[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
భోగి మంటలు
[dropcap]సం[/dropcap]క్రాంతి పండగ శోభ వేరు.
ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దటం తోను, గొబ్బిళ్లతో అలంకరించటం తోను, తెల్లవారక ముందే కొత్త అందాలు సంతరించుకుంటాయి. భోగి మంటలతో పీడ విరగడై పోతుందని నమ్మకం. అయితే మంటలు చలిమంటలు అయినంత వరకూ ఫర్వాలేదు గానీ, జీవితాలను కాల్చి వేసే మంటలు అయినప్పుడే అదొక సమస్య అవుతుంది.
***
దీపిక రైలు దిగింది.
స్టేషన్ బయట కొచ్చింది. ఆటో ఎక్కింది. ఎక్కడకు వెళ్లాలో చెప్పింది. ఆటో బయల్దేరింది.
అసలు ఇప్పుడిలా ఇంటికి రావటం దీపికకు ఎంత మాత్రం ఇష్టం లేదు. పండగకు అక్కావాళ్లింటికి వెళ్ళింది. ఈ సారి పండగ అక్కడ సరదాగా గడపాలనుకున్నది. కానీ వెళ్లిన మర్నాడే ఫోన్ వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చెయ్యమని.
ఇక్కడ వీళ్లు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారట. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు తనకి. చదువు, ఉద్యోగం, వివాహం – ఇవి వరుసక్రమం. రెండుమూడేళ్లు ఉద్యోగం చేసి ఎంతో కొంత పెళ్ళి ఖర్చు అయినా కూడబెట్టుకున్నాక, అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేయాలన్నది తన ఆలోచన. కానీ పెద్దవాళ్ల అభిప్రాయాలు వేరు. ఎంత తొందరగా తమ బాధ్యత వదిలించుకుందామా అని చూస్తుంటారు.
పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లా భవిష్యత్తు గురించి అందంగా ఊహించుకుంటుంది. సరియైన వాడు దొరికితే కల నిజమవుతుంది. వాడు సరియైన వాడు కాకపోతే అదొక పీడకల అవుతుంది. అందుకనే పెళ్లి అనగానే ఆడపిల్ల కళ్లు మెరిసే ఆనందం వెనుక ఏ మూలో రవ్వంత భయమూ ఉంటుంది.
ఉదోగ్యం ఉంటే ఆ ధైర్యం వేరు.
దీపిక అలోచనల్లో ఉండగానే ఇల్లు వచ్చింది. ఆటో అతనికి డబ్బులిచ్చి, సూట్‍కేస్ తీసుకుంటున్నప్పుడు చూసింది. ఆ సూట్‌కేస్ కింద ఒక ప్లాస్టిక్ కవరు కనిపించింది. ‘ఇది ఎవరిది?’ అన్న అనుమానం వచ్చి, ఆటో డ్రైవర్‌ని అడిగింది. అతనికి తెలియదు. అంతకు ముందు ఆ ఆటోలో ప్రయాణం చేసిన వ్యక్తి ఆ కవరు మర్చిపోయి వెళ్లిపోయి ఉంటాడు. అతను ఎక్కడ ఎక్కాడు, ఎక్కడ దిగాడు – అని అడిగింది. ఏదో ఒక చౌరస్తాలో ఆటో ఎక్కి, రైల్వేస్టేషన్ దగ్గర దిగారు – అని చెప్పాడు. కనుక అతని ఇల్లు తెల్సుకునే అవకాశం లేదు. అదేదో మీరే అతనికి అందజేయండని ఆటో డ్రైవర్ వెళ్లి పోయాడు.
దీపిక ఇంట్లోకి వెళ్లింది.
తల్లి, తండ్రి, నాయనమ్మ – ఆమె చుట్టూ మూగారు.
ఒక సంబంధం వచ్చిందట. అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కొద్దిగా ఆస్తిపాస్తులున్నయి. పెద్దగా బాధ్యతలూ లేవు. అమ్మాయిని చూడటానికి వస్తామన్నారట. అందుకని పిలిపించారు.
“ముందు ఉద్యోగం చూసుకుని, రెండేళ్లు అయ్యాక చూద్దాం, అనుకున్నాం గదా..” అన్నది దీపిక.
“ఉద్యోగాలు నీ కోసం కాచుకూర్చున్నాయేమిటే? ఎప్పటి కొస్తుందో, ఏమిటో, ఈలోగా వయసు మీద పడుతుంటే, సంబంధం కుదరడం ఎంత కష్టం?” అన్నది తల్లి.
“ఈ సంబంధం కుదిరి పెళ్లి అయితే, కొండకెళ్లి కల్యాణం చేయిస్తానని కూడా మొక్కుకున్నానే” అన్నది నాయనమ్మ.
ఆ ప్రసంగం అంతటితో ఆగిపోయింది.
ఇంక ఎవరిపనుల్లో వాళ్లు మునిగిపోయారు.
దీపిక సూట్‌కేస్ తెరిచినప్పుడు, దాని మీద ఉంచిన ఆ ప్లాస్టిక్ కవరు టేబుల్ మీద పెట్టింది.
తల దువ్వుకుని, స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుంది. అప్పుడు తీరికగా ఆటోలో దొరికిన ప్లాస్టిక్ కవరు తీసి చూసింది. అది కవర్ అంటే కవరూ కాదు. బ్యాగ్ అంటే బ్యాగూ కాదు. తీసి చూస్తే అందులో సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్, క్రెడిట్ కార్డు ఉన్నయి. క్రెడిట్ కార్డుకు డబ్బు కట్టమంటూ బ్యాంక్ నుంచి వచ్చిన లెటరూ ఉంది. అందులో అతని పేరు, అడ్రసు ఉన్నాయి. పేరు కార్తీక్.
ఇవన్నీ పోస్ట్‌లో పంపాలంటే కష్టం. బామ్మను సలహా అడిగింది. “పాపం, అతని ఆడ్రస్‌కు లెటర్ రాసి పడెయ్” అన్నది బామ్మ.
“నాకేంటి అవసరం?”
“నువ్వు ఒక మంచి పని చేస్తే, నీకూ మంచే జరుగుతుంది” బామ్మ అన్నది.
“ఇవన్నీ పాత కబుర్లు. ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. మంచి చేసిన వాళ్లకు చెడు జరుగుతోంది” అన్నది దీపిక.
“నీకు కష్టంగా ఉంటే అడ్రసు ఇవ్వు, నేనే కార్డు ముక్క రాసి పడేస్తాను.” అన్నది బామ్మ.
బామ్మ బలవంతం మీద దీపిక కార్డు రాసి పడేసింది.
మర్నాడు పెళ్లి చూపులకు వస్తామని చెప్పిన వాళ్లు పండగ నాడు వస్తామన్నారు. ఒక గంట తరువాత పండగ పూట ఎందుకు రెండు రోజుల తరువాత వస్తామన్నారు.
“మీరు ఎప్పుడైనా రావచ్చు”నని చెప్పాడు దీపిక తండ్రి.
పండగనాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. దీపిక తలుపు తీసింది.
పాతికేళ్ల కుర్రాడు గుమ్మం ముందు నిలబడి పరిచయం చేసుకున్నాడు. “నేను కార్తీక్ అండీ. ఆటోలో నా సర్టిఫికెట్స్ దొరికాయన్నారు. వాటిని పోగొట్టుకున్నది నేనే” అన్నాడు.
“ఓహో, మీరా? లోపలికి రండి” అని ఆహ్వానించింది. లోపలికి వచ్చాడు. కూర్చున్నారు.
“ఆ రోజు ఆటోలో మా సిస్టర్, నేనూ ఇద్దరం స్టేషన్‌కు వచ్చాం. ఇద్దరం చెరి కొన్ని సామాన్లతో స్టేషన్ లోపలికి వెళ్ళాం. ఆ తొందరలో ఆ బ్యాగ్ మిస్ అయ్యాం. అప్పటి నుంచీ తెగ కంగారు పడిపోతున్నాను. మొక్కని దేవుడు లేడు. ఏ దేవుడో మీ రూపంలో కరుణించాడు” అన్నాడు కార్తీక్,
ఇంతలో బామ్మ వచ్చింది. దీపిక కాఫీ తేవటానికి లోపలికి వెళ్లింది. ఈలోగా బామ్మ అతని హిస్టరీ అంతా లాగేసింది. అతనితో దూరపు చుట్టరికం ఉందన్న విషయమూ తెల్సుకుంది.
“అసలు ఇవాళ ఈ టైంకి మా దీపికకు పెళ్లిచూపులకు వస్తామన్నారు. కానీ రెండు రోజుల తరువాత వస్తామన్నారు. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటయి గదా” అన్నది బామ్మ.
దీషిక అతనికి కాఫీతో పోటీ ఆ కవరూ ఇచ్చింది.
“ఈ కవరులో ఉన్నవాటి మీద నా భవిష్యత్, నా జీవితం ఆధారపడి ఉంది. నేనూ, మా ఇంట్లో అందరం దిగులు పడిపోయాం. కొన్నిటిని పోగొట్టుకుంటే తిరిగి పొందలేం. కానీ ఇవాళ వీటిని పొందగలుగుతున్నానంటే, ఈ ఆనందాన్ని మాటలలో వర్ణించలేను. నా ఆనందానికి చిహ్నంగా ఈ చిన్న చిరుకానుక తెచ్చాను. మీరు తీసుకోవాలి” అంటూ ఆ గిఫ్ట్ ఆమె ముందు పెట్టాడు.
ఆ గిఫ్ట్- గోల్డ్ ఛెయిన్ ఉన్నవాచీ.
దీషిక ‘వద్దు’ అన్నది. కానీ అతని బలవంతం మీద తీసుకుంది.
“పండగ పూట, మా అమ్మాయికి మంచి బహుమతి ఇచ్చారు.” అని సంతోషించింది బామ్మ.
అతను వెళ్లి పోయాడు.
రెండు రోజుల తరువాత పెళ్లిచూపుల వారు వచ్చారు.
పిల్లను చూశారు. చదువు గురించి, సంగీత సాహిత్యాభిలాషల గురించీ రాగల ఉద్యోగాల అవకాశాల గురించీ, కుటుంబ మంచి చెడ్డల గురించి అన్నీ అడిగి తెల్సుకున్నారు.
ఏ విషయమూ తరువాత తెలియజేస్తామన్నారు.
రెండు రోజులు ఆగి, దీపిక తండ్రి వెళ్లి వాళ్లతో మాట్లాడి వచ్చాడు. యాభై లక్షలు కట్నం కావాలన్నారు. ఆయనకు నీరసం వచ్చేసింది. ఇంటికి రాగానే ఈ విషయం అందరికీ చెప్పాడు.
“అప్పో సప్పో తెచ్చి చెయ్యక తప్పుతుందా?” అన్నది బామ్మ
“నేను ఉద్యోగం చేసేదాకా ఆగమంటే ఆగకుండా మీరు సంబంధాలు చూడటం తప్పు. అక్కర్లేదని చెప్పేయ్యండి. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను” అని స్పష్టంగా చెప్పింది దీపిక.
ఇంక బేరాలు సాగాయి. “మీరు ఎంతవరకు ఇవ్వగలరు?” అని అడిగారు.
“సగానికి సగం అయినా మేము తూగలేము” అన్నాడు దీపిక తండ్రి.
“ఆలోచించుకుని చెబుతాం” అన్నారు వాళ్లు.
దీపిక తల్లిదండ్రులు రోజూ ఇంట్లో తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ బాధ భరించలేక దీపిక ఆ అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి చెప్పింది – “మాకు మీ సంబంధం నచ్చలేదు” అని.
“అదేమిటి? మా వాడికి ఏం లోపం?” అని అడిగాడాయన.
“అసలు లోపం ఏమిటంటే మీకు వివాహం అంటే అర్థమే తెలియదు. కొడుకు పుట్టినప్పటి ఉగ్గు పాల దగ్గర నుంచీ ఉద్యోగం వచ్చేవరకు వాడి మీద పెట్టిన పెట్టుబడి లెక్కలు కట్టి మొత్తం కట్నంగా గుంజాలనుకుంటారు. అభిమానాలకు, ఆదరణలకూ అర్థం తెలియని మనుష్యులు మీరు, మీకూ మాకూ ఎక్కడా పొంతన కుదరదు” అని ఫోన్ పెట్టేసింది.
ఇదిలా ఉండగా నాలుగు రోజుల తరువాత కార్తీక్ తండ్రి దీపిక ఇంటికి వచ్చాడు. బామ్మ గారితో మాటలు కలిపాడు. వరసలు కలిపాడు. ‘మీకు అభ్యంతరం లేకపోతే దీపికను కోడలిగా చేసుకోవటానికి అభ్యంతరం లేదని’ అన్నాడు.
మొన్న చూసిన అబ్బాయి కన్నా, కార్తీక్ అన్ని విధాలా గొప్పవాడే.
ఈ మాట వినగానే ముందు బామ్మ ముహం వికసించింది.
“మంచి చేస్తే, అంతా మంచే జరుగు తుందని, నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాను” అన్నది..
ఇక కట్నాలు, కానుకల విషయంలోనూ అభ్యంతరాలు లేవు.
“మీ అమ్మాయికి భర్త ఎంత అవసరమో, మా అబ్బాయికి భార్య అంత అవసరం. అంతకన్నా కావల్సిందేముంది?” అన్నాడు కార్తీక్ తండ్రి.
ఆయన అన్నమాటలను, దీపిక వీడియో తీసింది. శుభలేఖతోపాటు ఆ వీడియోనూ అంతకు ముందు యాభై లక్షల కట్నం కోరిన పెద్ద మనిషికి పంపించింది దీపిక.
నిశ్చితార్థం రోజున వచ్చిన వారంతా “ఈ సంబంధం మీకు ఎక్కడ దొరికింది?” అని అందరూ అడుగుతుంటే, “అదో పెద్ద కథలే” అని చెప్పారు.
వివాహం జరిగిపోయింది.
***
ఏడాది గడిచిపోయింది.
సంక్రాంతి వచ్చింది. కార్తీక్ అత్తారింటికి వచ్చాడు. ఇంకా తెల్లవారలేదు. ఇంటి ముందు అంతా సందడిగా ఉంది. భోగి మంటలు వేస్తున్నారు.
దీపిక వచ్చి కార్తీక్‌ని నిద్రలేపింది. అతను భార్యను మీదకు లాక్కున్నాడు.
“ఇదేమిటి? అక్కడ భోగి మంటలు వేస్తుంటే..”
“కొన్నిటిని వదులుకుంటేనే గానీ, కొన్నిటిని పొందలేం” అన్నాడు కార్తీక్ ఆమె నోరు మూయిస్తూ.