[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
జైలు
[dropcap]ఆ[/dropcap]దర్శప్రాయమైన కొన్ని కుటుంబాలను ఇంటర్వ్యూ చేస్తున్న ఒక పత్రికా విలేఖరి కుటుంబరావు ఇంటికి వచ్చాడు.
కుటుంబరావు స్త్రీ సంక్షేమ శాఖలో పని చేస్తున్నాడు. ఆయన భార్య ఆనందవల్లి జైలు సూపర్నెంటుగా పనిచేస్తోంది. పురుషుడు చేయాల్సిన ఉద్యోగంలో ఆమె పని చేస్తోంది.
విలేఖరి వాళ్ల కుటుంబ విషయాలన్నీ అడిగిన తరువాత మరో ప్రశ్న వేశాడు. “మీ ఇంట్లో ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునేది ఎవరు? డెసిషన్ మేకింగ్ పవరు ఎవరిది?” అని అడిగాడు.
“ఇంటి విషయాలు అన్నిటిలోనూ మా ఆవిడే నిర్ణయాలు చేస్తుంది. అయితే నిర్ణయం చేయబోయే ముందు నన్ను అడుగుతుంది. చాలా వరకు నేను చెప్పినట్లే చేస్తుంది” అని కర్ర విరగకుండా, పాము చావకుండా సమాధానం చెప్పాడు కుటుంబరావు.
“తుది నిర్ణయం మీదే నన్న మాట” అన్నాడు విలేఖరి నవ్వుతూ.
“తుది నిర్ణయం వల్లిదే. నేను అవసరమైనప్పుడు సలహా ఇస్తుంటాను” అన్నాడు కుటుంబరావు.
“మీ అమ్మాయి టీనేజ్‌లో ఉంది. మీ అమ్మాయికి మీరు ఎంతవరకు స్వేచ్ఛనిస్తారు?” అని అడిగాడు విలేఖరి.
“మా అమ్మాయి లావణ్యకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాం. అయితే లావణ్య ఎక్కడికైనా వెళ్లేముందు తనకు చెప్పి వెళ్లాలని అంటుంది వల్లి. అక్కడే తల్లి కూతుళ్లకు చిన్న క్లాష్” అన్నాడు కుటుంబరావు నవ్వుతూ.
విలేఖరి వెళ్లి పోయాడు.
కుటుంబరావుకీ, ఆనందవల్లికీ, లావణ్యకూ మధ్య గొడవ ప్రారంభమైంది.
“ఏంటీ, పెద్ద గొప్పగా ఆయన ముందు కోతలు కోశారు. మీరు సలహాలు చెబితే, ఆ సలహాలు నేను ఫాలో అవుతుంటానా? మీ సలహాలు వింటే మట్టికొట్టుకు పోవాల్సిందే..” అన్నది ఆనందవల్లి కోపంగా.
“ఏంటీ, ఈ ఇంట్లో నాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారా? ఎందుకు అన్నీ అబద్ధాలు చెప్పారు?” అని నిలదీసింది లావణ్య.
“ప్రతి ఇంట్లో ఏవో చిన్నచిన్న గొడవలుంటాయి. అవన్నీ పత్రికలో రాయటానికి అతను రాలేదు. ఆదర్శప్రాయమైన కుటుంబాల గురించి రాయాలని వచ్చాడు. అందుకని అతనికి కావల్సిన విధంగా చెప్పాను అన్నమాట” అన్నాడు కుటుంబరావు.
“మమ్మీ, మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా నాకు మాత్రం స్వతంత్రం రాలేదు. ఇకనుంచీ నా హక్కుల కోసం నేను పోరాటం ప్రారంభించ బోతున్నాను” అన్నది లావణ్య.
“నోర్ముయ్. హక్కులూ, పోరాటం? ఎవరితో పోరాడతావే? నీకు ఎప్పుడేం కావాలో, ఎప్పుడేమి ఇవ్వాలో నాకు తెల్పు” అన్నది ఆనందవల్లి.
“ఏంటమ్మా, ఇది జైలు కాదు, నువ్వు అర్డర్లు వెయ్యటానికి” అని ఎదురు సమాధానం చెప్పింది లావణ్య.
“జైల్లో కూడా ఎవడూ నా మాట కాదనటానికి వీల్లేదు” అంటూ ఆనందవల్లి వంటింట్లోకి వెళ్లిపోయింది.
***
ఆనందవల్లి జైలు సూపర్నెంటుగా తన ఆఫీసు గదిలోకి వెళ్లి కూర్చుంది. క్లార్క్ దగ్గరనుంచి వచ్చిన ఫైల్సు చూసి సంతకాలు చేసింది. ఇంతలో బయట కేకలు వినిపించటంతో అక్కడికి వెళ్లింది. యాదగిరి కరుడుగట్టిన రౌడీ. హత్యానేరంపై శిక్ష అనుభవిస్తున్నాడు. వాడి మాట కాదంటే కోపంతో రెచ్చిపోతాడు. చేతిలో ఏది ఉంటే దానితో కొట్టేస్తాడు.
“ఏంటి గొడవ?” అని అడిగింది ఆనందవల్లి.
“బాత్రూంకి వెళ్లాలి తలుపు తీయమంటే తీశానండీ. బాతరూంకి వెళ్లొచ్చాడు. సెల్ లోకి వెళ్లమంటే, వెళ్లనంటున్నాడు..” అన్నాడు కాపలా పోలీసు.
“సెల్‌లో ఊపిరి ఆడటం లేదు. కాస్త గాలి ఆడకపోతే సచ్చిపోతాను. అందుకని ఇక్కడ కూసున్నా” అన్నాడు యాదగిరి..
‘సరే. ఒక పది నిముషాలు కూర్చుని తరువాత నీ సెల్ లోకి వెళ్లు” అన్నది ఆనందవల్లి.
పోలీసు వ్యాన్ వచ్చింది. అందులో నుంచి దిగిన కానిస్టేబుల్ ఇద్దరు కుర్రాళ్లను తీసుకొచ్చాడు.
“వీళ్లకు నెలరోజులు జైలు శిక్ష వేశారండి” అన్నాడు కానిస్టేబుల్ కాగితాలు ఆమె ముందు పెడుతూ.
“ఏం చేశారు మీరు?” అని అడిగింది ఆనందవల్లి.
“ఏం చెయ్యలేదండి. సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నామని పట్టుకున్నారండీ. మామూళ్లు ఇస్తూనే ఉన్నామండి. అయినా అప్పుడప్పుడు తెచ్చిపడేస్తుంటారండి” అన్నాడా యువకుడు.
“నేరం చేయలేదంటావేంట్రా? బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మటం నేరం కదా?” అన్నాడు కానిస్టేబుల్.
“బ్లాక్ టిక్కెట్లు అమ్మటం నేరం అయితే, బ్లాక్‌లో కొనటమూ నేరమేగదా. బ్లాక్ అమ్మిస్తున్న సినిమాహాలు వాళ్లదీ నేరమే గదా. వాళ్లను వదిలేసి మమ్మల్ని మాత్రమే శిక్షిస్తారా?” అని అడిగాడా యువకుడు తల జుట్టు సవరించుకుంటూ.
కొత్తగా వచ్చిన ఆ ఇద్దర్నీ ఒక సెల్‌కి పంపించారు. కానీ వాళ్ల ఆవేదన ఆనందవల్లి అర్థం చేసుకుంది.
లావణ్య ఫోన్ చేసింది.
“అమ్మా, నేను మాట్నీ సినిమాకు వెళ్తున్నాను” అని చెప్పింది.
“ఎవరితో?”
“ఫ్రెండ్స్‌తో”
“ఎవరా ఫ్రెండ్స్!”
“ఏంటమ్మా, నీకు అన్నీ అనుమానాలే. రజనీ, సురేఖతో వెళ్తున్నాను. కొత్త పిక్చర్, ఇవాళే రిలీజ్. చూడకపోతే రజనికి తోచదు..”
“టిక్కెట్లు దొరుకుతాయా?” అని అడిగింది ఆనందవల్లి.
“కౌంటర్లో పది టిక్కెట్లు అమ్ముతారు. మిగతావన్నీ బ్లాక్‌లో అమ్ముతారు. మేం ఎప్పుడూ బ్లాక్ లోనే టిక్కెట్లు కొంటాం” అన్నది లావణ్య.
“బ్లాక్‍లో టిక్కెట్లు కొని సినిమాకు వెళ్ళకపోతే ఏమి? వెళ్లటానికి వీల్లేదు” అన్నది ఆనందవల్లి.
“నాకు బోర్ కొడుతుంది” అన్నది లావణ్య గోముగా.
“నేను ఒక అరగంటలో ఇంటికి వస్తున్నాను” అన్నదామె. ఆనందవల్లి ఇంటికి వెళ్లేటప్పటికి, లావణ్య కోవడంతో చిర్రుబుర్రులాడుతోంది.
“అందరూ ఫ్రెండ్స్‌తో సినిమాలకు, హోటల్స్‌కూ వెళ్తుంటారు. నువ్వు నన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వవు. ఇల్లు కూడా ఒక జైలులా తయారుచేశావు” అన్నది లావణ్య విసుగ్గా.
“మనం షాపింగ్‌కి వెళ్దాం పద” అంటూ ఆనందవల్లి కూతుర్ని బజారుకు తీసుకు వెళ్లింది.
ఇంకో రోజు –
ఆనందవల్లి జైలు ఆఫీసు గదిలో కూర్చుని ఉంది. ఖైదీ వరహాలు ఆమె దగ్గరకు వచ్చాడు.
“మేడమ్, నేనో లెటర్ రాశాను. అది పోస్ట్ చేయించండి” అన్నాడు.
“ఎవరికి లెటర్ రాశావు?” అని అడిగింది.
“మా ఇంటి దగ్గర ఉండే లచ్మిని ప్రేమించానండి. దానికి కూడా నేనంటే ఇష్టమే. నేను విడుదల అయి వెళ్లాక పెళ్లి చేసుకుంటామండి..”
“జైలునుంచి వెళ్లాక నిన్ను పెళ్లి చేసుకోవటానికి అది ఇష్టపడకపోతే?” అని అడిగింది.
“ప్రేమించాక పెళ్లి చేసుకోనంటే ఊరుకుంటానేంటి? దాన్ని చంపి, నేను చచ్చిపోతాను” అన్నాడు కోపంతో.
ఆనందవల్లి నిట్టూర్చింది.
అదే రోజు సాయంత్రం లావణ్య ఆమె దగ్గరకు వచ్చింది.
“అమ్మా, రవితేజ అని నా క్లాస్‌మేట్. చాలా ఇంటలిజెంట్. వాళ్ల ఫాదర్ గవర్నమెంట్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. రేపు రవితేజ బర్త్‌డే. నన్ను డిన్నర్‌కి రమ్మన్నాడు. ఊరికే వెళ్తే బావుండదు. అతనికి ఒక వాచ్ గిఫ్ట్‌గా ఇద్దామనుకుంటున్నాను.” అన్నది లావణ్య.
“నీ క్లాస్‌మేట్, ఇంటలిజెంట్, డిన్నర్‌కి ఆహ్వానం. గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన. నిజం చెప్పు.. మీ మధ్య ప్రేమ, దోమ లాంటిది ఏమైనా ఉందా?”
లావణ్య సమాధానం చెప్పలేదు.
వరహాలు చెప్పిన సమాధానమే ఆమె చెవుల్లో గింగురుమంటోంది.
“ప్రేమ తరువాత స్టేజ్ పెళ్లి. ప్రేమించిన వాళ్లంతా పెళ్లి చేసుకోలేరు. అప్పుడింక ఈ ప్రేమ కాస్తా ద్వేషంగా మారుతుంది. కక్షలూ, కార్పణ్యాలూ పెరిగి అవి ఎక్కడికి దారితీస్తాయో తెలియదు.. చదువుకునే వయస్సులో దృష్టినంతా చదువు మీదనే ఉండనివ్వు. ఆ చదువే నీ స్థాయిని పెంచుతుంది. అప్పుడింక పెళ్లి విషయంలో మేమూ వెతికి అన్నివిధాలా నీకు తగిన వాడిని తీసుకొస్తాం. అంతదాకాఈ ప్రేమ ప్రవాహంలో పడి కొట్టుకుపోకు” అని చెప్పింది ఆనందవల్లి.
లావణ్య మొహం కళావిహీనం అయింది. ఏడుపు ఒక్కటే తక్కువ.
ఇంకో రోజు –
ఆనందవల్లి తన ఆఫీసు గదిలో కూర్చుని ఉండగా ఒకడిని రిమాండ్‌కి తీసుకొచ్చారు.
ఎవరో ఒక స్త్రీ కొత్తగా నగరానికి వచ్చింది. ఆటో ఎక్కింది. ఆమె నగరానికి కొత్తదని తెల్సాక ఆటోను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్లి ఆమెను రేప్ చేశాడు.
పోలీసు కేసు, నిందితుడి అరెస్ట్ జరిగిపోయాయి.
లావణ్య సెలవుల్లో ఫ్రెండ్స్‌తో బెంగుళూరు వెళ్తానని చెప్పింది.
వెళ్లటానికి వీల్లేదని ఆనందవల్లి స్పష్టంగా చెప్పింది. ఈసారి లావణ్య ఎదురు తిరిగింది.
“ఏంటమ్మా, నేనింకా చిన్న పిల్లనని అనుకుంటున్నావా? నేను ఇప్పుడు మేజర్‌ని. నా ఇష్టం ప్రకారం చేయవచ్చు. తెల్సా?” అని రెట్టించింది.
“నిజమేనమ్మా, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవు కావు. పెద్దదానివి అయ్యావు. అందుకే నిన్ను వెయ్యి కళ్లలో కాపాడవల్సిన బాధ్యత నాకు ఉంది. నీ స్వేచ్ఛను, స్వాతంత్రాన్నీ అరికట్టాలని నేను అనుకోవటం లేదు. కానీ, కాలు బయటపెడితే సమాజంలో జరుగుతున్న దురాగతాలను తల్చుకుంటే, భయం వేస్తుంది. ఎవరికీ రక్షణ లేదు. నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే, జీవితమే అస్తవ్యస్తం అయిపోతుంది. అంతా అయిపోయాక, చేతులు కాలాక, ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. సినిమాకు వెళ్తే వెంటపడే పోకిరీ వెధవలు. ప్రేమ పేరుతో ముగ్గు లోకి దించి నట్టేట ముంచేవాడు ఒకడు. ఏదన్నా కొత్త చోటుకు వెళ్తే, క్షేమంగా తిరిగి వస్తామన్న ధీమా లేదు. అడది ఒంటరిగా కనిపిస్తే కాటెయ్యాలని చూసే విష సర్పాల మధ్య బ్రతుకుతున్నాం. ఈ దారుణాల నుంచి నిన్ను కాపాడుకోవాలన్న తాపత్రయమే తప్ప, నీ ఆనందానికి అడ్డు రావాలని కాదమ్మా” అన్నది ఆనందవల్లి.
“ఏమిటమ్మా, ఎక్కడో, ఎవరికో ఏదో జరిగితే, అవన్నీ మనకీ జరిగిపోతాయని భయపడితే, కాలు బయటపెట్టగలమా? లోకంలో జరిగే ప్రతి ప్రమాదమూ మనకే జరుగుతుందని భయపడటం అర్థ రహితం” అన్నది లావణ్య.
“నీవు చెప్పింది నిజమే గానీ, రోజంతా నేను ఖైదీలు, నేరస్థుల మధ్య ఉండటం వల్ల బహుశా లోకమంతా అలాగే ఉంటుందన్న భ్రమలో ఉంటున్నాను. ప్రపంచంలో నేరస్థులు పదిమంది ఉంటే, మంచివాళ్లు తొంభై మంది ఉంటారు. జైలుశిక్ష అనుభవిస్తున్న వాళ్లు కూడా అందరూ కిరాతకులు కారు. ప్రతి మనిషిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. జరిగిన అన్యాయానికి తట్టుకోలేక, క్షణికోద్రేకంలో రెచ్చిపోయి, నేరస్థులుగా మిగిలిన వాళ్లే ఎక్కువ మంది ఉంచారు. వాళ్లందరి మధ్యా రోజంతా గడిపే నేను వాళ్లను కొంత వరకూ జాలితో కూడా చూస్తుంటాను..” అన్నది ఆనందవల్లి.
“నీ అంతటి ధైర్యసాహసాలు నాకూ కలగాలంటే, ఈ నాలుగు గోడల మధ్య మగ్గిపోకూడదు. యథేచ్ఛగా బయటకు వెళ్లి ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూడనీ” అన్నది లావణ్య.
“సరే, అలాగే వెళ్ళు” అన్నది ఆనందవల్లి.
బెంగుళూరు వెళ్లేందుకు అనుమతించినందుకు లావణ్య, తల్లిని కౌగలించుకుంది ఆనందంతో.