అడ్డుపడేవాళ్ళం కాదు గదా – తమని శత్రువుల్లా చూడాల్సిన అవసరం ఏముందీ – అని అనుకుంటుంది గానీ, ఆమెకు సమాధానం చెప్పేవాళ్లు ఎవరూ లేరు.

ఇప్పుడు ఆకస్మాత్తుగా ఇవేళ పార్టీకి రమ్మని పిల్ల చేత ఫోన్ చేయించారు. మొదల్లో వెళ్లకూడదనే అనుకుంది. కానీ పంతాలకు పోయినందు వల్ల, మరింత దూరం అవటమే తప్ప, సమస్య పరిష్కారం కాదనుకుంది. చివరిక్షణంలో మనసు మార్చుకుని, అప్పటికప్పుడు బయల్దేరింది.

చంద్రమతి ఆ ఇంటి ముందు కారు దిగేటప్పటికి, అప్పటికే వాళ్ళ ఇంటి ముందు అటూ, ఇటూ బోలెడన్ని కార్లు బారులు తీరి ఉన్నాయి. గేటు దాటి లోపలికి వెళ్లింది. దీపాల తోరణాలతో బిల్డింగ్ వెలిగిపోతోంది. స్పీకర్ నుంచి నాదస్వరం వినిపిస్తోంది. లోపల అంతా ఖరీదైన మనుషులు సోఫాల్లోనూ, కుర్చీల్లోనూ కూర్చుని ఉన్నారు. అందరూ అందించిన గిప్ట్ లన్నీ ఒకమూల కుప్పగా పడి ఉన్నయి.

కాంతారావు అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. వర్ధని అతిథులకు శీతల పానీయాలు అందిస్తోంది.

చంద్రమతి వెళ్లి కాంతారావును పలకరించింది “బావున్నవా?” అంటూ.  “ఆ, బాగానే ఉన్నాను. లోపలకి వెళ్లు” అన్నాడు ముక్తసరిగా. ఇంట్లో మిగిలిన వాళ్లు రాలేదేం అని మాట వరసకైనా అనలేదు.

వర్ధని కూడా “రా, రా” అంటూ పలకరించింది. అందులో అప్యాయత లేకపోగా, అయిష్టతే ఎక్కువగా కనిపించింది.

ఒక గంట తరువాత అందరూ భోజనాలకు లేచారు. వర్ధని మనిషి మనిషి దగ్గరకు వెళ్లి పలకరిస్తోంది. చంద్రమతిని పట్టించుకోలేదు.

పక్కన నిలబడ్డ ఎవరో ఇద్దరు తగ్గు స్వరంతో మాట్లాడుకోవటం వినిపించింది. “ఈ పార్టీ ఇవ్వటానికి కారణం ఉంది. ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్‌ని ఓవర్‌లుక్ చేయించి, ఈ డైరెక్టర్ పోస్ట్ కొట్టేశాడు. అందుకు చాలా ఖర్చుపెట్టాడు. రేపటినుంచీ అంతకు పదింతలు పిండుకుంటాడు.. జీవితం అంతా వ్యాపారమే.. ఈ పార్టీకి కూడా రేపటి నుంచి తనకు ఉపయోగపడేవాళ్లనే పిల్చాడు. వాళ్లకు ఇదొక ఎర..” అని వాళ్లు గుసగుస లాడుకున్నారు.

ఆ మాటలు విన్నాక చంద్రమతికి తము అక్కడికి రావటం ఎంత పెద్ద తప్పో తెల్సిపోయింది.

కాంతారావు, వర్ధనీ అతిథులందరినీ సాగనంపుతున్నారు. చంద్రమతి కూడా లేచి “వెళ్తున్నా” అని చెప్పినప్పుడు కాంతరావు “తిన్నావా?” అన్నాడు. ఆమెకు ‘ఇంకా ఉన్నావా?’ అన్నట్లు వినపడింది.

ఇంటికి వచ్చాక చాలా బాధపడింది. “కావాలనే చాలా చిన్నచూపు చూశారు” అన్నదామె.

“వెళ్లదంటే విన్నావా?” అన్నది కూతురు చిర్రుబుర్రులాగుతూ.

“వీడు పుట్టగానే డైరెక్టర్ అయిపోయాడా? తను వీళ్ల కోసం ఎంత కష్టపడితే, ఇంత వాళ్లు కాగలిగారు? చావటానికి సిద్ధపడిన రోజున అండగా నిలబడి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? వాడిని ఒకే ఒక  ప్రశ్న అడుగుదామని వెళ్ళాను. ఎవరో ముక్కు, ముహం తెలియని వాళ్లను ఇందరిని విందుకు పిలిచావు గానీ, కొన్నేళ్ల పాటు ఏ అన్నగారింట్లో పడి తిన్నావో, ఆ అన్న నీకు గుర్తుకు రాలేదా – అని అడగాలనుకున్నాను. కానీ నాకా అవకాశం కూడా ఇవ్వలేదు. ఎంత శాఖోపశాఖలుగా విస్తరించిన మహావృక్షానికి అయినా వేళ్లు భూమిలోనే ఉంటయి. పెంచి పెద్ద చేసిన వాళ్లనే మర్చిపోయే వీళ్లందరూ, మొదలు నరికిన చెట్లు లాంటి వాళ్లు. ఆ చెట్లు ఎంతోకాలం బతకవు..” అన్నది కూతురితో.

అది ఆమె దీవెనో, శాపమో గానీ, నెల రోజులు తిరగకుండానే కాంతారావు కష్టాల్లో పడిపోయూడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు వచ్చి అతని ఆస్తిపాస్తులు లెక్కలు తీశారు.

వర్ధని సాయం చేయమని చంద్రమతికి ఫోన్ చేసింది. “నేనేం చేయగలను?” అన్నది చంద్రమతి.

“ఎక్కడి నుంచి ఫోన్” అని అడిగాడు హరిశ్చంద్ర రావు.

“ఏదో, రాంగ్ నెంబర్” అన్నది చంద్రమతి.

Exit mobile version