[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
మరో ఏడాదికి స్వాగతం
[dropcap]ఇ[/dropcap]వాళ రాత్రి మరో ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాం. నిన్నటిదాకా గడిచిన సంవత్సరంలో ఎన్నో మార్పులు. ఎన్నెన్నో ఉద్విగ్న క్షణాలు. మిత్రుల్ని విడదీశాయి. శత్రువులను – సన్నిహితుల్ని చేశాయి. సంయోగ వియోగాలెన్నో జరిగాయి. ప్రభుత్వాలు మారాయి.
సమయం చాలా స్వల్పమైనది. కానీ చాలా శక్తిమంతమైనది. ఒకక్షణం గడిచాక, అది కాలంగర్భంలో కలిశాకనే మరో క్షణం అందుబాటులోకి వస్తుంది. ఒక ఏడాదో, రెండేళ్లో గడిచాక అద్దంలో చూసుకుంటే మన మొహాల్లోనే ఎన్నో మార్పులు. కాలం నిర్విరామంగా, నిర్వికారంగా పరుగెత్తుతూనే ఉంటుంది.. వర్షాలు కురిపించి, పంటలు పండించీ, పూలు పూయించీ, కాయలు కాయించీ ప్రకృతి మనకెన్నో వరాలు ప్రసాదిస్తూనే ఉంటుంది. అలా మదర్ నేచర్ మనకు ఇచ్చిన వాటిని ఫాదర్ టైమ్ లాగేసుకుంటూ ఇవేవీ శాశ్వతం కావు సుమా అని అజ్ఞాతంగా హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇలాంటి చిత్ర విచిత్రాలు చేసే కాలం తిరిగి రాదని తెల్సినా, కాలాన్ని వృథా చేస్తూనే ఉంటాం. కొందరికి క్షణం తీరిక ఉండదు.
కొందరికి కాలక్షేపం కాక దిక్కులు చూస్తుంటారు. టైమ్ సేవింగ్ కోసం ముందుగా అపాయింట్‌మెంట్స్ తీసుకోవటం, రిజర్వేషన్ చేసుకోవటం లాంటి ఎన్నో కొన్ని పద్ధతులు పాటిస్తున్నా ఇంకా టైమ్ ‘దొరకని’ వాళ్లూ ఉన్నారు టైమ్ గడవని వాళ్లూ ఉన్నారు.
తీరికగా కూర్చున్న కొద్దీ పగటి కలలు కళ్లముందు మెదులుతుంటాయి. ఆ కలల్లో మనం మనకు ఇష్టమైన స్వర్గంలో విహరిస్తుంటాం. స్వర్గం ఎక్కడో ఆకాశంలో లేదు. చక్కని అవకాశం దొరకటం లోనే ఉంది. అర్హత లేనివెన్నో అయాచితంగా లభించటంలోనే ఉంది. అర్హమైన శిక్షలు తొలగిపోవటం లోనే ఉంది. మామూలు మనిషి ఏం ఊహించుకుంటాడు. ఇప్పటి జీతాలు ఉండి, అయిదేళ్ల కిందటి ధరలు ఉండి, పదేళ్ల కిందటి ఖర్చులు ఉంటే, అబ్బా, అంతకన్నా స్వర్గం ఇంకెక్కడుంది? – అని అనుకుంటాడు. కానీ వాస్తవం వేరుగా ఉంటుంది. రూపాయి విలువ పదింతలుగా పడిపోయి, ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి రాబడి ఏ మాత్రం పెరగక, ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం రోజురోజుకీ పెరుగుతూ జీవితం చింతాక్రాంతం అవుతూనే ఉంది. బ్రతుకు దుర్భరం అవుతూనే ఉంటుంది. స్వార్థం కోసం ఏమైనా చేయగల వాళ్లూ, ఆర్థికంగా, మానసికంగా క్రుంగి కృశించి పోతున్నా ఏమీ చేయలేని వాళ్ళూ – సమస్యలకు కేంద్రబిందువులవుతున్నారు.
‘నా భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పు’ అని అరచేయి చాపి రేఖలు చూపిస్తుంటారు. చేతినింగా పని ఉంటే, అది ఉపయోగపడే పని అయితే, జీవితం నల్లేరు మీద నడక లాగానే ఉంటుంది. బాధ పడేందుకు కూడా తీరిక లేనివాడు ఎవడు ఉంటాడో, వాడు సుఖపడుతున్నట్లే లెక్క.
తన కోసం, తన వాళ్ల కోసం, తన కుటుంబం కోసం కష్టపడటంలో ఎనలేని తృప్తి ఉంది. అంతులేని ఆనందం ఉంది. పన్నీరు ఎదుటివాళ్ల మీద చిమ్మినప్పుడు, కొంత చింది మన మీద పడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళను సుఖంగా ఉండనిస్తే, మనమూ ఆనందంగా ఉండగలుగుతాము.
ఇకపోతే, డబ్బు సంపాదనలోనే ఆనందం ఉంది అని అనుకోవడం పూర్తిగా నిజం కాదు. చాలామంది పేదవాళ్లు కూడా హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ జీవితాన్ని గడిపేస్తుంటారు. బస్తాలకొద్దీ నోట్లు కట్టులు ఇంట్లో మూలుగుతున్నా, అనేక భయాలతో ఆందోళనలతో, రోజులు గడిపేవాళ్లూ ఉంటారు. తాము కొనలేని వాటి జోలికి పోకుండా, ఉన్నంతలో తృప్తిపడేవాడు ఎవడు ఉంటాడో వాడు ఇంటి చుట్టూ పూలమొక్కల్ని పెంచినట్లు సుఖ సంతోషాలను పెంచుకోగలడు, ఆనందం పర్సు నిండా ఉన్న డబ్బులో ఉండదు, సర్దుకుపోయే మనసులో ఉంటుంది.
సంతోషంగా ఉండటానికి కొన్ని చిట్టాలున్నయి. మనసు నుంచి ద్వేషాన్ని, కోపాన్నీ తుడిచి పెట్టెయ్యాలి. ఇతరుల నుంచీ ప్రతిదానికీ వీలున్నంత తక్కువగా స్వీకరించి, వీలున్నంత ఎక్కువగా ఇవ్వగలగటం, మన స్వార్థపూరితమైన దృష్టి నుంచి గాక, ఎదుటి వాళ్లు దృక్పథం నుంచీ ఆలోచించటం, ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం – ఇవీ సంతోషానికి షార్ట్‌కట్ దారులు.
అన్నీ మనం అనుకున్నట్లే జరగాలన్న రూలు ఏమీలేదు. చాలాసార్లు అనుకునే దొకటీ అయితే, అయ్యేది మరొకటి అవుతుంటుంది. ఎండావానల లాంటిదే నిరాశా, నిస్పృహలు, ఎన్నాళ్ళో ఎదురుచూసినది జరిగినట్లే ఉంటుంది. చేతికి అందినట్లే అనిపిస్తుంది. కానీ తీరా అది జరిగిన తరువాత చూస్తే, ‘నేను అనుకున్నది ఇది’ కాదు, ‘నేను ఇన్నాళ్లూ ఆశించింది ఇది కాదు’ అన్న తపనా తప్పనిసరి అవుతుంది.
కొన్ని విషయాలల్లో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయిపోతుంటాం. ఇంక మనవల్ల కాదని మానేస్తుంటాం. చివరి ప్రయత్నంలో విజయం పొందే అవకాశం ఉండీ జారవిడుచుకుంటూ ఉంటాం. అందుకు మిగిలిన జీవితమంతా పరితపిస్తూనే ఉంటాం. ఒలింపిక్ క్రీడల్లో ఫొటో ఫినిష్‌లో గోల్డ్ మెడల్ పోగొట్టుకున్న వాడికీ, గెలిచినవాడికీ పెద్ద తేడా ఉండదు. ఒక పని కరెక్ట్ చేయటం దాదాపుగా కరెక్ట్ చేయటం – రెండూ ఒకటే. కొద్ది తేడాతో ఒక పిల్లవాడు లెక్క కరెక్ట్ గానే చేస్తాడుగానీ, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆన్సర్‌లో ఏడు అంకెకు బదులు ఒకటి అంకె వేసి, సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. అందుచేత అపజయం ఎదురైనా పరాజయం పొందాల్సిన పని లేదు. ఎదురు దెబ్బతగిలి ముందుకుపడి పోవచ్చు. తప్పుకాదు. భూమాతకు సాష్టాంగపడి, లేచి మళ్లీ పరుగెత్తేవాడే మొనగాడు. వాడే విజయుడు.
కొందరికి భుజబలం మాత్రమే ఉంటుంది. కొందరికి బుద్ధిబలం మాత్రమే ఉంటుంది. ఒకటి ఒకడికి ఒక రకమైన శక్తి ఉంటే, మరొకడికి మరో రకమైన శక్తి ఉంటుంది. ఎవరికి ఏది, ఎంత ఎప్పుడు, ఎంతవరకు అవసరమో, దానిని అంతవరకు ఉపయోగించి విజయం సాధించాలి.
కొన్నిటిని అలవాటు చేసుకోవాలి. కొన్ని అలవాట్లును వదిలేసుకోవాలి. ఇంత తెల్సి ఉండీ, ఇంకా తెల్సుకోవాల్సింది ఎంతో ఉంది.
కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుదాం మరి.